అమెరికా, భారత్‌ సంబంధాల్లో నూతన అధ్యాయానికి నాంది | PM Narendra Modi First Bilateral Meeting With US President Joe Biden | Sakshi
Sakshi News home page

Narendra Modi US Visit నూతన అధ్యాయానికి నాంది

Published Sat, Sep 25 2021 4:20 AM | Last Updated on Sat, Sep 25 2021 7:59 AM

PM Narendra Modi First Bilateral Meeting With US President Joe Biden - Sakshi

ఓవల్‌ ఆఫీస్‌లో బైడెన్, మోదీల ఆత్మీయ స్పర్శ

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌తో భారత ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం తొలిసారి భేటీ అయ్యారు. తమ సమావేశం అద్భుతంగా జరిగిందని మోదీ వెల్లడించారు. భారత్‌- యూఎస్‌ బంధం మరింత దగ్గరవ్వాలని, బలోపేతమవ్వాలని బైడెన్‌ ఆకాంక్షించారు. చర్చల్లో ఇరువురు నేతలు ఇండో-పసిఫిక్, వాతావరణ మార్పు, వాణిజ్యం, కోవిడ్‌తో సహా పలు అంశాలను చర్చించారు. శ్వేతసౌధంలోని ఓవల్‌ ఆఫీసులో మోదీకి బైడెన్‌ స్వాగతం పలికారు. ఇరుదేశాల సంబంధాల్లో ఇదో నూతనాధ్యయంగా బైడెన్‌ అభివర్ణించారు.
చదవండి: తల్లికి మధురమైన గిఫ్ట్‌ ఇచ్చిన విజయ్‌ దేవరకొండ

ప్రపంపంలోని రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల బంధం పలు అంతర్జాతీయ సవాళ్లను పరిష్కరిస్తుందని, కరోనా కట్టడిపై ఉమ్మడి నిబద్ధత చూపడంతో దీన్ని నిరూపిస్తామని బైడెన్‌ చెప్పారు. ప్రధాని పదవి స్వీకరించాక మోదీ అమెరికా సందర్శించడం ఇది ఏడవసారి. ‘ఈ దశాబ్దం ఎలా ఉంటుందనే విషయంలో మీ నాయకత్వం కీలకపాత్ర పోషించనుంది. భారత్, అమెరికా మధ్య మరింత బలమైన బంధానికి విత్తనాలు నాటాము’ అని బైడెన్‌తో మోదీ వ్యాఖ్యానించారు. కీలక భౌగోళికాంశాలపై బైడెన్‌కు ఉన్న అవగాహన అధికమని భేటీ అనంతరం మోదీ ట్వీట్‌ చేశారు. కరోనాపై, వాతావరణ మార్పుపై పోరాటం, ఇండో–పసిఫిక్‌ ప్రాంతంలో స్థిరత్వం తీసుకురావడం వంటి అంశాలపై మోదీతో చర్చించినట్లు తెలిపారు.
చదవండి: మృతదేహాన్ని అడ్డగింత.. చితి పైకెక్కి ఆందోళన

గాంధీ మార్గమే శరణ్యం
వచ్చేవారం జరగనున్న గాంధీ జయంతి ఉత్సవాలను బైడెన్‌ ప్రస్తావించారు. ఆయన చూపిన అహింస, ఓర్పులాంటి సూత్రాల అవసరం ఇప్పుడు ఎంతో ఉందన్నారు. ఈ సందర్భంగా గాంధీ ప్రవచించే ట్రస్టీషిప్‌ సిద్ధాంతాన్ని మోదీ గుర్తు చేశారు. ఇరు రాజ్యాల మధ్య రాబోయే రోజుల్లో బంధాన్ని ధృడోపేతం చేసే శక్తి వాణిజ్యానికి ఉందన్నారు. సాంకేతికత రాబోయే రోజుల్లో మరింత కీలక పాత్ర పోషించనుందన్నారు. ప్రశాంతమైన, స్వేచ్ఛాయుతమైన ఇండో– పసిఫిక్‌ ప్రాంతమే తమ రెండు దేశాలతో పాటు అనేక దేశాల ఆకాంక్ష అని బైడెన్‌ చెప్పారు. ఈ ప్రాంతంలో చైనా మిలటరీ విన్యాసాలను దృష్టిలో ఉంచుకొని ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తమ భాగస్వామ్యం అంచనాలను మించి మరింత ప్రభావం చూపగలదన్నారు. 40 లక్షల మంది ఇండో– అమెరికన్లు అగ్రరాజ్యాన్ని శక్తివంతం చేస్తున్నారన్నారు. భారతీయ సంతతి అమెరికా పురోగతిలో భాగం కావడంపై మోదీ ఆనందం వ్యక్తం చేశారు.

అధ్యక్షుడిపై ప్రధాని ప్రశంసలు
కోవిడ్, క్వాడ్‌ తదితర అంశాలపై బైడెన్‌ యత్నాలు అభినందనీయమని మోదీ ప్రశంసించారు. గతంలో బైడెన్‌ ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఒకసారి మోదీతో భేటీ అయ్యారు. ఆయన అధ్యక్షుడయ్యాక పలుమార్లు ఫోన్లలో, ఆన్‌లైన్‌ సమావేశాల్లో సంభాషించుకున్నా, ముఖాముఖి భేటీ కావడం ఇదే తొలిసారి. గతంలో తాము పరిచయమైనప్పుడే ఇరుదేశాల సంబంధాలపై బైడెన్‌ దూరదృష్టిని చూపారని, ప్రస్తుతం అధ్యక్షుడిగా అప్పటి ఆలోచనలను అమలు చేసేందుకు యతి్నస్తున్నారని బైడెన్‌ను ఆయన కొనియాడారు.

ఇరు రాజ్యాలు కలిసి చేసే యత్నాలు ప్రపంచానికి మంచి చేస్తాయని అభిప్రాయపడ్డారు. ఇరువురి భేటీ అత్యంత ఫలప్రదంగా జరిగిందని విదేశాంగ వ్యవహారాల శాఖ ప్రకటన విడుదల చేసింది. భేటీ సందర్భంగా వైట్‌హౌస్‌లోని రూజ్‌వెల్ట్‌ రూమ్‌లోని సందర్శకుల పుస్తకంలో ప్రధాని సంతకం చేశారు. ప్రధానితో పాటు జైశంకర్, అజిత్‌దోవల్, హర్షవర్ధన్‌ శ్రింగ్లా, తరణ్‌జిత్‌ సింగ్‌ సంధూ, అమెరికా తరఫున ఆంటోనీ బ్లింకెన్, జేక్‌ సల్లివాన్, జాన్‌ కెర్రీ, కర్ట్‌ చాంబెల్, డోనాల్డ్‌ లూ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

ప్రపంచ శాంతికి ‘క్వాడ్‌’: మోదీ
భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌ దేశాల కూటమి(క్వాడ్‌) కేవలం ఇండో–పసిఫిక్‌ ప్రాంతానికే కాదు మొత్తం ప్రపంచం శాంతి సౌభాగ్యాలతో వర్థిల్లడానికి దోహదపడుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. నాలుగు బలమైన దేశాలు జట్టుకట్టి, ఒకే వేదికపైకి రావడం ప్రపంచానికి మేలు కలిగించే పరిణామం అని తాను విశ్వసిస్తున్నట్లు చెప్పారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ ఆతిథ్యం ఇస్తున్న ‘క్వాడ్‌’ సదస్సు శుక్రవారం వాషింగ్టన్‌లో జరిగింది. మోదీ, బైడెన్‌తోపాటు ఆస్ట్రేలియా, జపాన్‌ ప్రధానులు స్కాట్‌ మోరిసన్, యోషిహిడే సుగా హాజరయ్యారు. కోవిడ్‌ నుంచి వాతావరణ మార్పుల దాకా ఎన్నో సవాళ్లు మానవాళికి ఎదురవుతున్నాయని బైడెన్‌  వ్యాఖ్యానించారు.ప్రజాస్వామిక భాగస్వాములతో కూడిన క్వాడ్‌ కూటమికి భవిష్యత్తుపై ఉమ్మడి దార్శనికత ఉందని అన్నారు. సవాళ్లను ఎలా ఎదిరించాలో తమకు తెలుసని చెప్పారు. ప్రధాని  మోదీ మాట్లాడుతూ.. మానవళి కోసం క్వాడ్‌ కూటమి రూపంలో నాలుగు దేశాలు ఒక్క తాటిపైకి వచ్చాయని పేర్కొన్నారు. సప్లై చైన్, అంతర్జాతీయ భద్రత, వాతావరణ మార్పులు, కోవిడ్‌పై పోరాటం, సాంకేతిక రంగంలో పరస్పర సహకారం వంటి కీలకం అంశాలపై తన మిత్రులతో చర్చిస్తున్నానని వివరించారు. సానుకూల దృక్పథంలో ముందుకు సాగాలని తాము నిర్ణయించుకున్నట్లు మోదీ చెప్పారు. ఈ కార్యక్రమంలో మోరిసన్, సుగా మాట్లాడారు. ఇండో–పసిఫిక్‌ ప్రాంతంలో బలప్రయోగానికి తావుండరాదని స్పష్టం చేశారు. ఏవైనా వివాదాలు, సమస్యలు ఉంటే అంతర్జాతీయ చట్టాల ప్రకారం శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు.
అవును.. భారత్‌లో మీ చుట్టాలున్నారు!

బైడెన్‌ ప్రశ్నకు మోదీ జవాబు
మోదీతో సమావేశం సందర్భంగా ఇండియాలో బైడెన్‌ చుట్టాల గురించి ఆసక్తికరమైన సంభాషణ జరిగింది. భారత్‌లో బైడెన్‌ ఇంటిపేరున్న వారున్నట్లు తనకు తెలిసిందని, కానీ అంతకుమించి వివరాలు దొరకలేదని బైడెన్‌ చెప్పారు. అయితే భారత్‌లో బైడెన్‌ ఇంటిపేరున్న వాళ్లు అధ్యక్షుడితో చుట్టరికం ఉన్నవాళ్లేనని, ఇందుకు సంబంధించిన ఆధారాల డాక్యుమెంట్లు తెచ్చానని చెప్పి బైడెన్‌ను ప్రధాని మోదీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. 1972లో తాను సెనేటర్‌గా తొలిసారి ఎన్నికైనప్పుడు బైడెన్‌ అనే ఇంటిపేరున్న ఒక వ్యక్తి ముంబై నుంచి తనకు అభినందనలు తెలుపుతూ లేఖ రాశాడని బైడెన్‌ గుర్తు చేసుకున్నారు. దాంతో తన ముత్తాతకు ముత్తాతకు ముత్తాత ఎవరో ఇక్కడ ఉండిఉండొచ్చని భావించానని చెప్పారు. అలాగే 2013లో భారత్‌ను సందర్శించినప్పుడు తనకు ఇండియాలో ఎవరైనా చుట్టాలున్నారా అన్న ప్రశ్న ఎదురైందన్నారు.

మరుసటి రోజే తనకు ఇండియాలో ఐదుగురు బైడెన్స్‌ నివశిస్తున్నట్లు తెలిసిందన్నారు. మరింత ఆరా తీయగా జార్జ్‌ బైడెన్‌ అని ఈస్ట్‌ ఇండియా టీకంపెనీలో ఒకరుండేవారని, బహూశ ఆయన ఇక్కడి అమ్మాయిని పెళ్లి చేసుకొని స్థానికంగా సెటిలై ఉండొచ్చన్నారు. అయితే నిజంగా ఏం జరిగిందో తనకు తెలియదన్నారు. భారత్‌తో తన బంధుత్వంపై తనకెవరైనా సాయం చేస్తారేమోనని ఈ విషయాలన్నీ చెబుతున్నానని ఆయన అనగానే మోదీతో సహా సమావేశంలోని వారంత నవ్వుల్లో మునిగారు. అనంతరం నిజంగా నాకు చుట్టాలున్నారా? అని మోదీని బైడెన్‌ అడగ్గా ఆయన అవునన్నారు. గతంలో కూడా తనతో ఈ విషయాన్ని ప్రస్తావించారని గుర్తు చేశారు. అందుకే దీనికి సంబంధించిన డాక్యుమెంట్ల కోసం అన్వేషించామని, ఈ రోజు వీటిని తీసుకువచ్చామని, వీటితో మీకు ఉపయోగం ఉండొచ్చని వివరించారు. ముంబైలో తన కొత్త చుట్టాలతో ఇంతవరకు సంభాషించలేదని, త్వరలో మాట్లాడతానని బైడెన్‌ చెప్పారు.  

కమలకు తాతయ్య జ్ఞాపకం: కానుకగా ఇచ్చిన ప్రధాని
మోదీ, అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌కు అరుదైన జ్ఞాపకాన్ని బహుమతిగా ఇచ్చారు. కమల తాతయ్య, తమిళనాడుకు చెందిన పి.వి. గోపాలన్‌ ప్రభుత్వ అధికారిగా వివిధ హోదాల్లో పని చేశారు. ఆయనకు సంబంధించిన ఒక పాత నోటిఫికేషన్‌ను హస్తకళా నిపుణులు తయారు చేసిన కలప ఫ్రేమ్‌లో పెట్టి బహుమానంగా ఇచ్చి కమలను సంభ్రమాశ్చర్యంలో ముంచెత్తారు. దాంతో పాటు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్‌సభ స్థానం, అత్యంత పురాతన నగరమైన వారణాసిలో హస్తకళల నిపుణులు ప్రత్యేకంగా తయారు చేసే గులాబీ మీనాకారి చదరంగం సెట్‌ను బహుమతిగా అందించారు.

ఈ చదరంగం సెట్‌లో ప్రతీ పావు అత్యంత అద్భుతమైన కళతో ఉట్టిపడుతూ చూపరుల్ని ఇట్టే ఆకర్షిస్తాయి. తాను కలుసుకున్న ఇతర ప్రపంచ దేశాల అధినేతలకు కూడా మనసుని ఉల్లాసపరిచే బహుమానాలు ఇచ్చారు. ఆ్రస్టేలియా ప్రధానమంత్రి స్కాట్‌ మారిసన్‌కు గులాబీ మీనాకారి కళతో తయారు చేసిన వెండి నౌకను బహుమతిగా ఇచ్చారు. జపాన్‌ ప్రధాని సుగాకు చందనపు చెక్కతో తయారు చేసిన బుద్ధుడి ప్రతిమను కానుకగా ఇచ్చారు. హస్తకళ నిపుణులు తయారు చేసిన ఈ కళాత్మక వస్తువులన్నింటిలోనూ వారణాసి సాంస్కృతిక చైతన్యం ఉట్టిపడుతూ ఉండడంతో ఆ కానుకలు అందరినీ అమితంగా ఆకర్షించాయి.  


రూజ్‌వెల్ట్‌ రూమ్‌లోని సందర్శకుల పుస్తకంలో సంతకం చేస్తున్న ప్రధాని మోదీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement