కోనసీమ జిల్లాలో టీడీపీ–జనసేన నేతల బరితెగింపు
యానాం నుంచి జనసేన ద్వితీయశ్రేణి నేతలు మద్యం అక్రమ రవాణా
వారి నుంచి రూ.5 లక్షలు డిమాండ్ చేసిన టీడీపీ–జనసేన నేతలు
సినీ ఫక్కీలో కిడ్నాప్.. రూ.25వేలు ఇచ్చాక విడుదల
పోలీసులకు బాధితుల ఫిర్యాదు
సాక్షి ప్రతినిధి, కాకినాడ : అధికారం వచ్చిందో లేదో టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి నేతల ఆగడాలు మామూలుగా లేవు. అధికారం తమ గుప్పెట్లో ఉందనే ధైర్యం, తమ ప్రజాప్రతినిధుల అండదండలున్నాయనే బరితెగింపుతో ఆయా పార్టీల నేతలు చెలరేగిపోతూ దోపిడీలు, దౌర్జన్యాల కోసం నకిలీ పోలీసుల అవతారమెత్తుతున్నారు.
నిజానికి.. రాష్ట్రంలో ప్రజలకు చెందాల్సిన ప్రతీపైసా నాటి సీఎం వైఎస్ జగన్ డీబీటీ (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్) ద్వారా బ్యాంకు ఖాతాల్లో పారదర్శకంగా జమ చేసేవారు. అదే సందర్భంలో తాము అమలుచేస్తున్న డీబీటీని చంద్రబాబు అండ్ కో దోచుకో, పంచుకో, తినుకోగా మార్చేస్తుందని జగన్ పదేపదే హెచ్చరించేవారు. అప్పుడు ఆయనన్నట్లుగానే ఇప్పుడు కూటమి నేతలు ఆ మాటలను నిజంచేసి చూపిస్తున్నారు.
ఈ విషయంలో టీడీపీ, జనసేన నేతలు ఒకరిని మించి మరొకరు దందాలు చేస్తున్న తీరు చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. రాష్ట్ర కార్మిక శాఖా మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రాతినిధ్యం వహిస్తున్న రామచంద్రాపురం నియోజకవర్గం మసకపల్లి గ్రామంలో తాజాగా చోటుచేసుకున్న ఇలాంటి ఘటనే ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. అక్కడ ఏం జరిగిందంటే..
చౌకగా కొని.. ‘చీప్’గా కల్తీచేసి..
పాండిచ్చేరి కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో తక్కువ ధరకు లభించే వివిధ బ్రాండ్ల మద్యం బాటిళ్లను కొందరు కూటమి నేతలు కొనుగోలు చేసి వాటి లేబుళ్లు, బాటిళ్లు మార్చి రామచంద్రాపురం నియోజకవర్గంలోని ప్రభుత్వ, ప్రైవేటు దుకాణాలు, బెల్ట్ షాపుల్లో కల్తీచేసి విక్రయిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు నియంత్రణలో ఉన్న ఈ అక్రమ మద్యం దందా.. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత విచ్చలవిడిగా సాగుతోంది. ఈ క్రమంలో.. మంగళవారం రాత్రి పామర్రు పోలీసుస్టేషన్ పరిధిలో ఇద్దరు జనసేన ద్వితీయ శ్రేణి నేతలు అరిశెట్టి మణికంఠ (అయ్యప్ప) మరొకరు యానాం మద్యాన్ని పామర్రు తరలిస్తున్నారు.
విషయం తెలుసుకుని మసకపల్లి, ద్రాక్షారామ ప్రాంతానికి చెందిన టీడీపీ, జనసేన నేతలు రవ్వా భూషణం, సలాది శ్రీనివాస్ పాణింగపల్లి వద్ద మాటేశారు. అక్కడకు దగ్గర్లోనే కారు పార్కు చేశారు. అందులో నకిలీ పోలీసులు ఇద్దరిని ఖాకీ డ్రెస్సుతో కూర్చోబెట్టారు. యానాం నుంచి లిక్కర్ బాటిళ్లతో వచ్చిన జనసేన ద్వితీయశ్రేణి నేతలను అడ్డగించి, కారులో స్పెషల్ పార్టీ పోలీసులున్నారు.. మీ వ్యవహారం బయటకు పొక్కకుండా ఉండాలంటే రూ.5 లక్షలు ఇవ్వాలని తెదేపా, జనసేన నేతలు డిమాండ్ చేశారు. అందుకు వారు నిరాకరించడంతో ఇద్దరినీ కిడ్నాప్‌చేసి కారులో ఆ రాత్రి ద్రాక్షారామ తరలించారు.
కనీసం రూ.2 లక్షలు ఇవ్వాలని, లేకుంటే పోలీసులు మా వెంటే ఉన్నారని, కేసుల్లో ఇరికిస్తామని బెదిరించారు. దీంతో కేసులకు భయపడి జనసేన ద్వితీయ శ్రేణి నేతలు రూ.25 వేలు చేతిలో పెట్టి మిగిలింది తరువాత చూస్తామని చెప్పడంతో వారిని విడిచిపెట్టారు. మణికంఠ అక్కడి నుంచి బయటపడి పామర్రు వచ్చేశాక వారిపై పోలీసు ఉన్నతాధికారులు, స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు గత రెండ్రోజులుగా పరారీలో ఉన్న ఇద్దరు కూటమి నేతలను అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయమై పామర్రు ఎస్‌ఐ జానీబాషాను సంప్రదించగా ఫిర్యాదు వచ్చిన మాట వాస్తవమేనని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment