భూసమీకరణపై ప్రపంచ బ్యాంకు విచారణ!
స్వతంత్రంగా ‘ఆస్కి’ ద్వారా వివరాలు సేకరిస్తున్న వైనం
సాక్షి, అమరావతి: రాజధానికి ప్రపంచ బ్యాంకు రుణం ఇచ్చేస్తుందని ప్రభుత్వం భావిస్తున్న తరుణంలో.. అందుకు విరుద్ధంగా దాని తరఫున ఆస్కి(అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజి) అక్కడి గ్రామాల్లో విచారణ చేస్తుండడం హాట్ టాపిక్‌గా మారింది. ఇది ప్రభుత్వానికి మింగుడుపడటం లేదు. దీంతో విచారణ నిర్వహిస్తున్న వారిపై సీఆర్‌డీఏ అధికారులు తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు. ఫలితంగా ఆస్కి బృందం ఆదివారం తమ రూటు మార్చుకుని ముందుగా నిర్ణయించిన గ్రామాలకు వెళ్లలేదు. ప్రపంచ బ్యాంకుకూ వాస్తవాలు తెలియకుండా ప్రభుత్వం మభ్య పెడుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రాజధానిలో చేపట్టే ప్రాజెక్టులకు రూ.6 వేల కోట్ల రుణమివ్వాలని ఆరు నెలల కిందట సీఆర్‌డీఏ ప్రపంచ బ్యాంకుకు దరఖాస్తు చేసుకుంది. దీనిపై బ్యాంకు ప్రతినిధులు రెండుసార్లు విజయవాడకు వచ్చి సీఆర్‌డీఏ ఉన్నతాధికారులతో చర్చించి రుణమిచ్చేందుకు ప్రాథమికంగా అంగీకరించారు. ఈ నేపథ్యంలోనే ప్రపంచ బ్యాంకు తరఫున రెండురోజుల నుంచి ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఆస్కికి చెందిన ప్రొఫెసర్ రేష్మి నాయర్, డాక్టర్ లక్ష్మిలు రాజధాని గ్రామాల్లో తిరుగుతూ భూసమీకరణపై వివరాలు సేకరిస్తున్నారు.