Cropland
-
పోలీస్ అధికారి మందలించడంతో మనస్తాపం
సాక్షి, రాజుపాళెం: పంట భూమి రస్తా విషయంపై రాజుపాళెం మండలంలోని కొర్రపాడు గ్రామానికి చెందిన వంగలి సలీం అనే యువకుడు గురువారం ఓ సెల్‌ఫోన్ టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని హల్చల్ చేశాడు. ఇది గమనించిన ప్రజలు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీస్ సిబ్బంది రంగప్రవేశం చేసి ఎట్టకేలకు ఆ యువకుడిని కిందికి దించారు. వివరాలు ఇలా ఉన్నాయి. వంగలి సలీం తండ్రి, వారి చిన్నాన్నకు కొర్రపాడు గ్రామ పొలంలో 364 సర్వే నంబరులో 80 సెంట్లు పంట భూమి ఉంది. ఈ భూమి గుండా దిగువనున్న 70 ఎకరాల రైతులు పొలం పనులు చేసుకుంటున్నారు. అయితే ఇటీవల ఆభూమిని కొలతలు వేయడంతో ఆభూమిలో ఎటువంటి రస్తా లేదని, ఇది పట్టా భూమి అని తెలుసుకున్న సలీం వారి కుటుంబ సభ్యులు దిగువనున్న రైతులను వారి భూమిలో నుంచి వెళ్లనీకపోవడంతో సమస్యగా మారింది. దిగువ నున్న రైతులు ఎన్నో ఏళ్లుగా ఆ భూమిలో ఉన్న రస్తా నుంచే వెళ్లి పంటలు సాగు చేసుకుంటున్నామని రెవెన్యూ, పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే నాలుగు రోజుల కిందట ప్రొద్దుటూరు రూరల్ సీఐ విశ్వనాథరెడ్డి వద్దకు వెళ్లగా రస్తా విషయంపై తగదా పడవద్దని చెప్పారు. ఆ తర్వాత ఆయన నన్ను మందలించి, మా ఆడవాళ్లను అవమానకరంగా మాట్లాడాడని బాధితుడు సలీం వాపోయాడు. భూమిలో రస్తా విషయంపై పోలీస్ అధికారి మందలించడంతో తాను మనస్తాపానికి గురైయ్యాయని, 40 సెంట్లు రస్తాకే పోతే తన కుటుంబ జీవన పరిస్థితి ఎలాగని, తమ భూమి రస్తా విషయంలో రూరల్ సీఐ చర్యలు తీసుకుంటే తన చావుకు కారణం ఆయనేనని బాధితుడు పేర్కొన్నాడు. గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు దొంతిరెడ్డి సూర్యనారాయణరెడ్డి సెల్‌టవర్ ఎక్కిన యువకుడితో చర్చలు జరిపారు. ఈభూమి రస్తా విషయంలో పోలీసుల జోక్యం ఉండదని చెప్పడంతో వెంటనే సలీం టవర్ దిగారు. దీంతో కుటుంబసభ్యులు, పోలీసులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. సంఘటనా స్థలానికి తహసీల్దార్ ఉదయభారతి, ఎంపీడీఓ సయ్యదున్నీసా, ఏఎస్ఐ కేవీ సుబ్బయ్య వచ్చి టవర్ ఎక్కిన సలీంతో మాట్లాడారు. అనంతరం తహసీల్దార్ బాధితుడి స్టేట్మెంట్ను నమోదు చేశారు. -
పచ్చని పొలాన్ని దున్నేశారు!
-
పచ్చని పొలాన్ని దున్నేశారు!
♦ రాజధాని రోడ్డు కోసం పంట భూములు నాశనం చేస్తున్న ప్రభుత్వం ♦ 112 ఎకరాలు స్వాధీనం చేసుకునే యోచన ♦ వెంకటపాలెంలో 25 ఎకరాల చదునుకు యత్నం ♦ నాలుగు ఎకరాల్లో క్యారట్ పంట ధ్వంసం ♦ రైతుల ప్రతిఘటనతో వెనుదిరిగిన అధికారులు, కాంట్రాక్టర్ సాక్షి అమరావతి బ్యూరో / తుళ్లూరు రూరల్: రాజధాని నిర్మాణం పేరిట రైతుల నుంచి బలవంతంగా వేలాది ఎకరాల భూములు స్వాధీనం చేసుకున్న ప్రభుత్వం.. కోర్టు వివాదంలో ఉన్న భూములను సైతం లాక్కునేందుకు ప్రయత్నిస్తోంది. రైతుల ఆవేదనను పట్టించుకోకుండా పచ్చని పంట పొలాలు ధ్వంసం చేస్తోంది. రోడ్డు నిర్మాణం కోసం కోట్లాది రూపాయల విలువైన జరీబు భూముల్లో యంత్రాలను దింపి చదును చేయిస్తోంది. సోమవారం వెంకటపాలెం గ్రామానికి చెందిన భూములను సీఆర్డీఏ అధికారుల సహకారంతో చదును చేసేందుకు కాంట్రాక్టర్లు యత్నించారు. లంక శ్రీకాంత్‌కు చెందిన 4 ఎకరాలను భూమిని చదును చేసేశారు. విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న గ్రామస్తులు ప్రతిఘటించడంతో అధికారులు, కాంట్రాక్టర్లు వెనుదిరిగారు. భూసమీకరణ కింద ఇవ్వని భూములను ఎలాగైనా లాక్కొనేందుకు ప్రభుత్వం భూసేకరణకు పూనుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే 9 గ్రామాల్లో భూసేకరణకు నోటిఫికేషన్ ఇచ్చారు. మరోవైపు అమరావతి నిర్మాణంలో భాగంగా రాజధాని పరిధిలో రూ.230 కోట్లతో 18.3 కిలోమీటర్ల మేర సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణ పనులను ప్రభుత్వం చేపట్టింది. ఆ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే మణిపాల్ ఆస్పత్రి నుంచి బోరుపాలెం వరకు సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణానికి ఆటంకాలు ఎదురయ్యాయి. తాడేపల్లి మునిసిపాలిటీ పరిధిలోని 28 ఎకరాలు రాజధాని ప్రాంత పరిధిలో లేవు. అలాగే ఉండవల్లి, పెనుమాక గ్రామాల పరిధిలో మరో 59 ఎకరాలను స్థానికులు ల్యాండ్ పూలింగ్‌కు ఇవ్వలేదు. వెంకటపాలెం గ్రామానికి చెందిన సుమారు 25 ఎకరాల భూమిని గత ప్రభుత్వం జాతీయ రహదారి నిర్మాణం కోసం సేకరించింది. అయితే పరిహారం తక్కువగా ప్రకటించడంతో రైతులు కోర్టును ఆశ్రయించారు. ఆ తర్వాత రాష్ట్ర విభజన, ప్రభుత్వాలు మారడం వంటి పరిణామాల నేపథ్యంలో జాతీయ రహదారి నిర్మాణానికి బ్రేక్ పడింది. కోర్టులో వివాదం ఇప్పటికీ కొనసాగుతోంది. గతంలో భూసేకరణ కింద తీసుకున్నవే గనుక తమవేనంటూ ప్రభుత్వం ఈ 25 ఎకరాలను ల్యాండ్ పూలింగ్ కింద తీసుకోలేదు. సంబంధిత రైతులు 40 మంది తమ భూముల్లో సాగును కొనసాగిస్తూ కూరగాయలను పండిస్తున్నారు. క్యారట్, కొత్తిమీర, ఆకుకూరలు ప్రస్తుతం సాగులో ఉన్నాయి. ఇక్కడ ఎకరం భూమి రూ.3 కోట్ల నుంచి రూ.4 కోట్ల వరకు పలుకుతోంది. ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే.. తాజాగా భూసేకరణకు దిగిన ప్రభుత్వం.. యాక్సిస్ రోడ్డు నిర్మాణం పూర్తి చేసేదుకు ఎలాగైనా ఈ 112 ఎకరాలను కూడా స్వాధీనం చేసుకునే యోచనలో ఉంది. ఈ నేపథ్యంలోనే వెంకటపాలెం గ్రామంలో కోర్టు వివాదంలో ఉన్న 25 ఎకరాల భూములను ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండానే సోమవారం యంత్రాలతో చదును చేయడం మొదలుపెట్టారు. సర్వే నంబర్ 110లోని లంక శ్రీకాంత్‌కు చెందిన 4 ఎకరాలను చదును చేశారు. క్యారట్ పంటను ధ్వంసం చేశారు. విషయం తెలుసుకుని ఈ భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్న రైతు సుబ్బారావు, గ్రామస్తులు ఆప్రాంతానికి చేరుకుని అధికారులతో వాగ్వాదానికి దిగారు. పనులను అడ్డుకున్నారు. కోర్టు వివాదంలో ఉన్న తమ భూములను స్వాధీనం చేసుకోవ డం మంచి పద్ధతి కాదంటూ ప్రతిఘటిం చారు. వెంటనే భూములు చదును చేసే పని ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించడంతో, అధికారులు, కాంట్రాక్టర్ సిబ్బంది వెనుదిరిగారు. పరిహారం చెల్లించేదెవరు? మాది తాళ్లాయపాలెం గ్రామం. వెంకటపాలెం గ్రామానికి చెందిన శ్రీకాంత్‌కు చెందిన 4 ఎకరాలను కౌలుకు తీసుకున్నా. రూ.3 లక్షలు ఖర్చుచేసి క్యారెట్ పంట సాగుచేశా. కొద్దిరోజులు గడిస్తే పంట చేతికొచ్చేది. క్యారెట్ అమ్మి చేసిన అప్పు చెల్లిస్తే మిగతా సొమ్ము కుటుంబ ఖర్చులకు పనికొస్తుందని ఆశించా. అధికారులు మాట మాత్రమైనా చెప్పకుండా పచ్చని పంటను పాడుచేశారు. రోడ్డు కోసం మా కడుపు కొట్టారు. చేసిన అప్పు ఎవరు చెల్లిస్తారు? నా పరిస్థితేంటి? మేమెలా బతకాలి? –కౌలు రైతు, సుబ్బారావు, తాళ్లాయపాలెం -
పంట భూములను లాక్కోవద్దు: చాడ
సాక్షి, హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో ఓపెన్‌కాస్ట్ బొగ్గు గనుల పేరుతో రైతుల పంట భూములను లాక్కోవద్దని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు. పంట భూములను తీసుకోవడం.. ఇళ్లను కూల్చడం వంటి సింగరేణి యాజమాన్యం ప్రతిపాదనలను వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. -
అవన్నీ పంట భూములే
రాజధాని భూములు లెక్క తేల్చిన సీఆర్డీఏ పర్యావరణ అనుమతి దరఖాస్తుల్లో వెల్లడి సాక్షి, విజయవాడ: రాజధాని నగరాన్ని నిర్మిస్తున్న ప్రాంతంలో భూములన్నీ పంట భూములేనని మరోసారి స్పష్టమైంది. 217.23 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఎక్కువ భాగంలో పంటలు పండుతున్నాయని సీఆర్డీఏ తేల్చి చెప్పింది. దాదాపు 70 శాతం పంట భూములేనని పేర్కొంది. గతంలోనే ఈ లెక్కలు సేకరించినా అధికారికంగా వాటిని ఎప్పుడూ బయట పెట్టలేదు. మూడు పంటలు పండే ప్రాంతంలో రాజధాని కట్టడం సరికాదని ప్రతిపక్షాలు, రైతు సంఘాలు, హక్కుల సంఘాలు ఆందోళనలు చేసినా నోరు మెదపకపోగా ఆ వివరాలు వెల్లడించడానికే ఇష్టపడలేదు. కానీ పర్యావరణ అనుమతి కోసం తయారు చేసిన దరఖాస్తులో ఈ వివరాలన్నింటినీ పొందుపరచక తప్పలేదు. రాజధాని కోసం తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లోని 29 గ్రామాల్లో 43,472 ఎకరాల భూములుండగా 32,400 ఎకరాలను ప్రభుత్వం భూసమీకరణ ద్వారా సేకరించిన విషయం తెలిసిందే. ఈ గ్రామాల్లోనే 217.23 చ.కి.మీ. రాజధాని నగరాన్ని నిర్మించడానికి సింగపూర్ ప్రభుత్వ సంస్థలతో మాస్టర్‌ప్లాన్ తయారు చేయించింది. సేకరించిన దాంట్లో 55.78 శాతం భూమిలో వివిధ రకాల పంటలు సాగవుతున్నట్లు స్పష్టమైంది. 121.17 చ.కి.మీ పరిధిలో ఈ పంటలు సాగవుతున్నాయి. 31.19 చ.కి.మీ. వివిధ రకాల తోటలున్నాయి. వీటి శాతం 14.36 శాతం. మొత్తంగా 70.14 శాతం భూములు ఏదోరకంగా సాగులో ఉన్నవే. ఈ భూముల్లో ఎక్కువగా పత్తి, వరి, మిరప, అరటి పంటలు సాగయ్యేవి. కృష్ణా నదికి ఆనుకుని ఉన్న ఏడు గ్రామాల్లో కూరగాయలు, పూలతోటలు సాగవుతున్నాయి. వీటితో రైతులకు బాగా ఆదాయం లభించేది. ఈ పంటలన్నింటికీ చాలావరకూ ఇప్పుడు బ్రేక్ పడింది. పంట భూముల తర్వాత 29.65 చ.కి.మీ. కృష్ణానది, కాలువలు, వాగులున్నాయి. మొత్తం భూమిలో వాటి శాతం 13.65. మిగిలిన భూముల్లో కొండలు, అర్బన్, రూరల్ ప్రాంతాలు, స్వల్పంగా ఖనిజాలున్నాయి. -
పంటలు పండించి తీరతాం
ఉండవల్లి, పెనుమాక రైతులు చకచకా ‘సాగు’తున్న పనులు ఇటు రైతులు.. అటు ప్రభుత్వం రాజధానిలో ద్విముఖ సిత్రం పచ్చటి పంట పొలాలను ట్రాక్టర్లతో తొక్కించి, నాగళ్లతో దున్ని అదే అభివృద్ధికి రాచబాట అంటూ మంత్రులు, అధికారులు రాజధానిలో హడావుడి చేస్తూ ఒకవైపు.. ప్రాణాలైనా ఇస్తాం కానీ తరతరాలుగా నేల తల్లిని నమ్ముకున్న మేము ఆ భూమిని వదలబోమంటూ భీష్మించిన రైతన్నలు.. అధికారులు కల్పిస్తున్న ఆటంకాలను ఓర్పుతో అధిగమిస్తూ పొలాలు దున్ని పచ్చటి పైరులను ఏపుగా పెంచేందుకు చేస్తున్న యత్నాలు మరొక వైపు.. ఇదీ ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో ప్రస్తుతం కనిపిస్తున్న దృశ్యాలు. -తాడేపల్లి రూరల్ రాజధాని పేరుతో పంట భూముల్లో ఆకాశహర్మ్యాలు కట్టేందుకు ప్రభుత్వం చట్టంలో ఎక్కడా లేని ‘లాండ్ పూలింగ్’ పేరుతో ప్రలోభపెట్టి, భయపెట్టి 27 వేల ఎకరాల భూములు లాక్కుంది. అయితే ఉండవల్లి, పెనుమాక రైతులు ఆ ప్రయత్నాలను అడ్డుకుని ప్రభుత్వ దాష్టీకాన్ని ఎదిరించారు. రైతులకు అండగా నిలిచిన మంగళగిరి శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి రైతులకు బాసటగా నిలిచి కోర్టులను ఆశ్రయించారు. పూలమ్మిన చోట కట్టెలమ్మలేమని, అన్నదాతలుగా ఉన్న తాము అడుక్కు తినలేమని, తరతరాలుగా ఆ భూముల్లో పంటలు పండించి కూరగాయలు, ఆహారధాన్యాలు పండిస్తున్నామని వారు కోర్టుకు చెప్పారు. కోర్డు సైతం రైతుల వాదనలతో ఏకీభవించి పంటల సాగుకు అవకాశం ఇవ్వాలని, వారి భూములు లాక్కోవద్దని ఆదేశించింది. కోర్టు భరోసాతో రైతులు పంటలు సాగుకు సమాయత్తమయ్యారు. మంగళగిరి ఎమెల్యే ఆర్కే ఈ మధ్య కాలంలో మీవెంట నేనున్నానంటూ కూరగాయ తోటల్లో పురుగు మందులు పిచికారి చేసి లాంఛనంగా ఉల్లి నాట్లు ప్రారంభించారు. ఉండవల్లి, పెనుమాక, యర్రబాలెం తదితర గ్రామాల్లో 700 ఎకరాల్లో ఉల్లి పంట పండేది. మొత్తం ఏడు వేల నుంచి పది వేల టన్నుల ఉల్లి దిగుబడి వచ్చేది. ఇక్కడి నుంచి మద్రాస్, తాడేపల్లిగూడెం, హైదరాబాద్, బరంపురం తదితర ప్రాంతాలకు ఉల్లిపాయలను రైతులు ఎగుమతి చేసేవారు. ఈ ఏడాది ప్రస్తుతానికి 500 ఎకరాల్లో ఉల్లినాట్లు వేశారు. అధికారులు రాజధాని నిర్మాణం పనులంటూ కృష్ణా కరకట్ట వెంట ఉన్న పంట పొలాలకు తరచూ విద్యుత్ సరఫరా నిలిపివేస్తుండడంతో, వేసిన పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొంది. అయినా పట్టు వీడని రైతులు ఆయిల్ ఇంజన్లు తెచ్చుకుని ఉల్లినాట్లను పూర్తి చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి నివాసం, భద్రత, రోడ్డు నిర్మాణం అంటూ రకరకాల పేర్లతో రైతులను పొలాల్లోకి వెళ్లకుండా అడ్డంకులు కల్పిస్తున్నారు. దీనిని సైతం ఉండవల్లి రైతులు గట్టిగా ఎదుర్కొంటున్నారు. పంటలపై మక్కువతో వారు దూరాభారాన్ని లెక్కచేయకుండా ఉండవల్లి నుంచి పెనుమాక వెళ్లి అక్కడ పంటపొలాల నుంచి ఉండవల్లి పొలాల్లోకి ప్రవేశించి నాట్లు వేస్తుండడం వారి పట్టుదలను సూచిస్తోంది. మరోవైపు ప్రభుత్వం సైతం రాజధాని శంకుస్థాపన పేరుతో రోడ్లు, నిర్మాణాలను వేగవంతం చేసింది. రెవెన్యూ, పోలీస్, ఆర్ అండ్ బీ, పంచాయితీరాజ్, విద్యుత్ శాఖల అధికార్లు అంతా ఇక్కడే మొహరించి పనులు చేస్తున్నారు. -
చెరువుకు గండి.. పొలాలను ముంచెత్తిన నీరు
రేగిడి: శ్రీకాకుళం జిల్లా రేగిడి మండలం లక్ష్మీపురం గ్రామంలోని కట్టలవాగు చెరువుకు ఆదివారం గండిపడింది. భారీ వర్షానికి చెరువు కట్ట కోతకు గురి కావడంతో దాని దిగువ ప్రాంతాల పొలాల్లోకి నీరు భారీగా చేరుతోంది. సుమారు 15 ఎకరాల్లోని పంటలకు నష్టం వాటిల్లింది. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు జలాశయాల కట్టలు దెబ్బతింటున్నా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవడం వల్లే ఈ నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. -
పంట భూములు లాక్కోవడానికి మేం వ్యతిరేకం: జగన్
రైతులను ఇబ్బంది పెట్టే ఏ చర్యకైనా మా మద్దతు ఉండదు ‘హోదా’ను విభజన చట్టంలో చేర్చి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్,ఆర్థికమంత్రి జైట్లీతో జగన్ భేటీ విభజన హామీలన్నీ నెరవేర్చాలని వినతి సాక్షి, న్యూఢిల్లీ: రాజధాని ప్రాంతంలో రైతుల నుంచి పచ్చని పంట భూములను బలవంతంగా లాక్కోవడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టంచేశారు. రైతులను ఇబ్బందులకు గురి చేసే ఏ చర్యకైనా తమ పార్టీ మద్దతు ఉండబోదని ఉద్ఘాటించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశాన్ని విభజన చట్టంలో చేర్చి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి ఉండేది కాదని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ ఆదివారమిక్కడ కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను, కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీని జగన్ కలిశారు. ఆయన వెంట పార్టీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, పీవీ మిథున్‌రెడ్డి. వైఎస్ అవినాశ్‌రెడ్డి ఉన్నారు. ఉదయం రాజ్‌నాథ్‌ను ఆయన నివాసంలో కలిసిన అనంతరం జగన్ విలేకరులతో మాట్లాడారు. ‘‘పార్లమెంట్ సమావేశాలు ఈనెల 23 నుంచి మొదలవుతున్న నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించి అంశాలను మరోసారి గుర్తుచేయడం కోసం హోంమంత్రిని కలిశాం. రాష్ట్రానికి సంబంధించిన ప్యాకేజీలు, సీఆర్డీఏ వల్ల రైతులకు జరుగుతున్న అన్యాయం, డ్యాముల్లో గేట్లు ఎత్తి భావోద్వేగాలను రెచ్చగొట్టడం వంటి అంశాలపై రాజ్‌నాథ్ సింగ్‌కు వివరించాం. ప్రధాని, రైల్వే మంత్రి అపాయింట్మెంట్లు కూడా అడిగాం. ఈ ఎనిమిది నెలల్లో వారిని కలవడం ఇది మూడోసారి. గతంలో రెండుసార్లు మేం ఢిల్లీకి వచ్చి ప్రధాని మొదలుకుని అందరినీ కలిశాం. రాష్ట్రానికి సహాయం అందించాలని వినతిపత్రాలు ఇచ్చాం. అందులో భాగంగానే ఇది మూడోసారి రావడం. బడ్జెట్ సమావేశాలు మొదలవనున్నందున మళ్లీ ఒకసారి వారికి గుర్తు