yanam
ఉప్పలగుప్తం, న్యూస్‌లైన్ : కృష్ణా గోదావరి బేసిన్ పరిధిలో ఉప్పలగుప్తం మండలం సూరసేన యానాంలో గల ‘రవ్వ’ చమురు క్షేత్రంలో రూ.9 వేల కోట్లతో కొత్తబావుల్లో ఉత్పత్తి ప్రారంభించనున్నట్టు క్షేత్రం యాజమాన్య సంస్థల్లో ఒకటైన కెయిర్న్ ఒక ప్రకటనలో తెలిపింది.
అంతర్జాతీయంగా 20 అతిపెద్ద స్వతంత్ర చమురు అన్వేషణ, ఉత్పత్తి సంస్థల్లో ఒకటైన తమ సంస్థ చమురు, సహజవాయు నిక్షేపాలు వెలికితీతతో పాటుగా స్థానికాభివృద్ధికి పెద్దపీట వేస్తోందని పేర్కొంది. భారతదేశంలో గత రెండు దశాబ్దాలుగా హైడ్రోకార్బన్‌ల అన్వేషణ, ఉత్పత్తిలో ఎన్నో రికార్డులు సాధించిందని, కనుగొన్న బావుల్లో త్వరితగతిన ఉత్పత్తి మొదలుపెట్టి దేశంలో 25% ముడిచమురు అందిస్తున్న ఘనతను సొంతం చేసుకుందని తెలిపిం ది. రవ్వ యాజమాన్య సంస్థలైనఓఎన్‌జీసీ, వీడియోకాన్, రవ్వ ఆయిల్ భాగస్వామ్యంతో ఉత్పత్తి ప్రారంభించిన తొలినాళ్లలో రోజుకు 3500 బారెల్స్ చమురు ఉత్పత్తి చేశామని, ఇప్పటి వరకు 245 మిలియన్ బారెల్స్ ముడిచమురు, 330 బిలియన్ క్యూబిక్ ఫీట్ గ్యాస్‌ను ఉత్పత్తి చేసినట్లు వెల్లడించింది. 2013-14 ఆఖరి క్వార్టర్‌లో అంచనాను మించి 29,151 బారల్స్ ఆయిల్, గ్యాస్ ఉత్పత్తి జరిగినట్టు వివరించింది.
సామాజిక సేవలతో అవార్డులు
దాదాపు 1400 హెక్టార్లలో విస్తరించి ఉన్న రవ్వ ప్లాంట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) కార్యక్రమాల్లో భాగంగా గ్రామంలోని ఆరువేల మంది జనాభాకు వివిధ సేవలు అందిస్తున్నట్లు కెయిర్న్ తెలిపింది. గ్రామంలో 560 వ్యక్తిగత మరుగుదొడ్లు, పేదలకు 200 పక్కాగృహాలు నిర్మించి, తాగునీటికి అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు పేర్కొంది.