ఇప్పుడేం చేయాలో..
కేంద్ర బడ్జెట్ రాష్ట్ర ప్రజలను నిరాశపరిచింది
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్‌కు చేసిన కేటాయింపులు నిరాశపరిచిన నేపథ్యంలో తర్వాత ఏం చేయబోతున్నారన్న మీడియా ప్రశ్నకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పందిస్తూ ‘తర్వాత ఏం చేయాలో నాకు అర్థమైతే మీకు చెప్పేవాడిని’ అని వ్యాఖ్యానించారు. కేంద్ర బడ్జెట్ రాష్ట్ర ప్రజలను తీవ్ర నిరాశ పరిచిందన్నారు. బడ్జెట్‌లో కేటాయింపులు చూసిన వెంటనే తాను ప్రధాని నరేంద్రమోదీ, ఆర్థికమంత్రి అరుణ్‌ైజైట్లీల అపాయింట్‌మెంట్ కోరానని, ఢిల్లీ వెళ్లి రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని వివరిస్తానని చెప్పారు. రాష్ట్రానికి న్యాయం చేయాల్సిందిగా తొలుత తన వంతు ప్రయత్నం చేస్తానని, ఆ తరువాత కలిసి వచ్చే పక్షాలన్నింటినీ కలుపుకొని వెళతానని పేర్కొన్నారు.
చంద్రబాబు తొలుత విలేకరుల సమావేశంలో, ఆ తరువాత ఇష్టాగోష్టిగా మాట్లాడారు. కేంద్రం తన కాళ్లు, చేతులు కట్టేసి పరుగెత్తమని చెబుతోందన్నారు. ఎంతదూరం పరుగెత్తగలిగితే అంతదూరం పరుగెడతానని చెప్పారు. ఆ తరువాత వాస్తవ పరిస్థితులను ప్రజలకు వివరిస్తానన్నారు. ‘ఈ పరిస్థితి మిత్రపక్షమైన మాకు ఇబ్బందే. రాష్ట్రానికి అన్యాయం జరిగింది నిజమే. కేంద్రం గతంలో చెప్పింది ఒకటి, ఇప్పుడు చేసింది మరొకటి. ఎన్‌డీఏకు నేతృత్వం వహిస్తున్న బీజేపీకి, మాకు మధ్య ఉన్న మిత్రత్వానికి, ఈ కేటాయింపులకు సంబంధం లేదు’ అని అన్నారు. ‘పత్రికల వారు కూడా రాష్ట్రానికి సహకరించాలి.
వివాదాస్పదమైన, ఇబ్బంది కలిగించే ప్రశ్నలు వేయటం సరికాదు. రాజకీయాలు, సంచలనాల కోసం ప్రయత్నించటం మంచిది కాదు’ అని అన్నారు. కాగా, తమ పార్టీ నాయకుడు అనుమతిస్తే బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం చేసిన బీజేపీపై పోరాటం చేస్తామని టీడీపీ ఎంపీ శివప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందించలేదు. ఎంపీ చేసిన వ్యాఖ్యలు గుర్తుచేస్తూ వారికి మీరేమని సూచిస్తారని ప్రశ్నించగా... ఇతర విషయాలను మాట్లాడి దీనికి మాత్రం సమాధానం చెప్పకుండా చంద్రబాబు దాటవేశారు.