సాక్షి, హైదరాబాద్: ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్, బయోటెక్, ఫిన్‌టెక్, డేటా సెంటర్స్, క్లీన్ ఎనర్జీ, ఉన్నత విద్య, టూరిజం వంటి రంగాల్లో న్యూజెర్సీ రాష్ట్రంతో తెలంగాణ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాల ద్వారా ఇరు ప్రాంతాల సంబంధాలు మరింత ముందుకు వెళ్తాయని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. అమెరికాలోని న్యూజెర్సీ గవర్నర్ ఫిలిప్ మర్ఫీ నేతృత్వంలోని బృందం రాష్ట్ర పర్యటనలో భాగంగా.. బుధవారం తెలంగాణతో ‘సిస్టర్ స్టేట్ పార్టనర్ షిప్ అగ్రిమెంట్’ కుదుర్చుకుంది. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు హోటల్‌లో కేటీఆర్ సమక్షంలో జరిగిన ఈ ఒప్పందంపై న్యూజెర్సీ గవర్నర్ ఫిలిప్ మరీ్ఫ, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి సంతకాలు చేశారు. 2 రోజులుగా తమ రాష్ట్రంలోని ప్రభుత్వ, పారిశ్రామిక వర్గాలతో సమావేశం అవుతున్నామని, తెలంగాణలో వాణిజ్య అనుకూల వాతావరణం ఉందని ఫిలిప్ మర్ఫీ అన్నారు. సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి సెక్రటరీ అజయ్ మిశ్రా, ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, హైదరాబాద్ అమెరికన్ కాన్సుల్ జనరల్ జోయల్ రీఫ్‌మన్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment