సాక్షి, హైదరాబాద్ : కృష్ణా జలాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న నికర జలాల కేటాయింపుల్లో తెలంగాణ వాటాను పెంచాలని, గోదావరిలో నీటి లభ్యత ఎంతో స్పష్టంగా తేల్చాలని రాష్ట్ర ప్రభుత్వం మరోమారు కేంద్రానికి స్పష్టం చేసింది. గోదావరిలో నీటి లభ్యతపై సమగ్ర అధ్యయనం చేసిన తర్వాత, తెలంగాణకు 1,500 టీఎంసీల నీటి అవసరాలు తీరాకే నదుల అనుసంధానంపై నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. హిమాలయాల నుంచి నదీ ప్రవాహాలను గోదావరికి మళ్లించడమొక్కటే భవిష్యత్తు తరాల నీటి కొరతను తీర్చగలదని తెలిపింది.
దీని ద్వారా 938 టీఎంసీల నీటిని గోదావరికి లింకు చేయడం వల్ల దక్షిణాది వాటర్ గ్రిడ్‌ను బలోపేతం చేయొచ్చని సూచించింది. కృష్ణా బేసిన్‌లో పట్టిసీమ, పోలవరం ద్వారా తరలిస్తున్న నీటిలో తెలంగాణకు దక్కే న్యాయమైన వాటాలను తేల్చి 575 టీఎంసీల వినియోగానికి అవకాశం ఇవ్వాలని కోరింది. కృష్ణాలో భవిష్యత్‌లో నీటి కొరతకు శాశ్వత పరిష్కారం లభించేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. మంగళవారమిక్కడ జరిగిన దక్షిణాది రాష్ట్రాల జలవనరుల సదస్సులో నదుల అనుసంధానంపై మంత్రి హరీశ్ మాట్లాడారు.
‘నదుల అనుసంధానంపై మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అయితే మా రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించుకోవడం మా బాధ్యత. తెలంగాణకు 954 టీఎంసీల కేటాయింపులు ఉన్నాయి. అయితే కృష్ణాలో ఇప్పటికే నీటి కొరత ఏర్పడింది. కర్ణాటకలో ఆల్మట్టి ఎత్తు పెంపునకు బ్రిజేశ్ ట్రిబ్యునల్ అనుమతించినందున భవిష్యత్‌లో కృష్ణా నదిలో దిగువ రాష్ట్రాలకు మరింత నీటి కొరత ఏర్పడే అవకాశం ఉంది. ఈ దృష్ట్యా కృష్ణా ప్రాజెక్టుల్లో నీటి కొరతను అధిగమించడానికి మేం గోదావరిపైననే ఆధారపడాల్సి ఉంది. అందుకే నదుల అనుసంధానానికి ముందు రాష్ట్రాల అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలి’’అని అన్నారు.
ఏపీ ఆరోపణలకు కౌంటర్
కృష్ణాలో వాడుతున్న 299 టీఎంసీలకు అదనంగా మరో 260 టీఎంసీల వినియోగానికి తెలంగాణ యత్నిస్తోందని ఈ భేటీలో ఏపీ ఆరోపించింది. కృష్ణా బేసిన్‌లో ఎలాంటి అనుమతి లేకుండా భారీ ప్రాజెక్టులను నిర్మిస్తున్నట్టు కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. ఈ ఆరోపణలను సీఎస్ ఎస్‌కే జోషి తిప్పిగొట్టారు. ఏపీ ఆరోపణలు నిరాధారమన్నారు. ఆర్డీఎస్ ఆనకట్టల పునరుద్ధరణకు ఏపీ సహకరించడం లేదని, పనులు మొదలు పెట్టిన ప్రతిసారీ శాంతి భద్రతల సమస్యను సృష్టించి పనులను ఆపుతోందని అన్నారు.
తుమ్మిళ్ల ఎత్తిపోతలతో రాయలసీమకు నష్టం జరుగుతుందని చేసిన ఫిర్యాదును మంత్రి హరీశ్ ఖండించారు. ఆర్డీఎస్ ద్వారా నీరందని ఆయకట్టుకు మాత్రమే తుమ్మిళ్ల ద్వారా నీరిచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. నదీజలాల పంపిణీ విషయంలోనూ ‘రూల్ ఆఫ్ లా’అమలు చేయాలని జోషి వ్యాఖ్యానించగా.. కేంద్రమంత్రి అర్జున్ రాం ఏకీభవించారు. ఏపీ ఫిర్యాదులపై విస్మయం వ్యక్తం చేసిన కేంద్రమంత్రి.. నీటి వసతి పెరిగితే అది దేశానికే మంచిదని, పాకిస్తాన్‌కు కాదంటూ ఏపీని ఉద్దేశించి అన్నారు.
ఇక తెలంగాణలో కొత్త ప్రాజెక్టులేవీ నిర్మించడం లేదని, పాతవి, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులనే పూర్తి చేస్తున్నామని హరీశ్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కాళేశ్వరం పాత ప్రాజెక్టు అని కేంద్ర ప్రభుత్వమే ధ్రువీకరించిన విషయాన్ని గుర్తు చేశారు. పోలవరంతో తెలంగాణలో ముఖ్యమైన కొన్ని ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయని, కేంద్రం జోక్యం చేసుకొని ముంపు నివారణ చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు. అనంతరం కేంద్రమంత్రి మాట్లాడుతూ.. ఈ సదస్సు రొటీన్ సమావేశం కాదని, ఇందులో చేసే తీర్మానాలతో జల వివాదాల పరిష్కారం దిశగా రోడ్ మ్యాప్ సిద్ధమవుతుందని అన్నారు.
గోదావరి–కావేరి లింకు వేగవంతం
గోదావరి–కావేరి నదుల అనుసంధాన ప్రక్రియను కేంద్రం వేగవంతం చేసింది. సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారు చేసేందుకు వీలుగా నదీ పరివాహక రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మెమోరాండం ఆఫ్ అగ్రిమెంట్ (ఎంఓఏ)చేసుకునేలా కేంద్ర జల వనరుల శాఖ పావులు కదుపుతోంది. ఇందులో భాగం గా ఇటీవలే కేంద్ర జల వనరుల శాఖ కార్యదర్శి యూపీ సింగ్ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎస్‌కే జోషికి లేఖ రాశారు.
‘‘గోదావరిలోని మిగులు, ఇంద్రావతిలో ఛత్తీస్‌గఢ్ వినియోగించుకోగా మిగిలిన నీటిని కలిపి మొత్తంగా 247 టీఎంసీలను కావేరికి మళ్లించేలా ఇప్పటికే సాధ్యాసాధ్యాల నివేదికను అన్ని రాష్ట్రాలకు పంపాం. ఈ పథకం కోసం హైడ్రలాజికల్ సర్వే, డీపీఆర్‌లు పూర్తిస్థాయిలో తయారు చేయాల్సి ఉంది. ఇందుకు ఏపీ, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాల మధ్య ఎంఓఏ జరగాల్సి ఉంది. ఆయా రాష్ట్రాల సీఎంల మధ్య, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా ముఖ్యమంత్రుల సమక్షంలో ఈ ఒప్పందం జరగాలి. ఎంఓఏపై ఏపీ, తమిళనాడు,m ఛత్తీస్‌గఢ్, తెలంగాణ ముఖ్యమంత్రులు సంతకాలు చేయాలి. అది ప్రస్తుత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే జరగాలి’’అని లేఖలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment