విభజన హామీలన్నీ నెరవేరుస్తాం
- పన్ను రాయితీలు ప్రారంభం మాత్రమే
- కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ
- రాష్ట్ర ఆర్థిక అంశాలపై జైట్లీతో చర్చించిన సీఎం చంద్రబాబు
సాక్షి, న్యూఢిల్లీ: విభజన చట్టంలోని అన్ని హామీలు తప్పక నెరవేరుస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ స్పష్టం చేశారు. హామీల అమలులో కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. న్యూఢిల్లీలో ఆదివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీతో జరిగిన నీతి ఆయోగ్ సమావేశం అనంతరం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీని ఆయన నివాసంలో కలిశారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన రాయితీలు సహా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన ఆర్థికసాయం ఇతర అంశాలపై చర్చించారు.
విభజన చట్టంలో పేర్కొన్న పలు ప్రాజెక్టులకు ఈ బడ్జెట్‌లోచోటు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా రాష్ట్రానికి ఏడు నెలల్లో వచ్చిన ఆదాయం, ఇతర ఆర్థిక ఇబ్బందులను ఆయన దృష్టికి తెచ్చారు. ప్రత్యేక హోదాపై అన్ని రాష్ట్రాలు అడుగుతున్నాయని సాకుగా చూపి తాత్సారం చేయడం తగదని, ఈ అంశంపై ప్రజలు ఆందోళనలో ఉన్నారని చెప్పారు. ప్రత్యేక హోదాపై అనుమానాలొస్తున్నట్లుగా పత్రికల్లో వచ్చిన కథనాలను చూపించారు. అనంతరం సీఎం చంద్రబాబునాయుడుతో కలిసి ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ మీడియాతో మాట్లాడారు.
‘నీతి ఆయోగ్ సమావేశానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాతోనూ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. నేను కేంద్ర ప్రభుత్వం తరఫున ఒక విషయాన్ని స్పష్టం చేయదలచుకున్నాను. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఇచ్చిన హామీలు, విభజన సందర్భంగా అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ ఇచ్చిన వాగ్ధానాలన్నింటినీ కేంద్ర ప్రభుత్వం తప్పక నెరవేరుస్తుంది. గత వారం మేం ప్రకటించిన కొన్ని రాయితీలు ప్రారంభం మాత్రమే. మిగిలిన అన్ని అంశాలు పరిశీలనలో ఉన్నాయనడానికి అదే నిదర్శనం.
కేంద్ర ప్రభుత్వం ఏర్పడి కొన్ని నెలలు మాత్రమే అవుతోంది. కేంద్ర ప్రభుత్వం ఎన్నో ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటోంది. మేం క్రమంగా అన్నీ నెరవేర్చేందుకు ప్రయత్నిస్తున్నాం. వీలైతే చెప్పిన దానికంటే ఎక్కువే చేసే అవకాశం ఉంది’ అని అరుణ్‌జైట్లీ చెప్పారు. సీఎం చంద్రబాబుతోపాటు అరుణ్‌జైట్లీతో భేటీలో కేంద్ర మంత్రులు అశోక్‌గజపతిరాజు, సుజనాచౌదరి, టీడీపీ ఎంపీలు తోట నర్సింహం, కొనకళ్ల నారాయణ, సీఎం రమేశ్, ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్‌రావు, ప్రభుత్వ సలహాదారుడు పరకాల ప్రభాకర్ తదితరులున్నారు. జైట్లీతో భేటీ అనంతరం చంద్రబాబు హైదరాబాద్‌కి తిరిగి వెళ్లారు.