ఏం లైఫ్‌ రా అయ్యా.. రోగం వస్తే మింగే మందుల ఖర్చు ఎంతో తెలుసా? | This Year Burden Of Medicine On People Is 2453 Crores | Sakshi
Sakshi News home page

ఇది మనిషి జీవితం.. రోగం వస్తే మింగే మందుల ఖర్చు అంతనా.. పట్టపగలే చుక్కలు!

Aug 9 2022 2:12 AM | Updated on Aug 9 2022 3:20 PM

This Year Burden Of Medicine On People Is 2453 Crores - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జబ్బు చేస్తే రాష్ట్ర ప్రజలు మందుల కోసం చేసే ఖర్చు చూస్తే కళ్లు బైర్లు కమ్ముతాయి. తలసరి మందుల ఖర్చు ఏడాదికి రూ.663 ఉందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తాజాగా విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. ఈ విషయమై దేశంలో తెలంగాణ 12వ స్థానంలో నిలిచిందని తెలిపింది. కాగా, రాష్ట్ర జనాభా 3.7 కోట్లు అనుకుంటే ఆ ప్రకారం ఒక్కొక్కరు చేసే ఖర్చు మొత్తం కలిపి రూ. 2,453 కోట్లు అవుతుంది. కేవలం మందుల కోసమే ఇంత ఖర్చు చేస్తుంటే, ఇక జబ్బుకు ఇతరత్రా చికిత్సకయ్యే ఖర్చులు సరేసరి. తలసరి ఖర్చు రూ. 663 కాగా, ప్రిస్క్రిప్షన్‌ లేకుండా నేరుగా మెడికల్‌ షాపులకు వెళ్లి మందులు కొనడం ద్వారా అయ్యే ఖర్చు రూ.122 ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

ఈ విషయంపై ఇటీవల పార్లమెంటులో ప్రశ్నోత్తరాల సమయంలో చర్చకు వచ్చింది. తెలంగాణ ప్రజలు ఏటా వైద్యం కోసం రూ.7,844 కోట్లు ఖర్చు చేస్తున్నారు. అందులో 69 శాతం ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో వైద్యఖర్చులకే సరిపోతుంది. అంటే ఆపరేషన్లు, వైద్య పరీక్షలకు తదితరాలకు అన్నమాట. మిగిలిన 31 శాతం మందుల కోసం ఖర్చు చేస్తున్నారు. వైద్యం కోసం ఆస్తులు అమ్ముకోవడం, కుటుంబ పెద్ద చనిపోతే అనేక కుటుంబాలు పేదరికంలోకి పోతున్నాయి. కరోనా సమయంలో ఈ పరిస్థితి ఎక్కువగా చూశాం. ఫలితంగా అనేక కుటుంబాలు ఛిన్నాభిన్నమయ్యాయి. 

చుట్టుముడుతున్న ప్రమాదకర వ్యాధులు
ప్రస్తుత వ్యాధుల తీవ్రతకు, 2040 నాటికి గణనీయమైన మార్పులు చోటు చేసుకోనున్నాయి. బీపీ, షుగర్, స్థూలకాయం వంటి జీవనశైలి వ్యాధుల వల్ల అనేక ప్రమాదకర వ్యాధులు మున్ముందు పట్టిపీడిస్తాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. 2016 లెక్కల ప్రకారం దేశంలో గుండె, డయేరియా, రోడ్డు ప్రమాదాలు, నవజాత శిశుమరణాలు, ఎయిడ్స్, టీబీ, లంగ్‌ క్యాన్సర్, డయాబెటిక్, కిడ్నీ వ్యాధులు, అల్జీమర్స్, లివర్‌ క్యాన్సర్, బ్రెస్ట్‌ క్యాన్సర్‌లు అధికంగా జనాలను పీడిస్తున్నాయి. అట్టడుగున ఉన్న భయంకరమైన వ్యాధులు 2040 నాటికి మొదటిస్థానాల్లోకి వచ్చి చేరే పరిస్థితి నెలకొందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.

ఉదాహరణకు 2016 నాటి లెక్కల ప్రకారం 15వ స్థానంలో ఉన్న డయాబెటిక్‌ 2040 నాటికి ఏడో స్థానంలోకి వచ్చి చేరనుంది. 16వ స్థానంలో ఉన్న కిడ్నీ వ్యాధి 2040 నాటికి ఐదో స్థానానికి రానుంది. అల్జీమర్స్‌ 2016లో 18వ స్థానంలో ఉంటే, 2040 నాటికి ఆరో స్థానానికి రానుంది. 20వ స్థానంలో ఉన్న కాలేయ క్యాన్సర్‌ 13వ స్థానానికి రానుంది. గుండె సంబంధిత వ్యాధులు, గుండెపోట్లు 2040 నాటికి కూడా మొదటిస్థానంలోనే ఉంటాయి. 29వ స్థానంలో ఉన్న బ్రెస్ట్‌ క్యాన్సర్‌ 2040 నాటికి 19వ స్థానానికి రానుంది. ప్రస్తుతం వివిధ వ్యాధులు వస్తున్న 100 మందిలో 30 శాతం మంది మలేరియా, డెంగీ తదితర సీజనల్‌ వ్యాధులతో బాధపడుతున్నారు. 60 శాతం మంది షుగర్, బీపీ, కిడ్నీ, గుండె, కాలేయం తదితర వ్యాధులతో బాధపడుతున్నారు. 10 శాతం మంది వివిధ రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారు.

అందువల్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ 2025 నాటికి తన లక్ష్యాలను నిర్దేశించింది. పొగాకు వినియోగాన్ని 30 శాతానికి తగ్గించడం, శారీరక శ్రమ చేసేవారి సంఖ్యను మరో 10 శాతానికి పెంచడం, బీపీ సంఖ్య 25 శాతానికి తగ్గించడం, స్థూలకాయాన్ని సున్నా శాతానికి చేర్చడం, మద్యం అలవాటును 10 శాతానికి, ఉప్పు తీసుకోవడాన్ని 30 శాతానికి తగ్గించడం, 80 శాతం వరకు అత్యవసర మందులను అందుబాటులోకి తీసుకురావడంతోపాటు గుండెపోట్లను 50 శాతానికి తగ్గించాలని సూచించింది.   
ఇది కూడా చదవండి:  మీ పిల్లలు ఆరోగ్యంగానే తింటున్నారా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement