రాసిస్తా.. రాజధాని | Amaravathi lands selling to the private companies | Sakshi
Sakshi News home page

రాసిస్తా.. రాజధాని

Published Mon, Feb 13 2017 1:34 AM | Last Updated on Sat, Aug 18 2018 3:49 PM

రాసిస్తా.. రాజధాని - Sakshi

రాసిస్తా.. రాజధాని

అమరావతి ‘ఫర్‌ సేల్‌’!.. పూలింగ్‌ భూములిక ప్రైవేట్‌ సంస్థలకు అమ్మకం

సాక్షి, అమరావతి: అనుకున్నంతా అయ్యింది.‘సాక్షి’ చెప్పింది అక్షరాలా నిజమయ్యింది.
రాజధానిలో బాబు సర్కారు ‘రియల్‌’ వ్యాపారం షురూ అయ్యింది. అమరావతి భూములను నచ్చినవారికి మెచ్చిన ధరలకు అమ్మేయబోతోంది. పక్కా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి అనువుగా రాజధాని భూ కేటాయింపు నిబంధనలను ప్రభుత్వం సవరించింది. సామదానభేద దండోపాయా లు ఉపయోగించి రాజధాని రైతులనుంచి సమీకరించిన వేల ఎకరాల భూములు బినామీ సంస్థల పరం కాబోతున్నాయి.

పైసా పెట్టుబడి లేకుండా రైతుల భూములతో బాబు ప్రభుత్వం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేయబోతోందని ‘సాక్షి’ పలు సందర్భాలలో ప్రత్యేక కథనాలను ప్రచురించిన సంగతి తెల్సిందే. కోట్ల రూపాయల విలువైన రైతుల భూములను కైంకర్యం చేయడానికి వీలుగా రాజధాని భూ కేటాయింపు నిబంధనలను సవరించడం.. సర్కారు ‘రియల్‌’ దాహాన్ని రుజువు చేసింది. ప్రైవేటు కంపెనీలు, సంస్థలకు మాత్రమే మేలు చేసే ఆ సవరణల ను చూసి ప్రభుత్వ అధికారులే నివ్వెరపోతు న్నారు. బినామీలకు మేలు చేయడానికి ఇంతగా బరితెగించడం మరెవరికీ సాధ్యం కాదన్న రీతిలో ప్రభుత్వ పెద్దలు వ్యవహరిం చారని సీఆర్‌డీఏ వర్గాల్లో వినిపిస్తోంది.

భూ కేటాయింపు నిబంధనలలో సవరణలు
అంతర్జాతీయ స్థాయి రాజధాని నిర్మాణం పేరుతో రైతుల నుంచి సమీకరించిన విలువైన భూములతో వ్యాపారం చేయాల ని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం అమరావతి భూముల కేటా యింపు నియమ నిబంధనల్లో సవరణలను తీసుకొచ్చింది. గత ఏడాది డిసెంబర్‌ 7న జరిగిన ఏపీ సీఆర్‌డీఏ 7వ అధికారుల సమావేశంలో ఈ సవరణలకు ఆమోదం తెలిపారు. ఈ భూములను పారిశ్రామిక, విద్య, వైద్యం, వినోదం, వాణిజ్యం, రియల్‌ ఎస్టేట్‌ తదితర  కార్యకలాపాల కోసం ప్రైవేట్‌ సంస్థలు, వ్యక్తులకు విక్రయించాల ని రాష్ట్రప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు సేల్‌ డీడ్‌ చేసేందుకు సీఆర్‌డీఏకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

లీజు లేదు ఏకంగా సేల్‌ డీడ్‌
ఏదైనా ప్రాజెక్టు ఏర్పాటుకు ఎవరైనా ముందుకు వస్తే తొలుత లీజుకు భూములను కేటాయిస్తారు. ఆ ప్రాజెక్టు ఏర్పాటు పూర్తయిన తరువాతనే ఆ భూములను ఆ ప్రాజెక్టు పేరు మీద బదలాయిస్తారు. అలాంటిది రాజధానిలో మాత్రం ప్రాజెక్టు ఏర్పాటు కాకుండానే ముందుగా భూములను ప్రైవేట్‌ సంస్థలు, వ్యక్తులకు అమ్మేయబోతున్నారు. ఒకవేళ ఆ సంస్థలు ఆ భూములపై రుణాలు తీసుకుని, ఆ తర్వాత ప్రాజెక్టు ఏర్పాటు చేయకుండా పోతే పరిస్థితి ఏమిటని అధికార వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.

