పంటలు పండించి తీరతాం
ఉండవల్లి, పెనుమాక రైతులు
చకచకా ‘సాగు’తున్న పనులు
ఇటు రైతులు.. అటు ప్రభుత్వం
రాజధానిలో ద్విముఖ సిత్రం
పచ్చటి పంట పొలాలను ట్రాక్టర్లతో తొక్కించి, నాగళ్లతో దున్ని అదే అభివృద్ధికి రాచబాట అంటూ మంత్రులు, అధికారులు రాజధానిలో హడావుడి చేస్తూ ఒకవైపు.. ప్రాణాలైనా ఇస్తాం కానీ తరతరాలుగా నేల తల్లిని నమ్ముకున్న మేము ఆ భూమిని వదలబోమంటూ భీష్మించిన రైతన్నలు.. అధికారులు కల్పిస్తున్న ఆటంకాలను ఓర్పుతో అధిగమిస్తూ పొలాలు దున్ని పచ్చటి పైరులను ఏపుగా పెంచేందుకు చేస్తున్న యత్నాలు మరొక వైపు.. ఇదీ ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో ప్రస్తుతం కనిపిస్తున్న దృశ్యాలు.
-తాడేపల్లి రూరల్
రాజధాని పేరుతో పంట భూముల్లో ఆకాశహర్మ్యాలు కట్టేందుకు ప్రభుత్వం చట్టంలో ఎక్కడా లేని ‘లాండ్ పూలింగ్’ పేరుతో ప్రలోభపెట్టి, భయపెట్టి 27 వేల ఎకరాల భూములు లాక్కుంది. అయితే ఉండవల్లి, పెనుమాక రైతులు ఆ ప్రయత్నాలను అడ్డుకుని ప్రభుత్వ దాష్టీకాన్ని ఎదిరించారు. రైతులకు అండగా నిలిచిన మంగళగిరి శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి రైతులకు బాసటగా నిలిచి కోర్టులను ఆశ్రయించారు. పూలమ్మిన చోట కట్టెలమ్మలేమని, అన్నదాతలుగా ఉన్న తాము అడుక్కు తినలేమని, తరతరాలుగా ఆ భూముల్లో పంటలు పండించి కూరగాయలు, ఆహారధాన్యాలు పండిస్తున్నామని వారు కోర్టుకు చెప్పారు. కోర్డు సైతం రైతుల వాదనలతో ఏకీభవించి పంటల సాగుకు అవకాశం ఇవ్వాలని, వారి భూములు లాక్కోవద్దని ఆదేశించింది. కోర్టు భరోసాతో రైతులు పంటలు సాగుకు సమాయత్తమయ్యారు. మంగళగిరి ఎమెల్యే ఆర్కే ఈ మధ్య కాలంలో మీవెంట నేనున్నానంటూ కూరగాయ తోటల్లో పురుగు మందులు పిచికారి చేసి లాంఛనంగా ఉల్లి నాట్లు ప్రారంభించారు.
ఉండవల్లి, పెనుమాక, యర్రబాలెం తదితర గ్రామాల్లో 700 ఎకరాల్లో ఉల్లి పంట పండేది. మొత్తం ఏడు వేల నుంచి పది వేల టన్నుల ఉల్లి దిగుబడి వచ్చేది. ఇక్కడి నుంచి మద్రాస్, తాడేపల్లిగూడెం, హైదరాబాద్, బరంపురం తదితర ప్రాంతాలకు ఉల్లిపాయలను రైతులు ఎగుమతి చేసేవారు. ఈ ఏడాది ప్రస్తుతానికి 500 ఎకరాల్లో ఉల్లినాట్లు వేశారు. అధికారులు రాజధాని నిర్మాణం పనులంటూ కృష్ణా కరకట్ట వెంట ఉన్న పంట పొలాలకు తరచూ విద్యుత్ సరఫరా నిలిపివేస్తుండడంతో, వేసిన పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొంది. అయినా పట్టు వీడని రైతులు ఆయిల్ ఇంజన్లు తెచ్చుకుని ఉల్లినాట్లను పూర్తి చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి నివాసం, భద్రత, రోడ్డు నిర్మాణం అంటూ రకరకాల పేర్లతో రైతులను పొలాల్లోకి వెళ్లకుండా అడ్డంకులు కల్పిస్తున్నారు. దీనిని సైతం ఉండవల్లి రైతులు గట్టిగా ఎదుర్కొంటున్నారు. పంటలపై మక్కువతో వారు దూరాభారాన్ని లెక్కచేయకుండా ఉండవల్లి నుంచి పెనుమాక వెళ్లి అక్కడ పంటపొలాల నుంచి ఉండవల్లి పొలాల్లోకి ప్రవేశించి నాట్లు వేస్తుండడం వారి పట్టుదలను సూచిస్తోంది. మరోవైపు ప్రభుత్వం సైతం రాజధాని శంకుస్థాపన పేరుతో రోడ్లు, నిర్మాణాలను వేగవంతం చేసింది. రెవెన్యూ, పోలీస్, ఆర్ అండ్ బీ, పంచాయితీరాజ్, విద్యుత్ శాఖల అధికార్లు అంతా ఇక్కడే మొహరించి పనులు చేస్తున్నారు.