సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు దక్కాల్సిన న్యాయమైన వాటాను సాధించుకుంటామని మంత్రి హరీశ్‌రావు విశ్వాసం వ్యక్తం చేశారు. కృష్ణా పరీవాహక ప్రాంతం తెలంగాణలోనే ఎక్కువగా ఉందని, ఆ లెక్కన రాష్ట్రానికి అధిక నీటి వాటా దక్కాల్సి ఉందని చెప్పారు. శుక్రవారం ఢిల్లీలో నదీ జలాల పంపకాలపై బ్రిజేశ్ ట్రిబ్యునల్‌లో జరుగుతున్న విచారణకు మంత్రి హరీశ్‌రావు హాజరయ్యారు.
అనంతరం మీడియాతో మాట్లాడారు. తెలంగాణకు న్యాయబద్ధంగా దక్కాల్సిన నీటి వాటాను సాధించుకుంటామని హరీశ్‌రావు చెప్పారు. నది పరీవాహక ప్రాంతం ఆధారంగా తెలంగాణకు నీటి కేటాయింపులు పెంచాలని సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించామని, కోర్టు కేంద్రం నుంచి స్పందన కోరిందని తెలిపారు. కానీ కేంద్రం ఇంతవరకు స్పందించలేదని.. ఇప్పటికైనా స్పందించి సుప్రీంకోర్టుకుగానీ, ట్రిబ్యునల్‌కుగానీ అభిప్రాయం తెలపాలని విజ్ఞప్తి చేశారు.
విచారణ వేగంగా జరగాలి..
తెలంగాణకు దక్కాల్సిన న్యాయమైన వాటా కోసం సీనియర్ న్యాయవాదులు వైద్యనాథన్, రవీందర్‌రావు, అధికారులు చేస్తున్న కృషి అభినందనీయమని హరీశ్‌రావు పేర్కొన్నారు. అయితే రెండు తెలుగు రాష్ట్రాలకు నీటి కేటాయింపులపై బ్రిజేశ్ ట్రిబ్యునల్ విచారణ వేగవంతంగా జరగాల్సి ఉందని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వానికి కూడా ఈ విషయాన్ని తెలియజేశామన్నారు. నీటి తుది కేటాయింపులు జరిగితే.. తెలంగాణకు తాత్కాలిక సర్దుబాటు కింద ఉన్న 299 టీఎంసీల వాటా కంటే అధికంగా జలాలు వస్తాయని తెలిపారు. అందువల్ల విచారణను వేగిరం చేసేలా ట్రిబ్యునల్‌కు విజ్ఞప్తి చేయాలని న్యాయవాదులకు సూచించామన్నారు.
విచారణ మార్చి 26కు వాయిదా..
నీటి పంపకాలకు సంబంధించి విచారణను బ్రిజేశ్ ట్రిబ్యునల్ వచ్చే నెల 26, 27, 28 తేదీలకు వాయిదా వేసింది. శుక్రవారం విచారణ సందర్భంగా వ్యవసాయ రంగంపై ఏపీ తరఫున సాక్షి అయిన వ్యవసాయ రంగ నిపుణుడు పీవీ సత్యనారాయణను తెలంగాణ న్యాయవాది వైద్యనాథన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. తెలంగాణ కోరుతున్న అదనపు నీటి కేటాయింపుల్లో కొత్తగా వరిసాగుపై ఎలాంటి ప్రతిపాదన చేయలేదన్నది తెలుసని, ఏపీలోని కృష్ణా బేసిన్‌లో వరి అధికంగా సాగవుతోందని, తెలంగాణలో మెట్ట పంటలు సాగవుతున్నాయన్న విషయాలను సత్యనారాయణ అంగీకరించారు.
నీరు ఇంకిపోవడమన్నది నేల స్వభావాన్ని బట్టి ఉంటుందని.. ఏపీలోని పరీవాహక ప్రాంతంలో నీరు ఇంకడం 2 ఎంఎంగా, తెలంగాణలో భిన్నరకాల నేలల వల్ల 5 ఎంఎంగా ఉందని పేర్కొన్నారు. అయితే దీనికి సంబంధించి తాను ఎలాంటి అధ్యయనం చేయలేదని, సాగు అవసరాలకు సంబంధించి నీరు ఇంకిపోయే నష్టాలను ఐక్యరాజ్యసమితి ఎఫ్‌ఏవో మ్యాన్యువల్ నుంచి తీసుకున్నానని ఆయన వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment