krishna godavari basin
-
కేజీ బ్లాక్ నుంచి ఓఎన్జీసీ చమురు ఉత్పత్తి ప్రారంభం
న్యూఢిల్లీ: సుదీర్ఘ జాప్యం తర్వాత కృష్ణా గోదావరి (కేజీ) బేసిన్‌లోని డీప్ సీ బ్లాక్ నుంచి ప్రభుత్వ రంగ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) చమురు ఉత్పత్తిని ప్రారంభించింది. కంపెనీతో పాటు కేంద్ర చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి ఈ విషయం తెలిపారు. అయితే, ఉత్పత్తి చేస్తున్న పరిమాణాన్ని మాత్రం వెల్లడించలేదు. కేజీ–డీడబ్ల్యూఎన్–98/2 (కేజీ–డీ5) ప్రాజెక్టుతో తమ చమురు ఉత్పత్తి సామర్ధ్యం 11 శాతం, గ్యాస్ ఉత్పత్తి సామర్ధ్యం 15 శాతం పెరుగుతుందని ఓఎన్జీసీ తెలిపింది. 2022–23లో ఓఎన్జీసీ 18.4 మిలియన్ టన్నుల క్రూడాయిల్, రోజుకు 20 బిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ ఉత్పత్తి చేసింది. తాజాగా అందుబాటులోకి వచి్చన బ్లాక్‌లో చమురు ఉత్పత్తి గరిష్టంగా రోజుకు 45,000 బ్యారెళ్లు, గ్యాస్ ఉత్పత్తి 10 మిలియన్ క్యూబిక్ మీటర్ల స్థాయికి చేరగలదని మంత్రి తెలిపారు. అయితే, ఎప్పటికి ఆ స్థాయిని చేరవచ్చనేది వెల్లడించలేదు. కేజీ బేసిన్లో రిలయన్స్ ఇండస్ట్రీస్‌కి చెందిన కేజీ–6 బ్లాక్ పక్కనే కేజీ–డీ5 బ్లాక్ ఉంది. దీన్ని మూడు క్లస్టర్లుగా విడగొట్టి ముందుగా రెండో క్లస్టర్‌పై పనులు ప్రారంభించారు. వాస్తవ ప్రణాళికల ప్రకారం 2021 నవంబర్లోనే ఇందులో ఉత్పత్తి ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ కోవిడ్ పరిణామాలతో 2023 మే నెలకు, అటుపైన ఆగస్టుకు, తర్వాత డిసెంబర్‌కు వాయిదా పడుతూ వచి్చంది. -
ఎగ్జాన్‌మొబిల్‌తో ఓఎన్జీసీ జత
న్యూఢిల్లీ: గ్లోబల్ చమురు దిగ్గజం ఎగ్జాన్‌మొబిల్‌తో ప్రభుత్వ రంగ ఇంధన దిగ్గజం ఓఎన్జీసీ చేతులు కలిపింది. తద్వారా దేశ తూర్పు, పశ్చిమ తీర ప్రాంతాల సముద్రగర్భం నుంచి చమురు, గ్యాస్ వెలికితీత కార్యక్రమాలను చేపట్టనుంది. ఇందుకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ఒక ప్రకటనలో ఓఎన్జీసీ పేర్కొంది. తూర్పు తీరప్రాంతంలో కృష్ణా గోదావరి, కావేరీ బేసిన్లపై దృష్టి సారించనున్నాయి. ఇదేవిధంగా పశ్చిమ తీరప్రాంతంలో కచ్–ముంబై వద్ద కార్యకలాపాలకు శ్రీకారం చుట్టనున్నట్లు ఓఎన్జీసీ వెల్లడించింది. అయితే భాగస్వామ్య ఒప్పందంపై వివరాలు తెలియచేయలేదు. కంపెనీకి గల బ్లాకులలో ఎగ్జాన్‌మొబిల్ వాటాలు తీసుకుంటుందా తదితర వివరాలు వెల్లడికాలేదు. ఎగ్జాన్‌మొబిల్‌తో జత కట్టడం వ్యూహాత్మకంగా మేలు చేస్తుందని, దేశ తూర్పు, పశ్చిమ తీరప్రాంతాలలో కంపెనీకి గల అనుభవం ఇందుకు సహకరిస్తుందని ఓఎన్జీసీ ఈ సందర్భంగా పేర్కొంది. దేశీయంగా చమురు అవసరాల కోసం 85 శాతంవరకూ దిగుమతులపై ఆధారపడుతున్న నేపథ్యంలో విదేశీ ఇంధన దిగ్గజాల నుంచి దేశీ సంస్థలు సాంకేతిక, ఆర్థికపరమైన మద్దతును ఆశిస్తున్నాయి. తద్వారా కొత్త వనరుల నుంచి దేశీయంగా ఇంధన ఉత్పత్తిని పెంచాలని ఆశిస్తున్నాయి. కాగా.. గత కొన్నేళ్ల చర్చల ప్రభావంతో 2019లో ఎగ్జాన్‌మొబిల్, ఓఎన్జీసీ మధ్య అవగాహనా ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా భవిష్యత్ వేలంలో రెండు కంపెనీలు సంయుక్త పరిశోధన, సంయుక్త బిడ్డింగ్ వంటివి చేపట్టేందుకు నిర్ణయించాయి. -
చరిత్రలో తొలిసారి!
సాక్షి, హైదరాబాద్/ నాగార్జునసాగర్/ గద్వాల రూరల్/ దోమలపెంట (అచ్చంపేట)/భద్రాచలం: నైరుతి రుతుపవనాలు, బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడనాల ప్రభావంతో పరీవాహక ప్రాంతాల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు.. కృష్ణా, గోదావరి, వాటి ఉప నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. కృష్ణా నదిపై ఉన్న ఆల్మట్టి నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు అన్ని ప్రాజెక్టుల్లో నీటి నిల్వ గరిష్ట స్థాయికి చేరుకోవడంతో పాటు ఎగువ నుంచి భారీగా ప్రవాహం కొనసాగుతుండటంతో గేట్లు ఎత్తేసి వచ్చిన నీటిని వచ్చినట్టు దిగువకు విడుదల చేస్తున్నారు. అలాగే గోదావరిపై గైక్వాడ్ నుంచి ధవళేశ్వరం బ్యారేజీ వరకూ అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేశారు. ఇలా కృష్ణా, గోదావరి బేసిన్లలో మొత్తం ప్రాజెక్టులన్నీ నిండటం, అలాగే కృష్ణా బేసిన్లో అన్ని రిజర్వాయర్ల గేట్లు ఎత్తేయడం చరిత్రలో ఇదే తొలిసారని అధికారవర్గాలు తెలిపాయి. కడలివైపు కృష్ణమ్మ కృష్ణా నదిపై కర్ణాటకలోని ఆల్మట్టి రిజర్వాయర్‌కు ఎగువన ఉన్న రెండు చిన్న బ్యారేజీలు జూన్ ఆఖరుకే నిండిపోయాయి. ఆల్మట్టి, నారాయణపూర్ జూలై మొదటి వారానికే నిండాయి. అప్పటి నుంచి వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు వదిలేస్తుండటంతో శ్రీశైలం, నాగార్జునసాగర్ నిండిపోయాయి. జూరాల, సుంకేసుల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు గురువారం 4,30,107 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. దీంతో పది గేట్లు 15 మీటర్ల మేర ఎత్తి, విద్యుదుత్పత్తి ద్వారా మొత్తం 4,53,917 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. ఇక సాగర్ 26 రేడియల్ క్రస్ట్‌గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు మొత్తం 26 గేట్లను మొదటిరోజే ఎత్తడం 2009 తర్వాత ఇదే మొదటిసారి. సాగర్ నుంచి భారీగా వరద వస్తుండడంతో వరద నియంత్రణ చర్యల్లో భాగంగా పులిచింతలలో నీటి నిల్వను 30 టీఎంసీలకు తగ్గిస్తూ 4.41 లక్షల క్యూసెక్కులు దిగువకు వదిలేస్తున్నారు. దాంతో ప్రకాశం బ్యారేజీ వైపు వరద బిరా బిరా పరుగులు పెడుతోంది. గురువారం రాత్రి 7 గంటలకు ప్రకాశం బ్యారేజీలోకి 1,18,909 క్యూసెక్కులు చేరుతుండగా.. కృష్ణా డెల్టాకు 12,539 క్యూసెక్కులను విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 1,06,370 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. మహాసముద్రాన్ని తలపిస్తోన్న గోదావరి గోదావరి నది మహాసముద్రాన్ని తలపిస్తోంది. సాధారణంగా ఆగస్టులో గోదావరికి భారీ వరదలు వస్తాయి. కానీ ఈ ఏడాది పరీవాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురవడంతో జూలై రెండో వారంలోనే గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఇటీవల కురుస్తున్న వర్షాలకు మరోసారి ఉధృతంగా ప్రవహిస్తోంది. గైక్వాడ్ నుంచి బాబ్లీలో అంతర్భాగమైన 11 బ్యారేజీ గేట్లను మహారాష్ట్ర సర్కార్ ఎత్తేసి.. దిగువకు వరదను విడుదల చేస్తోంది. వాటికి సింగూరు, నిజాంసాగర్ నుంచి విడుదల చేస్తున్న మంజీర ప్రవాహం తోడవుతుండటంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద స్థిరంగా కొనసాగుతోంది. శ్రీరాంసాగర్ నుంచి వదులుతున్న వరదకు కడెం వాగు వరద తోడవడంతో ఎల్లంపల్లి ప్రాజెక్టు ఎత్తిన గేట్లను ఇప్పటిదాకా దించలేదు. జూలై 8న పోలవరం ప్రాజెక్టు 48, ధవళేశ్వరం బ్యారేజీ 175 గేట్లను ఎత్తేశారు. ఇప్పటిదాకా వాటిని దించలేదంటే గోదావరి వరద ఏ స్థాయిలో సాగుతోందో అర్థం చేసుకోవచ్చు. మూడో ప్రమాద హెచ్చరికకు చేరువలో.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో గోదావరి ప్రవాహం గురువారం మూడో ప్రమాద హెచ్చరిక జారీకి చేరువయ్యింది. తెల్లవారుజామున 4 గంటలకు 51.30 అడుగులుగా ఉన్న నీటిమట్టం మెల్లగా పెరుగుతూ వచ్చింది. సాయంత్రం 5 గంటలకు 52.30 అడుగుల మేర ఉండగా, 13,86,192 క్యూసెక్కుల నీటి ప్రవాహం నమోదైంది. నీటిమట్టం 53 అడుగులకు చేరుకుంటే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తామని అధికారులు తెలిపారు. ముంపు బెడద గ్రామాలు ఎక్కువగా ఉన్న దుమ్ముగూడెం, చర్ల, బూర్గంపాడు మండలాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలను ముందు జాగ్రత్తగా పునరావాస శిబిరాలకు తరలిస్తున్నారు. దుమ్ముగూడెం మండలం యటపాకతో పాటు బూర్గంపాడు – సారపాకల మధ్య గల ఉన్న ప్రధాన రహదారులపైకి వరద నీరు చేరడంతో రాకపోకలు స్తంభించాయి. భద్రాచలం నుంచి భారీ వరద వస్తుండ టం.. వాటికి శబరి ప్రవాహం తోడ వుతుండటంతో పోలవరం ప్రాజెక్టు వద్ద అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. -
డీపీఆర్‌లపై కదలిక
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి బేసిన్‌లోని ప్రధాన ప్రాజెక్టుల సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ల తయారీకి రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. అనుమతుల్లేకుండా చేపడుతున్న ప్రాజెక్టుల డీపీఆర్‌లు సమర్పించాలని, వాటికి కేంద్ర జలసంఘం, అపెక్స్ కౌన్సిల్ అనుమతి పొందాలని అటు కేంద్రం, ఇటు బోర్డులు చెబుతున్న నేపథ్యంలో డీపీఆర్‌లను వీలైనంత త్వరగా సిద్ధం చేయాలని నిర్ణయించింది. మూడు రోజుల కింద ఇంజనీర్లతో ç సమీక్షించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. డీపీఆర్‌ల తయారీపై దృష్టిపెట్టి అనుమతులు తెచ్చుకునే పనిని ఆరంభించాలని సూచించారు. దీంతో 10 ప్రధాన ప్రాజెక్టుల డీపీఆర్‌లపై ఇరిగేషన్ శాఖ కసరత్తు మొదలుపెట్టింది. ప్రధాన ప్రాజెక్టులు టార్గెట్... కృష్ణా, గోదావరి నదీ బేసిన్లో తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు మొదలైన నాటి నుంచే కేంద్ర జలశక్తి శాఖ ప్రాజెక్టుల డీపీఆర్‌ల సమర్పణ, అనుమతుల అంశాన్ని ప్రస్తావిస్తోంది. దీనిపై పలుమార్లు కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ప్రభుత్వానికి లేఖలు రాశారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశంలోనూ ఈ అంశం ప్రస్తావనకు రాగా డీపీఆర్‌లు ఇచ్చేందుకు తెలంగాణ సుముఖత తెలిపింది. ఇంతవరకు సమర్పించలేదు. కేంద్రం వెలువరించిన గెజిట్ నోటిఫికేషన్లోనూ కాళేశ్వరం అదనపు టీఎంసీ, సీతారామ ఎత్తిపోతలు, జీఎల్ఐఎస్ ఫేజ్–3, తుపాకులగూడెం ప్రాజెక్టు, రామప్ప సరç స్సు నుంచి పాకాల లేక్‌కు నీటి మళ్లింపు, పాల మూరు–రంగారెడ్డి, డిండి, మోడికుంటవాగు, తుమ్మిళ్ల ప్రాజెక్టులను కేంద్ర జలసంఘం అనుమతులు లేవని పేర్కొంటూ.. ప్రాజెక్టులకు నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి ఆరు నెలల్లో అనుమతులు పొందాలని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. వీటి విషయంలో ఎలా ముందుకెళ్లాలన్న దానిపై ఇప్పటికే పలుమార్లు ఇంజనీర్లతో చర్చించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. పాలమూరు–రంగారెడ్డికి సంబంధించిన పర్యావరణ అనుమతుల ప్రక్రియను మొదలు పెట్టించారు. మిగతా ప్రాజెక్టుల అనుమతుల ప్రక్రియను సైతం మొదలుపెట్టేలా డీపీఆర్‌లను సిద్ధం చేయాలని, వాటిని కేంద్రానికి పంపి అనుమతులు పొందాలని సూచించారు. దీంతో ఇరిగేషన్ శాఖ స్పెషల్ సీఎస్ రజత్‌కుమార్ శుక్రవారం జలసౌధలో ప్రాజెక్టుల ఈఎన్సీలు, సీఈలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. డీపీఆర్‌ల తయారీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పొందుపరచాల్సిన అంశాలు, సేకరించాల్సిన వివరాలు తదితరాలపై మార్గదర్శనం చేశారు. శనివారం నుంచే డీపీఆర్‌ల తయారీ ప్రక్రియ మొదలుపెట్టనున్నారు. -
కృష్ణా, గోదావరి వరదలపై కీలక సమావేశం..కృష్ణా బోర్డు భేటీ వాయిదా!
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతాల్లో దిగువ రాష్ట్రాలకు ఇబ్బందులు లేకుండా చేసేందుకు కృష్ణా గోదావరి బేసిన్ ఆర్గనైజేషన్ (కేజీబీవో) మంగళవారం కీలక సమావేశాన్ని నిర్వహిస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు బేసిన్ పరిధిలోని రాష్ట్రాల జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో కేజీబీవో సీఈ డి.రంగారెడ్డి వర్చువల్ విధానంలో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ సీజన్లో కృష్ణా, గోదావరి నదులకు వరద వచ్చే సమయంలో.. వరద ముప్పును తగ్గించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎగువ రాష్ట్రాలకు దిశానిర్దేశం చేయనున్నారు. కృష్ణా బేసిన్‌లోని జలాశయాల్లో నీటిమట్టం గరిష్టస్థాయికి చేరాకగానీ మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు వరద ప్రవాహాన్ని దిగువకు విడుదల చేయడం లేదు. గరిష్టంగా వరదను ఒకేసారి విడుదల చేయడం వల్ల దిగువ రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వరద బారిన పడుతున్నాయి. వర్షాలు సమృద్ధిగా కురిసినప్పుడు వరద ముప్పును ఎదుర్కొంటున్న ఏపీ, తెలంగాణ.. వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు కనీసం తాగడానికి కూడా నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. దేశవ్యాప్తంగా అన్ని నదీ బేసిన్లలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో వరద సమయాల్లో తీసుకోవాల్సిన చర్యలు, దిగువ రాష్ట్రాలతో సమాచార మార్పిడి తదితర అంశాలపై ఆయా రాష్ట్రాలకు మార్గదర్శనం చేయనున్నారు. కృష్ణా బోర్డు భేటీ వాయిదా సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల పంపకాలపై చర్చించేందుకు మంగళవారం జరగాల్సిన కృష్ణా బోర్డు భేటీ వాయిదా పడింది. యాస్ తుపాను ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై ఉంటుందని కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో జల వనరుల శాఖ అధికారులంతా దానిని ఎదు ర్కొనే కార్యాచరణలో నిమగ్నమై ఉన్నారు. దీనికితోడు కేంద్రం ఆదేశాల మేరకు పోల వరం ప్రాజెక్టును పూర్తి చేయడంపై అధికార యంత్రాంగం ఉన్నందున మంగళవారం నాటి భేటీని వాయిదావేయాలని ఆంధ్రప్రదేశ్ బోర్డును కోరింది. ఈ నేపథ్యంలో సమావేశాన్ని వాయిదా వేస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. -
వరద గోదావరిని ఒడిసి పడదాం
తెలంగాణను దాటుకుని 2,500 టీఎంసీల గోదావరి జలాలు రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయి. గోదావరి నది జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో 120 రోజులు వరదతో పొంగుతుంది. వరద ఉన్న రోజుల్లో రోజుకు నాలుగు టీఎంసీల చొప్పున 120 రోజుల్లో 450 నుంచి 500 టీఎంసీలు శ్రీశైలం, నాగార్జునసాగర్‌లకు తీసుకెళ్లాలని ఇద్దరు ముఖ్యమంత్రులం నిర్ణయించాం. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి : ‘తెలుగువాళ్లం ఎక్కడ ఉన్నా సరే ఇచ్చి పుచ్చుకునే గుణం ఉండాలి. కలిసి పని చేసుకునే వాతావరణం ఉండాలి. ఒకరికి తోడుగా మరొకరు నిలబడాలి. నిజంగా ఆ భావన రావడం సంతోషం. తెలుగు రాష్ట్రాల భావితరాల ప్రయోజనాల కోసమే శ్రీశైలం, నాగార్జునసాగర్‌లకు గోదావరి జలాలను తరలించాలని నేను.. తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయించాం. తెలంగాణ భూభాగం నుంచి గోదావరి జలాలను తరలిస్తే అవి మన వరకూ వస్తాయా? అంటూ ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తిన సందేహాలు సహేతుకమైనవే. నిజంగా నీళ్లు రావు అనుకున్నప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులూ కలిసి ఎందుకు ముందడుగు వేయాలని అనుకుంటారు? మనం తీసుకునే నిర్ణయం వల్ల భావితరాలపై ప్రభావం ఉంటుంది. నిర్ణయం తీసుకోకపోవడం కూడా భావితరాలపై ప్రభావం చూపుతుందనే విషయాన్ని మరచి పోకూడదు. రాష్ట్రానికి మంచి చేయాలనే ఆరాటంతోనే నిర్ణయాలు తీసుకుంటున్నాం.. మంచి జరగదని అనుకుంటే ఆ పని ఎందుకు చేస్తాం? కచ్చితంగా చేయం’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. శ్రీశైలం జలాశయానికి గోదావరి జలాలు తరలిస్తే జగన్‌కు ఎక్కడ మంచి పేరు వస్తుందో అన్న ఈర్షతోనే ప్రతిపక్ష సభ్యులు రాద్ధాంతం చేస్తున్నారన్నారు. గోదావరి జలాల మళ్లింపుపై శాసనసభలో గురువారం జరిగిన స్వల్ప కాలిక చర్చలో జల వనరుల శాఖ మంత్రి డాక్టర్ అనిల్‌కుమార్ యాదవ్, ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఎమ్మెల్యేలు పయ్యావుల కేశవ్, తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డిలు మాట్లాడిన తర్వాత సీఎం వైఎస్ జగన్ సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా జగన్ ఏమన్నారంటే.. నాసిక్ పాయపై మహారాష్ట్ర ఎక్కడికక్కడ బ్యారేజీలు ‘గోదావరి నదికి నాలుగు పాయలు ఉన్నాయి. ఒక పాయ నాసిక్ నుంచి వస్తుంది. ఇది తెలంగాణలో కలుస్తుంది. దీన్నే అప్పర్ గోదావరి అంటారు.. ఈ సబ్ బేసిన్‌ను జీ–1 అంటారు. ప్రవర సబ్ బేసిన్‌ను జీ–2, పూర్ణ సబ్ బేసిన్‌ను జీ–3, మంజీర సబ్ బేసిన్‌ను జీ–4, మిడిల్ గోదావరి సబ్ బేసిన్‌ను జీ–5, మానేరు సబ్ బేసిన్‌ను జీ–6 అంటారు. నాసిక్ నుంచి వచ్చే పాయ ద్వారా గోదావరి నదిలో నీటి లభ్యత 22.23 శాతం ఉంటుంది. ఈ పాయపై మహారాష్ట్ర ఎక్కడికక్కడ బ్యారేజీలు కట్టేసి.. నీళ్లను వినియోగించుకుంటుండటం వల్ల తెలంగాణలో 90 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు(ఎస్సారెస్పీ)కు నీళ్లు రాని పరిస్థితి నెలకొంది. దాంతో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎస్సారెస్పీకి రివర్స్ పంపింగ్ ద్వారా గోదావరి జలాలను తరలించే పనులను తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది. శబరి సబ్ బేసిన్లో నీటి లభ్యత 12 శాతమే గోదావరి నది రెండో పాయ గురించి చెప్పాలంటే.. పెన్ గంగ సబ్ బేసిన్(జీ–7), వార్దా సబ్ బేసిన్(జీ–8), ప్రాణహిత సబ్ బేసిన్(జీ–9)లు తెలంగాణ పరిధిలోకి వస్తాయి. ప్రాణహిత సబ్ బేసిన్ నుంచి 35.46 శాతం నీటి లభ్యత ఉంటుంది. గోదావరి మూడో పాయ గురించి చెప్పాలంటే.. ఇది పూర్తిగా ఇంద్రావతి సబ్ బేసిన్(జీ–11). ఈ సబ్ బేసిన్లో 23 శా>తం నీటి లభ్యత ఉంటుంది. మనకు (ఆంధ్రప్రదేశ్) కేవలం శబరి సబ్ బేసిన్ (జీ–12) నుంచే గోదావరిలోకి నీళ్లు వస్తున్నాయి. ఈ సబ్ బేసిన్లో నీటి లభ్యత 12 శాతమే. సీడబ్ల్యూసీ లెక్కల ప్రకారం గత 44 ఏళ్లలో ప్రాణహిత సంగమం తర్వాత కాళేశ్వరం వద్ద గోదావరిలో ఏడాదికి సగటున 1,709 టీఎంసీల నీటి లభ్యత ఉంది. ఇంద్రావతి సంగమం తర్వాత పేరూరు వద్ద సీడబ్ల్యూసీ లెక్కల ప్రకారం గత 47 సంవత్సరాల్లో ఏడాదికి సగటున 2,489 టీఎంసీల నీటి లభ్యత ఉంది. శబరి సంగమం తర్వాత పోలవరం వద్ద గోదావరి నీటి లభ్యత 3,082 టీఎంసీలు. వీటిని పరిశీలిస్తే శబరి సంగమం నుంచి పోలవరం వరకూ గోదావరిలో నీటి లభ్యత 500 నుంచి 600 టీఎంసీలే. మిగిలిన 2,500 టీఎంసీలు తెలంగాణను దాటుకుని మన రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్నాయన్నది స్పష్టమవుతోంది. కృష్ణా ఆయకట్టు ఎండమావే.. సీడబ్ల్యూసీ రికార్డులను పరిశీలిస్తే గత 47 సంవత్సరాల్లో కృష్ణా నది నుంచి శ్రీశైలంలోకి సగటున ఏడాదికి 1,200 టీఎంసీలు వచ్చేవి. గత పదేళ్లలో శ్రీశైలంలోకి వస్తున్న నీళ్లు సగటున ఏడాదికి 600 టీఎంసీలకు పడిపోయాయి. గత ఐదేళ్లలో శ్రీశైలంలోకి ఏటా సగటున వస్తున్నది 400 టీఎంసీలు మాత్రమే. కృష్ణా నదీ జలాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన నీళ్లు 811 టీఎంసీలు. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కర్ణాటక సర్కారు ఆల్మట్టి జలాశయం ఆనకట్ట ఎత్తును 519 మీటర్ల నుంచి 524 మీటర్లకు పెంచే పనులను ప్రారంభించింది. ఈ పనులు పూర్తయితే ఆల్మట్టి జలాశయంలో అదనంగా 110 టీఎంసీలను నిల్వ చేసుకోవచ్చు. దీనివల్ల కర్ణాటక నీటి వినియోగం అదనంగా 130 నుంచి 140 టీఎంసీలకు పెరుగుతుంది. అప్పుడు శ్రీశైలం జలాశయంలోకి వచ్చే నీళ్లు 250 టీఎంసీలు మాత్రమే. ఇక శ్రీశైలం ఎప్పుడు నిండుతుంది? రాయలసీమ ప్రాజెక్టులు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ప్రాజెక్టులు ఎప్పుడు నిండుతాయి? నాగార్జునసాగర్‌కు నీళ్లు ఎప్పుడు వస్తాయి? కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల పరిస్థితి ఏంటి? కృష్ణా నదిలో నీటి లభ్యత నానాటికీ తగ్గిపోతున్న నేపథ్యంలో ఆయకట్టు ఎండమావిగా మారింది. డెల్టా ప్రయోజనాలకు విఘాతం కలగనివ్వం గోదావరి నదీ జలాలను పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా పోలవరం కుడి కాలువ మీదుగా కృష్ణా డెల్టాకు మళ్లింపు చేసే పనులు చేపట్టినప్పుడు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఏ రకమైన అభ్యంతరాలు వచ్చాయి.. ఎలాంటి గొడవలు జరిగాయన్నది ప్రతిపక్ష నేత చంద్రబాబు చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో.. శబరి ద్వారా వచ్చే నీళ్లు 500 నుంచి 600 టీఎంసీలు మాత్రమే. అక్కడి నుంచే ఈ నీటినే రాయలసీమకు తీసుకెళ్లండి.. శ్రీశైలానికి తీసుకెళ్లండి అని చెబితే.. గోదావరి జిల్లాల ప్రజలకు మనం న్యాయం ఎలా చేస్తాం.. వారికి ఎలా మంచి చేయగలుగుతాం? గోదావరి డెల్టా ప్రయోజనాలకు ఏమాత్రం విఘాతం కలిగించకుండా శ్రీశైలం, నాగార్జునసాగర్‌లకు గోదావరి జలాలను తరలించాలని నిర్ణయించాం. తెలంగాణ వాళ్లు డ్యామ్‌లు కట్టలేరా? మహారాష్ట్ర, కర్ణాటకలు ఏ రకంగా ప్రాజెక్టులు కట్టుకుంటూ పోతున్నాయో.. తెలంగాణ కూడా అదే మాదిరిగా ప్రాజెక్టులు కట్టుకుంటూ పోతోంది. గోదావరి నది నుంచి 450 టీఎంసీలను కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణ సర్కార్ తరలిస్తోందని మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ ఇదివరకే సభలో చెప్పారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కాళేశ్వరం ప్రాజెక్టును తెలంగాణ సర్కార్ ప్రారంభించి.. పూర్తి చేసింది. అప్పట్లో సీఎంగా ఉన్న చంద్రబాబు కాళేశ్వరం ప్రాజెక్టును ఆపగలిగారా? ఏమీ చేయలేకపోయారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి జలాశయం ఆనకట్ట ఎత్తును 519 మీటర్ల నుంచి 524 మీటర్ల ఎత్తుకు పెంచే పనులను చేపట్టింది. ఆ పనులను ఆపగలిగారా? ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ వాళ్లు డ్యామ్‌లు కట్టే పరిస్థితి లేదని ప్రతిపక్ష సభ్యులు చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది. డ్యామ్‌లు కట్టాలంటే రెండు కొండలు కావాలి.. వాటి మధ్య డ్యామ్ కట్టాలి అన్నది గతం. ఈ రోజుల్లో పరిస్థితి ఏమిటంటే.. చిన్న చిన్న బ్యారేజీలు టపాటపా కట్టుకుంటూ పోతున్నారు. కాళేశ్వరం వద్దకు నేను వెళ్లినప్పుడు 17 టీఎంసీల బ్యారేజీ అక్కడ కన్పించింది. ఇంకాస్త ముందుకు వెళితే మరో బ్యారేజీ కన్పించింది. అక్కడి నుంచి పంపుల ద్వారా నీటిని ఎత్తిపోసి.. ప్రాజెక్టులు నింపుతున్నారు. తెలంగాణతో సఖ్యత అవసరం ఇవ్వాళ్టి నుంచి పది సంవత్సరాలు ముందుకు వెళ్తే.. ఎలా ఉంటుందో ఊహించుకోవడానికే భయం వేస్తుంది. నీటి వినియోగం పెరుగుతోంది. నీటిపై ఆధారపడే పరిస్థితి పెరుగుతోంది. మరో వైపు నీటి లభ్యత తగ్గుతోంది. కృష్ణా నది నుంచి శ్రీశైలంలోకి 1,200 టీఎంసీలకు గాను 400 టీఎంసీలు కూడా రావడం లేదు. గత పది సంవత్సరాల లెక్కలను ఒకసారి పరిశీలిస్తే.. సగటున ఏడాదికి 600 టీఎంసీలు మాత్రమే శ్రీశైలానికి వచ్చాయి. గత ఐదేళ్లలో శ్రీశైలానికి వచ్చిన నీళ్లు 400 టీఎంసీలకు పడిపోయాయి. ఆల్మట్టి జలాశయం ఆనకట్ట ఎత్తును 519 నుంచి 524 మీటర్లకు పెంచే పనులు పూర్తయితే పరిస్థితి ఏమిటని ఆలోచన చేస్తేనే భయం వేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వంతో సఖ్యతగా ఉండటం ఎంత అవసరమో మనందరం ఆలోచించాలి. ఒక్కటైతే చెప్తున్నా.. కేసీఆర్ మంచి వారు.. మంచి చేయడానికి ముందడుగు వేస్తున్నారు. దానికి హర్షించాల్సింది పోయి వక్రీకరించడం ఎంత వరకు ధర్మం?. ఇరు రాష్ట్రాల ప్రయోజనాల కోసం కలిసికట్టుగా.. శ్రీశైలం జలాశయం సామర్థ్యం 215 టీఎంసీలు. నాగార్జునసాగర్ సామర్థ్యం 315 టీఎంసీలు. ఈ ప్రాజెక్టులను గోదావరి జలాలతో నింపుకోవచ్చు. కేవలం 190 టీఎంసీల సామర్థ్యం ఉన్న పోలవరం ప్రాజెక్టును కట్టడానికి అక్షరాలా రూ.55 వేల కోట్లు అవసరమని లెక్కకడుతున్నారు. ఇక శ్రీశైలం, నాగార్జునసాగర్ వంటి ప్రాజెక్టులు కట్టాలంటే ఎంత ఖర్చవుతుంది? శ్రీశైలం,నాగార్జునసాగర్ ప్రాజెక్టులు ఉమ్మడి ఆస్తులు. రెండు రాష్ట్రాల ప్రజల ప్రయోజనాలు ఇందులో ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో కలిసికట్టుగా అడుగులు ముందుకు వేస్తేనే ఇరు రాష్ట్రాల ప్రజలకు మేలు జరుగుతుందని ఆలోచిస్తున్నాం. శ్రీశైలం, నాగార్జునసాగర్‌లకు గోదావరి జలాలను తరలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలు.. తెలంగాణలో మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లోని ఆయకట్టుకు ప్రయోజనం చేకూరుతుంది. తెలంగాణ భూభాగం నుంచి గోదావరి జలాలను తరలిస్తే.. అవి శ్రీశైలం, నాగార్జునసాగర్‌కు చేరవేమో అని ప్రతిపక్ష సభ్యులు వ్యక్తం చేసిన అనుమానాలను పరిగణనలోకి తీసుకుంటాం. అలాంటి పరిస్థితులు రాకుండా శ్రీశైలం, నాగార్జునసాగర్‌లకు నీటిని ఎలా తీసుకెళ్లాలనే అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రితో, తెలంగాణ నీటిపారుదల అధికారులతో మన మంత్రులు, అధికారులు చర్చిస్తున్నారు. ఈర్షతోనే ప్రతిపక్షం రాద్ధాంతం చంద్రబాబు గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆయన ఎందుకు అరుస్తున్నారో ఆయనకే తెలియదు. ఆయన మాట్లాడుతున్నంతసేపూ మేము మాట్లాడకుండా విన్నాం. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్న ఈ పెద్దమనిషికి అవతలి వాళ్లు చెప్పేది వినే ఓపిక కూడా ఉండాలి. గోదావరి జలాలను శ్రీశైలంకు.. అక్కడి నుంచి నాగార్జునసాగర్‌కు తరలిస్తే జగన్‌కు ఎక్కడ మంచి పేరు వస్తుందో అన్న ఈర్ష తప్ప ప్రతిపక్ష సభ్యుల మాటల్లో ఇంకేమీ కన్పించడం లేదు. ప్రతిపక్ష నేత చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మాట్లాడినంత సేపు మేం అడ్డుతగలకుండా విన్నాం. మేం మాట్లాడుతున్నప్పుడు మాత్రం.. మా మాటలు మైకుల్లో విన్పించకుండా చేయాలనే దుర్భిద్ధితో దుర్మార్గంగా, అన్యాయంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు అసలు మనిషేనా? ఈ మనిషిని చూస్తే దెయ్యం, రాక్షసి గుర్తుకు వస్తాయి తప్ప మనిషి గుర్తుకు రాడు’ అని సీఎం జగన్ అన్నారు. -
కేజీ బేసిన్.. చమురు నిక్షేపాలు దొరికెన్!
నరసాపురం: కృష్ణా, గోదావరి (కేజీ) బేసిన్ పరిధిలోని ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లో చమురు నిక్షేపాల కోసం ప్రభుత్వరంగ దిగ్గజం ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఓఎన్జీసీ) అధికారులు రెండేళ్లుగా చేస్తున్న అన్వేషణ సత్ఫలితాలనిచ్చింది. తాజాగా చమురు నిక్షేపాల కోసం అధికారులు వేగం పెంచి విస్తృతంగా అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలో పశ్చిమగోదావరి జిల్లాలో నాలుగుచోట్ల అపారంగా గ్యాస్ నిక్షేపాలు ఉన్నట్టు గుర్తించారు. ఇవన్నీ కొత్త బావులు కావడం విశేషం. ఇప్పటికే రెండుచోట్ల సర్వే డ్రిల్లింగ్ పనులు పూర్తి చేశారు. మిగిలిన రెండు చోట్ల కూడా గ్యాస్ వెలికితీతకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కేజీ బేసిన్ పరిధిలో నరసాపురం చుట్టుపక్కల ప్రాంతాల్లో మూడు దశాబ్దాలుగా తవ్వుతున్న బావులు ఖాళీ అయ్యాయి. దీంతో ఉత్పత్తిని పెంచేందుకు ఓఎన్జీసీ రెండేళ్ల నుంచి నరసాపురం, పాలకొల్లు, యలమంచిలి, మార్టేరు, పెనుగొండ, భీమవరం ప్రాంతాల్లో అన్వేషణ ప్రారంభించింది. మార్టేరు, పెనుగొండ ప్రాంతాల్లో పెద్దస్థాయిలో, మొగల్తూరు మండలం ఆకెనవారితోట, భీమవరం సమీపంలోని మహాదేవపట్నం, వేండ్ర వద్ద మొత్తం నాలుగుచోట్ల చమురు నిక్షేపాలు ఉన్నట్టు గుర్తించి, వెలికితీతకు ఉపక్రమించారు. నాలుగు దశాబ్దాలుగా కార్యకలాపాలు నాలుగు దశాబ్దాలుగా నరసాపురం కేంద్రంగా ఓఎన్జీసీ కార్యకలాపాలు సాగుతున్నాయి. అయితే మూడు దశాబ్దాల పాటు ఓఎన్జీసీ కేవలం ఆన్షోర్పైనే దృష్టి పెట్టింది. రిలయన్స్, గెయిల్ వంటి ప్రైవేట్ ఆయిల్‌రంగ సంస్థలు రంగప్రవేశం చేయడంతో వాటి పోటీని తట్టుకోవడానికి ఓఎన్జీసీ 2006 నుంచి సముద్రగర్భంలో అన్వేషణలపై దృష్టి సారించింది. ప్రస్తుతం నరసాపురం నుంచి కాకినాడ వరకు సముద్రగర్భంలో డ్రిల్లింగ్ జరుగుతోంది. నరసాపురం మండలం చినమైనవానిలంక తీరానికి సమీపంగా సముద్రగర్భంలో గ్యాస్ వెలికితీత ప్రారంభమైంది. అదనపు ఉత్పత్తిలో లక్ష్యాన్ని చేరుకోవడానికి ఓఎన్జీసీ ప్రస్తుతం ఇదే ప్రధాన వనరుగా భావిస్తోంది. ఆన్‌షోర్‌కు సంబంధించి పశ్చిమగోదావరి జిల్లాలో కవిటం, నాగిడిపాలెం, ఎస్–1 వశిష్టాబ్లాక్, 98–2 ప్రాజెక్ట్‌లో, తూర్పుగోదావరి జిల్లా కేశనపల్లి, కృష్ణా జిల్లా బంటుమిల్లి, నాగాయలంక ప్రాంతాల్లో గత కొంతకాలంగా చేపట్టిన అన్వేషణలు పూర్తయ్యాయి. మరో రెండు, మూడు నెలల్లో వీటి ద్వారా ఉత్పత్తి ప్రారంభమవుతుందని ఓఎన్జీసీ అధికారులు చెపుతున్నారు. 25 శాతం ఉత్పత్తి పెంపు లక్ష్యంగా.. రానున్న ఏడాది మరో 25 శాతం ఉత్పత్తి పెంపు కోసం ఓఎన్జీసీ ప్రయత్నాలు సాగిస్తోంది. రోజుకు 35 నుంచి 40 లక్షల క్యూబిక్ మీటర్ల గ్యాస్, 1,400 టన్నుల ఆయిల్ వెలికితీయడమే లక్ష్యంగా ముందుకెళుతోంది. గ్యాస్ వెలికితీతలో ఇప్పటికే దేశంలో మొదటి స్థానాన్ని దక్కించుకున్న ఓఎన్జీసీ.. ఇదే దూకుడుతో లక్ష్యాన్ని చేరుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఇక ఆఫ్‌షోర్ (సముద్రగర్భం)లో అన్వేషణలకు సంబంధించి నరసాపురం తీరంలో చురుగ్గా కార్యకలాపాలు సాగుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లాదే అగ్రస్థానం కొత్తగా జిల్లాలో కనుగొన్న బావుల నుంచి ఉత్పత్తి ప్రారంభమైతే, రోజుకు ఇక్కడి నుంచి 4 లక్షల క్యూబిక్ మీటర్ల గ్యాస్ వెలికితీయవచ్చని ఓఎన్జీసీ అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం కేజీ బేసిన్లో ఓఎన్జీసీ రోజుకు 33 లక్షల క్యూబిక్ మీటర్ల గ్యాస్, 900 టన్నుల ఆయిల్‌ను వెలికితీస్తోంది. ఇందులో పశ్చిమగోదావరి జిల్లా నుంచే రోజుకు 10 లక్షల క్యూబిక్ మీటర్ల గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. కొత్త బావుల ద్వారా మరో 4 లక్షల క్యూబిక్ మీటర్ల గ్యాస్ ఉత్పత్తి ఇక్కడి నుంచి పెరిగితే ఈ జిల్లాదే అగ్రస్థానం అవుతుంది. -
కళావిహీనంగా కృష్ణా గోదావరి సంగమం
-
ఎస్సారెస్పీకి భారీ వరద
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గత నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా కృష్ణా, గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టుల్లో నీటి ప్రవాహాలు క్రమంగా పుంజుకుంటున్నాయి. ప్రధాన ప్రాజెక్టుల పరిధిలో కురుస్తున్న వర్షాలతోపాటు ఎగువ నుంచి వస్తున్న నీటి ప్రవాహం దిగువ ప్రాజెక్టుల్లోకి చేరుతోంది. మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో ఎస్సారెస్పీకి భారీ వరద వస్తోంది. మంగళవారం సాయంత్రానికి 21,400 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్ధ్యం 90.31 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.197 టీఎంసీలకు చేరింది. ఎగువన భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మరో నాలుగైదు రోజులు ప్రవాహాలు కొనసాగుతాయని నీటిపారుదల వర్గాలు చెబుతున్నాయి. సింగూరు, కడెం, ఎల్లంపల్లి ప్రాజెక్టుల్లో ఆశాజనక స్థాయిలో ప్రవాహాలు కొనసాగుతున్నాయి. సింగూరుకు మంగళవారం 1,442 క్యూసెక్కుల ప్రవాహం కొనసాగగా, 29.91 టీఎంసీల సామర్థ్యానికి చేరింది. కడెంలోకి 2,492 క్యూసెక్కులు, ఎల్లంపల్లికి 1,611 క్యూసెక్కుల మేర వస్తోంది. నిజాంసాగర్, లోయర్ మానేరు డ్యామ్ పరిధిలోకి ఇంకా ఎలాంటి ప్రవాహాలు మొదలు కాలేదు. కృష్ణా బేసిన్లో ఒక్క జూరాలకు మాత్రమే మెరుగైన ప్రవాహాలు వస్తున్నాయి. పరీవాహకంలో కురిసిన వర్షాలతో మంగళవారం 3,903 క్యూసెక్కుల మేర ప్రవాహం వస్తోంది. ఈ సీజన్లో వర్షాలు మొదలయ్యాక గరిష్టంగా జూరాలకే 1.28 టీఎంసీల కొత్తనీరు వచ్చి చేరింది. ఇక నాగార్జునసాగర్‌లోకి 512 క్యూసెక్కుల మేర ప్రవాహం వస్తోంది. ఎగువ కర్ణాటకలోని ఆల్మట్టికి ఎలాంటి ప్రవాహాలు లేకపోగా, నారాయణపూర్‌కు 599 క్యూసెక్కులు, తుంగభద్రకు 1,127 క్యూసెక్కుల మేర ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ ప్రాజెక్టుల్లో భారీగా వరద చేరితే కానీ దిగువకు ప్రవాహాలు కొనసాగే పరిస్థితి లేదు. -
కృష్ణాలో పెంచాలి.. గోదావరిలో తేల్చాలి
సాక్షి, హైదరాబాద్ : కృష్ణా జలాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న నికర జలాల కేటాయింపుల్లో తెలంగాణ వాటాను పెంచాలని, గోదావరిలో నీటి లభ్యత ఎంతో స్పష్టంగా తేల్చాలని రాష్ట్ర ప్రభుత్వం మరోమారు కేంద్రానికి స్పష్టం చేసింది. గోదావరిలో నీటి లభ్యతపై సమగ్ర అధ్యయనం చేసిన తర్వాత, తెలంగాణకు 1,500 టీఎంసీల నీటి అవసరాలు తీరాకే నదుల అనుసంధానంపై నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. హిమాలయాల నుంచి నదీ ప్రవాహాలను గోదావరికి మళ్లించడమొక్కటే భవిష్యత్తు తరాల నీటి కొరతను తీర్చగలదని తెలిపింది. దీని ద్వారా 938 టీఎంసీల నీటిని గోదావరికి లింకు చేయడం వల్ల దక్షిణాది వాటర్ గ్రిడ్‌ను బలోపేతం చేయొచ్చని సూచించింది. కృష్ణా బేసిన్లో పట్టిసీమ, పోలవరం ద్వారా తరలిస్తున్న నీటిలో తెలంగాణకు దక్కే న్యాయమైన వాటాలను తేల్చి 575 టీఎంసీల వినియోగానికి అవకాశం ఇవ్వాలని కోరింది. కృష్ణాలో భవిష్యత్‌లో నీటి కొరతకు శాశ్వత పరిష్కారం లభించేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. మంగళవారమిక్కడ జరిగిన దక్షిణాది రాష్ట్రాల జలవనరుల సదస్సులో నదుల అనుసంధానంపై మంత్రి హరీశ్ మాట్లాడారు. ‘నదుల అనుసంధానంపై మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అయితే మా రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించుకోవడం మా బాధ్యత. తెలంగాణకు 954 టీఎంసీల కేటాయింపులు ఉన్నాయి. అయితే కృష్ణాలో ఇప్పటికే నీటి కొరత ఏర్పడింది. కర్ణాటకలో ఆల్మట్టి ఎత్తు పెంపునకు బ్రిజేశ్ ట్రిబ్యునల్ అనుమతించినందున భవిష్యత్‌లో కృష్ణా నదిలో దిగువ రాష్ట్రాలకు మరింత నీటి కొరత ఏర్పడే అవకాశం ఉంది. ఈ దృష్ట్యా కృష్ణా ప్రాజెక్టుల్లో నీటి కొరతను అధిగమించడానికి మేం గోదావరిపైననే ఆధారపడాల్సి ఉంది. అందుకే నదుల అనుసంధానానికి ముందు రాష్ట్రాల అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలి’’అని అన్నారు. ఏపీ ఆరోపణలకు కౌంటర్ కృష్ణాలో వాడుతున్న 299 టీఎంసీలకు అదనంగా మరో 260 టీఎంసీల వినియోగానికి తెలంగాణ యత్నిస్తోందని ఈ భేటీలో ఏపీ ఆరోపించింది. కృష్ణా బేసిన్లో ఎలాంటి అనుమతి లేకుండా భారీ ప్రాజెక్టులను నిర్మిస్తున్నట్టు కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. ఈ ఆరోపణలను సీఎస్ ఎస్కే జోషి తిప్పిగొట్టారు. ఏపీ ఆరోపణలు నిరాధారమన్నారు. ఆర్డీఎస్ ఆనకట్టల పునరుద్ధరణకు ఏపీ సహకరించడం లేదని, పనులు మొదలు పెట్టిన ప్రతిసారీ శాంతి భద్రతల సమస్యను సృష్టించి పనులను ఆపుతోందని అన్నారు. తుమ్మిళ్ల ఎత్తిపోతలతో రాయలసీమకు నష్టం జరుగుతుందని చేసిన ఫిర్యాదును మంత్రి హరీశ్ ఖండించారు. ఆర్డీఎస్ ద్వారా నీరందని ఆయకట్టుకు మాత్రమే తుమ్మిళ్ల ద్వారా నీరిచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. నదీజలాల పంపిణీ విషయంలోనూ ‘రూల్ ఆఫ్ లా’అమలు చేయాలని జోషి వ్యాఖ్యానించగా.. కేంద్రమంత్రి అర్జున్ రాం ఏకీభవించారు. ఏపీ ఫిర్యాదులపై విస్మయం వ్యక్తం చేసిన కేంద్రమంత్రి.. నీటి వసతి పెరిగితే అది దేశానికే మంచిదని, పాకిస్తాన్‌కు కాదంటూ ఏపీని ఉద్దేశించి అన్నారు. ఇక తెలంగాణలో కొత్త ప్రాజెక్టులేవీ నిర్మించడం లేదని, పాతవి, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులనే పూర్తి చేస్తున్నామని హరీశ్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కాళేశ్వరం పాత ప్రాజెక్టు అని కేంద్ర ప్రభుత్వమే ధ్రువీకరించిన విషయాన్ని గుర్తు చేశారు. పోలవరంతో తెలంగాణలో ముఖ్యమైన కొన్ని ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయని, కేంద్రం జోక్యం చేసుకొని ముంపు నివారణ చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు. అనంతరం కేంద్రమంత్రి మాట్లాడుతూ.. ఈ సదస్సు రొటీన్ సమావేశం కాదని, ఇందులో చేసే తీర్మానాలతో జల వివాదాల పరిష్కారం దిశగా రోడ్ మ్యాప్ సిద్ధమవుతుందని అన్నారు. గోదావరి–కావేరి లింకు వేగవంతం గోదావరి–కావేరి నదుల అనుసంధాన ప్రక్రియను కేంద్రం వేగవంతం చేసింది. సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారు చేసేందుకు వీలుగా నదీ పరివాహక రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మెమోరాండం ఆఫ్ అగ్రిమెంట్ (ఎంఓఏ)చేసుకునేలా కేంద్ర జల వనరుల శాఖ పావులు కదుపుతోంది. ఇందులో భాగం గా ఇటీవలే కేంద్ర జల వనరుల శాఖ కార్యదర్శి యూపీ సింగ్ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషికి లేఖ రాశారు. ‘‘గోదావరిలోని మిగులు, ఇంద్రావతిలో ఛత్తీస్‌గఢ్ వినియోగించుకోగా మిగిలిన నీటిని కలిపి మొత్తంగా 247 టీఎంసీలను కావేరికి మళ్లించేలా ఇప్పటికే సాధ్యాసాధ్యాల నివేదికను అన్ని రాష్ట్రాలకు పంపాం. ఈ పథకం కోసం హైడ్రలాజికల్ సర్వే, డీపీఆర్‌లు పూర్తిస్థాయిలో తయారు చేయాల్సి ఉంది. ఇందుకు ఏపీ, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాల మధ్య ఎంఓఏ జరగాల్సి ఉంది. ఆయా రాష్ట్రాల సీఎంల మధ్య, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా ముఖ్యమంత్రుల సమక్షంలో ఈ ఒప్పందం జరగాలి. ఎంఓఏపై ఏపీ, తమిళనాడు,m ఛత్తీస్‌గఢ్, తెలంగాణ ముఖ్యమంత్రులు సంతకాలు చేయాలి. అది ప్రస్తుత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే జరగాలి’’అని లేఖలో పేర్కొన్నారు. -
నాన్చుడో.. తేల్చుడో..!
-
నాన్చుడో.. తేల్చుడో..!
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదీ జలాలపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య నానుతున్న వివాదాలపై ఏడాదిన్నర తర్వాత కేంద్ర జల వనరుల శాఖ గురువారం ఢిల్లీలో నిర్వహిస్తున్న సంయుక్త సమావేశం కీలకంగా మారింది. రాష్ట్ర విభజన అనంతరం నీటి వాటాలు, వినియోగం, ప్రాజెక్టుల పరిధి, కొత్త ప్రాజెక్టులు, గోదావరి నుంచి కృష్ణాకు తరలించే నీటితో ఎగువ రాష్ట్రాలకు దక్కే వాటాల అంశాలన్నీ అపరిష్కృతంగా ఉన్న నేపథ్యంలో ఈ భేటీలో అయినా కేంద్రం స్పష్టతనిస్తుందా అన్నది ఆసక్తిగా మారింది. వ్యూహంపై మంత్రి హరీశ్ దిశానిర్దేశం.. కేంద్ర జల వనరుల శాఖ కార్యదర్శి ఉపేంద్రప్రసాద్ సింగ్ అధ్యక్షతన ఢిల్లీలోని శ్రమశక్తి భవన్లో గురువారం ఉదయం 11 గంటలకు ఈ భేటీ జరగనుంది. తెలంగాణ తరఫున సీఎస్ ఎస్కే జోషి, ఈఎన్సీ మురళీధర్, అంతర్రాష్ట్ర జల వనరుల విభాగం అధికారులతో పాటు ఏపీ అధికారులు హాజరవుతున్నారు. కృష్ణా, గోదావరిలో తెలంగాణకు న్యాయంగా దక్కవలసిన వాటాపై గట్టిగా పోరాడాలని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఢిల్లీ భేటీలో అనుసరించాల్సిన వ్యూహంపై బుధవారం జలసౌథలో ఇరిగేషన్ అధికారులతో మంత్రి హరీశ్ సుదీర్ఘంగా చర్చించారు. తెలంగాణ రైతుల ప్రయోజనాలకు నష్టం కలిగే విధంగా ఆంధ్రప్రదేశ్ చేసే ప్రతిపాదనలను ఎలా తిప్పికొట్టాలన్న అంశంపై సమీక్షించారు. పోలవరం బ్యాక్ వాటర్ వల్ల ప్రభావితమయ్యే ప్రాంతాలు, తలెత్తే సమస్యలపై అధ్యయనం చేయాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీని ఆదేశించాల్సిందిగా కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఉన్నతాధికారులకు మంత్రి సూచించారు. పట్టిసీమ, పోలవరం నిర్మాణంతో తెలంగాణకు దక్కే 90 టీఎంసీలకై గట్టిగా వాదించాలని, రెండు రాష్ట్రాలకు కృష్ణాలో కేటాయించిన 811 టీఎంసీల్లో తెలంగాణకు 575 టీఎంసీలు కేటాయించి రాష్ట్రానికి న్యాయం చేయాలని కేంద్రాన్ని కోరాలని ఆదేశించారు. ఆర్డీఎస్ వాటాలు, టెలీమెట్రీ స్టేషన్ల సత్వర ఏర్పాటుపై ఒత్తిడి తేవాలని సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రెటరీ వికాస్ రాజ్, ఈఎన్సీలు మురళీధర్‌రావు, నాగేందర్రావు, సీఈ సునీల్ పాల్గొన్నారు. ఏఐబీపీ ప్రాజెక్టులపైనా సమీక్ష.. ఇక గురువారం ఢిల్లీలో కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీ అధ్యక్షతన జరగనున్న ఏఐబీపీ ప్రాజెక్టుల సదస్సులో మంత్రి హరీశ్‌రావు పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఏఐబీపీ ప్రాజెక్టులు, కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై మంత్రి హరీశ్ సమీక్షించారు. ప్రధానమంత్రి కృషి సించాయి యోజన(పీఎంకేఎస్‌వై) కింద దేశవ్యాప్తంగా ప్రాధాన్యంగా పూర్తిచేయాల్సిన ప్రాజెక్టుల జాబితాలో తెలంగాణాలోని 11 ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ ప్రాజెక్టులకు కేంద్రం నుంచి రూ.659 కోట్లు రావాల్సి ఉంది. ఇందులో దేవాదుల ప్రాజెక్టు కిందే రూ.460 కోట్ల పెండింగ్ నిధులు రావాల్సి ఉంది. ఈ నిధుల విడుదలపై కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఇక ఈ ప్రాజెక్టులకు క్యాడ్ వామ్ కింద రూ.వెయ్యి కోట్లు రాష్ట్రానికి రావాల్సి ఉంది. వీటిపై మంత్రి సమీక్షించారు. -
అడుగంటిన ఆశలు
- కృష్ణా, గోదావరి బేసిన్ ప్రాజెక్టులన్నీ ఖాళీ - మొత్తం నిల్వ సామర్థ్యం 709.47 టీఎంసీలు.. ఇప్పుడున్నది 188.08టీఎంసీలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి ప్రధాన నీటి వనరులుగా ఉన్న కృష్ణా, గోదావరి నదుల పరీవాహక పరిధిలోని ప్రాజెక్టులన్నీ వట్టిపోతున్నాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా నీటి మట్టాలన్నీ గణనీయంగా పడిపోతున్నాయి. ఆగస్టు రెండో వారం ముగిసినా ఆశించిన స్థాయి వ ర్షాలు లేకపోవడం, ఎగువన ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక ప్రాజెక్టుల్లోనూ భారీగా నీటి లోటు ఉండటం ఆందోళన కలుగజేస్తోంది. రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టుల మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 710 టీఎంసీలు కాగా.. మునుపెన్నడూ లేని రీతిలో ఇప్పుడు కేవలం 188 టీఎంసీల నీరే ఉండడం... అందులోనూ వినియోగార్హమైన నీరు కేవలం 50 టీఎంసీలే ఉండటం తీవ్రంగా కలవరపెడుతోంది. ఈ పరిస్థితుల్లో ఉన్న ఈ కాస్త నీటినీ తాగు అవసరాలకే వినియోగించాలని... సాగు అవసరాలను పూర్తిగా పక్కనపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతేడాదితో పోలిస్తే మూడో వంతుకు.. రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు పూర్తిగా పడిపోయాయి. నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్, నిజాంసాగర్, జూరాల, శ్రీశైలం, సింగూరు, మానేరు, కడెం ప్రాజెక్టులన్నీ కలిపి నిల్వ సామర్థ్యం 709.47 టీఎంసీలు కాగా... ఇప్పుడు 188.06 టీఎంసీలే ఉన్నాయి. మొత్తంగా 521.41 టీఎంసీల లోటు ఉంది. గత ఏడాది ఇదే సమయానికి ఈ ప్రాజెక్టులన్నింటిలో కలిపి 425.50 టీఎంసీల నీరు లభ్యతగా ఉంది. అంటే గత ఏడాదితో పోల్చినా ఈసారి సుమారు 237 టీఎంసీల నీరు తక్కువగా ఉంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటిలోనూ కృష్ణా బేసిన్‌లోని శ్రీశైలం, సాగర్‌లో కలిపి 20 నుంచి 30 టీఎంసీలు, గోదావరిలో మరో 20 టీఎంసీలు మాత్రమే వాడుకునే అవకాశం ఉంటుందని నీటి పారుదల శాఖ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఈ ప్రాజెక్టుల్లో నీటి లోటుతో 15 లక్షల ఎకరాల ఆయకట్టుపై ప్రభావం పడుతోంది. సాగర్ ఎడమ కాల్వ కింద 6 లక్షల ఎకరాలు, జూరాల కింద లక్ష ఎకరాలు, శ్రీరాంసాగర్, నిజాంసాగర్ కింద ఉన్న మరో లక్ష ఎకరాలకు సాగునీరు అందే పరిస్థితి లేదు. దీనికి తోడు పాక్షికంగా పూర్తయిన భీమా, నెట్టెంపాడు, ఇచ్చంపల్లి, కల్వకుర్తి, దేవాదుల ప్రాజెక్టుల కింద ఈ ఏడాది ఖరీఫ్‌లో కొత్తగా 6.2 లక్షల ఎకరాలకు నీరివ్వాలన్న ప్రభుత్వ సంకల్పం కూడా వ్యర్థమవుతోంది. ఆ నిర్ణయం వెనక్కి.. జూరాల ప్రాజెక్టులో గరిష్ట నిల్వ సామర్థ్యం 11.94 టీఎంసీలకుగానూ జూలైలో 6.09 టీఎంసీల నీటి లభ్యత ఉంది. అదే సమయంలో కర్ణాటకలో వర్షాలతో ఆల్మట్టి, నారాయణపూర్‌లకు నీటి చేరిక పెరగడంతో ఆగస్టు రెండో వారం నుంచి జూరాల కింది ఆయకట్టుకు నీరివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఇప్పు డు ప్రాజెక్టులో 5 టీఎంసీల మేర మాత్రమే నీరుండటం, ఎగువన ప్రవాహాలు లేకపోవడంతో... సాగుకు నీరివ్వాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు నీటి పారుదల శాఖ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం అన్ని ప్రాజెక్టుల్లో అందుబాటులో ఉన్న నీటిని భవిష్యత్ తాగునీటి అవసరాలకే వినియోగించుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ సాగుకు ఇవ్వరాదని ప్రభుత్వం నిర్ణయించినట్లు పేర్కొన్నాయి. ఎగువ రాష్ట్రాల్లోనూ అంతే.. సరైన వర్షాలు లేనికారణంగా ఎగువన ఉన్న కర్ణాటకలోని ప్రాజెక్టుల్లోనూ నీటి నిల్వలు పూర్తిగా అడుగంటాయి. రాష్ట్రంలోని ప్రాజెక్టులకు పరీవాహకం తక్కువగా ఉండటంతో ఎగువ ప్రాజెక్టులపైనే ఎక్కువగా ఆధారపడాల్సి వస్తోంది. అవి నిండి దిగువకు నీరొస్తేనే మన ప్రాజెక్టులు నిండుతాయి. ప్రస్తుతం ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర ప్రాజెక్టుల్లో మొత్తంగా 91 టీఎంసీల నీరు కొరతగా ఉంది. ప్రస్తుతం తుంగభద్రకు 17 వేల క్యూసెక్కులు, ఆల్మట్టి, నారాయణపూర్‌లకు 10 వేల క్యూసెక్కుల మేర ఇన్‌ఫ్లోలు కొనసాగుతున్నాయి. ఇవి ఇలాగే కొనసాగితే సెప్టెంబర్ తొలివారానికి ప్రాజెక్టులు నిండి.. దిగువకు నీరు వచ్చే అవకాశముంది. లేదంటే దిగువ ప్రాజెక్టులకు గడ్డు పరిస్థితి తప్పదు. -
కేజీ బేసిన్లో ఓఎన్జీసీ భారీ పెట్టుబడులు
న్యూఢిల్లీ: కేజీ బేసిన్లో చమురు, సహజ వాయువు నిక్షేపాల ఉత్పత్తి నిమిత్తం ఓఎన్జీసీ భారీగా పెట్టుబడులు పెట్టనున్నది. 2017-18 కల్లా 900 కోట్ల డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టనున్నామని ఓఎన్జీసీ డెరైక్టర్ (ఎక్స్‌ప్లోరేషన్) ఎన్.కె. వర్మ తెలిపారు. రిలయన్స్ కేజీ-డి6 బ్లాక్‌కు పక్కనున్న కేజీ-డీడబ్ల్యూఎన్-98/2లో 11 చమురు, గ్యాస్ నిక్షేపాలను కనుగొన్నామని, నార్తర్న్ డిస్కవరీ ఏరియా(ఎన్డీఏ) బ్లాక్ నుంచి ఏడాదికి 2.5-3 మిలియన్ టన్నులు చమురును, రోజుకు 9-10 మిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల గ్యాస్‌ను ఉత్పత్తి చేయాలనుకుంటున్నామని వివరించారు. ఎన్డీఏలో 92.30 మిలియన్ టన్నుల చమురు, 97.568 బిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయని అంచనా వేస్తున్నామని పేర్కొన్నారు. -
9 వేల కోట్లతో కొత్తబావుల్లో ఉత్పత్తి
ఉప్పలగుప్తం, న్యూస్‌లైన్ : కృష్ణా గోదావరి బేసిన్ పరిధిలో ఉప్పలగుప్తం మండలం సూరసేన యానాంలో గల ‘రవ్వ’ చమురు క్షేత్రంలో రూ.9 వేల కోట్లతో కొత్తబావుల్లో ఉత్పత్తి ప్రారంభించనున్నట్టు క్షేత్రం యాజమాన్య సంస్థల్లో ఒకటైన కెయిర్న్ ఒక ప్రకటనలో తెలిపింది. అంతర్జాతీయంగా 20 అతిపెద్ద స్వతంత్ర చమురు అన్వేషణ, ఉత్పత్తి సంస్థల్లో ఒకటైన తమ సంస్థ చమురు, సహజవాయు నిక్షేపాలు వెలికితీతతో పాటుగా స్థానికాభివృద్ధికి పెద్దపీట వేస్తోందని పేర్కొంది. భారతదేశంలో గత రెండు దశాబ్దాలుగా హైడ్రోకార్బన్ల అన్వేషణ, ఉత్పత్తిలో ఎన్నో రికార్డులు సాధించిందని, కనుగొన్న బావుల్లో త్వరితగతిన ఉత్పత్తి మొదలుపెట్టి దేశంలో 25% ముడిచమురు అందిస్తున్న ఘనతను సొంతం చేసుకుందని తెలిపిం ది. రవ్వ యాజమాన్య సంస్థలైనఓఎన్జీసీ, వీడియోకాన్, రవ్వ ఆయిల్ భాగస్వామ్యంతో ఉత్పత్తి ప్రారంభించిన తొలినాళ్లలో రోజుకు 3500 బారెల్స్ చమురు ఉత్పత్తి చేశామని, ఇప్పటి వరకు 245 మిలియన్ బారెల్స్ ముడిచమురు, 330 బిలియన్ క్యూబిక్ ఫీట్ గ్యాస్‌ను ఉత్పత్తి చేసినట్లు వెల్లడించింది. 2013-14 ఆఖరి క్వార్టర్లో అంచనాను మించి 29,151 బారల్స్ ఆయిల్, గ్యాస్ ఉత్పత్తి జరిగినట్టు వివరించింది. సామాజిక సేవలతో అవార్డులు దాదాపు 1400 హెక్టార్లలో విస్తరించి ఉన్న రవ్వ ప్లాంట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కార్యక్రమాల్లో భాగంగా గ్రామంలోని ఆరువేల మంది జనాభాకు వివిధ సేవలు అందిస్తున్నట్లు కెయిర్న్ తెలిపింది. గ్రామంలో 560 వ్యక్తిగత మరుగుదొడ్లు, పేదలకు 200 పక్కాగృహాలు నిర్మించి, తాగునీటికి అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు పేర్కొంది.