పంట భూములు లాక్కోవడానికి మేం వ్యతిరేకం: జగన్ | We have to rob the opposite of cropland: Pics | Sakshi
Sakshi News home page

పంట భూములు లాక్కోవడానికి మేం వ్యతిరేకం: జగన్

Published Mon, Feb 16 2015 1:57 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

We have to rob the opposite of cropland: Pics

  • రైతులను ఇబ్బంది పెట్టే ఏ చర్యకైనా మా మద్దతు ఉండదు
  •  ‘హోదా’ను విభజన చట్టంలో చేర్చి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు
  •  కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్,ఆర్థికమంత్రి జైట్లీతో జగన్ భేటీ
  •  విభజన హామీలన్నీ నెరవేర్చాలని వినతి
  •  సాక్షి, న్యూఢిల్లీ: రాజధాని ప్రాంతంలో రైతుల నుంచి పచ్చని పంట భూములను బలవంతంగా లాక్కోవడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టంచేశారు. రైతులను ఇబ్బందులకు గురి చేసే ఏ చర్యకైనా తమ పార్టీ మద్దతు ఉండబోదని ఉద్ఘాటించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశాన్ని విభజన చట్టంలో చేర్చి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి ఉండేది కాదని పేర్కొన్నారు.

    రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ ఆదివారమిక్కడ కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను, కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీని జగన్ కలిశారు. ఆయన వెంట పార్టీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, పీవీ మిథున్‌రెడ్డి. వైఎస్ అవినాశ్‌రెడ్డి ఉన్నారు. ఉదయం రాజ్‌నాథ్‌ను ఆయన నివాసంలో కలిసిన అనంతరం జగన్ విలేకరులతో మాట్లాడారు. ‘‘పార్లమెంట్ సమావేశాలు ఈనెల 23 నుంచి మొదలవుతున్న నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించి అంశాలను మరోసారి గుర్తుచేయడం కోసం హోంమంత్రిని కలిశాం.

    రాష్ట్రానికి సంబంధించిన ప్యాకేజీలు, సీఆర్‌డీఏ వల్ల రైతులకు జరుగుతున్న అన్యాయం, డ్యాముల్లో గేట్లు ఎత్తి భావోద్వేగాలను రెచ్చగొట్టడం వంటి అంశాలపై రాజ్‌నాథ్ సింగ్‌కు వివరించాం. ప్రధాని, రైల్వే మంత్రి అపాయింట్‌మెంట్లు కూడా అడిగాం. ఈ ఎనిమిది నెలల్లో వారిని కలవడం ఇది మూడోసారి. గతంలో రెండుసార్లు మేం ఢిల్లీకి వచ్చి ప్రధాని మొదలుకుని అందరినీ కలిశాం. రాష్ట్రానికి సహాయం అందించాలని వినతిపత్రాలు ఇచ్చాం.

    అందులో భాగంగానే ఇది మూడోసారి రావడం. బడ్జెట్ సమావేశాలు మొదలవనున్నందున మళ్లీ ఒకసారి వారికి గుర్తు చేయడం కోసం మా ధర్మం మేం చేస్తున్నాం. పారిశ్రామికాభివృద్ధి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, వెనుకబడిన జిల్లాలు, పోలవరం ప్రాజెక్టు, జాతీయస్థాయి విద్యాసంస్థలు, రైల్వే జోన్ తదితర అంశాలపై వినతిపత్రం ఇచ్చాం’’ అని తెలిపారు. ప్రత్యేక హోదా రాకపోయినా అంతకంటే ఎక్కువ నిధులు సాధించుకుంటామని సీఎం చంద్రబాబు చెబుతున్నారు కదా.. ప్రత్యేక హోదాపై రాజ్‌నాథ్‌సింగ్ ఏమన్నారు అని విలేకరులు ప్రశ్నించగా ‘‘మేం మూడోసారి వచ్చి కేంద్రాన్ని అభ్యర్థిస్తున్నాం. ప్రతిపక్ష పార్టీగా నాలుగు అడుగులు ముందుకు వేసి కేంద్రాన్ని కోరుతున్నాం. మా ధర్మం మేం చేస్తున్నాం’’ అని పేర్కొన్నారు.

    ఈ విషయంలో ప్రభుత్వ ప్రయత్నం ఎలా ఉందని అడగ్గా.. ‘‘చంద్రబాబునాయుడు గారిని అడగాలి. ఆరోజు చంద్రబాబు కాంగ్రెస్, బీజేపీతో కలిసి దగ్గరుండి మరీ రాష్ట్రాన్ని విడగొట్టారు. ఎవ రూ కూడా ఆరోజు కనీసం రెండు రోజులు ఆగి ప్రతి అంశాన్నీ చట్టంలో చేర్చాలని యోచించలేదు. ప్రత్యేక హోదాను చట్టంలో చేర్చకుండానే విడగొట్టారు. దీన్ని అప్పుడే చట్టంలో చేర్చి ఉంటే బహుశా ఇంత దారుణమైన పరిస్థితి ఉండేది కాదు. కానీ అప్పుడు మేం మొత్తుకుని చెప్పినా ఎవరూ పట్టించుకోలేదు.

    చంద్రబాబు ఆ రోజు దగ్గరుండి ఓటు వేయించారు. మొట్టమొదటి ఓటు మేమే వేశామని చేతులెత్తి చూపించారు. నిన్న వరంగల్‌కు వెళ్లినప్పుడు కూడా రాజకీయ ప్రయోజనాల కోసం... రాష్ట్రాన్ని మేమే విడగొట్టామని చెప్పారు. విభజన సమయంలో అన్నీ హడావుడిగా చేశారు. ఈరోజు కొన్ని విషయాలు చట్టంలో కూడా లేవు కనుక... కోర్టులకెళ్లినా ఏ మేరకు న్యాయం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఉంది. అయినా ఆ రోజు ప్రధానమంత్రి సభలో ఇచ్చిన మాట ప్రకారం అన్నీ చేయాలని ప్రతిపక్షంగా మేం అభ్యర్థిస్తున్నాం’’ అని వివరించారు.
     
    ముఖ్యమంత్రికి ఏమీ ఎక్కడం లేదు..


    ‘రాజధాని ప్రాంతంలో రైతుల భూములు బలవంతంగా లాగేసుకుంటున్నారు. అలాంటి వారిని ఏమైనా కేంద్రం వద్దకు తీసుకువచ్చే ఆలోచన ఉందా?’ అని విలేకరులు జగన్‌ను అడగ్గా... ‘‘సీఆర్‌డీఏకి సంబంధించి రైతులు ఎలా నష్టపోతున్నారు? రైతులకు ఇష్టం లేకున్నా వారిపై ఎలా ఒత్తిడి తెస్తున్నారన్న అంశాలను కూలంకశంగా వివరంగా చెప్పాం. రైతు ఒప్పుకుంటే  ఫర్వాలేదు. కానీ ఒప్పుకోకున్నా అన్యాయంగా వారి వద్ద నుంచి భూములు తీసుకోవడం సరైన పద్ధతి కాదని మేం ముందు నుంచీ చెబుతున్నాం.

    ఇంతకు ముందు కూడా రైతులు కేంద్రం వద్దకు వచ్చి తమ గోడు వెళ్లబోసుకున్నారు. మంగళగిరి ఎమ్మెల్యే మొన్న రైతులను తీసుకు వచ్చి వినతిపత్రం ఇచ్చారు. రైతులు అంతకన్నా చేసేది ఏముంది? ఎన్నిసార్లు ఏం చేసినా మన ఖర్మ ఏందంటే.. చర్మం మందంగా ఉన్న ముఖ్యమంత్రి మనకు ఉన్నారు. ఆ సీఎంకు ఏమీ ఎక్కడం లేదు. అది మన ఖర్మ’’ అని జగన్ మండిపడ్డారు. ‘భూసేకరణ చ ట్టం ఆర్డినెన్స్‌పై అన్నా హజారే ఈనెల 24 నుంచి ఢిల్లీలో ధర్నా చేయబోతున్నారు. మీరు అందుకు మద్దతు ఇస్తారా..?’ అని ప్రశ్నించగా... ‘‘మేం మొదట్నుంచీ ఒకటే చెబుతున్నాం. అంశాలవారీగా మద్దతిస్తామని.

    భూసేకరణ చట్టానికి సంబంధించి మల్టీక్రాప్ ఏరియాను తీసుకోవడాన్ని మా పార్టీ వ్యతిరేకిస్తుంది. సీఆర్‌డీఏలో అదే జరుగుతోంది. రైతుల దగ్గర నుంచి మల్టీక్రాప్ భూములను తీసుకునే కార్యక్రమం దౌర్జన్యంగా చేస్తున్నారు. కచ్చితంగా మేం దాన్ని వ్యతిరేకిస్తాం. ప్రజలకు మంచి జరిగే విషయాల్లో కచ్చితంగా మద్దతిస్తాం. ప్రజలకు ఇబ్బంది కలిగే ఏ అంశానికైనా మా మద్దతు ఉండదు. మిగిలిన ఇన్సూరెన్స్ బిల్లు పలు  అంశాలపై పార్లమెంట్‌లో మా పార్టీ మద్దతు ఇస్తుంది’’ అని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement