
భారత్-రష్యాల మధ్య కీలక ఒప్పందాలు
పణజీ: భారత్, రష్యా పలు కీలక ఒప్పందాలు చేసుకున్నాయి. భారత్ ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సమక్షంలో ఒప్పందాలపై సంతకాలు చేశారు. బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు గోవాకు వచ్చిన పుతిన్‌తో నరేంద్ర మోదీ శనివారం సమావేశమయ్యారు. భారత్, రష్యా 16 ఒప్పందాలపై సంతకాలు చేశాయి. పారిశ్రామిక అభివృద్ధి, రక్షణ రంగంలో ఒప్పందాలు చేసుకున్నాయి. నాగ్‌పూర్- సికింద్రాబాద్ మధ్య హైస్పీడ్ రైళ్లపై రష్యాతో భారత్ ఒప్పందం చేసుకుంది.
అనంతరం మోదీ, పుతిన్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇరు దేశాలు ఉజ్వల భవిష్యత్ దిశగా సాగుతున్నాయని మోదీ అన్నారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో రష్యా అండగా ఉందని మోదీ పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించడంలో ఇరు దేశాలు ఒకే వైఖరి అవలంభిస్తున్నాయని చెప్పారు. ఇద్దరు కొత్త మిత్రుల కంటే పాత మిత్రుడే ఉత్తమమని అన్నారు. సైన్స్, టెక్నాలజీ కమిషన్ ఏర్పాటు చేయడానికి భారత్-రష్యా అంగీకరించాయని మోదీ తెలిపారు. పారిశ్రామిక, రక్షణ, సాంకేతి రంగాల్లో ఇరు దేశాల కంపెనీల మధ్య సహకారం పెరుగుతోందని పుతిన్ అన్నారు.