న్యూఢిల్లీ: గ్లోబల్ చమురు దిగ్గజం ఎగ్జాన్‌మొబిల్‌తో ప్రభుత్వ రంగ ఇంధన దిగ్గజం ఓఎన్‌జీసీ చేతులు కలిపింది. తద్వారా దేశ తూర్పు, పశ్చిమ తీర ప్రాంతాల సముద్రగర్భం నుంచి చమురు, గ్యాస్ వెలికితీత కార్యక్రమాలను చేపట్టనుంది. ఇందుకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ఒక ప్రకటనలో ఓఎన్‌జీసీ పేర్కొంది. తూర్పు తీరప్రాంతంలో కృష్ణా గోదావరి, కావేరీ బేసిన్‌లపై దృష్టి సారించనున్నాయి. ఇదేవిధంగా పశ్చిమ తీరప్రాంతంలో కచ్–ముంబై వద్ద కార్యకలాపాలకు శ్రీకారం చుట్టనున్నట్లు ఓఎన్‌జీసీ వెల్లడించింది. అయితే భాగస్వామ్య ఒప్పందంపై వివరాలు తెలియచేయలేదు. కంపెనీకి గల బ్లాకులలో ఎగ్జాన్‌మొబిల్ వాటాలు తీసుకుంటుందా తదితర వివరాలు వెల్లడికాలేదు.
ఎగ్జాన్‌మొబిల్‌తో జత కట్టడం వ్యూహాత్మకంగా మేలు చేస్తుందని, దేశ తూర్పు, పశ్చిమ తీరప్రాంతాలలో కంపెనీకి గల అనుభవం ఇందుకు సహకరిస్తుందని ఓఎన్‌జీసీ ఈ సందర్భంగా పేర్కొంది. దేశీయంగా చమురు అవసరాల కోసం 85 శాతంవరకూ దిగుమతులపై ఆధారపడుతున్న నేపథ్యంలో విదేశీ ఇంధన దిగ్గజాల నుంచి దేశీ సంస్థలు సాంకేతిక, ఆర్థికపరమైన మద్దతును ఆశిస్తున్నాయి. తద్వారా కొత్త వనరుల నుంచి దేశీయంగా ఇంధన ఉత్పత్తిని పెంచాలని ఆశిస్తున్నాయి. కాగా.. గత కొన్నేళ్ల చర్చల ప్రభావంతో 2019లో ఎగ్జాన్‌మొబిల్, ఓఎన్‌జీసీ మధ్య అవగాహనా ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా భవిష్యత్ వేలంలో రెండు కంపెనీలు సంయుక్త పరిశోధన, సంయుక్త బిడ్డింగ్ వంటివి చేపట్టేందుకు నిర్ణయించాయి.
Comments
Please login to add a commentAdd a comment