సంశయం! సంకోచం! సందేహం! | Special Article On Mothers Love | Sakshi
Sakshi News home page

రెడీ టు కమాండ్‌

Published Wed, Feb 19 2020 4:09 AM | Last Updated on Wed, Feb 19 2020 8:34 AM

Special Article On Mothers Love - Sakshi

ఛత్రపతి శివాజీకి జిజియాబాయి జన్మనిచ్చిన రోజు ఇది. జన్మను మాత్రమే ఇవ్వలేదు జిజియా. జన్మభూమిని కాపాడే శౌర్యాన్ని ఇచ్చింది. స్త్రీలను, పరమతాలను గౌరవించడం నేర్పింది. భారత, రామాయణాల్ని చదివించింది. బలి చక్రవర్తి గాథల్ని వినిపించింది. యుద్ధతంత్రాలలో నిష్ణాతుడిని చేసి, ఖడ్గాన్ని చేతికి ఇచ్చింది. శివాజీ ఖడ్గధారకు అంతటి పదును తల్లి పట్టిన పాల వల్లనే! అతడొక గొప్పచక్రవర్తి అయ్యాడంటే.. ఆమె ఒక ధీశాలి అయిన తల్లి అవడం వల్లనే!

మగపిల్లల్ని గొప్ప యోధులుగా తీర్చిదిద్దిన తల్లులే కాదు, గొప్ప యోధులై.. దేశమాతను కాపాడుకున్న ఆడబిడ్డలూ మన దేశ చరిత్రలో ఎందరో ఉన్నారు. రాణీ లక్ష్మీబాయి, రాణీ పద్మిని, రజియా సుల్తానా, అహల్యాబాయ్‌ హోల్కర్, మాతా భాగ్‌ కౌర్, ఒనకె ఓబవ్వ, కేలడి చెన్నమ్మ, బెలవాడి మల్లమ్మ, అబ్బక్క రాణి.. ఎన్ని యుగాలకైనా ధ్వని తీవ్రత క్షీణించని శంఖారావాలు. పునీతా అరోరా, పద్మావతీ బందోపాధ్యాయ, మిథాలి మధుమిత, ప్రియా ఝింగన్, దివ్యా అజిత్‌ కుమార్, నివేదిత చౌదరి, అంజనా బాధురియా, ప్రియా సేవమ్‌వాల్, దీపికా మిశ్రా, సోఫియా ఖురేషి, శాంటి టిగ్గా, గనెవె లాల్జీ, గంజన్‌ సక్సేనా, అవని చతుర్వేది, మోహనాసింగ్, భావనాకాంత్‌.. తానియా శేర్గిల్‌.. వర్తమాన రక్షణదళ మహిళా క్షిపణులు.

ఐక్యరాజ్యసమితి భారతదళ సభ్యులుగా ఆఫ్రికా దేశాలలో, భారత రక్షణ సేనానులుగా పొరుగు దేశాల్లో.. శాంతిని స్థాపించి వచ్చిన లెఫ్ట్‌నెంట్‌ అనువందన జగ్గీ, మేజర్‌ గోపికా భట్తీ, మేజర్‌ మధు రాణా, మేజర్, మేజర్‌ ప్రీతీసింగ్, మేజర్‌ అనూజా యాదవ్‌.. యుద్ధభూముల్లో స్త్రీ శక్తిని చాటిన అస్త్రాలు. మహిళల్ని ఆర్మీలోకి కమాండర్‌లుగా తీసుకోవడం సాధ్యం కాదు అని సుప్రీంకోర్టులో సోమవారం కేంద్ర ప్రభుత్వం వాదిస్తున్నప్పుడు.. ‘ఎందుకు సాధ్యం కాదూ! సాధ్యం చేసిన, సాధ్యం చేస్తున్న వాళ్ల మాటేమిటి?’ అంటూ పైన ఉదహరించిన వారిలో పదమూడు మంది వర్తమాన మహిళా యోధుల పేర్లను సుప్రీంకోర్టు జడ్జిలు ప్రస్తావించారు. మూడు నెలల్లోగా మహిళల్ని కమాండింగ్‌ పోస్టులోకి తీసుకోవడం ప్రారంభించాలని తీర్పు చెప్పారు. సైన్యంలోని యుద్ధ విధుల్లో పని చేయాలన్న తపన ఉన్న యువతులకు ఇది ఉత్సాహాన్నిచ్చే తీర్పు.

ఐరాస విధుల్లో భారత మహిళా జవాన్లు

తొమ్మిదేళ్ల క్రితమే ఢిల్లీ హైకోర్టు ఇలాంటి తీర్పు ఇచ్చినప్పటికీ, తీర్పును అమలు చేసేందుకు ప్రభుత్వం సంశయించింది. శత్రువుకు ప్రత్యక్షంగా అందుబాటులో ఉండని ఎయిర్‌ఫోర్స్‌లో, నేవీలో  పర్వాలేదు కానీ.. శత్రువుకు ఎదురుగా వెళ్లి పోరాడవలసిన సైనికుల బృందానికి మహిళా కమాండర్‌లని సేనానులుగా పెట్టడం మంచిది కాదు అని ప్రభుత్వ వాదన. వాదన కాదు.. సంశయం! సంకోచం! సందేహం! మహిళల దేహ ధర్మాలు.. యుద్ధ ధర్మాలను సక్రమంగా నెరవేర్చనివ్వవని, మగ సైనికులు మహిళా కమాండర్‌ మాట వినరనీ, వీళ్లు బట్టలు మార్చుకుంటుంటే వాళ్లు తొంగిచూస్తుంటారనీ, శత్రువు చేతికి మన మహిళ చిక్కితే దేశ ప్రజల హృదయ స్పందనలు హద్దులు, సరిహద్దులు మీరే ప్రమాదం ఉందనీ స్వయంగా ఆర్మీ చీఫే అన్నారు. అయితే.. ‘‘ఇవన్నీ మీరు ఊహించుకుంటున్నవే కానీ.. కర్తవ్య నిర్వహణలో కమాండ్‌ చేసేందుకు మహిళలు ఎప్పుడూ సంసిద్ధంగానే ఉంటారు’’ అని తీర్పు వెలువరించడానికి ముందు సుప్రీం జడ్జిలు వ్యాఖ్యానించారు.

దేశ రక్షణకు ఉవ్విళ్లూరుతున్న యువతుల్ని నిరుత్సాహపరిచేందుకు మనల్ని ప్రేరేపిస్తున్నది వాళ్ల రక్షణ, వాళ్ల భద్రత మాత్రమేనని అనిపిస్తున్నప్పటికీ దానివెనుక తెలియకుండా ఉన్నది వివక్ష మాత్రమే. అది ఉద్దేశ పూర్వకమైన వివక్ష కాకపోవచ్చు. ‘స్త్రీ, పురుషుడు సమానం కాదు’ అనే ఆదిమ భావన నుంచి నేటి ఆధునిక సమాజం కూడా బయటపడలేక పోతోంది. ఇక ఆర్మీలోనైతే చెప్పే పని లేదు. సైనిక పటాలాలను పురుషుడు మాత్రమే నియంత్రించగలడనీ, సమర వ్యూహాలు, ప్రతిభాపాటవాలు పురుషుడికి మాత్రమే ఉంటాయని దివి నుంచి భువికి ఎవరో చెప్పి పంపించినట్లుగా స్థిరపడిపోయింది. మహిళకు అవకాశం రాక (ఇవ్వక) పురుషుడు దేశ రక్షకుడయ్యాడు కానీ.. దేశ రక్షణ బాధ్యతను మోసే బలం మహిళలకు లేదని కాదు.

సోఫియా ఖురేషి

భారతదేశ రక్షణ వ్యవస్థలోని సైనిక, వైమానిక, నావికా దళాలలో రెండు రకాౖలñ న నియామకాలు ఉంటాయి. షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌. పర్మినెంట్‌ కమిషన్‌. షార్ట్‌ సర్వీస్‌లో విధి నిర్వహణ పదేళ్లు మాత్రమే. సామర్థ్యాన్ని బట్టి మరో నాలుగేళ్ల పొడిగింపు ఉంటుంది. పర్మినెంట్‌ సర్వీసులో ఉన్నవారు పదవీ విరమణ వయసు వచ్చేవరకు విధుల్లో ఉండొచ్చు. అయితే మహిళల్ని ఉదారంగా రక్షణ దళాల్లోకి తీసుకుంటున్న ప్రభుత్వం.. అంతే ఔదార్యంతో వారిని పర్మినెంట్‌ కమిషన్‌లోకి తీసుకోవడం లేదు. కోర్టులో దీనిపై తొమ్మిదేళ్లుగా సాగుతూ వస్తున్న వాదోపవాదనల్లోనే.. ఇప్పుడు తాజాగా సుప్రీంకోర్టు మహిళల్ని కూడా పర్మినెంట్‌ కమిషన్‌లోకి తీసుకోవాలని తీర్పు ఇచ్చింది. దీంతో దళాల్ని ముందుకు నడిపించే (కమాండింగ్‌) బాధ్యతల్లోకి అతి త్వరలోనే మహిళలూ రాబోతున్నారు. ఈ కేసులో ప్రభుత్వం చేసిన ముఖ్యవాదన.. ‘గ్రామాల నుంచి వచ్చిన మగ జవానులు మహిళా కమాండ్‌ మాట వినరు.. దాంతో యుద్ధ సమయాలలో శుత్రువును కట్టడి చెయ్యడం మనకు కష్టం అవుతుంది. అది దేశ భద్రతకే ప్రమాదం..’ అని!

1992లో భారత సైన్యంలో చేరిన 25 మంది మహిళా అధికారులలో తొలి కేడెట్‌ అయిన మేజర్‌ ప్రియా ఝింగన్‌.. మొన్నటి సుప్రీంకోర్టు తీర్పుకు ఒకరోజు ముందు ఇచ్చిన ఒక ఇంటర్వూ్యలో మన ప్రభుత్వ వాదనకు తగిన సమాధానమే చెప్పారు. ‘‘జవాన్లు మాట వినరని మీరే అనడం ద్వారా.. ‘మహిళా కమాండర్‌ మాట వినొద్దు’ అని మీరు చెబుతున్నట్లుగా ఉంది’’ అన్నారు ఝింగన్‌. ఏ సిపాయి అయినా కమాండర్‌ మాట వినకపోతే సైనిక చట్టాల ప్రకారం పనిష్మెంట్‌లు ఉంటాయి. పనిష్మెంట్‌ ఉంటుందన్న భయం ఉంటే.. పై అధికారి పురుషుడైనా, మహిళ అయినా మాట వినే తీరుతారు. ‘మహిళలు కుటుంబం కోసం యుద్ధరంగాన్ని కాదనుకుని పోతారు’ అని మరొక వాదన. అదీ నిజం కాదు. సమర్థతతో, అంకితభావంతో, త్యాగనిర తితో ఏ బాధ్యతనైనా నిర్వర్తించే మనోబలం, నిబద్ధత మహిళల్లో ఉన్నాయి కనుకనే ప్రపంచ వ్యాప్తంగా పెద్ద పెద్ద వ్యవస్థలు విజయవంతంగా, నిరంతరాయంగా నడుస్తున్నాయి.

ప్రియా ఝింగన్‌

భారతీయ సైనికదళం నూట ఇరవై నాలుగేళ్లుగా ఉంది. అంతకు ఏడేళ్ల ముందు నుంచే సైన్యం కోసం మహిళా నర్సుల సేవలు సిద్ధంగా ఉన్నాయి! మొదటి, రెండు ప్రపంచ యుద్ధాలలో భారత సైన్యంలోని నర్సులు మూడు వందల యాభై మందికి పైగా మరణించడమో, బందీలుగా శత్రువుల చేతికి చిక్కడమో జరిగింది. మరికొందరు అసలు ఏమైపోయారో కూడా తెలీదు. ఆ తర్వాత నలభై ఏడేళ్లకు గానీ మహిళల్ని వైద్యేతర విభాగాల్లోకి తీసుకునే చొరవ చేయలేకపోయింది భారత సైన్యం. తొలిసారి 1992లో నాన్‌–మెడికల్‌ విధుల్లోకి మహిళలు ప్రవేశించారు. తర్వాత పదిహేనేళ్లకు మన దేశం నుంచి ఐక్యరాజ్యసమితి తరఫున వందమందికిపైగా మహిళా పోలీసులు శాంతిస్థాపనకోసం లైబీరియా వెళ్లి సమర్థంగా విధులు నిర్వర్తించి వచ్చారు. 2014 నాటికి భారతీయ సైనిక దళంలో 3 శాతానికి, నావికాదళంలో 2.8 శాతానికి, వైమానిక దళంలో 8.5 శాతానికి మహిళ సంఖ్య పెరిగింది. 2015లో తొలిసారి ఫైటర్‌ పైలట్‌లుగా మహిళలు యుద్ధవిధుల్లోకీ వచ్చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement