పచ్చని పొలాన్ని దున్నేశారు!
♦ రాజధాని రోడ్డు కోసం పంట భూములు నాశనం చేస్తున్న ప్రభుత్వం
♦ 112 ఎకరాలు స్వాధీనం చేసుకునే యోచన
♦ వెంకటపాలెంలో 25 ఎకరాల చదునుకు యత్నం
♦ నాలుగు ఎకరాల్లో క్యారట్ పంట ధ్వంసం
♦ రైతుల ప్రతిఘటనతో వెనుదిరిగిన అధికారులు, కాంట్రాక్టర్
సాక్షి అమరావతి బ్యూరో / తుళ్లూరు రూరల్: రాజధాని నిర్మాణం పేరిట రైతుల నుంచి బలవంతంగా వేలాది ఎకరాల భూములు స్వాధీనం చేసుకున్న ప్రభుత్వం.. కోర్టు వివాదంలో ఉన్న భూములను సైతం లాక్కునేందుకు ప్రయత్నిస్తోంది. రైతుల ఆవేదనను పట్టించుకోకుండా పచ్చని పంట పొలాలు ధ్వంసం చేస్తోంది. రోడ్డు నిర్మాణం కోసం కోట్లాది రూపాయల విలువైన జరీబు భూముల్లో యంత్రాలను దింపి చదును చేయిస్తోంది. సోమవారం వెంకటపాలెం గ్రామానికి చెందిన భూములను సీఆర్డీఏ అధికారుల సహకారంతో చదును చేసేందుకు కాంట్రాక్టర్లు యత్నించారు. లంక శ్రీకాంత్‌కు చెందిన 4 ఎకరాలను భూమిని చదును చేసేశారు. విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న గ్రామస్తులు ప్రతిఘటించడంతో అధికారులు, కాంట్రాక్టర్లు వెనుదిరిగారు.
భూసమీకరణ కింద ఇవ్వని భూములను ఎలాగైనా లాక్కొనేందుకు ప్రభుత్వం భూసేకరణకు పూనుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే 9 గ్రామాల్లో భూసేకరణకు నోటిఫికేషన్ ఇచ్చారు. మరోవైపు అమరావతి నిర్మాణంలో భాగంగా రాజధాని పరిధిలో రూ.230 కోట్లతో 18.3 కిలోమీటర్ల మేర సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణ పనులను ప్రభుత్వం చేపట్టింది. ఆ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే మణిపాల్ ఆస్పత్రి నుంచి బోరుపాలెం వరకు సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణానికి ఆటంకాలు ఎదురయ్యాయి. తాడేపల్లి మునిసిపాలిటీ పరిధిలోని 28 ఎకరాలు రాజధాని ప్రాంత పరిధిలో లేవు.
అలాగే ఉండవల్లి, పెనుమాక గ్రామాల పరిధిలో మరో 59 ఎకరాలను స్థానికులు ల్యాండ్ పూలింగ్‌కు ఇవ్వలేదు. వెంకటపాలెం గ్రామానికి చెందిన సుమారు 25 ఎకరాల భూమిని గత ప్రభుత్వం జాతీయ రహదారి నిర్మాణం కోసం సేకరించింది. అయితే పరిహారం తక్కువగా ప్రకటించడంతో రైతులు కోర్టును ఆశ్రయించారు. ఆ తర్వాత రాష్ట్ర విభజన, ప్రభుత్వాలు మారడం వంటి పరిణామాల నేపథ్యంలో జాతీయ రహదారి నిర్మాణానికి బ్రేక్ పడింది. కోర్టులో వివాదం ఇప్పటికీ కొనసాగుతోంది. గతంలో భూసేకరణ కింద తీసుకున్నవే గనుక తమవేనంటూ ప్రభుత్వం ఈ 25 ఎకరాలను ల్యాండ్ పూలింగ్ కింద తీసుకోలేదు. సంబంధిత రైతులు 40 మంది తమ భూముల్లో సాగును కొనసాగిస్తూ కూరగాయలను పండిస్తున్నారు. క్యారట్, కొత్తిమీర, ఆకుకూరలు ప్రస్తుతం సాగులో ఉన్నాయి. ఇక్కడ ఎకరం భూమి రూ.3 కోట్ల నుంచి రూ.4 కోట్ల వరకు పలుకుతోంది.
ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే..
తాజాగా భూసేకరణకు దిగిన ప్రభుత్వం.. యాక్సిస్ రోడ్డు నిర్మాణం పూర్తి చేసేదుకు ఎలాగైనా ఈ 112 ఎకరాలను కూడా స్వాధీనం చేసుకునే యోచనలో ఉంది. ఈ నేపథ్యంలోనే వెంకటపాలెం గ్రామంలో కోర్టు వివాదంలో ఉన్న 25 ఎకరాల భూములను ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండానే సోమవారం యంత్రాలతో చదును చేయడం మొదలుపెట్టారు. సర్వే నంబర్ 110లోని లంక శ్రీకాంత్‌కు చెందిన 4 ఎకరాలను చదును చేశారు. క్యారట్ పంటను ధ్వంసం చేశారు. విషయం తెలుసుకుని ఈ భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్న రైతు సుబ్బారావు, గ్రామస్తులు ఆప్రాంతానికి చేరుకుని అధికారులతో వాగ్వాదానికి దిగారు. పనులను అడ్డుకున్నారు. కోర్టు వివాదంలో ఉన్న తమ భూములను స్వాధీనం చేసుకోవ డం మంచి పద్ధతి కాదంటూ ప్రతిఘటిం చారు. వెంటనే భూములు చదును చేసే పని ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించడంతో, అధికారులు, కాంట్రాక్టర్ సిబ్బంది వెనుదిరిగారు.
పరిహారం చెల్లించేదెవరు?
మాది తాళ్లాయపాలెం గ్రామం. వెంకటపాలెం గ్రామానికి చెందిన శ్రీకాంత్‌కు చెందిన 4 ఎకరాలను కౌలుకు తీసుకున్నా. రూ.3 లక్షలు ఖర్చుచేసి క్యారెట్ పంట సాగుచేశా. కొద్దిరోజులు గడిస్తే పంట చేతికొచ్చేది. క్యారెట్ అమ్మి చేసిన అప్పు చెల్లిస్తే మిగతా సొమ్ము కుటుంబ ఖర్చులకు పనికొస్తుందని ఆశించా. అధికారులు మాట మాత్రమైనా చెప్పకుండా పచ్చని పంటను పాడుచేశారు. రోడ్డు కోసం మా కడుపు కొట్టారు. చేసిన అప్పు ఎవరు చెల్లిస్తారు? నా పరిస్థితేంటి? మేమెలా బతకాలి?
–కౌలు రైతు, సుబ్బారావు, తాళ్లాయపాలెం