human nature
-
స్వయం శిక్షణ
నేడు మారుతున్న కాలానికనుగుణంగా పురోభివృద్ధితో పాటు సమాజంలో పగ, వైరం, ద్వేషం, అసూయ, అల్పబుద్ధి, హింస పెరిగి పోతున్నాయి. నైతిక స్వభావంలో లోపం ఏర్పడడం వల్లనే ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా అభ్యుదయాత్మకమైన మనోవైఖరి అలవరచుకుంటే అన్ని సమస్యలు పరిష్కరించుకోవచ్చన్న విషయాన్ని అవగతం చేసుకోవాలి. నిశ్చయాత్మకంగా ఉండే లక్షణం అలవడినపుడు కష్టాలు ఎదురైనా మనస్సు అదుపు తప్పదు. ఈ క్రమంలో... పరిస్థితులకు భయపడని వాడు తనకు తాను మిత్రుడవుతాడు. స్వయంశిక్షణ అంటే తన ఆలోచనలను, తన అధీనంలో ఉంచుకోవడం. ఇది ఒక వ్యక్తికి నిశ్చయాత్మకంగా ఆలోచించే శక్తినిస్తుంది. స్వయంశిక్షణ మనస్సును అన్ని రకాలైన బలహీనతల నుంచి రక్షించి జీవితానికి ఒక ప్రత్యేక విలువనూ, యోగ్యతనూ ఇస్తుంది. నైతిక ప్రమాణాలను విశ్వాసంతో క్రమబద్ధంగా అనుష్టించడం ద్వారా విశ్వాసం పెరిగి పరిణితి లభిస్తుంది. ఈ విశ్వాసం పెరగాలంటే క్రమశిక్షణ అనేది అత్యంత ఆవశ్యకమని గుర్తెరగాలి. క్రమశిక్షణ అనేది ఏదో కొన్ని విషయాలల్లో కాకుండా అన్నింటిలోనూ అలవరచుకోవాలి. ఒక ఇనుప కడ్డీని అయస్కాంతంగా మారిస్తే, అది దాని బరువు కన్నా 12 రెట్లు అధికంగా ఉన్న బరువును ఎత్తగలదు. అయితే అది దాని అయస్కాంత శక్తిని కోల్పోతే మాత్రం ఒక చిన్న గుండు సూదిని కూడా ఎత్తలేదు. మనిషి మనస్సు కూడా అంతే. నిశ్చయాత్మకంగా, నిర్మలంగా, నిలకడగా ఉంటే మనిషి పరిస్థితులను తన అ«ధీనంలో ఉంచుకుని అద్భుతాలు చెయ్యగలడు. ప్రపంచంలోని గొప్ప గొప్ప వారందరికీ గుర్తింపు రావడానికి కారణం వ్యతిరేక భావాలను అధిగమించే శక్తి. నిశ్చయాత్మకంగా ఉండడమేనని, వారు తమ మనస్సును నిశ్చయాత్మక భావనలతో నింపి ఉంచడం వల్లనే ఆ స్థాయికి వెళ్ళారని అవగతం చేసుకోవాలి. మనిషి స్వప్రయత్నం తో తనను తాను ఉద్ధరించుకోవాలని, తనను తాను కించపరచుకోకుండా ఉండాలని భగవద్గీతలో కృష్ణపరమాత్మ అర్జునుడికి తెలియ చేశాడు. మనిషి తనకు తానే శత్రువు, అలాగే, తనకు తానే మిత్రుడు కూడా. ప్రపంచం పట్ల, తమ పట్ల సానుకూలమైన, నిర్మాణాత్మకమైన, నిర్మలమైన స్నేహ వైఖరిని అలవరచుకుని తమకు తామే మిత్రులవ్వాలి. వ్యతిరేక భావాలతో వ్యతిరేక చర్యలు చేపట్టేవారికి బతుకు వ్యర్థం అవుతుంది. దీనికి మన నిత్య జీవితంలో కనిపించే చీమలు మనకు ఎన్నో పాఠాలు నేర్పుతాయి. తమను ఎవరైనా ఆపినా, లేక వాటి మార్గంలో ఏదైనా అడ్డు వచ్చినా చీమలు ఆగవు. అడ్డంగా ఉన్న దాని మీదకు ఎక్కి దానిని దాటుతాయి. లేదంటే మరో మార్గంలో ముందుకు వెళతాయి. కానీ అవి ఆగవు. అంటే దీనివల్ల చేపట్టిన పని పూర్తయ్యే వరకు లక్ష్యాన్ని సాధించే వరకూ ఆగకూడదని నిగూఢం గా చీమలు మనకు తెలియ చేస్తున్నాయి. అలాగే, చీమలు వేసవి కాలంలో శీతాకాలం గురించే ఆలోచిస్తాయి. చలి కాలానికి కావల్సిన ఆహారాన్ని కూడా అవి వేసవిలోనూ సేకరిస్తాయి. అంతేకాదు రుతువుల్లోని మార్పులకు అవి అసంతృప్తి ప్రకటించవు. సముద్రపుటొడ్డున ఇసుకలో సూర్యరశ్మిలో ఆనందిస్తున్నట్టే, ఈత కొట్టడానికి దిగే ముందు సముద్రపు అడుగునుండే బండరాళ్ళ గురించి ఆలోచించాలి. అందువల్ల ఎప్పుడూ ఆచరణాత్మకంగా ఉండాలి, నిశ్చయాత్మకంగా ఆలోచించాలని తెలుసుకోవాలి. చీమ శీతాకాలం గురించి ఆలోచిస్తూనే, ఎంతోకాలం అది ఉండదని, త్వరలోనే దానినుంచి బయటపడతామని తనకి తాను సర్ది చెప్పుకుంటుంది. అలాగే మనిషి కూడా ఎల్లపుడూ కష్టాల గురించి ఆలోచించకుండా నిశ్చయాత్మకంగా ఆలోచించాలి. ఎందుకంటే చీకటి తరువాత వెలుతురు కూడా వస్తుందని గుర్తెరిగి మసలుకోవాలి. జీవితం పట్ల ఆసక్తి, నిశ్చయాత్మక మనో వైఖ రుల వల్ల ప్రతిబంధకాలను సైతం అధిగమించవచ్చు. మానవ దేహాన్ని, మనస్సును కావల్సిన విధంగా మలచుకోవచ్చు. అంకిత భావం, క్రమ శిక్షణ, ఆత్మ విశ్వాసం, నిశ్చయాత్మక మనో వైఖరి, కష్టపడి పనిచేయడం అనేవి మానవ మేధకు ప్రోత్సాహానిస్తాయి. అలాగే, అపరాధ భావం, వైరం, విచారం లాంటి వ్యతిరేక భావాల్ని తొలగించుకుని ఆత్మవిశ్వాసం, మానసిక ప్రశాంతత, స్వయంశిక్షణ లాంటి విశిష్ట గుణాలు అభివృద్ధి చేసుకుంటే జీవితం నందనవనం అవుతుంది. అదే విధంగా ప్రతి ఒక్కరిలోనూ నమ్మశక్యం కానంతటి దక్షత, కౌశలం, దివ్యసంపద ఉన్నాయి. అయినా వాటిని చాలా మంది గుర్తించడం లేదు. అందువల్ల మన గురించి మనం స్వయంగా తెలుసుకోవడానికి మానసికంగా మనల్ని మనం శోధించి, పరిశీలించుకోవాలి. దీనివల్ల మనకు కీడు జరగదు. దీనికి కావల్సింది స్వయంశిక్షణ. గొప్ప పరిశోధనలూ, జీవితంలోని అన్ని రంగాల్లోనూ పరిపూర్ణ విజయ సాధకులకూ వెనుక ఉన్న రహస్యం ఇదే. వారంతా స్వయం శిక్షణ అలవరచుకోవడమే. ఆరోగ్యకర ఆహారాన్ని స్వీకరించడం, యోగాసనాలు, తదితర వ్యాయామాల ద్వారా శారీరక క్రమశిక్షణ అలవడుతుంది. అలాగే జీవశక్తుల్ని ప్రాణాయామం ద్వారా నియంత్రించి శ్వాస పీల్చడంలో క్రమశిక్షణను అలవరచుకోవచ్చు. వ్యర్థ ప్రసంగాలతో కాలాన్ని, శక్తిని వృథా చేయకుండా మౌనంగా ఉండడం మాటలాడడంలో క్రమశిక్షణ ను తెలుపుతుంది. అలాగే గ్రంథపఠనం ద్వారా ఆలోచనలు, భావనలు పవిత్రం చేసుకోవడం ద్వారా భావనల్లో క్రమశిక్షణ అలవడుతుంది. ప్రార్థనలు, తీవ్రమైన జప ధ్యానాలు చేయడం ద్వారా వివేచన కలిగి అంతర్గత స్వభావంలో క్రమశిక్షణ ఏర్పడుతుంది. దారంపోగు ఒక్కటిగా ఉన్నపుడు చాలా బలహీనంగా ఉంటుంది. అయితే అలాంటి ఎన్నో దారం పోగులను కలిపి తాడుగా పేనినట్లయితే ఆ తాడు ఏనుగును కూడా బంధించగలదు. అలాగే నిశ్చయాత్మకమైన భావనలు అనే బలవర్ధకమైన నియమిత ఆహారాన్ని మన మనస్సులలోకి ఎక్కించాలి. అప్పుడే మనం యోగ్యులుగా పరిణితి చెందుతాం. వ్యతిరేక భావనల్ని అధిగమించడంలో స్వయం శిక్షణ బాగా తోడ్పడుతుంది. కష్టాలను, ఆపదలనూ ఎదుర్కొనేందుకు దృఢమైన విశ్వాసం కావాలి. ఈ విశ్వాసం ప్రోది చేసుకోవడానికి క్రమ శిక్షణ ఆ క్రమశిక్షణ ద్వారా స్వీయ శిక్షణ అలవడుతుందన్న వాస్తవాన్ని గ్రహించాలి. అలాగే, మనలో పేరుకుపోయిన వ్యతిరేక భావాల్ని సహజమైన క్రమశిక్షణ ద్వారా తొలగించడం సాధ్యమేనన్న విషయాన్ని గుర్తించి మసలుకోవాలి. – దాసరి దుర్గా ప్రసాద్ -
మనిషికి విఘాతం
దేవరకొండ తిలక్ రాసిన ‘నల్లజర్ల రోడ్డు’ చదవాలి. అందులో దట్టమైన అడవి మధ్యన కారు చెడిపోయి ఆగిపోతే కారు దిగిన నవ యువకుణ్ణి విషసర్పం కాటు వేస్తుంది. అర్ధరాత్రి. ప్రాణాపాయం. సాయం చేసే మనిషి కనిపిస్తే ఆస్తి రాసిమ్మన్నా సరే! కారులోని మనుషులు వెర్రెత్తి చూస్తుండగా ఒక ముసలివాడు తన మనవరాలితో వస్తాడు. గుడిసెలో విరుగుడు మందు లేకపోతే అంత రాత్రీ అడవిలోకి మనవరాలిని పంపి తెప్పిస్తాడు. ప్రాణం నిలబెడతాడు. అతని కోసం ఏమైనా చేస్తాం అంటారు కృతజ్ఞతతో కారులోని మనుషులు. తెల్లవారుతుంది. ఇప్పుడు ముసలివాడిని పాము కాటేస్తుంది. మనవరాలు కారు మనుషులతో తాతను పట్నం తీసుకెళ్ల మంటుంది. కానీ కారు మనుషులకు అర్జెంటు వ్యవహారం మీద వెళ్లాల్సి ఉంటుంది. గత రాత్రి వాళ్లు ఆ ముసలివాడి వల్లే బతికారు. కానీ ఈ ఉదయం ముసలివాణ్ణి వాడి ఖర్మానికి వదిలి బయలు దేరారు. మనిషితనానికి విఘాతం కలిగించే మనుషులు వీరు. మధురాంతకం మహేంద్ర రాసిన ‘అతడి పేరు మనిషి’ కథ చదవాలి. అందులో కారు చెడి పోయిన వాన సాయంత్రం దానిని డ్రైవ్ చేస్తూ ఒంటరిగా రోడ్డు మీద చిక్కుబడిపోయిన యువతిని ఒక పల్లె యువకుడు ఆదుకుంటాడు. గుడిసెకు తీసుకెళ్లి పొడి బట్టలు ఇస్తాడు. అన్నం పెడతాడు. రాత్రంతా ఆమెకు రక్షణగా ఉండి మరుసటి ఉదయం భద్రంగా పంపిస్తాడు. ఆమె తన లాకెట్‌ను మర్చిపోతే వెతుక్కుంటూ వెళ్లి ఇవ్వబోతే ఆ యువతి ఇంటి మనుషులు థ్యాంక్స్ చెప్పి ‘భోజనం చేసి వెళ్లమని’ బయట వరండాలో సరిగ్గా కుక్క ఎక్కడ తింటుందో అక్కడ పెట్టబోతారు. యువతి దుఃఖంతో వణికిపోతుంది– మనిషితనానికి విఘాతం కలిగించే అలాంటి మనుషులను చూసి! అల్లం శేషగిరిరావు ‘వఱడు’ కథ భలే పాఠం. దేశానికి కొత్తగా రైల్వే లైన్లు వేస్తున్న రోజులు. అడవిలో క్యాంప్. రిటైర్ అయిన వృద్ధ గుమస్తా ఇంజనీరుగారిని బతిమిలాడి కుటుంబ అవసరాల రీత్యా పని చేస్తూ ఉంటాడు. అతడి కూతురు నిండు గర్భిణి. ఇంకా చాలా ఖర్చులే ఉన్నాయి. ఆ ఒత్తిడిలో ఆ వృద్ధ గుమస్తా ఏదో పని సరిగా చేయకపోతే ఇంజనీరు గారు ఫైలు ముఖాన కొడతారు. అది చూసి జీపు డ్రైవరు చిన్నయ్యకు కోపం వస్తుంది. వయసులో పెద్దవాడైన గుమస్తా మీద చిన్నవాడివైన నువ్వు ఫైలు కొడతావా అని నిరసన వ్యక్తం చేస్తాడు. ఎందుకు చేస్తాడు? వృద్ధ గుమస్తా మర్యాద కాపాడటానికి! కానీ వృద్ధ గుమస్తా ఇంజనీరు గారికి కోపం రాకుండా చూసుకుంటాడు. ‘తల్లి వంటి ఇంజనీరుగారు ఒక దెబ్బ కొట్టడం తప్పా’ అని ఎదురు చిన్నయ్యనే అడుగుతాడు. చిన్నయ్య ఇప్పుడు అపరాధి అవుతాడు. ఇంజనీరు గారి అహానికి ఆ చిన్నయ్య డ్రైవర్ ఉద్యోగం ఊడిపోతుంది. అడవిలో వఱడు (హైనా) నేరుగా తాను వేటాడి బతకదు. పులికి ఎరను చూపి అది తినగా మిగిలిన దాన్ని తింటుంది. వృద్ధ గుమస్తా చేసింది అదే. డ్రైవర్ చిన్నయ్యను ఎరగా వేయడం. మనిషితనానికి విఘాతి ఆ గుమస్తా. అనాదిగా మనిషి మనిషితనానికి విఘాతం పుట్టిస్తూనే ఉన్నాడు. మనిషిగా ఉండటానికి నిరాకరిస్తూనే ఉన్నాడు. అతడికి ఆధిపత్యం కావాలి. స్వార్థం కావాలి. ‘తనే’ కావాలి. అందుకై ప్రాంతం తనది అంటాడు. కులం తనది అంటాడు. మతం తనది అంటాడు. సరిహద్దు తనది అంటాడు. సరిహద్దుకు అవతల ఉన్నదీ తనదే అంటాడు. అతడు వెన్నుపోటు పొడుస్తాడు. విశ్వాస ఘాతుకం చేస్తాడు. విద్వేషాన్ని ప్రజ్వరిల్లజేస్తాడు. హింసను ప్రేరేపిస్తాడు. ఎదుటివాడి రక్తాన్ని ఆశిస్తాడు. యుద్ధాన్ని ఆజ్ఞాపిస్తాడు. మనిషిగా ఉండటం ఎంతో సులువు అని గ్రహించక అందుకు విరుద్ధమైన అతి కష్టమైన పనులన్నీ చేస్తాడు. అప్పుడు సందేహం వస్తుంది– మనిషిని నమ్మొచ్చా అని! ఏ మనిషినీ నమ్మకూడదు అని! అల్లాంటి సమయాలలోనే ఎవరో ఒక మనిషి మనిషితనానికి పెద్ద ఉదాహరణగా నిలుస్తాడు. ఓ.హెన్రీ ‘లాస్ట్ లీఫ్’ గుర్తుంది కదా! న్యూమోనియా సోకిన అమ్మాయి తన కిటికీలో నుంచి చూస్తున్న తీగకు ఆకులు రాలుతూ ఉంటే చివరి ఆకు రాలిన రోజు తాను మరణిస్తానని గట్టిగా నమ్ముతుంది. అన్ని ఆకులూ రాలుతాయి. చివరి ఆకు తప్ప. ఆమె బతుకుతుంది. కానీ గోడ మీద రాలని ఆకును చిత్రించిన వృద్ధ చిత్రకారుడు అందుకై రాత్రంతా మంచులో తడిసి అదే న్యూమోనియాతో మరణిస్తాడు. ఆ వృద్ధ చిత్రకారుడు ఎవడో? ఎవడైతే ఏమిటి, మనిషి! రోజులు అట్టే బాగోలేవు. ఇరుగింటి వారికి పొరుగింటిపై అక్కసు, బంధువులకు బంధువులతో పొసగనితనం, అన్నాచెల్లెళ్ల అక్కాతమ్ముళ్ల మధ్య విఘాతం, ఆఫీసుల్లో సాటి కొలీగ్స్‌పై కక్ష, సమూహాలకు సమూహాలతో వైరం, మతాలకూ మతాలకూ చిచ్చు, దేశాల మధ్య వైరం... ఇంతా చేసి ఇదంతా మనిషి మనిషితనానికి తెస్తున్న విఘాతం. మూడు పూట్లా తిండి, ఒక పూట విసర్జనాన్ని దాటలేకపోయిన మనిషి సాటి మనిషిని బాధించి, సాధించి బావుకునేది ఏమిటి? ఆస్తి, ఎల్లలు పెంచుకోగలడు కానీ కడుపులోని పెద్ద ప్రేవు, చిన్నప్రేవు పరిమాణాన్ని పెంచగలడా? వేళ్ళు ముదిరి పునాదులకే ప్రమాదం వచ్చినప్పుడు చెట్టును కొట్టేయక తప్పదు. మనిషి తనానికి విఘాతంగా మనిషి మారినప్పుడు ఆ మనిషికి గట్టిగా బుద్ధి చెప్పక తప్పదు. చరిత్ర అంతా ఓడిన చెడ్డ మనుషులు, గెలిచిన మంచి మనుషులే! మనిషిపై మనిషికి నమ్మకం మిగిల్చినవాళ్లే! లేకుంటే ఇంతకాలం మనిషి బతకగలిగేవాడా సాటి మనిషిని తోడు చేసుకోక. -
అందుకోసం రోజుకు 52 నిమిషాలు!
ముందే వచ్చేశాడే.. ఇంట్లో ఏదైనా పని ఉంటే కదా వాడికి..! ఆవిడంతే ఎప్పుడూ ముభావంగా ఉంటుంది.. ఎందుకో చెప్పనా? అదిగో చూడు వాళ్లిద్దరి ఇకఇకలు పకపకలు.. బుద్ధిలేకుండా.. వాళ్లు ఎలాంటివాళ్లంటే! ఇలా ఏ ఇద్దరు మనుషులు కలిసినా మూడో వ్యక్తి గురించి చెవులు కొరుక్కోవడం మానవ సహజ లక్షణం. ప్రతీ మనిషి రోజుకు సగటున దాదాపు 52 నిమిషాలు ఇతరుల జీవితం గురించే మాట్లాడటానికి వెచ్చిస్తాడు. అంతేకాదు తమ మధ్య లేని స్నేహితుడు, బంధువు, శత్రువు ఇలా అందరి గురించి 15 శాతం చెడుగానే మాట్లాడుకుంటారు. సామాజిక జంతువైన మనిషికి ఈ లక్షణం పూర్వీకుల నుంచే సంక్రమించింది. ఆదిమ మానవుల కాలం నాటి నుంచే గాసిప్ రాయుళ్లు వదంతులు ప్రచారం చేసేవాళ్లు. అయితే ఓ వ్యక్తితో పరిచయం, స్నేహం పెంచుకునేందుకు ఎక్కువ మంది చాడీలపై ఆధారపడతారు. ఈ విషయాలన్నీ చెబుతున్నది మేం కాదండోయ్. మనిషి ప్రవర్తన- వ్యవహార శైలిపై పరిశోధనలు చేస్తున్న సామాజిక శాస్త్రవేత్తలు, సైక్రియార్టిస్టులూనూ. గాసిప్ అంటేనే ఒకరకమైన ప్రతికూల దృక్పథం. ఈ విషయం గురించి గాలేస్బర్గ్ నాక్స్ కాలేజీ సైకాలజీ ప్రొఫెసర్ ఫ్రాంక్ మెక్ఆండ్రూ మాట్లాడుతూ.. ‘‘మన పూర్వీకులు గాసిప్ విషయంలో ఎంతో నేర్పరులు. మానవ పరిణామక్రమంలో వారి వారసులమైన మనకు కూడా ఈ గుణం అలవడింది. ఎవరు ఎవరితో పడుకుంటున్నారు? ఎవరి దగ్గర అధికారం ఉంది? ఎవరికి కావాల్సినన్ని వనరులు అందుబాటులో ఉన్నాయి? గుహల్లో నివసించే కాలం నాటి నుంచి ఇవన్నీ ఉన్నాయి. ముఖ్యంగా నిజానిజాలు తెలుసుకోకుండా మూడో వ్యక్తి గురించి వదంతులు ప్రచారం చేయడం, వారి గోప్యతకు భంగం కలిగించడం ఇతరులను గాయపరుస్తుంది. అయితే రోజూవారీ జీవితంలో ప్రతీ ఒక్కరూ గాసిపింగ్ ద్వారా ఎన్నో మంచి విషయాలు కూడా తెలుసుకునే అవకాశం ఉంది. ఓ వ్యక్తి ఎటువంటి వాడు.. అతడి వల్ల మనకేమైనా హాని కలుగుతుందా? అన్న విషయాలు తెలుసుకుని ముందే జాగ్రత్తపడవచ్చు’’అని చెప్పుకొచ్చారు. ఇక మరో ప్రొఫెసర్ మేఘన్ రాబిన్స్.. ఇతరుల గురించి రహస్యాలు మాట్లాడుకునేప్పుడు ప్రతీ ఒక్కరూ ఉపయోగించే మాట.. ‘‘నిన్ను నమ్మి నీతో ఈ విషయం పంచుకుంటున్నా’’. అయితే ప్రతీ ఒక్కరూ విశ్వాసాన్ని నిలబెట్టుకోలేరు. కొంతమంది మాత్రమే దీనికి కట్టుబడి ఉంటారు. కాబట్టి మూడో వ్యక్తితో మనకు కొంతమేర ప్రమాదం పొంచి ఉంటుంది’’అని హెచ్చరించారు. ఆడ, మగా తేడా లేదు.. ఆడవాళ్లు, చదువుకోని వాళ్లు ఎక్కువగా గుసగుసలాడుకుంటారనేది ఒక అపోహ మాత్రమే అని పరిశోధకులు కొట్టిపారేశారు. గాసిపింగ్కు ఆడా, మగా.. హై క్లాస్, లో క్లాస్ తేడా ఉండదని.. నిరక్షరాస్యులే కాదు ఆఫీసుల్లో పనిచేసే వాళ్లు కూడా ఇందుకు అతీతం కాదని వెల్లడించారు. ఇతరులకు హాని చేయనంత వరకు గాసిపింగ్ అంతచెడ్డ గుణం కాదని... బంధాలు పెంపొందించుకోవడంలో ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా వృద్ధులు తమ ఒంటరితనాన్ని పోగొట్టుకోవడం కోసం రెస్టారెంట్లు, మాల్స్‌కు వెళ్లి కొత్త వారిని పరిచయం చేసుకుంటారని... ఇందుకోసం గాసిపింగ్ ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. అందుకే సెలబ్రిటీల గురించి మాట్లాడతాం చాలా మంది సెలబ్రిటీల జీవనశైలిని అనుకరించేందకు ప్రయత్నిస్తారు. వారి వివరాలు తెలుసుకునేందుకు అమితాసక్తి చూపుతారు. ముఖ్యంగా వారి వ్యక్తిగత జీవితం గురించి ఆరాలు తీస్తారు. ఇలా తెలుసుకున్న విషయాలను పది మందిలో కూర్చున్నపుడు.. పార్టీలో ఉన్నపుడు వాటికి కాస్త మసాలా జోడించి తనదైన స్టైల్లో చెప్పి శ్రోతలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. తమకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం తహతహలాడేవారు ఇలా చేస్తారు. మాట్లాడుతోంది సెలబ్రిటీల గురించి కాబట్టి.. వాళ్లు మనకు తారసపడే అవకాశం లేనందు వల్ల ఇది సేఫ్‌సైడ్ అనుకుంటారు. అంతేకాదు ఇలాంటి వారు.. తన కంటే అన్ని విషయాల్లో కాస్త పైచేయి సాధించిన వారి విషయంలోనూ ఇదే ధోరణి అవలంబిస్తారు. దీని వల్ల పెద్దగా ప్రమాదం ఉండకపోవచ్చు. అదే గాసిప్ తన గురించి వస్తే మాత్రం తట్టుకోలేరు. తనలోని అవలక్షణాలను చెప్పిన వారికి దూరంగా ఉంటారు. ఇందుకోసం ముఖ్యమైన బంధాలను వదులుకోవడానికి కూడా వెనకాడరంటూ ఆండ్రూ తాను పరిశోధనలో తేలిన అంశాల గురించి చెప్పుకొచ్చారు. -
ధిక్కారం మానవ స్వభావం
అభిప్రాయం దాదాపు 2400 ఏళ్ల క్రితం సోఫోక్లీస్ వ్రాసిన నాటకం ‘‘యాంటిగొని’’. ఈడి పస్ కుమారులిద్దరూ రాజ్యాధికారం కోసం పరస్పరం చేసుకొన్న యుద్ధంలో మరణించాక సింహాసనాన్ని అధి రోహించిన రాజు క్రియాన్, ఆ సోదరులలో ఒకరైన పోలినైసిస్ శవానికి ‘‘ఖననం చేయకూడదని, కాకులకు, గద్దలకు, పురుగులకు వదిలివేయాలనే’’ శిక్షను విధిస్తాడు. తన సోదరునికి విధించిన మరణానంతర శిక్షను పోలినైసిస్ సోదరి యాన్టిగోని తీవ్రంగా గర్హిస్తుంది. ఖనన సంస్కారం చేద్దాం రమ్మని తన సోదరి ‘‘ఇస్మీని’’ని పిలుస్తుంది, అందుకు ఇస్మీని సమ్మతించక పర్యవసానాన్ని వివరించి హెచ్చరిస్తుంది. అప్పుడు యాన్టిగొని అంటుంది ""if i have to die for this pure crime/i am content, for i shall rest beside him'' అంటుంది. ""the city is the king''s అంటూ రాజద్రోహ నేరానికి గాను గృహంలో బంధించి చనిపోయేలా చేయాలని క్రీయాన్ శిక్ష విధిస్తే దాన్ని కూడా ధిక్కరిస్తూ ఉరి వేసుకొని చచ్చిపోతుంది. క్రీ.పూ 4వ శతాబ్దానికి చెందిన సోక్రటీస్‌ను ‘‘దైవ ధిక్కారము, యువతను కలుషిత పరచడం’’ అనే నేరాలను ఆరోపించి ఖైదు చేసినపుడు పారిపోయే అవకాశముండీ, తను ఏమయితే చెప్పేడో వాటి మీదే నిలబడుతున్నానని చెపుతూ విషాపానం చేసి మరణ శిక్షను స్వీకరించాడు. "my kingdom is not of this world''అని క్రీస్తు అన్నప్పటికీ ‘‘నా రాజ్యము’’ అన్న మాటే రాజధిక్కారంగా పరిగణించి సిలువనెక్కిస్తే, క్రీస్తు ‘‘బిడ్డలారా నాకోసం ఏడవకండి మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి’’ అన్నాడే కానీ దేవుని రాజ్యము మిధ్య అని సిలువ శిక్షను తప్పించుకోలేదు. అన్ని వేల ఏళ్ళ క్రితం కూడా మనిషి రాజ ధిక్కార లేదా దేశ ధిక్కార నేరం విధిస్తే శిక్షను అనుభవించాడే కానీ తన భావాన్ని వ్యక్తపరచకుండా వెనుకకు తగ్గలేదు ఎందుకని? ఎందుకంటే భావ వ్యక్తీకరణ అనేది మానవ హక్కులకు పునాది వంటిది. అది మనిషి స్వభావంలో ఒక భాగం, ఆ హక్కును కాపాడు కోవడానికి మనిషి ప్రాణాలను సైతం అర్పిస్తాడు. అది లేని నాడు జార్జ్ వాషింగ్టన్ చెప్పినట్లు ‘‘వధ్యసిల మీదకు వెళుతున్న గొర్రెల’’లాగే మనిషి తనను భావించుకుంటాడు. కన్హయ్య కుమార్ మరియు జేఎన్‌యూ విద్యార్థులు చేసింది భావ ప్రకటన మాత్రమే. ‘‘ప్రతి మనిషికి తన రాజ్యాంగ హక్కులతో పాటు దేశంలో సమాన హోదా కల్పించినప్పుడే అది న్యాయమంటాం, మేం మీ దోపిడీ సంస్కృతిని నాశనం చేయాలనుకుంటున్నాం’’ అని వాళ్లు అన్నారు. అలా అనడానికి కన్హయ్యకే కాదు ఈ దేశంలో ప్రతి ఒక్కరికీ హక్కు వుంది. ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు, చర్చించుకునే హక్కుని ఈ రాజ్యాంగం కల్పించింది. భావప్రకటన ఎన్నటికీ దేశ ద్రోహం కాదు. ‘‘ఆలోచనల మీద ఆంక్షల ఆమ్ల వర్షం కురిపించే’’ రాజ్యాలు, ప్రభుత్వాలు కుప్పకూలిన దాఖలాలే చరిత్ర నిండా. అయినా అసలు దేశభక్తి అంటే ఏమిటి? పార్లమెంటులో ఇంత పెద్ద రవీంద్రుని విగ్రహం పెట్టుకున్నారు కదా. ఆయన ‘‘జాతీయత అనేది ఒక పెద్ద విపత్తు.. భారతదేశపు అన్ని సమస్యలకి ఇదే మూల కారణం అయి ఉన్నది. నా దేశ వాసులు మానవీయత కంటే దేశం గొప్పదనే భావనకు వ్యతిరేకంగా పోరాడి నిజమయిన దేశాన్ని పొందుతారని ఆశ పడుతున్నా’’ అని విశ్వ మానవతను గురించి అన్న మాట వీరికి తెలి యదా? ప్రశ్న మొలకెత్తినపుడు, నిరసన స్వరం జ్వలించినపుడు కారణాలు తెలుసుకొని పరిష్కా రం వెదకడం సముచితం కదా? అణచిన స్వరం అలాగే ఉండిపోదు. అలా ఉండిపోక పోవడానికి నాగరికత అని పేరు. ప్రశ్న లేకపోతే జ్ఞానం విస్తృతి పొందదు. నాగరికత ముందుకూ పోదు. చిన్నప్పుడు నేనో కథ విన్నాను, ఒక అడవిలో ఒక యేరు వుంది ఒకరోజు ఒక మేక పిల్ల అక్కడికి నీరు తాగడానికి వచ్చింది. అంతలోకి ఒక పులి కూడా అక్కడికి వచ్చింది. ఏటికి పైన పులి నీరు తాగుతుంది. క్రింద మేకపిల్ల తాగుతుంది. కాసేపటికి పులి ‘ఓ మేకా నిన్ను తినేస్తా’ అన్నది. మేక ఆశ్చర్యపడి ‘నేనేం తప్పు చేసానని తినేస్తావు’ అన్నది. అందుకు పులి ‘నువ్వు నా నీళ్ళు ఎంగిలి చేసావుకదా’ అని బదులిచ్చింది. ‘పులీ నువ్వు పైన తాగుతున్నావ్. నేను క్రింద తాగుతున్నా. ఎంగిలెలా చేయగలను’ అన్నది మేక పిల్ల. అప్పుడు పులి ‘ఇప్పుడు కాదు, నువ్వు కడుపులో వున్నప్పుడు మీ అమ్మ ఎంగిలి చేసింది’ అని ఆ చిన్ని మేక పిల్లను తినేస్తుంది. మొన్నటి వరకు నాకో సందేహం వుండేది ఈ కథ గురించి. పులి కదా శుభ్రంగా తినేయక సాకులు ఎందుకు వెదికింది అని. కన్హయ్య సంఘటనతో సందేహం తీరిపోయింది. ఏమంటే అప్పుడు ఆ పులి ప్రజాస్వామ్య ప్రభుత్వమున్న ఒకానొక అడవికి ‘నాయకుడి’గా ఉండింది. - సామాన్య వ్యాసకర్త రచయిత్రి మొబైల్: 80196 00900