సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదీ బేసిన్ల పరిధిలో తెలంగాణ, ఏపీ మధ్య వివాదాలపై కేంద్ర జల వనరుల శాఖ ఆధ్వర్యంలో గురువారం జరిగిన సమావేశం అసంపూర్ణంగా ముగిసింది. ఇరు రాష్ట్రాల పరిధిలోని వివాదాస్పద అంశాలపై అవగాహన తెచ్చుకునేందుకే కేంద్రం పరిమితమైంది. కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తెస్తామంటూ కేంద్రం సూచన చేసినా దానిపై సఖ్యత కుదరకపోవడంతో నిర్ణయమేదీ తీసుకోలేదు. వీటిపై ఈ నెల 20న దక్షిణాది రాష్ట్రాల సాగునీటి మంత్రుల భేటీలో చర్చించాక నిర్ణయాలు తీసుకుంటామని పేర్కొంది.
వాటా తేల్చాకే బోర్డుల పరిధి
కేంద్ర జల వనరుల శాఖ కార్యదర్శి ఉపేంద్ర ప్రసాద్ సింగ్ అధ్యక్షతన ఢిల్లీలోని శ్రమశక్తి భవన్‌లో జరిగిన ఈ కీలక భేటీలో రాష్ట్రం తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, ఈఎన్‌సీ మురళీధర్, అంతర్రాష్ట్ర జల వనరుల విభాగం సీఈ నరసింహారావు, ఎస్‌ఈ కోటేశ్వరరావు, ఏపీ నుంచి జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఈఎన్‌సీ వెంకటేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా ప్రాజెక్టులను బోర్డు పరిధిలో తేవాలని కేంద్రం, బోర్డు, ఏపీ ప్రతిపాదించాయి. దీనిపై సీఎస్ జోషి తీవ్రంగా మండిపడ్డారు.
‘‘నీటి విషయంలో తెలంగాణ 70 ఏళ్లుగా అన్యాయానికి గురవుతోంది. రాష్ట్రంగా అవతరించాక నాలుగేళ్లుగా కూడా అదే అన్యాయం కొనసాగుతోంది. కృష్ణా బేసిన్‌లో 37.19 లక్షల హెక్టార్ల సాగుయోగ్యమైన భూమి ఉన్నా 6.39 లక్షల హెక్టార్లకు మించి సాగు చేసుకోలేకపోతున్నాం’’అని పేర్కొన్నారు. ‘‘పరీవాహకం, ఆయకట్టు, అవసరాల ప్రకారం చూస్తే 811 టీఎంసీల నికర జలాల్లో తెలంగాణకు 575 టీఎంసీలు దక్కాలి. ఏపీకి 140 టీఎంసీలకు మించి కేటాయింపు అవసరం లేదు.
ఈ దృష్ట్యా ట్రిబ్యునల్ తుది తీర్పు వచ్చేదాకా తాత్కాలికంగా తెలంగాణకు 575 టీఎంసీలివ్వండి’’అని కోరారు. బచావత్ అవార్డు ప్రకారం సైతం పోలవరం, పట్టిసీమల ప్రాజెక్టుల కింద తెలంగాణకు 90 టీఎంసీలు కేటాయించాలన్నారు. దీనిపై నిపుణుల కమిటీ కూడా ఏమీ తేల్చలేదన్నారు. తెలంగాణకు న్యాయమైన వాటా ఇవ్వకుండా, పోలవరం వాటాలపై తేల్చకుండా, ప్రాజెక్టులవారీ కేటాయింపులు లేకుండా ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తెచ్చేందుకు ఒప్పుకోబోమని స్పష్టం చేశారు.
కొత్త ప్రాజెక్టులు తలపెట్టింది ఏపీనే
భేటీలో ఏపీ మళ్లీ కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని ప్రస్తావించింది. అది కొత్త ప్రాజెక్టేనని, దానికి బోర్డు, అపెక్స్ కౌన్సిల్ అనుమతి తప్పనిసరని వాదించగా తెలంగాణ తిప్పికొట్టింది. కాళేశ్వరం ఎత్తిపోతల, తమ్మిడిహెట్టి రెండూ ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టులో భాగమేనని, వీటిపై 2008లో ఉమ్మడి ఏపీలో ఇచ్చిన జీవో 238 ప్రకారమే నడుచుకుంటున్నామంది. కాళేశ్వరం పాతదేనని కేంద్ర జల సంఘమూ తేల్చిందని గుర్తు చేసింది. నిజానికి ఏపీయే కొత్తగా వెలిగొండ, ముచ్చుమర్రి, గురు రాఘవేంద్ర ప్రాజెక్టులు చేపట్టిందని పేర్కొంది.
పోలవరం ముంపు, ఆర్డీఎస్ వాటాపై గరంగరం
పోలవరం బ్యాక్ వాటర్‌తో భద్రాచల సీతారామాలయంసహా పలు గ్రామాలు, గనులు, మణుగూరు హెవీ వాటర్ ప్లాంట్ ముంపునకు గురయ్యే ప్రమాదముందని కేంద్రం దృష్టికి జోషి తీసుకెళ్లారు. ముంపు సమస్యలపై అధ్యయనం చేయాల్సిందిగా పోలవరం అథారిటీని ఆదేశించాలన్నారు. తుంగభద్ర జలాల అంశాన్ని కృష్ణా బోర్డు పరిధిలోకి తేవాలని కోరారు. కృష్ణా పరిధిలో టెలిమెట్రీ విధానం తెచ్చినా ఇంకా అమల్లోకి రాలేదన్నారు. దీంతో పోతిరెడ్డిపాడు కింద ఏపీ ఇష్టానికి వాడుకుంటోందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment