Godavari coast
-
చీరమీను.. రుచి అదిరేను.. రేటెంతైనా తినాల్సిందే
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఏడాదిలో ఒక్కసారి మాత్రమే లభించే చీరమీనుల్ని చూస్తే గోదావరి వాసులు లొట్టలేస్తారు. శీతల గాలి తిరిగిందంటే.. గోదావరి తీరంలో చీరమీను కోసం మాంసాహార ప్రియులు ఎగబడుతుంటారు. గోదావరికి వరదలు వస్తే పులస చేపల కోసం క్యూకట్టే తరహాలోనే అక్టోబరు నెలాఖరు మొదలు నవంబరు నెలాఖరు వరకూ చీరమీను కోసం గోదావరి తీరంలో తెల్లవారకుండానే జనం తండోపతండాలుగానే కనిపిస్తుంటారు. పోషకాలు దండిగా ఉండి సంపూర్ణ ఆరోగ్యాన్నిచ్చే అరుదైన ఈ చిట్టి చేపలను కొనాల్సిందేనంటారు. కార్తీకాన్ని ఎంతో నిష్టగా ఆచరించే వారు సైతం అరుదుగా లభించే చీరమీనును మాత్రం వదిలిపెట్టరు. కొలత ఏదైనా.. ధర ఎంతైనా.. మార్కెట్లో అన్నిరకాల వస్తువులను కేజీలు, లీటర్లలో కొలుస్తుంటారు. కానీ.. చీరమీను మాత్రం సంప్రదాయంగా వస్తున్న గిద్ద, సోల, గ్లాసు, తవ్వ , శేరు, కుంచం, బకెట్ కొలమానంతో విక్రయిస్తున్నారు. చీరమీను రోజువారీ లభ్యతను బట్టి లభ్యతను బట్టి ప్రస్తుతం శేరు (సుమారు కిలో) రూ.2 వేల నుంచి రూ.5 వేల ధర పలుకుతోంది. ఈ చీరమీను ఎక్కువగా యానాం, భైరవపాలెం, ఎదుర్లంక, జి.వేమవరం, గుత్తెనదీవి, జి.మూలపొలం, ఎదుర్లంక, మురమళ్ల, పశువుల్లంక, మొల్లేటిమొగ, పండి, పల్లం, సూరసేన యానాం, అంతర్వేదికర, వేమగిరి గ్రామాల్లో లభిస్తోంది. సెలీనియం అధికం సంపూర్ణ ఆరోగ్యానికి చీరమీను ఎంతో దోహదం చేస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఈ చేపల్లో సెలీనియం అధిక మోతాదులో ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేసి, శరీరంలోని హానికరమైన కణాలతో పోరాడటానికి సహాయపడుతుందని పలు అధ్యయనాల్లో తేలిందని మత్స్య శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మానవునికి రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో సెలీనియం కీలక పాత్ర పోషిస్తుంది. రోగనిరోధక కణాల పనితీరును మెరుగుపర్చి ఆస్తమాను తగ్గించడంలో క్రియాశీలకంగా పనిచేస్తుంది. థైరాయిడ్, గుండె సంబంధ వ్యాధులు, కొలె్రస్టాల్ స్థాయిలను తగ్గించడానికి చీరమీనులో ఉండే సెలీనియం సహాయపడుతుందని చెబుతున్నారు. చీరమీనుతో మసాలా కర్రీ, చింతకాయలతో కలిపి కూర, చీరమీను గారెలు కూడా వేస్తుంటారు. అంగుళం నుంచి.. ఇండో–పసిఫిక్ సముద్ర ప్రాంతాల్లో అరుదుగా లభించే చీరమీను లిజార్డ్ ఫిష్ జాతికి చెందిన చేపగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సినోడాంటిడే కుటుంబానికి చెందిన చేపలివి. వీటి శాస్త్రీయ నామం సారిడా గ్రాసిలిస్. సారిడా టంబిల, సారిడా అండోస్క్యామిస్ జాతులకు చెందిన చిట్టి చేపలని కూడా పిలుస్తారు. అంగుళం నుంచి మూడు అంగుళాల పరిమాణంలో ఉండే చీరమీను చీరల సాయంతో పడుతుంటారు. రంగు, రంగు చీరలను చూసి ఈ చిట్టిచేపలు గోదావరి అడుగు నుంచి నీటి ఉపరితలంపైకి వస్తుంటాయి. అలా చీరల్లోకి సమూహాలుగా వచ్చి ఇవి జాలర్లకు పట్టుబడుతుంటాయి. రేటెంతైనా తినాల్సిందే చాలా అరుదైన చీరమీను మార్కెట్లోకి వచ్చి0దంటే ఎంత ధరకైనా కొనాల్సిందే. మా చిన్నప్పుడు తాతల కాలం నుంచి చీరమీను సీజన్లో ఒక్కసారైనా ఈ కూర తినాలని చెప్పేవారు. ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచిగా ఉండటంతో ఏ సీజన్లోను విడిచిపెట్టం. ఎంత ధర ఉన్నా కొని తినాల్సిందే. ధర రూ.5 వేలు ఉన్నా కొని కూర వండిస్తాం. – చిక్కాల నరసింహమూర్తి, యానాం ఆరోగ్యానికి దోహదం సీజనల్‌గా దొరికే చీరమీను ఎంత రుచిగా ఉంటుందో.. ఆరోగ్యానికి కూడా అంతే దోహదం చేస్తుంది. కాల్షియం, పొటాషియం, జింక్, అయోడిన్ చీరమీనులో ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఈ చేపల్లో ఉండే ఒమెగా–3 ప్యాటీ యాసిడ్స్‌తో ఎంతో ఉపయోగం. ఆరోగ్యానికి చీరమీను ఎంతో దోహదం చేస్తుంది. అనేక అధ్యయనాల్లో ఈ విషయం తేలింది. అందుకే ఈ ప్రాంతంలో మాంసాహార ప్రియులు సీజన్లో దొరికే చీరమీను ఎంత ఖర్చు పెట్టి అయినా కొనుగోలు చేస్తుంటారు. – కె.కరుణాకర్, మత్స్యశాఖ అధికారి, కాకినాడ -
ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకుండా..ఏం చర్యలు తీసుకున్నారు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వర్షాలు, వరదల కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకుండా ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ‘రాష్ట్రంలో వరద కారణంగా ఇంతవరకు ఎంతమంది చనిపోయారు? డిజాస్టర్ చట్టం ప్రకారం ఎంతమందిని రక్షించారు? గోదావరి తీర ప్రాంత గ్రామాల రక్షణకు ఏం చర్యలు చేపట్టారు? బాధితులకు కనీస సౌకర్యాలు అందిస్తున్నారా? వరదలపై వార్‌రూమ్ ఎందుకు ఏర్పాటు చేయలేదు? ఎన్నికలప్పుడు ఏర్పాటు చేస్తారు కానీ.. వరదలు లాంటి అత్యవసర సమయంలో ఏర్పాటు చేయరా?..’అని ప్రశ్నించింది. పూర్తి వివరాలతో ఓ నివేదికను సోమవారం అందజేయాలని స్పష్టం చేసింది. రాష్ట్రంలో కొద్ది రోజులుగా వర్షాలు, వరదల నేపథ్యంలో ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందో వెల్లడించడం లేదని, రక్షణ చర్యలు తీసుకునేలా రాష్ట్ర సర్కారుకు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ వినోద్‌కుమార్ ధర్మాసనం శుక్రవారం ప్రత్యేకంగా విచారణ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పడం లేదు.. ‘వర్షాలు, వరదలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం హెచ్చరించింది. ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. రాష్ట్రంలో వరదల కారణంగా 19 మంది మృతి చెందారని పత్రికల్లో వస్తున్న వార్తలు తెలియజేస్తున్నాయి. వరదలు ఇంకా కొనసాగే అవకాశం ఉందని కేంద్రం మరోసారి తెలియజేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వరదల నుంచి ప్రజలను రక్షించడానికి ఏం చర్యలు తీసుకున్నారు? ఎంత మంది మరణించారు? లాంటి వివరాలను వెల్లడించడం లేదు. కడెం ప్రాజెక్టు వద్ద తీవ్ర భయానక పరిస్థితి కొనసాగుతోంది. ప్రాజెక్టు తెగితే వందల గ్రామాలు నీట మునగడంతో పాటు లక్షల మంది నిరాశ్రయులుగా మారే అవకాశం ఉంది..’అంటూ న్యాయవాదులు చిక్కుడు ప్రభాకర్, పల్లె ప్రదీప్‌కుమార్ కోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో ‘వరద బాధితులకు తక్షణమే కనీస సౌకర్యాలు అందేలా ఏర్పాట్లు చేయాలి. కడెం ప్రాజెక్టు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారిని భద్రతా చట్ట ప్రకారం చర్యలు చేపట్టి వెంటనే రక్షించాలి. ఎలాంటి ప్రాణ నష్టం సంభవించకుండా చూడాలి..’అని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. తదు పరి విచారణను ఈ నెల 31కి వాయిదా వేసింది. -
రాకాసి పట్టణం
సాక్షి, హైదరాబాద్: అదో పట్టణం.. విచిత్రమైన రాకాసి పట్టణం. అక్కడ మనకులాగే మనుషులు, ఇళ్లుంటాయని అనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే ఆ పట్టణంలో మనుషులు మచ్చుకు కూడా కనిపించరు. ఎటు చూసినా సమాధులే దర్శనమిస్తాయి. అవేవో ఈమధ్య కట్టినవి కావు. వీటి వయసు దాదాపు 3వేల ఏళ్లు. అంటే ఇనుపయుగం నాటివి. గుట్టపైకెక్కి తిరుగుతుంటే ఒక్కో రాయికి ఓ సమాధి కనిపిస్తుంది, అందుకే ఆ ప్రాంతానికి స్థానికులు పెట్టుకున్న పేరు.. ‘రాకాసి పట్టణం’. భద్రాచలం దట్టమైన అడవుల్లో ఈ ప్రాంతం ఉంది. జ్యోండిగో.. దక్షిణ కొరియాలో ప్రముఖ పర్యాటక ప్రాంతం. ఇక్కడి గుట్టల్లో వేల సంఖ్యలో ఆదిమానవుల సమాధులు కనిపిస్తాయి. భారీ బండరాళ్లు చుట్టూ పేర్చి.. వాటిపై దాదాపు 15 అడుగుల మందం ఉండే పెద్ద రాయిని మూతగా పెట్టి దాని కింద ఓ గది కట్టి అందులో మృతదేహాన్ని ఉంచేవారు. ఇది వేల ఏళ్లనాటి సమాధి చేసే విధానం. ఒకే ప్రాంతంలో వేల సంఖ్యలో ఇలాంటి సమాధులు ఉండటం ప్రపంచంలో మరెక్కడా లేవనేది ఇప్పటి వరకు ఉన్న మాట. అందుకే దీన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. ఈ సమాధులను చూసేందుకు నిత్యం కొన్ని వేల మంది పర్యాటకులు, పరిశోధకులు అక్కడికి వస్తుంటారు. గోదావరి తీరంలోని పూర్వపు వరంగల్–ఖమ్మం ప్రాంతం.. మల్లూరు, దామరవాయి, జానంపేట, పాండురంగాపురం.. ఇలాంటి గుట్టలతో నిండిన ప్రాంతాలెన్నో. ఈ గుట్టలపై ఆదిమానవుల కాలంనాటి గూడు సమాధులు వేలల్లో ఉన్నాయి. అలా విస్తరించిన ప్రాంతాల పరిధి ఏకంగా దాదాపు 200 కిలోమీటర్లకు పైబడే! ఆదిమానవుల గూడు సమాధులు (డోలమైన్స్, డోల్మనాయిడ్స్) ఇంత విశాలమైన ప్రాంతంలో విస్తరించి ఉండటం.. ప్రపంచంలో మరెక్కడా లేదన్న అభిప్రాయం ఉంది. కొరియాలో సమాధుల సంఖ్య ఎక్కువగా ఉన్నా, ఆ ప్రాంత విస్తీర్ణం తక్కువ. మనదగ్గర ఆ పరిధి విస్తీర్ణం ఎక్కువ. కానీ వీటికి యునెస్కో కాదు కదా, కనీసం రాష్ట్ర పురావస్తు శాఖ గుర్తింపు కూడా లేదు. ఇప్పుడు ఈ ప్రాంతంలో మరొక కొత్త గుట్ట వెలుగు చూసింది. ఇంతకాలం స్థానిక పశువుల కాపరులు తప్ప బయటి వ్యక్తులు వాటిని చూడలేదు. తాజాగా కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు వాటిని పరిశీలించారు. స్థానికులు రాకాసి పట్టణంగా పేర్కొనే ఈ ప్రాంతం పినపాక మండలంలోని బయ్యారం నుంచి పాండురంగాపురం వెళ్లేదారిలో దట్టమైన అడవిలో ఉంది. పైన కప్పు.. లోపల రాతి తొట్టి! లోహయుగంలో మానవులు చనిపోయిన తర్వాత ప్రత్యేక గౌరవాన్ని పొందేవారు. చనిపోయాక సమాధి చేయటం సాధారణ విషయమే. కానీ, ఆ సమాధిలో సంబంధీకులు ఇష్టపడే ఆహారం, ఆహార్య వస్తువులు ఉంచేవారు. ఆ ఆత్మ తిరిగి వస్తుందన్న నమ్మకంతోనే ఇలా చేసేవారు. పెద్దపెద్ద బండరాళ్లను చెక్కి చుట్టూ కొంతమేర పాతి దాదాపు పదడుగుల గుహను రూపొందించేవారు. దానిపై విశాలమైన పెద్ద బండరాయిని కప్పుగా ఏర్పాటు చేసేవారు. లోనికి వెళ్లేలా చతురస్రాకారంలో మార్గాన్ని ఏర్పాటు చేసేవారు. దాదాపు ఎనిమిదడుగుల రాతి తొట్టిని రూపొందించి మృతదేహాన్ని అందులో ఉంచి ఆ గుహకు పెద్ద రాయితో మూసేసేవారు. పక్కనే వారికి ఇష్టమైన ఆహారం, అలంకరణ వస్తువులను ఆ తొట్టే లో ఉంచేవారు. కొన్ని గుహల్లో రెండు, మూడు తొట్లు కూడా ఉండేవి. పూర్తిగా భూ ఉపరితలంపై ఇలాంటి సమాధులు కొన్ని ప్రాంతాల్లో కనిపించాయి. వాటిని డోలమైన్స్గా చరిత్రకారులు పేర్కొంటారు. కొంతమేర భూమిలోకి పాతినట్టు ఉండేవాటిని డోల్మనాయిడ్స్గా పేర్కొంటారు. ఇప్పుడు తాజాగా వెలుగుచూసిన ప్రాంతంలో వందల సంఖ్యలో డోల్మనాయిడ్స్ కనిపించాయి. స్థానిక పశువుల కాపరులు ఇచ్చిన సమాచారంతో కొత్త తెలంగాణ చరిత్ర బృందం, ఔత్సాహిక పరిశోధకులు కొండవీటి గోపి, నాగులపల్లి జగన్మోహన్రావు, సింహాద్రి నారాయణలు వాటిని పరిశీలించారు. స్థానిక అమరారం గ్రామం నుంచి పదిహేను కిలోమీటర్ల పాటు దట్టమైన అడవిలోకి వెళ్తే ఇలాంటి వందల సంఖ్యలో సమాధులున్న గుట్టలు కనిపిస్తున్నాయి. గతంలో భూపాలపల్లి జిల్లా దామరవాయి అడవిలో వెలుగుచూసిన సమాధులకు కాస్త భిన్నంగా ఉన్నట్లు గుర్తించారు. గోదావరి తీరంలో ఇలా సమాధులున్న ప్రాంతం మరింత విస్తారంగా ఉందని తాజాగా గుర్తించిన సమాధులు స్పష్టం చేస్తున్నాయి. ఎందుకీ నిర్లక్ష్యం? ప్రపంచంలో ఇలా ఒకేచోట వేల సంఖ్యలో ఆదిమానవుల సమాధులు భద్రంగా ఉన్న ప్రాంతాలు చాలా అరుదు. తెలంగాణలోని గోదావరి తీరంలో 200 కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ ప్రాంతాలు ఇప్పటి వరకు యునెస్కో దృష్టికి వెళ్లలేదు. వీటిని పరిరక్షించి యునెస్కో గుర్తింపునకు యత్నించాలన్న ఆలోచన కూడా మన ప్రభుత్వానికి రాలేదు. వెంటనే ఇలాంటి అరుదైన ప్రాంతాలను ప్రపంచ పర్యాటక పటంలో ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు శ్రీరామోజు హరగోపాల్ పేర్కొన్నారు. ఇక్కడికి చేరువలో ఉన్న జానంపేటలో ఆంగ్లేయుల కాలంలోనే పరిశోధనలు జరిగాయి. ఇవి చాలా అద్భుత చారిత్రక సంపద అని నాటి పరిశోధకులు తేల్చారు. ఇలాంటి భారీ బండరాళ్లలో భూగర్భంలో సమాధి గూళ్లు రెండేళ్ల క్రితం కేంద్ర పురావస్తు సర్వేక్షణ సంస్థ (ఏఎస్ఐ) తవ్వకాలు జరిపి నాటి ఆదిమానవుల అవశేషాలు గుర్తించి డీఎన్ఏ పరీక్షలకు తరలించింది. భూపాలపల్లి జిల్లా దామరవాయి ప్రాంతానికి అమెరికాలోని శాండియాగో విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ థామస్ ఈ లెవీ ఆధ్వర్యంలో బృందం వచ్చి ప్రాథమిక పరిశోధన జరిపి ప్రపంచంలోనే ఇవి అరుదైన ప్రాంతాలుగా గుర్తించింది. ప్రభు త్వం సహకరిస్తే ఈ మొత్తం ప్రాంతాన్ని లైడా ర్ సర్వే చేసి ఆధునిక పద్ధతిలో పరిశోధనలు చేస్తామని ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు మన పర్యాటక శాఖ, పురావస్తు శాఖ ఇటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. వీటిని యునెస్కో నుంచి ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు లభిస్తే వాటి పరిరక్షణకు, పరిశోధనకు పెద్దమొత్తంలో నిధులు సమకూరుతాయి. ఇక వివిధ దేశాల నుంచి పర్యాటకులు వాటిని చూసేందుకు క్యూ కడతారు. తద్వారా ప్రభుత్వానికి ఆదాయంతోపాటు స్థానికుల ఉపాధికి అవకాశం కలుగుతుంది. -
ఏజెన్సీ ప్రాంతాల్లో రెండు వరుసల రోడ్లు
వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంత రోడ్ల పథకం కింద కేంద్రం మంజూరు 600 కి.మీ. మేర రూ.1,590 కోట్లతో నిర్మాణం సాక్షి, హైదరాబాద్: వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. కొంతకాలంగా పరిశీలన పేరుతో పెండింగులో పెట్టిన రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలించి ఎట్టకేలకు ఓకే చెప్పింది. పాత ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల పరిధిలో మొత్తం 29 రోడ్ల నిర్మాణానికి అనుమతి మంజూరు చేసింది. కొద్దిరోజుల క్రితమే సూత్రప్రాయ ఆమోదం తెలిపిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు అనుమతి మంజూరు చేసింది. 600 కిలోమీటర్ల మేర నిర్మితమయ్యే ఈ రోడ్లకు రూ.1,590 కోట్లు ఖర్చు కానున్నారుు. ముఖ్యంగా గోదావరి నదీ తీరం వెంబడి ఉన్న ఏజెన్సీ ప్రాంతాల్లో విస్తృతంగా రోడ్ల నిర్మాణం జరగనుంది. ఇప్పటి వరకు అసలు రోడ్డంటూ లేకుండా కచ్చా బాటకే పరిమితమైన చోట్ల కూడా రెండు వరుసల రోడ్లు నిర్మితం కానుండటం విశేషం. అలాగే ప్రస్తుతం సింగిల్ రోడ్డుగా ఉన్న రహదారులను కూడా రెండు వరుసలకు విస్తరిస్తారు. ప్రధాన రహదారులు, జాతీయ రహదారులతో అనుసంధానిస్తూ ఈ రోడ్ల నిర్మాణం జరుగుతుంది. కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న వామపక్ష తీవ్రవాదుల కదలికలు మళ్లీ పెరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వానికి ఇంటెలిజెన్స నివేదికలు అందిన నేపథ్యంలో ఈ మేరకు నిర్ణరుుంచింది. ఇటీవల ఢిల్లీలో జరిగిన రాష్ట్రాల డీజీపీల సదస్సులో కూడా ఈ అంశం చర్చకు వచ్చింది. దీంతో ఏజెన్సీ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణాన్ని వేగిరం చేయాలని కేంద్రం నిర్ణరుుంచటంతో రాష్ట్ర ప్రతిపాదనకు మోక్షం కలిగినట్టరుుంది. రాష్ట్ర ప్రభుత్వంపై భారం వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం పథకానికి ఇంతకాలం మొత్తం నిధులు కేంద్రమే విడుదల చేసేది. తాజాగా ఆ నిబంధనలు సడలించి రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం భరించాలని తేల్చింది. దీంతో ఇప్పుడు కొత్తగా మంజూరైన రోడ్ల వ్యయంలో 40 శాతం భారం రాష్ట్ర ప్రభుత్వంపై పడబోతోంది. దాదాపు రూ.630 కోట్ల మేర రాష్ట్ర ఖజానాపై భారం పడనుంది. -
గోదావరీ తీరంలో గ్యాస్ నిక్షేపాల గుర్తింపు
అమలాపురం టౌన్: తూర్పు గోదావరి జిల్లా కోనసీమలోని ముమ్మిడివరం మండలం లంకాఫ్ ఠానేల్లంక సమీపంలో గోదావరి తీరాన కొండుకుదురులంక ద్వీపంలో గ్యాస్ నిక్షేపాలు విరివిగా ఉన్నట్లు ఆయిల్ ఇండియా సంస్థ తన అన్వేషణలో గుర్తించింది. గ్యాస్ నిక్షేపాలు వెలికి తీసేందుకు నాబార్స్ అనే అంతర్జాతీయ డ్రిల్లింగ్ కంపెనీతో ఒప్పందం చేసుకుంది. ఇప్పటికే కృష్ణా గోదావరి బేసిన్లో ఓఎన్జీసీ, రిలయన్స్, కెయిర్న్ ఎనర్జీ, గెయిల్, గుజరాత్ పెట్రోలియం కార్పొరేషన్ వంటి కంపెనీలు ఆన్‌షోర్, ఆఫ్ షోర్ కార్యకలాపాల ద్వారా చమురు, సహజ వాయువులను వెలికితీస్తున్న సంగతి తెలిసిందే. -
గోనెసంచిలో మృతదేహం
రామగుండం (కరీంనగర్): కరీంనగర్ జిల్లాలో గోదావరి నది ఒడ్డున ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. రామగుండం సమీపంలో గోలివాడలో గోదావరి నది ఒడ్డున బుధవారం ఉదయం ఇది బయటపడింది. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఎవరో హత్య చేసి మృతదేహాన్ని గోనెసంచిలో మూటకట్టి వదిలేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
భద్రాద్రి రాముడి తెప్పోత్సవం
పులకించిన గోదారి తీరం భద్రాచలం: ఖమ్మం జిల్లా భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో బుధవారం స్వామి వారి తెప్పోత్సవం అత్యంత వైభవోపేతంగా జరిగింది. పవిత్ర గోదావరి నదిలో హంసవాహనంపై విహరించిన స్వామి వారిని చూసిన భక్తులు పులకించిపోయారు. వెకుంఠ ఏకాదశి ఉత్సవాలలో భాగంగా బుధవారం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం 4 గంటలకు వేదమంత్రోచ్ఛారణలు, మేళతాళాలు, భక్తజనుల రామనామస్మరణల మధ్య శ్రీసీతారామచంద్రస్వామి వారిని ఆలయం నుంచి ప్రత్యేక పల్లకిలో గోదావరి నదీ తీరానికి తీసుకొచ్చారు. స్వామి వారి పల్లకిని రాష్ట్ర మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జోగు రామన్న మోసి సేవలో పాల్గొన్నారు. అనంతరం గోదావరి నదిలో ప్రత్యేకంగా తయారు చేసిన హంసవాహనంపై స్వామి వారిని ఉంచి వేదపండితులు ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు స్వామివారికి హంసవాహనంపై తెప్పోత్సవం నిర్వహించారు. బాణ సంచా వెలుగులతో శోభాయమానంగా సాగిన ఈ కార్యక్రమాన్ని భక్తులు కనులారా వీక్షించి తన్మయత్వం చెందారు. స్వామి వారు తెప్పోత్సవంపై విహరిస్తున్నంత సేపూ గోదావరి తీరాన భక్తులు శ్రీరామ నామ జయజయ ధ్వానాలు చేశారు. తెప్పోత్సవాన్ని తిలకించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చారు. కార్యక్రమంలో మహబూబాబాద్ ఎంపీ సీతారాంనాయక్, సిర్పూర్ కాగజ్‌నగర్, అశ్వారావుపేట, వైరా, భద్రాచలం ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, తాటి వెంకటేశ్వర్లు, మదన్‌లాల్, సున్నం రాజయ్య, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జడ్పీ చైర్పర్సన్ గడపల్లి కవిత, కలెక్టర్ ఇలంబరితి, జేసీ సురేంద్రమోహన్, ఎస్పీ షాన్వాజ్ ఖాసీం, ఐటీడీఏ పీవో దివ్య, దేవస్థానం ఈవో కూరాకుల జ్యోతి పాల్గొన్నారు. -
భద్రాద్రిలో వైభవంగా తెప్పోత్సవం
భద్రాచలం, న్యూస్‌లై న్ : ఖమ్మం జిల్లా భద్రాచలంలో శుక్రవారం తెప్పోత్సవం వైభవోపేతంగా జరిగింది. వైకుంఠ ఏకాదశి ఉత్సవాలలో భాగంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆరాధన, ఏకాంత తిరుమంజనం, నివేదన అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. సాయంత్రం నాలుగు గంటలకు స్వామి వారు హంసవాహనంపై విహరించేందుకు ఆలయం నుంచి గోదావరి తీరానికి బయలు దేరారు. వేదమంత్రోచ్ఛరణలు, మేళతాళాలు, భక్తుల రామనామ స్మరణలతో శ్రీసీతారామచంద్రస్వామివారిని ప్రత్యేక పల్లకిలో ఊరేగింపుగా గోదావరి నదీ తీరానికి తీసుకొచ్చారు. ప్రత్యేకంగా తయారు చేసిన హంసవాహనంపై స్వామి వారిని ఉంచి వేదపండితులు, అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం ఆరు గంటల నుంచి గంటపాటు గోదావరిలో స్వామి వారికి తెప్పోత్సవం నిర్వహించారు. బాణసంచా వెలుగులతో శోభాయమానంగా సాగిన ఈ ఉత్సవాన్ని భక్తులు కనులారా వీక్షించి తన్మయత్వానికి లోనయ్యారు.