చేయడం కోసం మా ధర్మం మేం చేస్తున్నాం. పారిశ్రామికాభివృద్ధి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, వెనుకబడిన జిల్లాలు, పోలవరం ప్రాజెక్టు, జాతీయస్థాయి విద్యాసంస్థలు, రైల్వే జోన్ తదితర అంశాలపై వినతిపత్రం ఇచ్చాం’’ అని తెలిపారు. ప్రత్యేక హోదా రాకపోయినా అంతకంటే ఎక్కువ నిధులు సాధించుకుంటామని సీఎం చంద్రబాబు చెబుతున్నారు కదా.. ప్రత్యేక హోదాపై రాజ్‌నాథ్‌సింగ్ ఏమన్నారు అని విలేకరులు ప్రశ్నించగా ‘‘మేం మూడోసారి వచ్చి కేంద్రాన్ని అభ్యర్థిస్తున్నాం. ప్రతిపక్ష పార్టీగా నాలుగు అడుగులు ముందుకు వేసి కేంద్రాన్ని కోరుతున్నాం. మా ధర్మం మేం చేస్తున్నాం’’ అని పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రభుత్వ ప్రయత్నం ఎలా ఉందని అడగ్గా.. ‘‘చంద్రబాబునాయుడు గారిని అడగాలి. ఆరోజు చంద్రబాబు కాంగ్రెస్, బీజేపీతో కలిసి దగ్గరుండి మరీ రాష్ట్రాన్ని విడగొట్టారు. ఎవ రూ కూడా ఆరోజు కనీసం రెండు రోజులు ఆగి ప్రతి అంశాన్నీ చట్టంలో చేర్చాలని యోచించలేదు. ప్రత్యేక హోదాను చట్టంలో చేర్చకుండానే విడగొట్టారు. దీన్ని అప్పుడే చట్టంలో చేర్చి ఉంటే బహుశా ఇంత దారుణమైన పరిస్థితి ఉండేది కాదు. కానీ అప్పుడు మేం మొత్తుకుని చెప్పినా ఎవరూ పట్టించుకోలేదు. చంద్రబాబు ఆ రోజు దగ్గరుండి ఓటు వేయించారు. మొట్టమొదటి ఓటు మేమే వేశామని చేతులెత్తి చూపించారు. నిన్న వరంగల్‌కు వెళ్లినప్పుడు కూడా రాజకీయ ప్రయోజనాల కోసం... రాష్ట్రాన్ని మేమే విడగొట్టామని చెప్పారు. విభజన సమయంలో అన్నీ హడావుడిగా చేశారు. ఈరోజు కొన్ని విషయాలు చట్టంలో కూడా లేవు కనుక... కోర్టులకెళ్లినా ఏ మేరకు న్యాయం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఉంది. అయినా ఆ రోజు ప్రధానమంత్రి సభలో ఇచ్చిన మాట ప్రకారం అన్నీ చేయాలని ప్రతిపక్షంగా మేం అభ్యర్థిస్తున్నాం’’ అని వివరించారు. ముఖ్యమంత్రికి ఏమీ ఎక్కడం లేదు.. ‘రాజధాని ప్రాంతంలో రైతుల భూములు బలవంతంగా లాగేసుకుంటున్నారు. అలాంటి వారిని ఏమైనా కేంద్రం వద్దకు తీసుకువచ్చే ఆలోచన ఉందా?’ అని విలేకరులు జగన్‌ను అడగ్గా... ‘‘సీఆర్డీఏకి సంబంధించి రైతులు ఎలా నష్టపోతున్నారు? రైతులకు ఇష్టం లేకున్నా వారిపై ఎలా ఒత్తిడి తెస్తున్నారన్న అంశాలను కూలంకశంగా వివరంగా చెప్పాం. రైతు ఒప్పుకుంటే ఫర్వాలేదు. కానీ ఒప్పుకోకున్నా అన్యాయంగా వారి వద్ద నుంచి భూములు తీసుకోవడం సరైన పద్ధతి కాదని మేం ముందు నుంచీ చెబుతున్నాం. ఇంతకు ముందు కూడా రైతులు కేంద్రం వద్దకు వచ్చి తమ గోడు వెళ్లబోసుకున్నారు. మంగళగిరి ఎమ్మెల్యే మొన్న రైతులను తీసుకు వచ్చి వినతిపత్రం ఇచ్చారు. రైతులు అంతకన్నా చేసేది ఏముంది? ఎన్నిసార్లు ఏం చేసినా మన ఖర్మ ఏందంటే.. చర్మం మందంగా ఉన్న ముఖ్యమంత్రి మనకు ఉన్నారు. ఆ సీఎంకు ఏమీ ఎక్కడం లేదు. అది మన ఖర్మ’’ అని జగన్ మండిపడ్డారు. ‘భూసేకరణ చ ట్టం ఆర్డినెన్స్‌పై అన్నా హజారే ఈనెల 24 నుంచి ఢిల్లీలో ధర్నా చేయబోతున్నారు. మీరు అందుకు మద్దతు ఇస్తారా..?’ అని ప్రశ్నించగా... ‘‘మేం మొదట్నుంచీ ఒకటే చెబుతున్నాం. అంశాలవారీగా మద్దతిస్తామని. భూసేకరణ చట్టానికి సంబంధించి మల్టీక్రాప్ ఏరియాను తీసుకోవడాన్ని మా పార్టీ వ్యతిరేకిస్తుంది. సీఆర్డీఏలో అదే జరుగుతోంది. రైతుల దగ్గర నుంచి మల్టీక్రాప్ భూములను తీసుకునే కార్యక్రమం దౌర్జన్యంగా చేస్తున్నారు. కచ్చితంగా మేం దాన్ని వ్యతిరేకిస్తాం. ప్రజలకు మంచి జరిగే విషయాల్లో కచ్చితంగా మద్దతిస్తాం. ప్రజలకు ఇబ్బంది కలిగే ఏ అంశానికైనా మా మద్దతు ఉండదు. మిగిలిన ఇన్సూరెన్స్ బిల్లు పలు అంశాలపై పార్లమెంట్లో మా పార్టీ మద్దతు ఇస్తుంది’’ అని పేర్కొన్నారు. -
పచ్చని దృశ్యం.. ఇక అదృశ్యం!
చోడవరం- గోవాడ మధ్య రియల్ జోరు చోడవరం రూరల్: పంట భూములు రూపు మారుతున్నాయి. పచ్చని పంటలతో కనిపించే దృశ్యాలు అదృశ్యమవుతున్నాయి. వాణిజ్య కూడళ్లుగా మారిపోతున్నాయి. పట్టణాలు పల్లెలు కలిసిపోతున్నాయి. మండల కేంద్రం చోడవరం- గోవాడ మధ్య సుమారు 5 కిలోమీటర్ల దూరం ఉంది. రోడ్డుకు ఇరువైపులా పచ్చని వరిచేలు, చెరకు తోటలు దర్శనమిచ్చేవి. పెరుగుతున్న వ్యాపార, వాణిజ్య అవసరాల దృష్ట్యా ఏడాదికి రెండు పంటలు పండే భూములు సైతం రూపు మారుతున్నాయి. రోడ్డును ఆనుకుని ఉన్న భూములు వ్యాపార కూడళ్లుగా తయారవుతున్నాయి. భూమిని నమ్ముకున్న రైతులు ప్రస్తుతం రోడ్డు పక్క భూములకు ధరలు వస్తుండడంతో అమ్ముతున్నారు. చోడవరం- గోవాడ మార్గ మధ్యలో రెండు పెట్రోల్ బంక్‌లు, మూడు ద్విచక్రవాహన షోరూంలు, బల్క్‌మిల్క్ కూలింగ్ సెంటర్, రెండు డాబాలు, వేబ్రిడ్జి కేంద్రాలు, పలు రకాల షోరూంలు, గోడౌన్లు వెలిశాయి. ఈ క్రమంలో తాజాగా భారీ వెంచర్లు కూడా ఏర్పాటవుతున్నాయి. వాల్టా చట్టం ప్రకారం వ్యవసాయ భూములను వాణిజ్య అవసరాలకు మార్చే క్రమంలో నిబంధనలు పాటించాలి. దీని దృష్ట్యా రెండేళ్లు వ్యవసాయ భూములలో పంటలు వేయడం మానేసి ఉంచుతున్నారు. తర్వాత వీటిని సరి చేసి వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నారు. దీంతో ఇక రోడ్డకిరువైపులా వాణిజ్య, వ్యాపార కూడళ్లు మినహా పంటలు కనిపించే పరిస్థితి ఉండదు.