ప్రైవేట్‌కు ‘రాజధాని’ భూములు!
పరిశ్రమల కోసం తొలి దశలో 2,700 ఎకరాలు రిజర్వ్
♦ పెట్టుబడుల ప్రోత్సాహక ఏజెన్సీ ఏర్పాటు
♦ సీఆర్‌డీఏ ప్రతిపాదనలు
సాక్షి, హైదరాబాద్: రాజధాని ప్రాంతంలో రైతుల నుంచి సమీకరించిన భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా రహదారి సౌకర్యం గల ప్రాంతాల్లో భూములను సీఆర్‌డీఏ ఇప్పటికే గుర్తించింది. పరిశ్రమల స్థాపన కోసం నిడమర్రు, బేతపూడి, కురగల్లులో తొలదిశలో 2,700 ఎకరాలను రిజర్వ్ చేసింది. ఈ భూముల వివరాలను రాష్ట్ర పరిశ్రమల శాఖకు పంపించింది. ఇక్కడ పరిశ్రమల స్థాపనకు ప్రైవేట్ వ్యక్తులను తీసుకురావాలని సూచించింది. రాజధా ని ప్రాంతం కోసం ప్రత్యేకంగా పెట్టుబడుల ప్రోత్సాహక ఏజెన్సీని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలను సీఆర్‌డీఏ సమర్పించింది.
వాణిజ్య వినియోగానికి సాగు భూములు
రాజధానిలో అభివృద్ధి ప్రాజెక్టులను ప్రభుత్వం మూడు కేటగిరీలుగా వర్గీకరించింది. మొదటి కేటగిరీలో రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, యుటిలిటీ కారిడార్స్, వరద నిర్వహణ ప్రాజెక్టులు, ట్రంక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులను ఈపీసీ విధానంలో చేపట్టాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్టులను చేపట్టే నిర్మాణ సంస్థలకు సిమెంట్, స్టీలు, ఇంధనం, లేబర్ ధరలు పెరిగితే ఆ మొత్తాలను చెల్లించే వెసులబాటును కల్పించనుంది. అలాగే రెండో కేటగిరీలో ప్రాజెక్టులను పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంతో (పీపీపీ) చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రైవేట్ వ్యక్తులు, సంస్థలకు అవసరమైన భూమిని సరసమైన ధరలకే కేటాయించనుంది.
ఇక మూడో కేటగిరిలో రాజధాని నిర్వహణకు అయ్యే వ్యయం మొత్తం రాబట్టడమే లక్ష్యంగా రైతుల నుంచి సమీకరించిన భూములను ప్రైవేట్ వ్యక్తులకు వాణిజ్య అవసరాల కోసం కేటాయించనుంది. ఈ భూములను ప్రైవేట్ వ్యక్తులకు, సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం విక్రయిస్తుంది. ఇందుకు సంబంధించి 10 వేల ఎకరాలను రిజర్వ్ చేసింది. రాజధాని ప్రాంతంలో సాగు భూములను వాణిజ్య వినియోగ మార్పిడికి అనుమతించే అధికారాన్ని సీఆర్‌డీఏ ఎగ్జిక్యూటివ్ కమిటీకి అప్పగించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయం తీసుకుంది. మొత్తం రాజధాని ప్రాంతంలో పలు రంగాలకు చెందిన తొమ్మిది సిటీలను అభివృద్ధి చేయాలని సర్కారు నిర్ణయించింది.