రాజధాని భూములు లెక్క తేల్చిన సీఆర్‌డీఏ
పర్యావరణ అనుమతి దరఖాస్తుల్లో వెల్లడి
సాక్షి, విజయవాడ: రాజధాని నగరాన్ని నిర్మిస్తున్న ప్రాంతంలో భూములన్నీ పంట భూములేనని మరోసారి స్పష్టమైంది. 217.23 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఎక్కువ భాగంలో పంటలు పండుతున్నాయని సీఆర్‌డీఏ తేల్చి చెప్పింది. దాదాపు 70 శాతం పంట భూములేనని పేర్కొంది. గతంలోనే ఈ లెక్కలు సేకరించినా అధికారికంగా వాటిని ఎప్పుడూ బయట పెట్టలేదు. మూడు పంటలు పండే ప్రాంతంలో రాజధాని కట్టడం సరికాదని ప్రతిపక్షాలు, రైతు సంఘాలు, హక్కుల సంఘాలు ఆందోళనలు చేసినా నోరు మెదపకపోగా ఆ వివరాలు వెల్లడించడానికే ఇష్టపడలేదు.
కానీ పర్యావరణ అనుమతి కోసం తయారు చేసిన దరఖాస్తులో ఈ వివరాలన్నింటినీ పొందుపరచక తప్పలేదు. రాజధాని కోసం తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లోని 29 గ్రామాల్లో 43,472 ఎకరాల భూములుండగా 32,400 ఎకరాలను ప్రభుత్వం భూసమీకరణ ద్వారా సేకరించిన విషయం తెలిసిందే. ఈ గ్రామాల్లోనే 217.23 చ.కి.మీ. రాజధాని నగరాన్ని నిర్మించడానికి సింగపూర్ ప్రభుత్వ సంస్థలతో మాస్టర్‌ప్లాన్ తయారు చేయించింది. సేకరించిన దాంట్లో 55.78 శాతం భూమిలో వివిధ రకాల పంటలు సాగవుతున్నట్లు స్పష్టమైంది. 121.17 చ.కి.మీ పరిధిలో ఈ పంటలు సాగవుతున్నాయి. 31.19 చ.కి.మీ. వివిధ రకాల తోటలున్నాయి. వీటి శాతం 14.36 శాతం. మొత్తంగా 70.14 శాతం భూములు ఏదోరకంగా సాగులో ఉన్నవే.
ఈ భూముల్లో ఎక్కువగా పత్తి, వరి, మిరప, అరటి పంటలు సాగయ్యేవి. కృష్ణా నదికి ఆనుకుని ఉన్న ఏడు గ్రామాల్లో కూరగాయలు, పూలతోటలు సాగవుతున్నాయి. వీటితో రైతులకు బాగా ఆదాయం లభించేది. ఈ పంటలన్నింటికీ చాలావరకూ ఇప్పుడు బ్రేక్ పడింది. పంట భూముల తర్వాత 29.65 చ.కి.మీ. కృష్ణానది, కాలువలు, వాగులున్నాయి. మొత్తం భూమిలో వాటి శాతం 13.65. మిగిలిన భూముల్లో కొండలు, అర్బన్, రూరల్ ప్రాంతాలు, స్వల్పంగా ఖనిజాలున్నాయి.