గోదారి తీరంలో చిట్టిచేపల సందడి.. శీతాకాలంలో గోదారోళ్లకు జోష్
రుచిలో రారాజు.. ఆరోగ్యానికి మహారాజు.. విక్రయాల్లో పూర్వ కొలతలే ప్రామాణికం
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఏడాదిలో ఒక్కసారి మాత్రమే లభించే చీరమీనుల్ని చూస్తే గోదావరి వాసులు లొట్టలేస్తారు. శీతల గాలి తిరిగిందంటే.. గోదావరి తీరంలో చీరమీను కోసం మాంసాహార ప్రియులు ఎగబడుతుంటారు.
గోదావరికి వరదలు వస్తే పులస చేపల కోసం క్యూకట్టే తరహాలోనే అక్టోబరు నెలాఖరు మొదలు నవంబరు నెలాఖరు వరకూ చీరమీను కోసం గోదావరి తీరంలో తెల్లవారకుండానే జనం తండోపతండాలుగానే కనిపిస్తుంటారు. పోషకాలు దండిగా ఉండి సంపూర్ణ ఆరోగ్యాన్నిచ్చే అరుదైన ఈ చిట్టి చేపలను కొనాల్సిందేనంటారు. కార్తీకాన్ని ఎంతో నిష్టగా ఆచరించే వారు సైతం అరుదుగా లభించే చీరమీనును మాత్రం వదిలిపెట్టరు.
కొలత ఏదైనా.. ధర ఎంతైనా..
మార్కెట్‌లో అన్నిరకాల వస్తువులను కేజీలు, లీటర్లలో కొలుస్తుంటారు. కానీ.. చీరమీను మాత్రం సంప్రదాయంగా వస్తున్న గిద్ద, సోల, గ్లాసు, తవ్వ , శేరు, కుంచం, బకెట్ కొలమానంతో విక్రయిస్తున్నారు.
చీరమీను రోజువారీ లభ్యతను బట్టి లభ్యతను బట్టి ప్రస్తుతం శేరు (సుమారు కిలో) రూ.2 వేల నుంచి రూ.5 వేల ధర పలుకుతోంది. ఈ చీరమీను ఎక్కువగా యానాం, భైరవపాలెం, ఎదుర్లంక, జి.వేమవరం, గుత్తెనదీవి, జి.మూలపొలం, ఎదుర్లంక, మురమళ్ల, పశువుల్లంక, మొల్లేటిమొగ, పండి, పల్లం, సూరసేన యానాం, అంతర్వేదికర, వేమగిరి గ్రామాల్లో లభిస్తోంది.
సెలీనియం అధికం
సంపూర్ణ ఆరోగ్యానికి చీరమీను ఎంతో దోహదం చేస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఈ చేపల్లో సెలీనియం అధిక మోతాదులో ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేసి, శరీరంలోని హానికరమైన కణాలతో పోరాడటానికి సహాయపడుతుందని పలు అధ్యయనాల్లో తేలిందని మత్స్య శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
మానవునికి రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో సెలీనియం కీలక పాత్ర పోషిస్తుంది. రోగనిరోధక కణాల పనితీరును మెరుగుపర్చి ఆస్తమాను తగ్గించడంలో క్రియాశీలకంగా పనిచేస్తుంది. థైరాయిడ్, గుండె సంబంధ వ్యాధులు, కొలె్రస్టాల్ స్థాయిలను తగ్గించడానికి చీరమీనులో ఉండే సెలీనియం సహాయపడుతుందని చెబుతున్నారు. చీరమీనుతో మసాలా కర్రీ, చింతకాయలతో కలిపి కూర, చీరమీను గారెలు కూడా వేస్తుంటారు.
అంగుళం నుంచి..
ఇండో–పసిఫిక్ సముద్ర ప్రాంతాల్లో అరుదుగా లభించే చీరమీను లిజార్డ్ ఫిష్ జాతికి చెందిన చేపగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సినోడాంటిడే కుటుంబానికి చెందిన చేపలివి. వీటి శాస్త్రీయ నామం సారిడా గ్రాసిలిస్. సారిడా టంబిల, సారిడా అండోస్క్యామిస్ జాతులకు చెందిన చిట్టి చేపలని కూడా పిలుస్తారు.
అంగుళం నుంచి మూడు అంగుళాల పరిమాణంలో ఉండే చీరమీను చీరల సాయంతో పడుతుంటారు. రంగు, రంగు చీరలను చూసి ఈ చిట్టిచేపలు గోదావరి అడుగు నుంచి నీటి ఉపరితలంపైకి వస్తుంటాయి. అలా చీరల్లోకి సమూహాలుగా వచ్చి ఇవి జాలర్లకు పట్టుబడుతుంటాయి.
రేటెంతైనా తినాల్సిందే
చాలా అరుదైన చీరమీను మార్కెట్‌లోకి వచ్చి0దంటే ఎంత ధరకైనా కొనాల్సిందే. మా చిన్నప్పుడు తాతల కాలం నుంచి చీరమీను సీజన్‌లో ఒక్కసారైనా ఈ కూర తినాలని చెప్పేవారు. ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచిగా ఉండటంతో ఏ సీజన్‌లోను విడిచిపెట్టం. ఎంత ధర ఉన్నా కొని తినాల్సిందే. ధర రూ.5 వేలు ఉన్నా కొని కూర వండిస్తాం.
– చిక్కాల నరసింహమూర్తి, యానాం
ఆరోగ్యానికి దోహదం
సీజనల్‌గా దొరికే చీరమీను ఎంత రుచిగా ఉంటుందో.. ఆరోగ్యానికి కూడా అంతే దోహదం చేస్తుంది. కాల్షియం, పొటాషియం, జింక్, అయోడిన్ చీరమీనులో ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఈ చేపల్లో ఉండే ఒమెగా–3 ప్యాటీ యాసిడ్స్‌తో ఎంతో ఉపయోగం. ఆరోగ్యానికి చీరమీను ఎంతో దోహదం చేస్తుంది. అనేక అధ్యయనాల్లో ఈ విషయం తేలింది. అందుకే ఈ ప్రాంతంలో మాంసాహార ప్రియులు సీజన్‌లో దొరికే చీరమీను ఎంత ఖర్చు పెట్టి అయినా కొనుగోలు చేస్తుంటారు.
– కె.కరుణాకర్, మత్స్యశాఖ అధికారి, కాకినాడ
Comments
Please login to add a commentAdd a comment