చరిత్ర సృష్టించిన జో బైడెన్‌ | Biden, Harris To Take Oath As US President, Vice-President | Sakshi
Sakshi News home page

అమెరికా 46వ అధ్యక్షుడిగా జో‌ బైడెన్‌ ప్రమాణం

Published Wed, Jan 20 2021 10:11 PM | Last Updated on Thu, Jan 21 2021 10:03 AM

Biden, Harris To Take Oath As US President, Vice-President - Sakshi

వాషింగ్టన్‌: భద్రత బలగాల పటిష్ట పహారా మధ్య బుధవారం అమెరికా 46వ అధ్యక్షుడిగా జోసెఫ్‌ రాబినెట్‌ బైడెన్‌ ప్రమాణ స్వీకారం చేశారు. క్యాపిటల్‌ భవనంలో సంప్రదాయంగా ప్రమాణ స్వీకారం జరిగే ప్రదేశంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జాన్‌ రాబర్ట్స్‌.. బైడెన్‌తో దేశ నూతన అధ్యక్షుడిగా ప్రమాణం చేయించారు. తమ కుటుంబానికి చెందిన 127 ఏళ్లనాటి బైబిల్‌పై ప్రమాణం చేసి బైడెన్‌ దేశాధ్యక్ష బాధ్యతలను స్వీకరించారు. గతంలో సెనేటర్‌గా, ఉపాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కూడా ఆయన ఈ బైబిల్‌పైనే ప్రమాణం చేయడం విశేషం. అధ్యక్షుడుగా బైడెన్‌ ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు, దేశ 49వ ఉపాధ్యక్షురాలిగా మన తమిళనాడు మూలాలున్న ఇండో–ఆఫ్రో అమెరికన్‌ మహిళ కమల హ్యారిస్‌(56) ప్రమాణ స్వీకారం చేశారు. ఆమెతో సుప్రీంకోర్టు న్యాయమూర్తి సోనియా సోటోమేయర్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. 

అమెరికా చరిత్రలోనే అతిపెద్ద వయస్కుడైన అధ్యక్షుడిగా జో బైడెన్‌(78) చరిత్ర సృష్టించారు. భార్య జిల్‌ బైడెన్‌తో కలిసి ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. మొదట సెనేటర్‌ అమీ క్లాబుకర్‌ ప్రారంభోపన్యాసం చేశారు. సెనెటర్‌ రాయ్‌బ్లంట్‌ ప్రారంభ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. అనంతరం, బైడెన్‌ కుటుంబానికి సన్నిహితుడైన రోమన్‌ కాథలిక్‌ మత ప్రబోధకుడు లియో జెరెమి ఓ డోనోవాన్‌ ప్రార్థనలు చేశారు. ఆ తరువాత లేడీ గాగా జాతీయ గీతాన్ని ఆలపించారు. జార్జియాలోని సౌత్‌ ఫల్టన్‌లో ఫైర్‌ రెస్క్యూ డిపార్ట్‌మెంట్‌కు కెప్టెన్‌గా ఎంపికైన తొలి ఆఫ్రో అమెరికన్‌ మహిళ ఆండ్రియా హాల్‌ ప్రతిజ్ఞ చేశారు. ఆ తరువాత, కమల హ్యారిస్‌తో సుప్రీంకోర్టు న్యాయమూర్తి సోనియా సోటోమేయర్‌ ప్రమాణం చేయించారు.

అనంతరం 2017లో తొలి యువ కవయిత్రి పురస్కారాన్ని పొందిన అమండా గార్మన్‌.. తాను రాసిన ఒక కవితను చదివి వినిపించారు. ఆ తరువాత, నటి, గాయని జెన్నిఫర్‌ లోపెజ్‌ ఒక పాటను ఆలపించారు. అనంతరం, డెలావర్‌లోని విల్మింగ్టన్‌లో ఉన్న బెతెల్‌ ఆఫ్రికన్‌ మెథడిస్ట్‌ ఎపిస్కోపల్‌ చర్చ్‌ పాస్టర్‌ సిల్విస్టర్‌ బీమన్‌ ఆశీస్సులు అందజేశారు. దేశాధ్యక్షుడిగా జో బైడెన్‌తో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జాన్‌ రాబర్ట్స్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారం అనంతరం బైడెన్‌ దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. అధ్యక్ష పదవిని వీడుతున్న డొనాల్డ్‌ ట్రంప్‌ మద్దతుదారులు అల్లర్లకు, దాడులకు పాల్పడే అవకాశముందన్న హెచ్చరికల నేపథ్యంలో.. క్యాపిటల్‌ భవనంలో, ప్రమాణ స్వీకార ప్రదేశంలో అసాధారణ స్థాయిలో బలగాలను మోహరించారు. 

ట్రంప్‌ రాలేదు.. పెన్స్‌ వచ్చారు
నూతన అధ్యక్షుడి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పదవి నుంచి వైదొలగుతున్న అధ్యక్షడు పాల్గొనడం ఆనవాయితీ. కానీ, ఆ సంప్రదాయాన్ని తోసిపుచ్చుతూ, బైడెన్‌ ప్రమాణ స్వీకారానికి ట్రంప్‌ హాజరు కాలేదు. ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. అలాగే, కోవిడ్‌–19 ముప్పు నేపథ్యంలో అసాధారణంగా, ఎంపిక చేసిన కొందరు ఆహూతుల సమక్షంలో జరిగిన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మాజీ అధ్యక్షులు ఒబామా, జార్జ్‌ బుష్, క్లింటన్‌ తమ సతీమణులతో కలిసి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి హాజరైన సుమారు వెయ్యి మందిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, కాంగ్రెస్‌ సభ్యులు కూడా ఉన్నారు. 

బైడెన్‌కు మోదీ అభినందనలు
న్యూఢిల్లీ: అమెరికా 46వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన జో బైడెన్‌కు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు. భారత్‌–అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు గాను బైడెన్‌తో కలిసి పనిచేయడానికి కంకణబద్ధుడనై ఉన్నానని పేర్కొన్నారు.  ఉమ్మడి సవాళ్లను ఎదుర్కొనేందుకు, అంతర్జాతీయ శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఐక్యంగా నిలుద్దామని అమెరికా నాయకత్వానికి పిలుపునిచ్చారు.  

►జో బైడెన్‌ అమెరికాకు రెండో క్యాథలిక్‌ అధ్యక్షుడు. అలాగే దేశానికి 46వ అధ్యక్షుడు.  
►127 ఏళ్ల నాటి తన కుటుంబ బైబిల్‌పై ప్రమాణం చేశారు. 
►ఈ కార్యక్రమానికి మాజీ అధ్యక్షుడు బిల్‌ క్లింటన్, జార్జి బుష్‌ బరాక్‌ ఒబామా హాజరయ్యారు. 
►ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌ జస్టిస్‌ థర్గుడ్‌ మార్షల్‌కు చెందిన బైబిల్‌పై ప్రమాణం చేశారు. 
►డొనాల్డ్‌ ట్రంప్‌ వీడ్కోలు కార్యక్రమానికి గైర్హాజరైన ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ బైడెన్‌ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు.   

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement