టెక్‌ దిగ్గజాలకు ఆస్ట్రేలియా చెక్‌ | Facebook Switches News Back On In Australia, Signs Content Deals | Sakshi
Sakshi News home page

ఫేస్‌బుక్, గూగుల్‌ దూకుడుకు ఆస్ట్రేలియా అడ్డుకట్ట

Published Sun, Feb 28 2021 3:10 AM | Last Updated on Sun, Feb 28 2021 11:22 AM

Facebook Switches News Back On In Australia, Signs Content Deals - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వార్తా పత్రికలకు అన్యాయం చేస్తూ అప్పనంగా రెవెన్యూ మూట కట్టుకుంటున్న అంతర్జాతీయ టెక్‌ దిగ్గజాలు ఫేస్‌బుక్, గూగుల్‌ దూకుడుకు అడ్డుకట్ట వేసి ఆస్ట్రేలియా ప్రపంచ దేశాలకు, వార్తా పత్రికలకు సరికొత్త మార్గాన్ని చూపించింది. ఎన్నో వ్యయప్రయాసల కోర్చి వార్తా పత్రికలు సేకరిస్తున్న సమాచారాన్ని తమ టెక్‌ ప్లాట్‌ఫామ్స్‌ ద్వారా నెట్‌ ప్రపంచం ముందు ఉంచుతున్న ఫేస్‌బుక్, గూగుల్‌ ఆ వార్తల ద్వారా వస్తున్న ఆదాయంలో 80 శాతం మొత్తాన్ని వెనకేసుకుంటున్న విషయాన్ని గ్రహించి ఆస్ట్రేలియా తీసుకున్న సంచలన నిర్ణయంతో భారత్‌ సహా అన్ని దేశాలు ఆ దిశగా ఆలోచన మొదలుపెట్టాయి. సొమ్ము ఒకడిది.. సోకు మరొకడిది... అన్నట్లుగా పత్రికలు అందిస్తున్న వార్తలను నెట్‌ ప్రపంచంలో హోస్ట్‌ చేస్తున్న ఫేస్‌బుక్, గూగుల్‌ చేస్తున్న వ్యాపార రహస్యాన్ని ఆస్ట్రేలియా బట్టబయలు చేసింది. వాస్తవానికి ఫ్రాన్స్‌, జర్మనీ, కెనడా ఈ దిశగానే ఆ రెండు టెక్‌ దిగ్గజాలకు ముకుతాడు వేసేందుకు ప్రయత్నాలు చేస్తుండగానే, అస్ట్రేలియా మరింత వేగంగా చర్యలు తీసుకుని పత్రికలకు రెవెన్యూలో తగిన వాటా ఇచ్చే విధంగా చట్టం చేసింది.

వార్తలు, సమాచారం షేర్‌ చేయడం ద్వారా వస్తున్న ఆదాయాన్ని ఆయా మీడియా సంస్థలతో పంచుకోవాల్సిందేనని ఆస్ట్రేలియా ప్రభుత్వం స్పష్టం చేయడంతో ఫేస్‌బుక్‌ మొదట్లో బెదిరింపు చర్యలకు దిగింది. ఆస్ట్రేలియా నుంచి ఏ వార్త హోస్ట్‌ చేయకుండా కట్టడి చేసింది. వార్తలు షేర్‌ చేస్తే ఆయా పత్రికా సంస్థలకు ఆదాయంలో వాటా ఇవ్వాలన్న ఆస్ట్రేలియా నిబంధనల వల్లనే ఆ దేశ వార్తలను బంద్‌ చేస్తున్నట్టు ఫేస్‌బుక్‌ చేసిన ప్రకటన జనానికి ఆగ్రహం తెప్పించింది. వార్తలకే పరిమితం కాకుండా రవాణా, వైద్య ఆరోగ్యం, ఫైర్‌ సర్వీసెస్, వాతావరణ విభాగం నుంచి వచ్చే అత్యవసర సమాచారం కూడా బ్లాక్‌ చేయడంతో ఫేస్‌బుక్‌ జనాగ్రహానికి బుక్‌ అయిపోయింది. ప్రపంచవ్యాప్తంగానూ విమర్శలు వెల్లువెత్తాయి.

మరోవైపు ప్రభుత్వం మరింత పట్టుదలగా తమ నిబంధనలకు అంగీకరిస్తే తప్ప కుదరదని తేల్చిచెప్పడంతో ఫేస్‌బుక్, గూగుల్‌ దిగి రాక తప్పలేదు. దాదాపు రెండేళ్ల పాటు ఫేస్‌బుక్, గూగుల్‌ రెవెన్యూపై దృష్టి సారించిన ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆ సంస్థలకు అధిక ఆదాయం న్యూస్, వార్తా కథనాల కోసం నెటిజన్స్‌ చేస్తున్న సెర్చ్‌ వల్లనే వస్తున్నదని నిర్ధారించుకుంది. ఇలా వచ్చే దాంట్లో 80 శాతం ఆదాయాన్ని ఫేస్‌బుక్, గూగుల్‌ తమ ఖాతాలో వేసుకోవడాన్ని ఆస్ట్రేలియా బహిర్గతం చేసింది. ఆస్ట్రేలియా  మార్గంలోనే ఇండియా చర్యలు తీసుకోవాలని పత్రికా సంస్థలు కోరుతున్నాయి. పత్రికలు యాడ్స్‌పైనే ఆధారపడతాయని, డిజిటల్‌ స్పేస్‌లో మాత్రం రెవెన్యూలో మెజారిటీ వాటాను గూగుల్‌ తీసుకుని తమను నష్టానికి గురిచేస్తోందని ఆరోపిస్తున్నాయి. 

ఒప్పందాల బాటలో గూగుల్‌ 
ఆస్ట్రేలియా ప్రభుత్వ కఠిన నిర్ణయాల నేపథ్యంలో గూగుల్‌ ఆస్ట్రేలియాకు చెందిన నైన్‌ ఎంటర్‌టైన్‌ మెంట్, సెవెన్‌ వెస్ట్‌ మీడియాలతో గత వారంలో రెండు ఒప్పందాలు కుదుర్చుకుంది. వీటి విలువ సుమారు 4.7 కోట్ల డాలర్లు. దీని ప్రకారం గూగుల్‌కు చెందిన ‘‘న్యూస్‌ షో కేస్‌’’లో కనిపించే నైన్‌ ఎంటర్‌టైన్‌ మెంట్, సెవెన్‌ వెస్ట్‌ ప్రచురణ సంస్థల వార్తలకు గూగుల్‌ ఈ సంస్థలకు డబ్బు చెల్లిస్తుంది. మీడియో మొఘల్‌ రూపర్ట్‌ మర్డోక్‌కు చెందిన న్యూస్‌కార్ప్‌తోనూ గూగుల్‌ ఒప్పందం చేసుకుంది. మూడేళ్ల పాటు అమల్లో ఉండే ఈ ఒప్పందం విలువ మాత్రం తెలియరాలేదు. గూగుల్‌ ఒప్పందంలో భాగంగా న్యూస్‌కార్ప్‌కు చెందిన వాల్‌స్ట్రీట్‌ జర్నల్, న్యూయార్క్‌ పోస్ట్, ద సన్‌, ద టైమ్స్‌ వంటి పలు వార్తా పత్రికల వార్తలు, ప్రత్యేక కథనాలు, ఫీచర్స్‌ గూగుల్‌ న్యూస్‌ షో కేస్‌లో కనిపిస్తాయి. అంతే కాకుండా సబ్‌స్క్రిప్షన్‌ ప్లాట్‌ఫామ్స్‌ ఏర్పాటుకు, గూగుల్‌ యాడ్‌ టెక్నాలజీ సర్వీస్‌ ద్వారా ప్రకటనల ఆదాయాన్ని రెండు సంస్థలు పంచుకునేందుకు ఏర్పాట్లు జరిగాయి.

గూగుల్‌ న్యూస్‌ షోకేస్‌ ప్రస్తుతం యూకే, జర్మనీ, బ్రెజిల్, అర్జెంటీనా, కెనెడా, జపాన్‌, ఫ్రాన్స్‌, ఆస్ట్రేలియాలతోపాటు మొత్తం 12 దేశాల్లో అందుబాటులో ఉంది. కొన్ని నెలల చర్చల తరువాత ఈ ఏడాది జనవరిలో ఫ్రాన్స్‌ ప్రచురణ సంస్థల లాబీ ఒకటి గూగుల్‌తో ఒక ఒప్పందం కుదుర్చుకోగలిగింది. దీని ప్రకారం వార్తల కోసం గూగుల్‌ ప్రచురణ సంస్థలకు డబ్బు చెల్లించనుంది. భారత్‌లోనూ ప్రచురణ సంస్థల వార్తలకు డబ్బులు చెల్లించేలా చూడాలని ఇండియన్‌ న్యూస్‌ పేపర్‌ అసోసియేషన్‌ ఆ సంస్థలకు ఒక లేఖ రాసింది. స్వతంత్ర వార్తా పత్రికలు సిద్ధం చేసే కంటెంట్‌కు సంబంధించిన పరిహారం విషయంలో టెక్నాలజీ దిగ్గజాలు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాయన్న వాదన చాలాకాలంగా ఉంది. ‘‘కంటెంట్‌ ఈజ్‌ కింగ్‌ అని మాటవరసకు చెబుతారు కానీ... ఈ టెక్నాలజీ యుగంలో అది పాపర్‌ అయిపోయింది’’అని ద ప్రింట్‌ ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ శేఖర్‌ గుప్తా వ్యాఖ్యానించారు. ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్స్, ప్రచురణకర్తల మధ్య ఉన్న అంతరాన్ని తొలగించడానికి భారత ప్రభుత్వం స్పందించాలని కోరారు.

భారత్‌లో ఫేస్‌బుక్‌ వినియోగదారులు 32.8 కోట్లు  
దేశంలో ఫేస్‌బుక్‌ వినియోగదారులు మొత్తం 32.8 కోట్ల మంది ఉంటారని అంచనా. వాట్సాప్‌ వినియోగదారుల సంఖ్య 40 కోట్ల పైమాటే. 2018 నాటి అంచనాల ప్రకారం ఆన్‌ లైన్‌ అడ్వర్‌టైజ్‌మెంట్‌ మార్కెట్‌లో గూగుల్, ఫేస్‌బుక్‌ల సంయుక్త వాటా 68 శాతం. వార్తల హోస్టింగ్‌ ద్వారా వచ్చే అడ్వర్టయిజ్‌మెంట్‌ ఆదాయంలో 85 శాతం ప్రచురణ సంస్థలకు ఇవ్వాలని ఇండియన్‌ న్యూస్‌ పేపర్‌ సొసైటీ (ఐఎన్‌ఎస్‌) గూగుల్‌కు రాసిన లేఖలో డిమాండ్‌ చేసింది. ప్రచురణ సంస్థలు కొన్ని వేల మంది జర్నలిస్టులను నియమించుకుని, ఖర్చులు భరిస్తూ వార్తా సేకరణ చేస్తుంటాయని, వారు తయారు చేసే వార్తలను వాడుకోవడం ద్వారా గూగుల్‌ లాంటి సంస్థలు తమ ఆదాయాన్ని పెంచుకుంటున్నాయని ఐఎన్‌ఎస్‌ అధ్యక్షుడు ఎల్‌.ఆదిమూలం ఆవేదన వ్యక్తం చేశారు. గూగుల్‌ ప్రస్తుతం ప్రచురణ సంస్థలకు ఎంత మొత్తం చెల్లిస్తోందో? ఏ ప్రాతిపదికన చెల్లిస్తోందో స్పష్టంగా తెలియదు.

ప్రచురణ సంస్థలు సేకరించే వార్తలు/ కథనాలు ప్రొప్రైటరీ తరహావి కావడం వల్ల అవి విశ్వసనీయమైనవని, భారత్‌లో గూగుల్‌పై నమ్మకం పెరిగేందుకు ఉపయోగపడ్డాయని ఐఎన్‌ఎస్‌ గట్టిగా చెపుతోంది. గూగుల్, ఫేస్‌బుక్‌ లాంటి టెక్‌ దిగ్గజాలు ప్రచురణ సంస్థల డిమాండ్లకు తలొగ్గేలా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గతంలో యూట్యూబ్‌కు టెలివిజన్‌ చానళ్లు, సినిమా నిర్మాణ సంస్థలకు కూడా కంటెంట్‌ విషయంలో వివాదాలు వచ్చినప్పుడు యూట్యూబ్‌ ఏకపక్షంగా వ్యవహరించిన విషయాన్ని వీరు గుర్తు చేస్తున్నారు. అంతర్జాతీయ టెక్‌ సంస్థల బలం ముందు స్థానిక మీడియా సంస్థలు నిలబడటం కష్టమవుతుందని, ఈ కారణంగానే ప్రభుత్వ జోక్యం అనివార్యమని మళయాల మనోరమ ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌ జయంత్‌ ఎం మాథ్యూ అన్నారు. ప్రచురణ సంస్థలన్నీ ఒక్కతాటిపై నిలబడి, ప్రభుత్వ నియంత్రణ సంస్థలు కూడా సహకరిస్తే వాణిజ్యంపై టెక్‌ సంస్థలతో చర్చలు జరిగేందుకు అవకాశం ఉందని... దానికి చట్టసభల సహకారం ఉంటే పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుందని అభిప్రాయపడ్డారు.  

85 శాతం రెవెన్యూ ప్రచురణకర్తలకు ఇవ్వాలి 
విశ్వసనీయమైన సమాచారం గూగుల్‌కు సాధికారత సమకూర్చింది. అత్యంత విశ్వసనీయమైన ప్రింట్‌ మీడియా కంటెంట్‌ గూగుల్‌కు లభించేలా పూర్తి యాక్సెస్‌ను ప్రచురణకర్తలు ఇచ్చారు. విశ్వసనీయత కలిగిన సమాచారం కోసం ప్రింట్‌ మీడియా వేలాది మంది జర్నలిస్టులను క్షేత్రస్థాయిలో నియమించుకుంది. అయితే ఈ సమాచారం, స్టోరీలు గూగుల్‌లో కనిపించినప్పుడు... న్యాయమైన విలువను ప్రచురణకర్తలకు గూగుల్‌ చెల్లించాల్సి ఉంది. విశ్వసనీయమైన, నాణ్యమైన వార్తలు అందిస్తున్న సంస్థలకు, ఫేక్‌ న్యూస్‌ అందిస్తున్న వాటికి మధ్య భారీ తేడా ఉంది. అందువల్ల వార్తా ప్రచురణకర్తలకు గూగుల్‌ తగిన పరిహారం, తగిన విలువ చెల్లించాలని ఇండియన్‌ న్యూస్‌ పేపర్‌ సొసైటీ(ఐఎన్‌ఎస్‌) ప్రతిపాదిస్తోంది.

న్యూస్‌ ఇండస్ట్రీకి వాణిజ్య ప్రకటనలే వెన్నెముక. అయితే డిజిటల్‌ స్పేస్‌కు వచ్చేసరికి ప్రచురణకర్తల ఆదాయం పూర్తిగా తగ్గిపోయింది. ఎందుకంటే వాణిజ్య ప్రకటనల వ్యయంలో గూగుల్‌కే సింహభాగం వెళుతోంది... ప్రచురణకర్తలకు కొద్దివాటా మిగులుతోంది. అలాగే ప్రకటనల విధానంలో పారదర్శకత లేని పరిస్థితిని ప్రచురణకర్తలు ఎదుర్కొంటున్నారు. అందువల్ల వార్తాసంస్థలకు 85 శాతం రెవెన్యూ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం. గుర్తింపు పొందిన వార్తా ప్రచురణ సంస్థల ఎడిటోరియల్‌ కంటెంట్‌కు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ఫేక్‌ న్యూస్‌ను అరికట్టవచ్చు. 
– ఎల్‌.ఆదిమూలం, అధ్యక్షుడు, ఇండియన్‌ న్యూస్‌ పేపర్‌ సొసైటీ 

విశ్వసనీయ సమాచారానికి తగిన విలువ సమకూరాలి 
ఇండియన్‌ న్యూస్‌ పేపర్‌ సొసైటీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను. నేను ఐఎన్‌ఎస్‌ డిజిటల్‌ కమిటీకి చైర్మన్‌గా కూడా ఉన్నాను. కంటెంట్‌కు న్యాయమైన విలువను వార్తాసంస్థలకు ఇవ్వడం, వాణిజ్య ప్రకటనల్లో ప్రచురణకర్తల వాటా పెంచడం, ఫేక్‌ న్యూస్‌ను అరికట్టడం... అన్న మూడు అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. దేశంలో ప్రచురణకర్తలు విశ్వసనీయమైన వార్తలు, కరెంట్‌ అఫైర్స్, విశ్లేషణ, సమాచారం, వినోదం తదితర అంశాల్లో నాణ్యమైన జర్నలిజాన్ని అందిస్తున్నారు. గూగుల్‌ వెబ్‌ క్రాలర్స్‌ ఈ వార్తలను పాఠకులకు పంచుతోంది. వేలాది మంది జర్నలిస్టులతో విశ్వసనీయత కలిగిన సమాచారం అందిస్తున్నందున దానికి తగిన విలువ సమకూరాలి. ఈ దిశగా గూగుల్‌కు ఐఎన్‌ఎస్‌ లేఖ రాసింది. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు కూడా దీనిపై దృష్టి పెట్టాయి. యురోపియన్‌  యూనియన్, ఆస్ట్రేలియాలలో గూగుల్‌ సముచిత రీతిలో ప్రచురణకర్తలకు చెల్లించేందుకు అంగీకారం కుదిరింది. ఇక్కడ కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. 
– జయంత్‌ మమెన్‌ మాథ్యూ, ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్, మలయాళ మనోరమ 

వైశాల్యపరంగా పెద్దదే అయినప్పటికీ... ఆస్ట్రేలియా జనాభా 2.54 కోట్లు మాత్రమే. ఫేస్‌బుక్‌ వినియోగదారులు 1.12 కోట్ల మంది. ఇంత తక్కువ సబ్‌స్క్రైబర్‌ బేస్‌ ఉన్న ఆస్ట్రేలియానే ప్రభుత్వ దృఢ సంకల్పంతో అంతర్జాతీయ టెక్‌ దిగ్గజాలైన ఫేస్‌బుక్, గూగుల్‌లను దారిలోకి తెచ్చినపుడు... మనమెందుకు చేయలేం? భారత్‌లో ఫేస్‌బుక్‌కు ఏకంగా 32.8 కోట్ల మంది ఖాతాదారులున్నారు. ప్రపంచంలో వారికిదే అతిపెద్ద మార్కెట్‌. సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్న కొద్దీ సంప్రదాయ వార్తా పత్రికలు అనేక సవాళ్లను, ఆర్థిక ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. కాబట్టి  ఆస్ట్రేలియా స్ఫూర్తితో భారత ప్రభుత్వం కూడా ఆ దిశగా చర్యలు తీసుకోవాలని మీడియా సంస్థలు కోరుతున్నాయి. తమ వార్తల ద్వారా ఫేస్‌బుక్, గూగుల్‌లు ఆర్జిస్తున్న మొత్తంలో సముచిత వాటాను ఇచ్చేలా చట్టం తేవాలని విజ్ఞప్తి చేస్తున్నాయి.

ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్స్‌లో కొరవడిన పారదర్శకత
వార్తల హోస్టింగ్‌ ద్వారా డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌కు ప్రకటనల రూపంలో ఎంత ఆదాయం వస్తోందన్న విషయం బయటికి తెలియడం లేదు. గూగుల్, ఫేస్‌బుక్‌ వంటి సంస్థలు తాము ఆర్జించిన ప్రకటనల ఆదాయంలో అతి తక్కువ మొత్తాన్ని ప్రచురణ సంస్థలకు విదిలిస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. డిజిటల్‌ అడ్వర్టయిజ్‌మెంట్లు ఎప్పటికప్పుడు పెరుగుతున్నా అదాయంలో అధిక మొత్తం టెక్‌ సంస్థలకే వెళుతోందన్నది ఆస్ట్రేలియా ప్రభుత్వ అంచనా కూడా. 

♦ ఆస్ట్రేలియాలో డిజిటల్‌ అడ్వర్టయిజ్‌మెంట్‌ కోసం వంద రూపాయలు ఖర్చు చేస్తే అందులో 49 రూపాయలు గూగుల్‌కు, 24 రూపాయలు ఫేస్‌బుక్‌కు వెళుతోందని, మిగిలిన 27మాత్రమే ఇతర మాధ్యమాలకు అందుతోందని ఆస్ట్రేలియన్‌ కాంపిటీషన్‌ అండ్‌ కన్జ్యూమర్‌ కమిషన్‌ అధ్యయనంలో తేలింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement