
లోకం నోరు చాలా పెద్దదే కాక బలమైనది కూడా. ఎంత మాట మాట్లాడటానికి కూడా వెరవదు. రాజును గురించి మాట్లాడు తున్నామా లేక ఆ రాజు దగ్గర పనిచేసే సేవకుడిని గురించి మాట్లాడుతున్నామా అన్న ఆలోచన లోకానికి ఉండదు. వాళ్ళిద్దరి మధ్య తేడా ఉన్నట్లుగా అది గుర్తించదు.
లోకానికి అందరూ సమానమే! కనుక ఎవరి గురించైనా ఎంత మాటైనప్పటికీ ఏ భయమూ లేకుండా అనేసి, అక్కడితో తన పని అయిపోయినట్లుగా చేతులు దులుపుకుని నిలబడి, ఆ తరువాత ఏమి జరుగుతుందో చూస్తూ ఉంటుంది. లోకం మాటలు నచ్చనపుడు, ఆ లోకం నోరు నొక్కాలని చేసే ప్రయత్నాలు ఎవరికీ సఫలం కావు. లోకం నోరు ఎక్కడి నుండి ఎక్కడికి వ్యాపించి ఉన్నదో కనిపెట్టగలిగినవాడు ఈ లోకంలో లేడు. అది తెలిసినవాడు కనుకనే శ్రీరాముడంతటి ప్రభువు కూడా లోకం నోరు నొక్కే ప్రయత్నం చేయలేదు. సీతమ్మపై వేసిన నిందకు ఆధారం చూపమని లోకాన్ని నిలదియ్య లేదు. అది వృథా పని అని తెలిసి శ్రీరాముడు అలా చేయలేదు. దానికి బదులుగా, లోకం తన నుండి ఏమి ఆశిస్తున్నదో ఊహించి, ఆ పనిని, అది అన్యాయమని అనిపించినప్పటికీ, భరించలేని బాధకు గురిచేసినప్పటికీ, చేశాడు శ్రీరాముడు అని లక్ష్మణుడి చేత సీతమ్మకు చెప్పించాడు తిక్కన మహాకవి ‘నిర్వచనోత్తర రామాయణం’లోని ఈ కింది పద్యంలో.
ఏనిం కేమని చెప్పుదున్ రఘుకులాధీశున్ జగంబెల్ల నీ
కై నిందింపగ జాల నొచ్చి యిది మిథ్యావాద మైనన్ సమా
ధానం బేర్పడ జేయకున్న నిజవృత్తం బెంతయున్ దూషితం
బై నీచత్వము రాక తక్కదని యూహాపోహ సంవేదియై.
‘నేనింక ఏమని చెప్పను తల్లీ! లోకమంతా నిందించడంతో కలత చెందారు శ్రీరాములవారు! అదంతా అబద్ధమనీ, అందులో ఎంతమాత్రమూ నిజం లేదన్నది తెలుస్తున్నప్పటికీ, లోకుల నిందకు సరైన సమాధానం చెప్పేదిగా అనిపించే ప్రతిక్రియను వెంటనే చేయకపోతే, అది చాలా నీచమైన పరిస్థితులకు దారి తీస్తుందని ఊహించి, లోకం తీరుకు కలత చెంది’ ఇలా చేయ మన్నారని సీతమ్మకు సంగతిని వివరించి చెప్పి, అడవిలో విడిచి వెళుతూ దుఃఖించాడు లక్ష్మణుడు.
– భట్టు వెంకటరావు