ఆస్పత్రికి పోతే అప్పుల పాలే
- బిల్లులు లక్షల్లో.. ప్రభుత్వాల రీయింబర్స్‌మెంట్ వేలల్లో
- లబోదిబోమంటున్న ఉద్యోగులు.. పెన్షనర్లదీ అదే దుస్థితి
- ఒప్పందం ఉల్లంఘించి లక్షల్లో బిల్లులు
- వసూలు చేస్తున్న కార్పొరేట్ ఆస్పత్రులు
- ఆస్పత్రుల నియంత్రణలో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు విఫలం
- ఏటా సగటున 50 వేలమందిపై రూ.300 కోట్ల భారం
- నగదు రహిత వైద్యం అమలు చేయకపోవడంతో నష్టపోతున్న వైనం
సాక్షి, హైదరాబాద్: అనారోగ్యంతో ఆస్పత్రుల్లో చికిత్స కోసం చేరుతున్న ఉద్యోగులు, పెన్షనర్లను.. రాష్ట్ర ప్రభుత్వాలు, కార్పొరేట్ ఆస్పత్రులు కలసి అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నాయి. ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్‌ఎస్) కింద రీయింబర్స్‌మెంట్ వస్తుంది కదా అనే ధైర్యంతో ఆస్పత్రుల్లో చేరుతున్నవారు చివరకు ప్రభుత్వాలు మంజూరు చేస్తున్న బిల్లులు చూసి లబోదిబోమంటున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (సీజీహెచ్‌ఎస్) రేట్ల ప్రకారం వైద్య చికిత్సలు చేయాల్సిన ఆస్పత్రులు.. ప్రభుత్వాలతో కుదుర్చుకున్న ఒప్పందాలను ఉల్లంఘించి అధిక బిల్లులతో రోగులను పిండుకుంటున్నాయి.
మరోవైపు లక్షల్లో బిల్లులు వేస్తున్న ఆస్పత్రులను నియంత్రించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ పరిస్థితి ఉంది. పూర్తిగా నగదు రహిత వైద్య సదుపాయాన్ని అందుబాటులోకి తేవడమే దీనికి పరిష్కారమని అధికారులు సూచిస్తున్నా.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. దీంతో ఏటా సగటున యాభైవేల మంది ఉద్యోగులు, పెన్షనర్లు వైద్య బిల్లుల కారణంగా అప్పులపాలవుతున్నారు. ఏదైనా జబ్బుతో కార్పొరేట్ ఆస్పత్రిలో చేరారంటే ఆ అప్పునుంచి ఏళ్ల తరబడి కోలుకోలేని పరిస్థితి ఎదురవుతోంది. ఇక పెన్షనర్ల పరిస్థితి మరింత దయనీయంగా ఉంటోంది.
ఏటా పరిశీలనకు 50 వేల దరఖాస్తులు
ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగులు, పెన్షనర్లు 8.5 లక్షల మంది ఉండగా, తెలంగాణలో 5 లక్షల వర కు ఉన్నారు. వీరికి సంబంధించిన మెడికల్ బిల్లులు ఏటా సగటున 50 వేల వరకు వైద్య విద్యా సంచాలకుల పరిశీలనకు వస్తున్నాయి. ఈ 50 వేల దరఖాస్తులకు సంబంధించి ప్రైవేటు ఆస్పత్రులు, నర్సింగ్ హోంలు, కార్పొరేట్ ఆస్పత్రులు ఇస్తున్న బిల్లుల అంచనా రూ.700 కోట్లకు పైనే. కానీ ఉద్యోగులకు రాష్ర్ట్ర ప్రభుత్వాలు ప్యాకేజీ (సీజీహెచ్‌ఎస్) రేట్ల కింద రీయింబర్స్‌మెంట్ చేస్తున్నది మాత్రం రూ.400 కోట్లు మాత్రమే. అంటే సగటున 50 వేలమంది ఉద్యోగులు, పెన్షనర్లపై ఏటా రూ.300 కోట్ల మేర భారం పడుతోందన్నమాట. ఆస్పత్రులకు ముందు సొమ్ము చెల్లించి ఆ తర్వాత రీయింబర్స్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉండటంతో ఈ పరిస్థితి తలెత్తుతోంది.
అమలుకు నోచని నగదు రహిత వైద్యం
ఉద్యోగులకు నగదు రహిత వైద్యం అమల్లోకి తెస్తామని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు గత రెండేళ్లుగా చెబుతున్నా ఇప్పటికీ అమల్లోకి రాలేదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగులు, పెన్షనర్ల నుంచి నెల నెలా ప్రీమియం డబ్బు వసూలు చేస్తున్నా ప్రయోజనం శూన్యం. ప్రీమియం కొంత అధికంగా తీసుకునైనా తమకు నగదు రహిత వైద్యం అందించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వాలు.. తూతూ మంత్రంగా కార్పొరేట్ ఆస్పత్రులతో భేటీలు జరుపుతున్నాయే తప్ప ఫలితం ఉండటం లేదు. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉద్యోగులు ఆస్పత్రుల్లో చేరితే డబ్బులు పూర్తిగా చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత ప్రభుత్వాలు ఏ ఆరు మాసాల్లోపో సీజీహెచ్‌ఎస్ రేట్ల ప్రకారం బిల్లులు మంజూరు చేస్తుండటంతో అప్పులపాలవుతున్నారు.
పొంతనలేని రేట్లు
కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం కింద ఉన్న రేట్ల ప్రకారమే కార్పొరేట్ ఆస్పత్రులు వైద్యం అందించాల్సి ఉండగా.. అవి వేస్తున్న బిల్లులు మాత్రం మూడు, నాలుగు రెట్లు ఉంటుండడం గమనార్హం. కొన్ని జబ్బులకు సంబంధించిన రేట్లను పరిశీలిస్తే...
- కంటికి సంబంధించిన ఏ జబ్బుకైనా సీజీహెచ్‌ఎస్ కింద గరిష్టంగా రూ.18 వేల రీయింబర్స్‌మెంట్‌కే అవకాశం ఉంది. కానీ కార్పొరేట్ ఆస్పత్రులు జబ్బును బట్టి రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు బిల్లు వేస్తున్నాయి.
- లాంగ్‌బోన్ సర్జరీకి ప్యాకేజీ రేటు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు ఉండగా.. ఆస్పత్రులు రూ.1.50 లక్షల వరకు వసూలు చేస్తున్నాయి.
- మోకాలి చిప్ప మార్పిడికి ఒక్కో దానికి రూ.1.56 లక్షలు ఉంటే కార్పొరేట్ బిల్లు రూ.2 లక్షలకు పైగానే వస్తోంది.
- గుండెకు సంబంధించిన శస్త్రచికిత్సకు ప్రభుత్వం గరిష్టంగా రూ.2 లక్షలే ఇస్తుంది. కానీ ఆస్పత్రుల బిల్లు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు అవుతోంది.
- గుండెకు స్టెంట్‌లు (2) వేస్తే ప్రభుత్వం గరిష్టంగా రూ.2 లక్షలు ఇస్తుండగా రూ.4 లక్షలు పైనే వేస్తున్నారు.
- తుంటి ఎముకకు శస్త్రచికిత్స చేస్తే వచ్చే బిల్లు రూ.20 వేలకు మించి లేదు. కానీ ఆస్పత్రులు రూ.70 వేలు బిల్లు వేస్తున్నాయి.
- హెర్నియా సర్జరీకి (మందులు, సేవలు కలిపి) రూ.50 వేలు మించి లేదు. కానీ రూ.3 లక్షల వరకు వసూలు చేస్తున్నారు.
ఈహెచ్‌ఎస్ వస్తేనే న్యాయం జరుగుతుంది
కార్పొరేట్ ఆస్పత్రులు ఎక్కువ రేట్లు వేస్తున్న విషయం వాస్తవమే. కానీ వాటిని నియంత్రించలేకపోతున్నాం. దీనివల్ల ఉద్యోగులు, పెన్షనర్లు అధికంగా బిల్లులు చెల్లిస్తున్నదీ వాస్తవమే. దీనికి పరిష్కారం నగదు రహిత వైద్యం మినహా మరొకటి లేదు. త్వరలో దీన్ని అమల్లోకి తెచ్చేందుకు యత్నిస్తున్నాం.
- డాక్టర్ ఎన్.సుబ్బారావు, వైద్యవిద్యా సంచాలకులు, ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వమే ముందుకురావడం లేదు..
పెన్షనర్లు లక్ష రూపాయలు వైద్యం కోసం ఖర్చు చేస్తే కొన్నిసార్లు రూ.10 వేలు కూడా రాని పరిస్థితి. వారి ఆవేదన వర్ణనాతీతం. మాకు ఉచిత వైద్యమొద్దు. డబ్బు తీసుకుని కార్పొరేట్ వైద్యం అందించాలని కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కార్పొరేట్ ఆస్పత్రులు మూడు ప్యాకేజీల ఆప్షన్ ఇచ్చారు. కానీ ప్రభుత్వమే ముందుకు రావడం లేదు.
- పి.వెంకటరెడ్డి, పీఆర్‌టీయూ మాజీ అధ్యక్షుడు, తెలంగాణ
సీఎం ఆదేశాలతోనే సరి
ఉద్యోగులకు నగదు రహిత వైద్యం అందించాలని ముఖ్యమంత్రి నాలుగు నెలల క్రితం ఆదేశాలిచ్చారు. ఉద్యోగులే ట్రస్ట్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. కానీ ఇప్పటివరకు ట్రస్ట్ ఏర్పాటుకు జీవో లేదు, మేనేజింగ్ కమిటీ లేదు. హైదరాబాద్‌లోని 15 కార్పొరేట్ ఆస్పత్రులతో పాటు చెన్నై, బెంగళూరుల్లో ఉన్న కొన్ని ఆస్పత్రుల్లోనూ ఈహెచ్‌ఎస్ వర్తింప చేయాలని సీఎం చెప్పారు.. కానీ ఏదీ అమలుకు నోచుకోలేదు. ఉద్యోగులు, పెన్షనర్లు నెలనెలా డబ్బులు చెల్లిస్తున్నా నగదు రహిత వైద్యం అందడం లేదు.
- కత్తి నరసింహారెడ్డి, ఎస్టీయూ రాష్ర్ట అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్