సాక్షి, అమరావతి/సాక్షి, భీమవరం: హెలికాప్టర్ లాండింగ్‌కు అనుమతించలేదన్న కారణ0తో ప్రతిపక్ష నాయకుడు ఎవరైనా పార్టీ సమావేశాలను వాయిదా వేసుకుంటారా? కానే కాదు. దాని వెనుక సొంత పార్టీ కారణాలు ఉంటాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లాల పర్యటన వాయిదా వెనుక కూడా టీడీపీ–జనసేన కూటమి గొడవలు, ఇతరత్రా కారణాలు ఉన్నాయి. అవి బయటపడకుండా హెలికాప్టర్ లాండింగ్‌కు అనుకూలంగా లేదన్న అధికారుల సూచనను రాజకీయం చేసేసి, అన్ని సమావేశాల్ని మంగళగిరికి మార్చేసుకున్నారు పవన్.
ఇదీ అసలు కారణం
జనసేన – టీడీపీ పొత్తు నేపథ్యంలో అసెంబ్లీ నియోజకవర్గాలలో రెండు పార్టీ ల నాయకుల మధ్య ఉప్పు– నిప్పుగా ఉంది. ఈ కారణంతోనే ఇటీవలి కాలంలో పవన్ జిల్లా పర్యటనలకు వెళ్లడం లేదు. వారాహి యాత్రా ఆగిపోయింది. చివరాఖరికి ఉభయ గోదావరి జిల్లాల పర్యటనకు ఉపక్రమించారు. బుధవారం నుంచి ఈనెల 17 వరకు మూడు రోజులు భీమవరంలోనే మకాం ఉండి భీమవరం, అమలాపురం, కాకినాడ, రాజమహేంద్రవరంలలో జరిగే జనసేన, టీడీపీ ముఖ్య నాయకుల సమావేశాల్లో పాల్గొనాల్సి ఉంది.
అయితే, నియోజకవర్గాల్లో జనసేన, టీడీపీ వర్గాల మధ్య బొత్తిగా పొసగడంలేదు. టీడీపీ పశ్చిమ గోదావరి జిల్లా నేతలు తోట సీతారామలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు), మాజీ ఏఎంసీ చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు మధ్య వివాదాలు తీవ్రంగా ఉన్నాయి. వీరి గ్రూపు రాజకీయాలు పవన్ పర్యటనకు చేటుచేస్తాయని జనసేన నేతలు భావించినట్టు సమాచారం. దీనికి తోడు పెళ్లిళ్ల ముహూర్తాల కారణంగా పవన్ మకాం చేసేందుకు భీమవరం పరిసర ప్రాంతాల్లో గెస్ట్ హౌస్‌లు, సమావేశాలకు ఫంక్షన్ హాళ్లు దొరకలేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో పవన్ పర్యటన వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది.
ప్రభుత్వంపై నెపం వేసి..
టీడీపీ–జనసేన కూటమిలో విభేదాలు, వసతి దొరకలేదన్న కారణాన్ని బయటకు చెప్పలేక, హెలిప్యాడ్‌కు ప్రత్యామ్నాయం చూడాలన్న అధికారుల సూచనను రాజకీయం చేసి, పబ్బం గడిపేసుకుంటున్నారు పవన్. హెలికాప్టర్ లాండింగ్‌కు అనుమతులివ్వడంలేదంటూ ప్రభుత్వంపై బురదజల్లేసి కార్యక్రమాలను మంగళగిరికి మార్చేసుకున్నారు. వాస్తవానికి పట్టణంలోని విష్ణు కళాశాలల వద్ద ఎన్నో ఏళ్ల క్రితం ఏర్పాటుచేసిన హెలిప్యాడ్‌ను జనసేన నాయకులు ఎంచుకున్నారు.
ఈ హెలీప్యాడ్ వినియోగించి చాలా కాలమైంది. ఆ ప్రాంతంలో కొత్తగా భవనాలు, అపార్ట్మెంట్స్ నిర్మించడం, చెట్లు పెరిగిపోవడంతో ల్యాండింగ్‌కు సురక్షితం కాదని అనుమతి ఇవ్వలేదని ఆర్ అండ్ బీ ఈఈ ఎస్ లోకేశ్వరరావు తెలిపారు. గత నెలలో సీఎం జగన్ భీమవరం పర్యటన సందర్భంగా విష్ణు కళాశాల హెలీప్యాడ్ అనుకూలంగా ఉండదని భావించడం వల్లే పట్టణంలోని లూథరన్ హైసూ్కల్ ఆవరణలో హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. పవన్ హెలికాప్టర్ కోసం కూడా ప్రత్యామ్నాయ స్థలాలు చూడాలని జనసేన నేతలకు సూచించారు.
ఈ మేరకు జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు తదితరులు ఉండి సమీపంలోని ఫంక్షన్ హాలుకు ఎదురుగా ఉన్న ఖాళీ స్థలాన్ని పరిశీలించారు. అయినా, అసలు కారణాలను కప్పిపుచ్చుతూ, పవన్‌కళ్యాణ్ ప్రయాణించే హెలికాప్టర్ ల్యాండింగ్‌కు ఆర్ అండ్ బీ అధికారులు అనుమతులు మంజూరు చేయకుండా అడ్డంకులు సృష్టిస్తున్న కారణంగా బుధవారం (14వ తేదీ) నుంచి జరగాల్సిన పర్యటన వాయిదా వేసుకున్నట్టు జనసేన ఓ ప్రకటనలో పేర్కొంది.
మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలోనే ఆయా నియోజకవర్గ ముఖ్య నేతలతో సమావేశాలు జరగనున్నట్లు తెలిపింది. ఇది కేవలం ఒక వంకేనని, అసలు కారణం టీడీపీ, జనసేన మధ్య విభేదాలేనని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఐదారు నెలల క్రితం బాబు అరెస్టు సమయంలో తన హెలికాప్టర్ ప్రయాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నారని అప్పట్లో హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా విజయవాడ వచ్చి, మధ్యలో రోడ్డుపైనే పడుకొని హడావుడి చేసిన పవన్.. ఇప్పుడు రోడ్డు మార్గంలో ఎందుకు రాలేరని వారు ప్రశ్నిస్తున్నారు.
మంగళగిరి కార్యాలయం నుంచి 150 కి.మీ. లోపే ఉన్న భీమవరానికి రోడ్డు మార్గంలో రావడం సులువైన పని అయినప్పటికీ, హెలికాప్టర్‌కు అడ్డంకుల పేరుతో పర్యటననే వాయిదా వేసుకోవడం విచిత్రంగానే ఉందని జనసేన నేతలు సైతం వ్యాఖ్యానిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment