యూదులు రెండువేల ఏళ్ళ క్రితం పస్కా పండుగనాడు యేసుక్రీస్తును శుక్రవారం రాత్రి సిలువ వేసి చంపి, అరిమతై యోసేపు అనే ఒక రహస్య క్రైస్తవునికి చెందిన రాతిసమాధిలో ఆయన్ను ఖననం చేశారు. అయితే యేసుక్రీస్తు తాను మునుపే ప్రకటించినట్టుగా, ఆదివారంనాటి తెల్లవారు జామునే పునురుత్థానుడు కాగా, తిరిగి సజీవుడైన యేసుక్రీస్తును విశ్వాసులైన స్త్రీలు మొదట చూశారు. వారిద్వారా ప్రభువు శిష్యులు తెలుసుకొని వెళ్లి ఖాళీ సమాధిని చూశారు. అయితే ప్రభువే వారికి ప్రత్యక్షమై తనను తాను కనపర్చుకున్నాడు. ఆ విధంగా యేసు పునరుత్థానమే పునాదిగా క్రైస్తవం ఆరంభమైంది. అలా చాలా కొద్దిమందితో, యేసును సిలువ వేసిన యెరూషలేమే కేంద్రంగా, ఆయన్ను సిలువ వేసిన యూదుల మధ్యే ఆరంభమైన క్రైస్తవంలోకి యూదులతో సహా ఎంతో మంది చేరుతూండగా అది ఎల్లలు దాటి ప్రపంచమంతా విస్తరించి, ఈనాడు 210 కోట్ల మంది విశ్వాసులున్న అతి పెద్దమతంగా ప్రపంచంలో సుస్థిరమైంది.
ప్రపంచ చరిత్రలో అలా జరిగిన ఒక కుట్ర పటాపంచలై యేసుక్రీస్తు సారథ్యంలో ప్రేమ, క్షమాపణలే ముఖ్యాంశాలుగా ఆయన స్థాపించిన ప్రేమ సామ్రాజ్యంగా క్రైస్తవం తన ఉనికిని చాటుకుంది. పామరులు, పిరికివాళ్ళు, సమాజంలో ప్రాబల్యం లేనివాళ్లయిన విశ్వాసులతో కూడిన క్రైస్తవం ఇంతటి స్థాయికి ఈనాడు ఎలా ఎదిగింది? ఆ పిరికివాళ్ళనే దేవుడు తన శక్తితో నింపాడు. ‘మీరు జీవాధిపతిని చంపారు, కాని దేవుడు ఆయన్ను మృతులలో నుండి లేపాడు. అందుకు మేము సాక్షులము...’ అంటూ వేలాదిమంది యూదుప్రముఖుల సమక్షంలో యేసుక్రీస్తు సిలువ మరణాన్ని, ఆయన పునరుత్థాన మహా ఘటనను శిష్యులైన పేతురు,యోహాను కలిసి అవి జరిగిన కొద్దిరోజులకే యెరూషలేము మహాదేవాలయ ప్రాంగణంలో ప్రకటించారు.
విశేషమేమిటంటే, నాడు పస్కాపండుగ రాత్రి గెత్సేమేనే తోటలో ప్రార్థనలో ఉన్న యేసుక్రీస్తును యూదా ఇస్కరియోతు అనే మరో శిష్యుని విద్రోహం కారణంగా రోమా సైనికులొచ్చి నిర్బంధించినపుడు, యేసు ఎవరో నాకసలు తెలియదంటూ మూడుసార్లు నిర్లజ్జగా బొంకి పేతురు పారిపోయిన ఉదంతాన్ని కూడా తన సువార్తలో ఎంతో విపులంగా ప్రస్తావించిన లూకా సువార్తికుడే, యేసును కుట్రచేసి చంపిన యూదు మతపెద్దలు, శాస్త్రులున్న గుంపును ఉద్దేశించి, పునరుత్థానుడైన యేసు ప్రభువును కళ్లారా చూసిన నూతనోత్తేజంతో ఇది జరిగిన దాదాపు 55 రోజులకే పేతురు ఆత్మవశుడై ఎంతో ధైర్యంగా చేసిన ఈ ప్రకటనను కూడా తన అపొస్తలుల కార్యాల గ్రంథంలో ప్రస్తావించాడు (లూకా 22:39–62), (అపో.కా 3:15). సిలువ వెయ్యడానికి సైనికులు యేసుక్రీస్తును నిర్బంధించి తీసుకెళ్తుంటే ప్రాణభయంతో ఆయన్ను వదిలేసి పారిపోయిన పిరికి పేతురుకు, అది జరిగి రెండు నెలలైనా కాకముందే ‘మీరంతా యేసు హంతకులు, యేసు హత్యకు, ఆయన పునరుత్థానానికి కూడా మేము సాక్షులం’ అంటూ నిలదీసే ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది? అది క్రైస్తవానికి యేసుక్రీస్తువారి పునరుత్థాన శక్తి ద్వారా వచ్చింది.
వాస్తవమేమిటంటే, క్రీస్తును తెలుసుకొని ఆయన అనుచరులముగా క్రైస్తవులమైతే అయ్యాము కానీ, ఆయన పునరుత్థానశక్తిని మాత్రం పూర్తిగా అవగాహన చేసుకోలేక దాన్ని పొందలేక పోతున్నాము. పునరుత్థానశక్తికి లోకపరమైన శక్తితో ఏమాత్రం పోలికలేదు. ఒక రాయిని కొండమీది నుండి భూమ్మీదికి తోసేందుకు తోడయ్యేది మామూలుగా లోకంలో అందరిలోనూ ఉండే శక్తి అయితే అదే బండరాయిని భూమ్మీదినుండి కొండ మీదికి దొరలించేందుకు ఉపకరించేది యేసుప్రభువు వారి పునరుత్థాన శక్తి!! యేసుప్రభువు వారి ప్రేమ, క్షమాపణ అనేవి అర్థమైతేనే ఈ శక్తి అర్థమవుతుంది, లభ్యమవుతుంది. రెండువేల ఏళ్ళ క్రితం నాటి ్రౖకైస్తవంలో ఎక్కువగా పామరులు, సామాన్యులే ఉన్నారు కాని వాళ్ళు క్రైస్తవాన్ని భూదిగంతాలకు విజయవంతంగా తీసుకువెళ్లడం వెనుక ఈ శక్తి ఉంది. అందుకే ఆ శక్తిని తాను తెలుసుకోవడానికే ప్రయాసపడుతున్నానని మహా అపొస్తలుడు పౌలు అన్నాడు (ఫిలిప్పి 3:11). – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్
Comments
Please login to add a commentAdd a comment