విజయవాడ: రాజధాని నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూ సమీకరణపై తీవ్ర స్థాయిలో అభ్యంతరాలు, ఆందోళనలు వ్యక్తమవుతుండటంతో ప్రభుత్వం కొత్త ఎత్తులు వేస్తుంది. రాజధాని ప్రాంత రైతులు, తమ భూములు బలవంతంగా లాక్కున్నారంటూ దేశ రాజధానిలో ఆందోళనకు దిగడంతో ప్రభుత్వం ఆగమేఘాలపై సోమవారం రైతులతో ఒప్పందాలు కుదుర్చుకుని చెక్కులు పంపిణీ చేసింది. అనంతరం చెక్కులు పంపిణీ చేసిన రైతుల పంట భూముల్లో ట్రాక్టర్లతో చదును కార్యక్రమం చేపట్టారు. తుళ్లూరు మండలం నేలపాడులో 93 ఎకరాలకు సంబంధించిన 36 మంది రైతులతో అప్పటికప్పుడు ఒప్పందాలు చేసుకుని భూములను స్వాధీనం చేసుకున్నారు. అక్కడికక్కడే ఎకరాకు రూ. 30 వేల చొప్పున రైతులకు పరిహారం చెక్కులు పంపిణీ చేశారు. వెనువెంటనే నేలపాడు సర్పంచ్ సుబ్బారావు పొలంలో భూమి చదును చేసే కార్యక్రమాన్ని సోమవారం సాయంత్రం ప్రారంభించారు.
భూ సమీకరణకు అంగీకారపత్రాలు ఇచ్చిన రైతులందరినీ పరిహారం వైపు మళ్లించడం, భవిష్యత్తులో న్యాయ వివాదాలు రాకుండా జాగ్రత్త పడటం కోసమే ఈ రకమైన ఎత్తుగడ వేశారని రాజధాని ప్రాంత రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తొలివిడత భూ సమీకరణ ముగిసిన వెంటనే అంగీకార పత్రాలు అందిన భూములకు సంబంధించి సర్వే నిర్వహించి అన్నీ సక్రమంగా ఉంటేనే ఒప్పందాలు చేసుకోవాలని ప్రభుత్వం తొలుత భావించింది. రైతుల భూమి అధికారికంగా సీఆర్‌డీఏ చేతికి అందాక భూమిని చదును చేస్తామని సీఆర్‌డీఏ అధికారులు నిన్నటి వరకూ చెప్పారు. ఒప్పందాలు పూర్తయిన తర్వాత మాస్టర్‌ప్లాన్ వచ్చేలోపు భూములను చదును చేయాలని భావించారు. కానీ అవేమీ మొదలుకాకుండానే సీఆర్‌డీఏ కమిషనర్ శ్రీకాంత్, గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే సోమవారం సాయంత్రమే భూములు స్వాధీన పరుచుకునే పని ప్రారంభించారు. .