రాజధానిలో ఇక ఏడీసీ కీలకం
సీసీడీఎంసీ పేరును ఏడీసీగా మార్చిన ప్రభుత్వం
సాక్షి, విజయవాడ బ్యూరో : రాజధాని వ్యవహారాల్లో అమరావతి డెవలప్‌మెంట్ కంపెనీ (ఏడీసీ)ఇకపై కీలకంగా మారనుంది. కొద్దిరోజుల క్రితం వరకూ సీసీడీఎంసీ (క్యాపిటల్ సిటీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్)గా ఉన్న దీని పేరును ప్రభుత్వం ఇటీవలే ఏడీసీగా మార్చింది. స్విస్ ఛాలెంజ్ విధానంలో రాజధాని ప్రాజెక్టును సింగపూర్ కన్సార్టియంకు అప్పగిస్తున్న ప్రభుత్వం తన తరఫున ఏడీసీని భాగస్వామిగా నియమించనున్నట్లు ప్రకటించింది. రాజధాని ప్రాజెక్టులో సింగపూర్ కన్సార్టియంకు 52 శాతం, ఏడీసీకి 48 శాతం వాటా ఉంటుందని ఇప్పటికే ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
కన్సార్టియంకు అప్పగించనున్న 1691 ఎకరాల్లో చేపట్టే కార్యకలాపాలన్నింటినీ దాంతో కలిసి ఏడీసీ చేపడుతుంది. ఈ నేపథ్యంలో ఏడీసీని మరింత పటిష్టం చేయనున్నారు. రాజధాని అభివృద్ధి, ప్రాజెక్టుల రూపకల్పన, అమలు, నిర్వహణ.. స్పెషల్ పర్పస్ వెహికల్‌గా (ఎస్‌పీవీ)గా 2013 కంపెనీల చట్టం ప్రకారం వంద కోట్ల రూపాయల మూల నిధితో కొద్దిరోజుల క్రితం దీనిని ఏర్పాటు చేశారు. ఈ సంస్థ ఎండీగా ప్రస్తుతం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి లక్ష్మీ పార్థసారథి పనిచేస్తున్నారు. ఇంజినీరింగ్, పరిపాలనా వ్యవహారాలకు సంబంధించి కొందరు అధికారులను నియమించగా, మరికొంత మందిని త్వరలో నియమించనున్నారు.
ఏడీసీకే అత్యధిక అధికారాలు..
► సీఆర్‌డీఏ(క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ)ను కేవలం ప్రణాళికలు రూపొందించడం వరకే పరిమితం చేసి వాటి అమలు, నిర్వహణ బాధ్యతలను ఏడీసీకి అప్పగిస్తారు.
► రాబోయే రోజుల్లో ప్రణాళికల రూపకల్పనను సైతం ఏడీసీకే అప్పగించే యోచన ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో సీఆర్‌డీఏ పాత్ర రీజియన్ వ్యవహారాలకే పరిమితమవుతుంది.
► ఇప్పటికే సీఆర్‌డీఏ చేపట్టిన పలు ప్రాజెక్టులను ఏడీసీకి అప్పగించారు.
► ఐదో నెంబరు జాతీయ రహదారిని సీడ్ రాజధానికి కలిపే యాక్సెస్ రోడ్డు నిర్మాణ బాధ్యతను పూర్తిగా ఏడీసీ టేకోవర్ చేసింది.
► సీడ్ రాజధానిలో ప్రభుత్వ భవన సముదాయం డిజైన్ల ఎంపికనూ కొద్దిరోజుల నుంచి ఏడీసీనే పర్యవేక్షిస్తోంది.