జీవితం క్షణ భంగురం అని తెలిసి కూడా చేయరాని పనులు చేసి మనిషి ఎన్నో అగచాట్లు పడుతుంటాడు. కొందరు అధికారం, అహం, ఆవేశం, అసూయ అనే 'అ'అక్షరం పట్టుకుని ఆఖరికి.. 'ఆ!'.... అని అర్రుల చాచుతూ ఆక్రందన చేసే పరిస్థితిని కొనితెచ్చుకుంటారు. మరికొందరు కామం, క్రోధం, అనే వాటితో క్షమార్హమైన పనులకు పాల్పడి కష్టాల కడలిలో కొట్టుకుపోతుంటారు.
పగ, పిసినారితనం, అనే 'ప' అక్షరాన్ని పట్టుకుని పడరాని పాట్లు పడి పెడబొబ్బలు పెడుతుంటారు మరికొందరు. ఆ తర్వాత ఏదో జబ్బు చేసో లేక అనుకోని ప్రమాదంలోనో తనువు చాలిస్తారు. మన జీవితం ఎలా ఉంది అని ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే అసహ్యం కలగకూడదు.
ఏంటిది! జీవితం ఇలా వృథా చేసుకున్నానా? అని తెలుసుకునేలోపే మన కథ ముగిసిపోతుంది. అందుకే అంటారు పెద్దలు బతికి ఉన్నప్పుడే నలుగురికి ఉపయోగపడే పనులు కనీసం ఒక్కటైన చేసి మనిషి అనిపించుకోమని. కనీసం కౌమర, యవ్వన దశలో తెలిసో తెలియకో ఉడుకురక్తంతో ఉచితానుచితాలు ఆలోచించకుండా చేసి ఉండొచ్చు.
కనీసం వృద్ధాప్యంలోనైనా తనకు చేతనైనంతలో ఇతరులకు సేవ చేసి తరించాలి. బహుశా అందుకే కాబోలు పెద్దలు మనిషి జీవితం విస్తరాకులాంటిది అని చెప్పారేమో! ఎందుకిలా అన్నారంటే.. ఇది వరకు ఎక్కువగా పెళ్లిళ్లు, పేరంటాలు, వేడుకల్లో.. భోజనాలు విస్తరాకుల్లోనే వడ్డించేవారు. అందువల్ల దీనితో మనిషి జీవితాన్ని పోల్చి ఉండవచ్చు.
ఇక మనిషి జీవితానికి విస్తరాక్కి ఉన్న పోలిక ఏంటో చూస్తే.. భోజనం చేసేటప్పుడు మనం కొద్దిగా నీళ్లు విస్తరిలో జల్లి శుభ్రంగా చేసుకుంటాం. ఆ తర్వాత భోజనం పూర్తయ్యేవరకు దానిని జాగ్రత్తగా చూసుకుంటాం. తిన్న మరుక్షణం, ఆ ఆకుని మడిచి దూరంగా విసిరేస్తాం. మనిషి జీవితం కూడా అంతే! ఊపిరి పోగానే ఒక్క క్షణం కూడా ఉంచం.
అయితే ఇక్కడ విస్తరాకు పడేసినప్పుడు అది సంతోషడుతుందట. ఎందుకంటే తాను పోయే ముందు కనీసం ఒక్కరి ఆకలినైనా తీర్చటానికి ఉపయోగపడ్డానులే అని తృప్తి పడుతుందట. కానీ మనిషికి ఆ తృప్తి ఉండదు.
పోయే ముందు వరకు ఏదో ఒక వ్యాపకంతో సతమతమవుతూ.. ఎవరో ఒకరితో పోట్లాడుతూనే ఉంటాడు మనిషి. చేద్దాంలే సేవ అనుకునేలోపే జీవితం జగడాలు, పట్టింపులతో ముగిసిపోతుంది. ఏ క్షణం మనల్ని మృత్యువు కౌగిలించుకుంటుందో చెప్పలేం. ఆ తరుణం రాగానే మన ఒంటిపై గుడ్డకూడా ఉంచరు.
ఎంత పెద్ద ధనికుడైన శ్మశానానికి చేరుకోవాల్సిందే. ఏ డబ్బు కోసం అందరితో తగవులాడి, శత్రుత్వం తెచ్చుకున్నామో.. ఆ సొత్తులోంచి ఒక్క చిల్లిగవ్వ కూడా తీసుకుపోలేం. అందుకే పెద్దలు ఊపిరి ఉన్నప్పుడే నలుగురుకి ఉపయోగపడే పనులు చేసేలా జీవించండిరా! అని హితవు చెప్పేది. లేదంటే విస్తరాకు పాటి విలువ కూడా లేని వృథా జీవితంగా మారుతుందని వారి హెచ్చరిక.
(చదవండి: సీతమ్మ తల్లి తనువు చాలించిన ప్రదేశం ఎక్కడో తెలుసా!)
Comments
Please login to add a commentAdd a comment