hospitals treatment
-
ఏం లైఫ్ రా అయ్యా.. రోగం వస్తే మింగే మందుల ఖర్చు ఎంతో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: జబ్బు చేస్తే రాష్ట్ర ప్రజలు మందుల కోసం చేసే ఖర్చు చూస్తే కళ్లు బైర్లు కమ్ముతాయి. తలసరి మందుల ఖర్చు ఏడాదికి రూ.663 ఉందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తాజాగా విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. ఈ విషయమై దేశంలో తెలంగాణ 12వ స్థానంలో నిలిచిందని తెలిపింది. కాగా, రాష్ట్ర జనాభా 3.7 కోట్లు అనుకుంటే ఆ ప్రకారం ఒక్కొక్కరు చేసే ఖర్చు మొత్తం కలిపి రూ. 2,453 కోట్లు అవుతుంది. కేవలం మందుల కోసమే ఇంత ఖర్చు చేస్తుంటే, ఇక జబ్బుకు ఇతరత్రా చికిత్సకయ్యే ఖర్చులు సరేసరి. తలసరి ఖర్చు రూ. 663 కాగా, ప్రిస్క్రిప్షన్ లేకుండా నేరుగా మెడికల్ షాపులకు వెళ్లి మందులు కొనడం ద్వారా అయ్యే ఖర్చు రూ.122 ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ విషయంపై ఇటీవల పార్లమెంటులో ప్రశ్నోత్తరాల సమయంలో చర్చకు వచ్చింది. తెలంగాణ ప్రజలు ఏటా వైద్యం కోసం రూ.7,844 కోట్లు ఖర్చు చేస్తున్నారు. అందులో 69 శాతం ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యఖర్చులకే సరిపోతుంది. అంటే ఆపరేషన్లు, వైద్య పరీక్షలకు తదితరాలకు అన్నమాట. మిగిలిన 31 శాతం మందుల కోసం ఖర్చు చేస్తున్నారు. వైద్యం కోసం ఆస్తులు అమ్ముకోవడం, కుటుంబ పెద్ద చనిపోతే అనేక కుటుంబాలు పేదరికంలోకి పోతున్నాయి. కరోనా సమయంలో ఈ పరిస్థితి ఎక్కువగా చూశాం. ఫలితంగా అనేక కుటుంబాలు ఛిన్నాభిన్నమయ్యాయి. చుట్టుముడుతున్న ప్రమాదకర వ్యాధులు ప్రస్తుత వ్యాధుల తీవ్రతకు, 2040 నాటికి గణనీయమైన మార్పులు చోటు చేసుకోనున్నాయి. బీపీ, షుగర్, స్థూలకాయం వంటి జీవనశైలి వ్యాధుల వల్ల అనేక ప్రమాదకర వ్యాధులు మున్ముందు పట్టిపీడిస్తాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. 2016 లెక్కల ప్రకారం దేశంలో గుండె, డయేరియా, రోడ్డు ప్రమాదాలు, నవజాత శిశుమరణాలు, ఎయిడ్స్, టీబీ, లంగ్ క్యాన్సర్, డయాబెటిక్, కిడ్నీ వ్యాధులు, అల్జీమర్స్, లివర్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్లు అధికంగా జనాలను పీడిస్తున్నాయి. అట్టడుగున ఉన్న భయంకరమైన వ్యాధులు 2040 నాటికి మొదటిస్థానాల్లోకి వచ్చి చేరే పరిస్థితి నెలకొందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఉదాహరణకు 2016 నాటి లెక్కల ప్రకారం 15వ స్థానంలో ఉన్న డయాబెటిక్ 2040 నాటికి ఏడో స్థానంలోకి వచ్చి చేరనుంది. 16వ స్థానంలో ఉన్న కిడ్నీ వ్యాధి 2040 నాటికి ఐదో స్థానానికి రానుంది. అల్జీమర్స్ 2016లో 18వ స్థానంలో ఉంటే, 2040 నాటికి ఆరో స్థానానికి రానుంది. 20వ స్థానంలో ఉన్న కాలేయ క్యాన్సర్ 13వ స్థానానికి రానుంది. గుండె సంబంధిత వ్యాధులు, గుండెపోట్లు 2040 నాటికి కూడా మొదటిస్థానంలోనే ఉంటాయి. 29వ స్థానంలో ఉన్న బ్రెస్ట్ క్యాన్సర్ 2040 నాటికి 19వ స్థానానికి రానుంది. ప్రస్తుతం వివిధ వ్యాధులు వస్తున్న 100 మందిలో 30 శాతం మంది మలేరియా, డెంగీ తదితర సీజనల్ వ్యాధులతో బాధపడుతున్నారు. 60 శాతం మంది షుగర్, బీపీ, కిడ్నీ, గుండె, కాలేయం తదితర వ్యాధులతో బాధపడుతున్నారు. 10 శాతం మంది వివిధ రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారు. అందువల్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ 2025 నాటికి తన లక్ష్యాలను నిర్దేశించింది. పొగాకు వినియోగాన్ని 30 శాతానికి తగ్గించడం, శారీరక శ్రమ చేసేవారి సంఖ్యను మరో 10 శాతానికి పెంచడం, బీపీ సంఖ్య 25 శాతానికి తగ్గించడం, స్థూలకాయాన్ని సున్నా శాతానికి చేర్చడం, మద్యం అలవాటును 10 శాతానికి, ఉప్పు తీసుకోవడాన్ని 30 శాతానికి తగ్గించడం, 80 శాతం వరకు అత్యవసర మందులను అందుబాటులోకి తీసుకురావడంతోపాటు గుండెపోట్లను 50 శాతానికి తగ్గించాలని సూచించింది. ఇది కూడా చదవండి: మీ పిల్లలు ఆరోగ్యంగానే తింటున్నారా? -
ఆస్పత్రికి పోతే అప్పుల పాలే
- బిల్లులు లక్షల్లో.. ప్రభుత్వాల రీయింబర్స్మెంట్ వేలల్లో - లబోదిబోమంటున్న ఉద్యోగులు.. పెన్షనర్లదీ అదే దుస్థితి - ఒప్పందం ఉల్లంఘించి లక్షల్లో బిల్లులు - వసూలు చేస్తున్న కార్పొరేట్ ఆస్పత్రులు - ఆస్పత్రుల నియంత్రణలో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు విఫలం - ఏటా సగటున 50 వేలమందిపై రూ.300 కోట్ల భారం - నగదు రహిత వైద్యం అమలు చేయకపోవడంతో నష్టపోతున్న వైనం సాక్షి, హైదరాబాద్: అనారోగ్యంతో ఆస్పత్రుల్లో చికిత్స కోసం చేరుతున్న ఉద్యోగులు, పెన్షనర్లను.. రాష్ట్ర ప్రభుత్వాలు, కార్పొరేట్ ఆస్పత్రులు కలసి అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నాయి. ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్) కింద రీయింబర్స్మెంట్ వస్తుంది కదా అనే ధైర్యంతో ఆస్పత్రుల్లో చేరుతున్నవారు చివరకు ప్రభుత్వాలు మంజూరు చేస్తున్న బిల్లులు చూసి లబోదిబోమంటున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (సీజీహెచ్ఎస్) రేట్ల ప్రకారం వైద్య చికిత్సలు చేయాల్సిన ఆస్పత్రులు.. ప్రభుత్వాలతో కుదుర్చుకున్న ఒప్పందాలను ఉల్లంఘించి అధిక బిల్లులతో రోగులను పిండుకుంటున్నాయి. మరోవైపు లక్షల్లో బిల్లులు వేస్తున్న ఆస్పత్రులను నియంత్రించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ పరిస్థితి ఉంది. పూర్తిగా నగదు రహిత వైద్య సదుపాయాన్ని అందుబాటులోకి తేవడమే దీనికి పరిష్కారమని అధికారులు సూచిస్తున్నా.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. దీంతో ఏటా సగటున యాభైవేల మంది ఉద్యోగులు, పెన్షనర్లు వైద్య బిల్లుల కారణంగా అప్పులపాలవుతున్నారు. ఏదైనా జబ్బుతో కార్పొరేట్ ఆస్పత్రిలో చేరారంటే ఆ అప్పునుంచి ఏళ్ల తరబడి కోలుకోలేని పరిస్థితి ఎదురవుతోంది. ఇక పెన్షనర్ల పరిస్థితి మరింత దయనీయంగా ఉంటోంది. ఏటా పరిశీలనకు 50 వేల దరఖాస్తులు ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగులు, పెన్షనర్లు 8.5 లక్షల మంది ఉండగా, తెలంగాణలో 5 లక్షల వర కు ఉన్నారు. వీరికి సంబంధించిన మెడికల్ బిల్లులు ఏటా సగటున 50 వేల వరకు వైద్య విద్యా సంచాలకుల పరిశీలనకు వస్తున్నాయి. ఈ 50 వేల దరఖాస్తులకు సంబంధించి ప్రైవేటు ఆస్పత్రులు, నర్సింగ్ హోంలు, కార్పొరేట్ ఆస్పత్రులు ఇస్తున్న బిల్లుల అంచనా రూ.700 కోట్లకు పైనే. కానీ ఉద్యోగులకు రాష్ర్ట్ర ప్రభుత్వాలు ప్యాకేజీ (సీజీహెచ్ఎస్) రేట్ల కింద రీయింబర్స్మెంట్ చేస్తున్నది మాత్రం రూ.400 కోట్లు మాత్రమే. అంటే సగటున 50 వేలమంది ఉద్యోగులు, పెన్షనర్లపై ఏటా రూ.300 కోట్ల మేర భారం పడుతోందన్నమాట. ఆస్పత్రులకు ముందు సొమ్ము చెల్లించి ఆ తర్వాత రీయింబర్స్మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉండటంతో ఈ పరిస్థితి తలెత్తుతోంది. అమలుకు నోచని నగదు రహిత వైద్యం ఉద్యోగులకు నగదు రహిత వైద్యం అమల్లోకి తెస్తామని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు గత రెండేళ్లుగా చెబుతున్నా ఇప్పటికీ అమల్లోకి రాలేదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగులు, పెన్షనర్ల నుంచి నెల నెలా ప్రీమియం డబ్బు వసూలు చేస్తున్నా ప్రయోజనం శూన్యం. ప్రీమియం కొంత అధికంగా తీసుకునైనా తమకు నగదు రహిత వైద్యం అందించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వాలు.. తూతూ మంత్రంగా కార్పొరేట్ ఆస్పత్రులతో భేటీలు జరుపుతున్నాయే తప్ప ఫలితం ఉండటం లేదు. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉద్యోగులు ఆస్పత్రుల్లో చేరితే డబ్బులు పూర్తిగా చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత ప్రభుత్వాలు ఏ ఆరు మాసాల్లోపో సీజీహెచ్ఎస్ రేట్ల ప్రకారం బిల్లులు మంజూరు చేస్తుండటంతో అప్పులపాలవుతున్నారు. పొంతనలేని రేట్లు కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం కింద ఉన్న రేట్ల ప్రకారమే కార్పొరేట్ ఆస్పత్రులు వైద్యం అందించాల్సి ఉండగా.. అవి వేస్తున్న బిల్లులు మాత్రం మూడు, నాలుగు రెట్లు ఉంటుండడం గమనార్హం. కొన్ని జబ్బులకు సంబంధించిన రేట్లను పరిశీలిస్తే... - కంటికి సంబంధించిన ఏ జబ్బుకైనా సీజీహెచ్ఎస్ కింద గరిష్టంగా రూ.18 వేల రీయింబర్స్మెంట్కే అవకాశం ఉంది. కానీ కార్పొరేట్ ఆస్పత్రులు జబ్బును బట్టి రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు బిల్లు వేస్తున్నాయి. - లాంగ్బోన్ సర్జరీకి ప్యాకేజీ రేటు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు ఉండగా.. ఆస్పత్రులు రూ.1.50 లక్షల వరకు వసూలు చేస్తున్నాయి. - మోకాలి చిప్ప మార్పిడికి ఒక్కో దానికి రూ.1.56 లక్షలు ఉంటే కార్పొరేట్ బిల్లు రూ.2 లక్షలకు పైగానే వస్తోంది. - గుండెకు సంబంధించిన శస్త్రచికిత్సకు ప్రభుత్వం గరిష్టంగా రూ.2 లక్షలే ఇస్తుంది. కానీ ఆస్పత్రుల బిల్లు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు అవుతోంది. - గుండెకు స్టెంట్లు (2) వేస్తే ప్రభుత్వం గరిష్టంగా రూ.2 లక్షలు ఇస్తుండగా రూ.4 లక్షలు పైనే వేస్తున్నారు. - తుంటి ఎముకకు శస్త్రచికిత్స చేస్తే వచ్చే బిల్లు రూ.20 వేలకు మించి లేదు. కానీ ఆస్పత్రులు రూ.70 వేలు బిల్లు వేస్తున్నాయి. - హెర్నియా సర్జరీకి (మందులు, సేవలు కలిపి) రూ.50 వేలు మించి లేదు. కానీ రూ.3 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. ఈహెచ్ఎస్ వస్తేనే న్యాయం జరుగుతుంది కార్పొరేట్ ఆస్పత్రులు ఎక్కువ రేట్లు వేస్తున్న విషయం వాస్తవమే. కానీ వాటిని నియంత్రించలేకపోతున్నాం. దీనివల్ల ఉద్యోగులు, పెన్షనర్లు అధికంగా బిల్లులు చెల్లిస్తున్నదీ వాస్తవమే. దీనికి పరిష్కారం నగదు రహిత వైద్యం మినహా మరొకటి లేదు. త్వరలో దీన్ని అమల్లోకి తెచ్చేందుకు యత్నిస్తున్నాం. - డాక్టర్ ఎన్.సుబ్బారావు, వైద్యవిద్యా సంచాలకులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే ముందుకురావడం లేదు.. పెన్షనర్లు లక్ష రూపాయలు వైద్యం కోసం ఖర్చు చేస్తే కొన్నిసార్లు రూ.10 వేలు కూడా రాని పరిస్థితి. వారి ఆవేదన వర్ణనాతీతం. మాకు ఉచిత వైద్యమొద్దు. డబ్బు తీసుకుని కార్పొరేట్ వైద్యం అందించాలని కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కార్పొరేట్ ఆస్పత్రులు మూడు ప్యాకేజీల ఆప్షన్ ఇచ్చారు. కానీ ప్రభుత్వమే ముందుకు రావడం లేదు. - పి.వెంకటరెడ్డి, పీఆర్టీయూ మాజీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం ఆదేశాలతోనే సరి ఉద్యోగులకు నగదు రహిత వైద్యం అందించాలని ముఖ్యమంత్రి నాలుగు నెలల క్రితం ఆదేశాలిచ్చారు. ఉద్యోగులే ట్రస్ట్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. కానీ ఇప్పటివరకు ట్రస్ట్ ఏర్పాటుకు జీవో లేదు, మేనేజింగ్ కమిటీ లేదు. హైదరాబాద్లోని 15 కార్పొరేట్ ఆస్పత్రులతో పాటు చెన్నై, బెంగళూరుల్లో ఉన్న కొన్ని ఆస్పత్రుల్లోనూ ఈహెచ్ఎస్ వర్తింప చేయాలని సీఎం చెప్పారు.. కానీ ఏదీ అమలుకు నోచుకోలేదు. ఉద్యోగులు, పెన్షనర్లు నెలనెలా డబ్బులు చెల్లిస్తున్నా నగదు రహిత వైద్యం అందడం లేదు. - కత్తి నరసింహారెడ్డి, ఎస్టీయూ రాష్ర్ట అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్