సాక్షి ప్రతినిధి, కాకినాడ: దశ, దిశ నిర్దేశం లేకుండానే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ముగిసింది. తూర్పు సెంటిమెంట్‌గా ఈ నెల 14న అన్నవరం సత్యదేవునికి పూజలు నిర్వహించి, పవన్ ఈ యాత్రను ప్రారంభించారు. ఈ యాత్రలో పార్టీ నిర్దిష్ట అజెండా గురించి తన నాయకుడు వివరిస్తారని భావించిన ఆయన అభిమానులకు నిరాశే ఎదురైంది.
కాకినాడ జిల్లా కత్తిపూడి మొదలు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురంలో ఆదివారం జరిగిన ముగింపు సభ వరకూ వరుసగా వివాదాలు మూటగట్టుకున్నారు. సహజంగా ఏ రాజకీయ పార్టీ అయినా ఇటువంటి యాత్రలు చేసేటప్పుడు పార్టీ విధానపరమైన ప్రణాళికలను ప్రజల ముందు ఉంచుతుంది. తమకు ఓటేస్తే ప్రజలకు ఏం చేయదలుచుకున్నారో అర్థమయ్యేలా వివరిస్తూ.. వారి మనసు చూరగొనే ప్రయత్నం చేస్తుంది.
పవన్ అభిమానులు, ఆ పార్టీ నేతలు ఆయన నుంచి ఇవే ఆశించారు. కానీ అందుకు పూర్తి భిన్నంగా వన్‌మేన్ ఆర్మీ మాదిరిగా ఉమ్మడి తూర్పు గోదావరిలో పవన్ తన యాత్రకు ముగింపు పలికారు. పార్టీకి ఒక అజెండా అంటూ లేకపోవడం జనసేన నేతలకు రుచించ లేదు.
ద్వారంపూడి, ముద్రగడపై విమర్శలతో పెనుదుమారం
వారాహి యాత్రలో పవన్ వ్యాఖ్యలపై పెనుదుమారం రేగింది. రెండవ సారి గెలుపొందిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి వంటి నేతలే లక్ష్యంగా పవన్ ప్రసంగం సాగడం సొంత సామాజిక వర్గ నేతల నుంచే అసంతృప్తి వ్యక్తమైంది. అలాగే, కాపు ఉద్యమాన్ని ముందుండి నడిపించిన నేత ముద్రగడ పద్మనాభం లక్ష్యంగా పరోక్ష విమర్శలు చేయడం రాష్ట్ర స్థాయిలో పెను దుమారాన్నే రేపింది.
అటు ద్వారంపూడి, ఇటు ముద్రగడ సంధించిన అనేక ప్రశ్నలకు, వచ్చే ఎన్నికల్లో పోటీపై విసిరిన సవాళ్లకు పవన్ సమాధానం చెప్పకుండానే తోక ముడిచారనే విమర్శను మూటగట్టుకోవాల్సి వచ్చింది. గుండె ధైర్యం ఎక్కువని పదేపదే చెప్పుకునే ఆయన.. వారి సవాళ్లకు సరైన సమాధానం చెబుతారని ఎదురు చూశామని, తీరా చివరకు తల దించుకునేలా చేశారని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు వాపోతున్నారు.
ఒకపక్క జనసేనకు కులాల అంతరాలు లేవంటూనే మరోపక్క తన ప్రసంగాల్లో కులాల ప్రస్తావనతో యువతలో పవన్ భావోద్వేగాలు రెచ్చగొట్టిన తీరును మేధావి వర్గం తప్పు పడుతోంది. పవన్ వాడిన పదజాలంపై రాజకీయాల్లో మూడు దశాబ్దాల అనుభవం ఉన్న కాకినాడ ఎంపీ వంగా గీత ‘రాజకీయాల్లోకి రావాలనుకునే యువతకు ఇదేనా మీరిచ్చే సందేశం’ అంటూ చురకలు అంటించడం గమనార్హం.
అయినా.. మారలేదు
రీల్ లైఫ్‌కు, రియల్ లైఫ్‌కు చాలా తేడా ఉంటుందని చెబుతూనే ప్రసంగాలు, హావభావాల్లో ఫక్తు సినిమా స్టైల్‌ను ప్రదర్శించడంలో పవన్ ఔచిత్యాన్ని విజ్ఞులు ప్రశ్నిస్తున్నారు. తాను సీఎం అయ్యేందుకు సిద్ధంగా ఉన్నానని కత్తిపూడిలో చెప్పుకున్న పవన్.. పచ్చ మీడియా ఇంటర్వ్యూల్లో ఏదో అభిమానులు అలా అంటూంటే వారిని ఉత్సాహ పరిచేందుకు అలా మాట్లాడాననడం ఒక పార్టీకి నాయకత్వం వహించే నాయకుడి లక్షణమా అని వివిధ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.
మార్పు రావాలని గొంతెత్తిన జనసేనాని తాను మారలేదనే విషయాన్ని వారాహి యాత్ర ద్వారా చెప్పకనే చెప్పారని ఆ వర్గాలు అంటున్నాయి. గోదావరి నేలను వదిలేది లేదని, ఈ జిల్లాలు రాజకీయ మార్పునకు నాంది పలుకుతాయని చెప్పిన పవన్.. వచ్చే ఎన్నికల్లో పోటీపై గత ఎన్నికల్లో మాదిరిగానే ఇప్పుడు కూడా పూటకో మాటతో అభిమానులను గందరగోళంలో పడేశారు.
ఆ పార్టీ నేతలే పెదవి విరుపు
మంగళగిరిలో తెలుగుదేశంతో పొత్తు అనగానే గోదావరి జిల్లాల్లో పవన్ గ్రాఫ్ పడిపోయింది. 80వ దశకంలో వంగవీటి మోహన్ రంగా హత్యోదంతం నుంచి.. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కుటుంబం పైన, కాపు సామాజికవర్గం పైన చంద్రబాబు ప్రభుత్వం సాగించిన దమనకాండను గుర్తుకు తెచ్చుకుని.. సామాజిక మాధ్యమాల్లో పలువురు పవన్ తీరును ఏకి పారేశారు. ఆ వ్యతిరేకతను తగ్గించుకునేందుకో లేక కాస్తో కూస్తో బలం ఉన్న గోదావరి జిల్లాల్లో బలప్రదర్శన ద్వారా పొత్తుల్లో సీట్లు పెంచుకునేందుకో వారాహి యాత్రను ఇక్కడి నుంచే ప్రారంభించి ఉంటారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఈ యాత్రలో తమకు కనీస ప్రాధాన్యం ఇవ్వలేదని ఆ పార్టీ నేతలు పలువురు తీవ్ర ఆవేదనతో ఉన్నారు. పుష్కర కాలంగా పార్టీ కోసం లక్షల రూపాయలు తగలేసుకుంటున్న ఇన్‌చార్జిలకు సైతం వారాహిపై వేదిక పంచుకునే అవకాశం ఇవ్వకుండా దూరం పెట్టడంపై నిప్పులు చెరుగుతున్నారు. మొత్తంగా ఉమ్మడి ‘తూర్పు’న వారాహి యాత్ర అనేక వివాదాలు, అసంతృప్తులతో ఆ పార్టీ అభిమానులకు తీవ్ర నిరాశ మిగిలి్చంది.
Comments
Please login to add a commentAdd a comment