స్థూపాకారంలో అసెంబ్లీ!
సాక్షి, అమరావతి: రాజధాని పరిపాలనా నగరంలో నిర్మించే అసెంబ్లీ భవన డిజైన్ దాదాపు ఖరారైంది. ఆక్యులస్ మోడల్(స్థూపం)లో ఉండే అసెంబ్లీ భవన డిజైన్‌ను ప్రభుత్వం ఖరారు చేసిందని సీఆర్‌డీఏ వర్గాలు చెబుతున్నాయి. హైకోర్టు డిజైన్‌పై మాత్రం ఇంకా సందిగ్ధం కొనసాగుతోంది. సీఆర్‌డీఏతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం మాస్టర్ ఆర్కిటెక్ట్ నార్మన్ ఫోస్టర్ సంస్థ పరిపాలనా నగరం వ్యూహ ప్రణాళికతో పాటు హైకోర్టు, అసెంబ్లీ భవనాల డిజైన్లు ఇవ్వాల్సి ఉంది. వీటిలో అసెంబ్లీకి సంబంధించి నార్మన్ ఫోస్టర్ సంస్థ గతంలో పలు డిజైన్లు ఇచ్చినా ప్రభుత్వం వాటిని తిరస్కరించింది.
ఈ నేపథ్యంలో నార్మన్ ఫోస్టర్ సంస్థ మళ్లీ పలు డిజైన్లు రూపొందించగా.. ప్రభుత్వం చివరకు ఆక్యులస్ మోడల్‌లో ఉండే భవన డిజైన్‌ను ఖరారు చేసినట్లు తెలిసింది. ఈ డిజైన్ ప్రకారం 160 ఎకరాల్లో నిర్మించే ఈ భవనం బౌద్ధ స్థూపం ఆకారంలో ఉంటుంది. సూర్యకిరణాలు నేరుగా ఈ స్థూపం ద్వారా భవనంలోని అన్ని వైపులా పడేలా దీన్ని డిజైన్ చేశారు. నాలుగు భాగాలుగా దీన్ని విభజించారు. ఒక భాగంలో కౌన్సిల్ హాలు, మరో భాగంలో అసెంబ్లీ హాలు ఉంటాయి. మూడో భాగంలో సెంట్రల్ హాలు, నాలుగో భాగంలో పరిపాలనా భవనాలు, ఇతర ఆకర్షణలుంటాయి. మధ్యలో రౌండ్ సర్కిల్‌ను పబ్లిక్ ప్లేస్‌గా వదిలి దానిలో పార్కు తదితరాలు ఏర్పాటు చేస్తారు.
విశాఖ భూ స్కాంపై సిట్: విశాఖపట్నంలో జరిగిన భారీ భూ కుంభకోణంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)తో విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఈ కుంభకోణం జరిగిన తీరుపై వాకబు చేసిన ముఖ్యమంత్రి.. రెవెన్యూ, పోలీసు ఉన్నతాధికారులు, మంత్రులతో ఈ అంశంపై సమీక్షించారు. నిర్ణీత సమయంలో ఈ కుంభకోణంపై దర్యాప్తు జరిపి దోషులను నిగ్గు తేల్చేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని వేయాలని, ఇందులో రెవెన్యూ, పోలీసు ఉన్నతాధికారులతోపాటు న్యాయ నిపుణులను నియమించాలని సీఎం ఈ సందర్భంగా ఆదేశించారు.