ప్రభుత్వానికి ఆ భూములపై ఎలాంటి హక్కూ ఉండదు..
రాజధాని ప్రాంతంలో ఏదైనా సంస్థ ఏర్పాటుకు 100 ఎకరాల భూములు అవసరమనుకోండి. కొత్త నిబంధనల ప్రకారం అనుకున్నదే తడవుగా ఆ 100 ఎకరాలను సదరు సంస్థకు కేటాయించడమే కాదు ఆ సంస్థ ఏర్పాటు కాకుండానే ఆ వంద ఎకరాలను ఆ సంస్థ పేరు మీద విక్రయించేస్తారు. ఈ విధంగా విక్రయించేస్తేనే ఆ సంస్థ ఆ భూమిని బ్యాంకుల్లో తనఖా పెట్టి రుణాలను తీసుకోవడం సులువవుతుంది.

అమరావతి భూముల కేటాయింపు నియమ నిబంధనల్లో తొలుత ఇలాంటి దుర్మార్గపు వెసులుబాటు లేదు. ప్రాజెక్టు అమలు చేయక ముందే సేల్‌ డీడ్‌ చేసేందుకు ఆస్కారం లేదు. ఇప్పుడు సేల్‌ డీడ్‌ చేసేందుకు వీలుగా కేటాయింపుల నియమ నిబంధనల్లో సవరణలు తీసుకువచ్చారు. ప్రభుత్వ పెద్దలకు నచ్చిన వ్యక్తులు, సంస్థలకు రాజధాని ప్రాంతంలోని భూములను రియల్‌ ఎస్టేట్‌ లేదా వాణిజ్య, వినోద తదితర కార్యకలాపాలపేరుతో ఏకంగా అమ్మేయనున్నారు. ఈ విధంగా భూములను ప్రైవేట్‌ సంస్థలు, వ్యక్తులకు అమ్మేసిన తరువాత ప్రభుత్వానికి ఎటువంటి హక్కూ ఉండదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

12 సంస్థలకు 1020.5 ఎకరాలు..
ఇప్పటికే రాజధాని ప్రాంతంలో 12 సంస్థల ఏర్పాటునకు ప్రభుత్వం 1020.5 ఎకరాలను కేటాయించింది. ప్రైవేట్‌ సంస్థలకు ఫ్రీ హోల్డ్‌ విధానంలో భూములను కేటాయించగా ప్రభుత్వ సంస్థలకు లీజు విధానంపై భూములను కేటాయించింది. అంతేకాదు ప్రభుత్వ సంస్థలలో ఒక్క సంస్థను తీసుకున్నా గరిష్టంగా 50 ఎకరాలు కూడా మించలేదు.. కానీ ప్రైవేటు సంస్థలకు మాత్రం వందల ఎకరాలను కేటాయించింది. అంటే ప్రభుత్వ సంస్థల విషయంలో ఒకలా ప్రైవేటు సంస్థల విషయంలో మరోలా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నమాట. ప్రైవేటు సంస్థలంటే ప్రభుత్వ పెద్దలకు సన్నిహితులు, వారి బినామీలేనని, అందుకే ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుందని అధికారవర్గాలంటున్నాయి.  ప్రాజెక్టు అమలు చేయకముందే ప్రైవేటు సంస్థలు, వ్యక్తులకు ఆ భూములను పూర్తిస్థాయిలో విక్రయించడం ఎక్కడా లేదని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి..


Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement