
నేడు మారుతున్న కాలానికనుగుణంగా పురోభివృద్ధితో పాటు సమాజంలో పగ, వైరం, ద్వేషం, అసూయ, అల్పబుద్ధి, హింస పెరిగి పోతున్నాయి. నైతిక స్వభావంలో లోపం ఏర్పడడం వల్లనే ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా అభ్యుదయాత్మకమైన మనోవైఖరి అలవరచుకుంటే అన్ని సమస్యలు పరిష్కరించుకోవచ్చన్న విషయాన్ని అవగతం చేసుకోవాలి. నిశ్చయాత్మకంగా ఉండే లక్షణం అలవడినపుడు కష్టాలు ఎదురైనా మనస్సు అదుపు తప్పదు. ఈ క్రమంలో... పరిస్థితులకు భయపడని వాడు తనకు తాను మిత్రుడవుతాడు.
స్వయంశిక్షణ అంటే తన ఆలోచనలను, తన అధీనంలో ఉంచుకోవడం. ఇది ఒక వ్యక్తికి నిశ్చయాత్మకంగా ఆలోచించే శక్తినిస్తుంది. స్వయంశిక్షణ మనస్సును అన్ని రకాలైన బలహీనతల నుంచి రక్షించి జీవితానికి ఒక ప్రత్యేక విలువనూ, యోగ్యతనూ ఇస్తుంది. నైతిక ప్రమాణాలను విశ్వాసంతో క్రమబద్ధంగా అనుష్టించడం ద్వారా విశ్వాసం పెరిగి పరిణితి లభిస్తుంది. ఈ విశ్వాసం పెరగాలంటే క్రమశిక్షణ అనేది అత్యంత ఆవశ్యకమని గుర్తెరగాలి. క్రమశిక్షణ అనేది ఏదో కొన్ని విషయాలల్లో కాకుండా అన్నింటిలోనూ అలవరచుకోవాలి.
ఒక ఇనుప కడ్డీని అయస్కాంతంగా మారిస్తే, అది దాని బరువు కన్నా 12 రెట్లు అధికంగా ఉన్న బరువును ఎత్తగలదు. అయితే అది దాని అయస్కాంత శక్తిని కోల్పోతే మాత్రం ఒక చిన్న గుండు సూదిని కూడా ఎత్తలేదు. మనిషి మనస్సు కూడా అంతే. నిశ్చయాత్మకంగా, నిర్మలంగా, నిలకడగా ఉంటే మనిషి పరిస్థితులను తన అ«ధీనంలో ఉంచుకుని అద్భుతాలు చెయ్యగలడు. ప్రపంచంలోని గొప్ప గొప్ప వారందరికీ గుర్తింపు రావడానికి కారణం వ్యతిరేక భావాలను అధిగమించే శక్తి. నిశ్చయాత్మకంగా ఉండడమేనని, వారు తమ మనస్సును నిశ్చయాత్మక భావనలతో నింపి ఉంచడం వల్లనే ఆ స్థాయికి వెళ్ళారని అవగతం చేసుకోవాలి.
మనిషి స్వప్రయత్నం తో తనను తాను ఉద్ధరించుకోవాలని, తనను తాను కించపరచుకోకుండా ఉండాలని భగవద్గీతలో కృష్ణపరమాత్మ అర్జునుడికి తెలియ చేశాడు. మనిషి తనకు తానే శత్రువు, అలాగే, తనకు తానే మిత్రుడు కూడా. ప్రపంచం పట్ల, తమ పట్ల సానుకూలమైన, నిర్మాణాత్మకమైన, నిర్మలమైన స్నేహ వైఖరిని అలవరచుకుని తమకు తామే మిత్రులవ్వాలి. వ్యతిరేక భావాలతో వ్యతిరేక చర్యలు చేపట్టేవారికి బతుకు వ్యర్థం అవుతుంది.
దీనికి మన నిత్య జీవితంలో కనిపించే చీమలు మనకు ఎన్నో పాఠాలు నేర్పుతాయి. తమను ఎవరైనా ఆపినా, లేక వాటి మార్గంలో ఏదైనా అడ్డు వచ్చినా చీమలు ఆగవు. అడ్డంగా ఉన్న దాని మీదకు ఎక్కి దానిని దాటుతాయి. లేదంటే మరో మార్గంలో ముందుకు వెళతాయి. కానీ అవి ఆగవు. అంటే దీనివల్ల చేపట్టిన పని పూర్తయ్యే వరకు లక్ష్యాన్ని సాధించే వరకూ ఆగకూడదని నిగూఢం గా చీమలు మనకు తెలియ చేస్తున్నాయి.
అలాగే, చీమలు వేసవి కాలంలో శీతాకాలం గురించే ఆలోచిస్తాయి. చలి కాలానికి కావల్సిన ఆహారాన్ని కూడా అవి వేసవిలోనూ సేకరిస్తాయి. అంతేకాదు రుతువుల్లోని మార్పులకు అవి అసంతృప్తి ప్రకటించవు. సముద్రపుటొడ్డున ఇసుకలో సూర్యరశ్మిలో ఆనందిస్తున్నట్టే, ఈత కొట్టడానికి దిగే ముందు సముద్రపు అడుగునుండే బండరాళ్ళ గురించి ఆలోచించాలి. అందువల్ల ఎప్పుడూ ఆచరణాత్మకంగా ఉండాలి, నిశ్చయాత్మకంగా ఆలోచించాలని తెలుసుకోవాలి.
చీమ శీతాకాలం గురించి ఆలోచిస్తూనే, ఎంతోకాలం అది ఉండదని, త్వరలోనే దానినుంచి బయటపడతామని తనకి తాను సర్ది చెప్పుకుంటుంది. అలాగే మనిషి కూడా ఎల్లపుడూ కష్టాల గురించి ఆలోచించకుండా నిశ్చయాత్మకంగా ఆలోచించాలి. ఎందుకంటే చీకటి తరువాత వెలుతురు కూడా వస్తుందని గుర్తెరిగి మసలుకోవాలి.
జీవితం పట్ల ఆసక్తి, నిశ్చయాత్మక మనో వైఖ రుల వల్ల ప్రతిబంధకాలను సైతం అధిగమించవచ్చు. మానవ దేహాన్ని, మనస్సును కావల్సిన విధంగా మలచుకోవచ్చు. అంకిత భావం, క్రమ శిక్షణ, ఆత్మ విశ్వాసం, నిశ్చయాత్మక మనో వైఖరి, కష్టపడి పనిచేయడం అనేవి మానవ మేధకు ప్రోత్సాహానిస్తాయి. అలాగే, అపరాధ భావం, వైరం, విచారం లాంటి వ్యతిరేక భావాల్ని తొలగించుకుని ఆత్మవిశ్వాసం, మానసిక ప్రశాంతత, స్వయంశిక్షణ లాంటి విశిష్ట గుణాలు అభివృద్ధి చేసుకుంటే జీవితం నందనవనం అవుతుంది.
అదే విధంగా ప్రతి ఒక్కరిలోనూ నమ్మశక్యం కానంతటి దక్షత, కౌశలం, దివ్యసంపద ఉన్నాయి. అయినా వాటిని చాలా మంది గుర్తించడం లేదు. అందువల్ల మన గురించి మనం స్వయంగా తెలుసుకోవడానికి మానసికంగా మనల్ని మనం శోధించి, పరిశీలించుకోవాలి. దీనివల్ల మనకు కీడు జరగదు. దీనికి కావల్సింది స్వయంశిక్షణ. గొప్ప పరిశోధనలూ, జీవితంలోని అన్ని రంగాల్లోనూ పరిపూర్ణ విజయ సాధకులకూ వెనుక ఉన్న రహస్యం ఇదే. వారంతా స్వయం శిక్షణ అలవరచుకోవడమే.
ఆరోగ్యకర ఆహారాన్ని స్వీకరించడం, యోగాసనాలు, తదితర వ్యాయామాల ద్వారా శారీరక క్రమశిక్షణ అలవడుతుంది. అలాగే జీవశక్తుల్ని ప్రాణాయామం ద్వారా నియంత్రించి శ్వాస పీల్చడంలో క్రమశిక్షణను అలవరచుకోవచ్చు. వ్యర్థ ప్రసంగాలతో కాలాన్ని, శక్తిని వృథా చేయకుండా మౌనంగా ఉండడం మాటలాడడంలో క్రమశిక్షణ ను తెలుపుతుంది. అలాగే గ్రంథపఠనం ద్వారా ఆలోచనలు, భావనలు పవిత్రం చేసుకోవడం ద్వారా భావనల్లో క్రమశిక్షణ అలవడుతుంది. ప్రార్థనలు, తీవ్రమైన జప ధ్యానాలు చేయడం ద్వారా వివేచన కలిగి అంతర్గత స్వభావంలో క్రమశిక్షణ ఏర్పడుతుంది.
దారంపోగు ఒక్కటిగా ఉన్నపుడు చాలా బలహీనంగా ఉంటుంది. అయితే అలాంటి ఎన్నో దారం పోగులను కలిపి తాడుగా పేనినట్లయితే ఆ తాడు ఏనుగును కూడా బంధించగలదు. అలాగే నిశ్చయాత్మకమైన భావనలు అనే బలవర్ధకమైన నియమిత ఆహారాన్ని మన మనస్సులలోకి ఎక్కించాలి. అప్పుడే మనం యోగ్యులుగా పరిణితి చెందుతాం. వ్యతిరేక భావనల్ని అధిగమించడంలో స్వయం శిక్షణ బాగా తోడ్పడుతుంది. కష్టాలను, ఆపదలనూ ఎదుర్కొనేందుకు దృఢమైన విశ్వాసం కావాలి. ఈ విశ్వాసం ప్రోది చేసుకోవడానికి క్రమ శిక్షణ ఆ క్రమశిక్షణ ద్వారా స్వీయ శిక్షణ అలవడుతుందన్న వాస్తవాన్ని గ్రహించాలి. అలాగే, మనలో పేరుకుపోయిన వ్యతిరేక భావాల్ని సహజమైన క్రమశిక్షణ ద్వారా తొలగించడం సాధ్యమేనన్న విషయాన్ని గుర్తించి మసలుకోవాలి. – దాసరి దుర్గా ప్రసాద్