మహమ్మారిపై మహాపోరు | Special Article About Women Response On Corona Vaccine In Family | Sakshi
Sakshi News home page

మహమ్మారిపై మహాపోరు

Published Tue, Mar 24 2020 1:02 AM | Last Updated on Tue, Mar 24 2020 1:02 AM

Special Article About Women Response On Corona Vaccine In Family - Sakshi

మందు కనిపెట్టే వరకే ఏ మహమ్మారి అయినా విజృంభిస్తుంది. కనిపెట్టాక తోక ముడుస్తుంది. కరోనా ఇప్పుడు తనకు మందు లేదని విర్రవీగుతోంది. కాని దాని పడగను నులిమేసే పరిశోధనలు సాగుతూ ఉన్నాయి. రాక్షస సంహారం చేసిన నారీమణులు మన పురాణాలలో ఉన్నారు. చరిత్రలో ఉన్నారు. ఇప్పుడు కరోనా తరిమివేతలోనూ ఉంటారు. లండన్‌ మెడికల్‌ రిసెర్చ్‌ కౌన్సిల్‌లో ఈ మహిళా పరిశోధకులు కరోనా గురించి చైతన్యం కలిగించడంలో ముందున్నారు.

లండన్‌లో ఉన్న ‘మెడికల్‌ రిసెర్చ్‌ కౌన్సిల్‌’లో మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా మహిళా పరిశోధకులంతా కలిసి సంతోషంగా సంబరాలు జరుపుకోవాలనుకున్నారు. కాని అంతలోనే వారికి బాధ్యత గుర్తుకు వచ్చింది. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌పై తమ పరిశోధక శస్త్రాలను ఎక్కు పెట్టాలని సంకల్పం కలిగింది. అక్కడి బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న ఈ పరిశోధకులు కొవిడ్‌ 19 మహమ్మారికి సంబంధించి చర్చించి, ప్రజలకు ఎప్పటికప్పుడు సరైన సమాచారం అందిస్తూ, ప్రజలకు ధైర్యాన్నివ్వాలనుకున్నారు.

క్రిజిల్‌ డొన్నెల్లీ
విదేశీయుల ద్వారా ఎంతమందికి ఈ వ్యాధి సోకింది, ఏ విధంగా నియంత్రించాలి అనే అంశాల గురించి చర్చిస్తున్నారు క్రిజిల్‌ డొన్నెల్లీ. ‘మా పరిశోధనలో తేలిన అంశాలను డబ్లుహెచ్‌ఓ (వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌)కి అందచేçస్తూ, యుకేలోని ప్రభుత్వ విభాగాలకు, పబ్లిక్‌ హెల్త్‌ సెంటర్స్‌కి వాటిని అందిస్తున్నాం. అదేవిధంగా ఐM్కఉఖఐఅఔ’S గిఉఆSఐఖీఉ లో కూడా ఉంచుతున్నాం. సమాచారాన్ని సంక్షిప్తంగా, ప్రతి ప్రాంతీయ భాషలలో అందచేస్తున్నాం. మీడియాకు సహకరించే బాధ్యత నాది. టీవీ, రేడియో, దినపత్రికలు, ఆన్‌లైన్‌ ఔట్‌లెట్స్‌ (లైవ్, రికార్డెడ్‌ ఇంటర్వూ్యలు).. అందరికీ అందుబాటులో ఉంచుతున్నాను. బిబిసి కరోనా వైరస్‌ పాడ్‌క్యాస్ట్‌లో మొట్టమొదటి ఇంటర్వూ్య ఇచ్చాను. ప్రపంచాన్ని వణికించిన ఎబోలా సమయలో ఈ విధంగా పనిచేసిన అనుభవం నాది’ అంటారు క్రిజిల్‌ డొన్నెల్లీ.

డా. యాన్‌ కొరీ
‘స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్స్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇన్‌ఫెక్షియస్‌ డిసీజ్‌ ఎపిథెమియాలజీ’లో లెక్చరర్‌గా పనిచేస్తున్నారు డా.యాన్‌ కొరీ. ‘ప్రజలకు, ప్రజలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునేవారికి ఇది ఒక గడ్డుకాలం. అందరికీ సకాలంలో సరైన సమాచారం అందుతుందనే నమ్మకం లేదు. ఈ వ్యాధి వలన నిజంగానే ప్రమాదం ఉందా లేదా అనే విషయాన్ని కచ్చితంగా తెలుసుకోవటం చాలా కష్టం. 2014 – 2016 మధ్య కాలంలో పశ్చిమ ఆఫ్రికాను గడగడలాడించిన ఎబోలా గురించి 2018 నుంచి డెమొక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగోలో ఎంత బాధ్యతగా పనిచేస్తున్నామో, ఇప్పుడు కూడా అదేవిధంగా పని చేస్తున్నాం. మేమంతా కలిసి ఎంతో జాగ్రత్తగా ఈ వ్యాధిని నివారించటానికి, నిర్మూలించటానికి కృషి చేస్తున్నాం’ అంటున్నారు డా. యాన్‌ కొరీ.

వెండీ బార్క్‌లే

కొవిడ్‌ 19 శ్వాసకోశంలోకి ఏ విధంగా ప్రవేశించి, వ్యాప్తి చెందుతుంది అనే విషయంలో పరిశోధిస్తున్నారు. కొత్త కొత్త శాస్త్రవేత్తల గురించి, నిపుణుల గురించి మీడియాకు విస్తృతంగా సమాచారం అందించిన అనుభవం వీరిది. ‘2000 సంవత్సరంలో సార్స్‌ విషయం బయట పడినప్పుడే గబ్బిలాలలో కరొనా వైర స్‌ విస్తృతంగా ఉందని తెలుసుకున్నాం. ఇదొక్కటే ఈ వ్యాధి వ్యాప్తికి కారణం కాదు. రెండు గబ్బిలాలలోని వైరస్‌ కలయిక వల్ల ఈ వ్యాధికి సంబంధించి వైరస్‌ పుడుతోందని తెలిసింది. ఇది నేరుగా గబ్బిలాల నుంచే మనుషులకు సోకుతోందా లేదా గబ్బిలాల నుంచి ఏదైనా మరొక వాహకం ద్వారా మనుషులకు సోకేలా చేస్తోందా అనేది ఇంకా నిర్థారించాలి’ అంటున్నారు వెండీ బార్క్‌లే.

రెబెకా ప్రైస్‌
సార్స్‌ – కోవ్‌ 2 ఏ విధంగా కొవిడ్‌ 19కు కారకం అవుతున్నాయనే అంశం గురించి పని చేస్తున్న బృందంలో సభ్యురాలు. ‘దేశాలు, ప్రయోగ కేంద్రాల మధ్య అనుంధానం చాలా కష్టం అనుకున్నాను మొదట్లో. కాని ఎంతో అవగాహనతో బాధ్యతగా పనిచేస్తున్నారు’ అంటున్నారు రెబెకా ఫ్రైస్‌.

డా. అన్నా బ్లాక్‌నీ (పోస్ట్‌ డాక్టరల్‌ రిసెర్చర్‌)

ప్రొఫెసర్‌ రాబిన్‌ షటాక్స్‌ బృందంలో కొవిడ్‌ 19కి ప్రాథమిక వ్యాక్సిన్‌ తయారీలో పని చేస్తున్నారు. ‘ఈ వ్యాక్సిన్‌ తయారీకి మాకు 14 రోజుల సమయం పట్టింది. ఇదొక రికార్డు. అవసరమైన వైరస్‌ను  సేకరించి, వ్యాక్సిన్‌ను రూపొందించాం. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్‌ను జంతువులపై ప్రయోగిస్తున్నాం. మా బృందం రూపొందించిన వ్యాక్సిన్‌లో స్వయం నిరోధక శక్తి పెంచే ఆర్‌ఎన్‌ఎ ఉంది. అంటు వ్యాధులకు ఇది అడ్డుకట్ట వేస్తుంది’ అంటారు డా.అన్నా బ్లాక్‌నీ.

ఒక చిన్న సూక్ష్మజీవి యావత్‌ ప్రపంచానికి తాళం వేసే స్థితి తీసుకువచ్చినా శాస్త్రవేత్తలు మాత్రం అనుక్షణం ఈ వైరసణ నిర్మూలన కోసం శ్రమిస్తున్నారు. ఈ యజ్ఞంలో కొందరు వైద్యులు ఇప్పటికే ఆహుతయ్యారు. వైద్యులు, శాస్త్రవేత్తలు చేస్తున్న కృషికి ఫలితం రావాలంటే, ప్రజలంతా తప్పనిసరిగా సహకరించాలి. ‘‘వ్యాధులు బాధలు ముసిరే వేళ మృత్యువు కోరలు సాచే వేళ/గుండెకు బదులుగా గుండెను పొదిగి.. కొన ఊపిరులకు ఊపిరులూదీ/జీవన దాతలై వెలిగిన మూర్తుల సేవాగుణం మాకందించరావా’’ అంటూ ప్రతి ఒక్కరూ వైద్యులను అభినందించాలి. శాస్త్రవేత్తలకు శిరసు వంచి నమస్కరించాలి. ఇది ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలి. – వైజయంతి

ప్రొఫెసర్‌ అజ్రా ఘనీ
‘సెంటర్‌ ఫర్‌ ఇన్‌ఫెక్షియస్‌ డిసీజ్‌ అనాలసిస్‌’లో తన తోటి ఉద్యోగులతో కలిసి అజ్రా ఘనీ ప్రభుత్వానికి కీలక సమాచారం అందించటంలో అహర్నిశలూ కృషి చేస్తున్నారు. కరొనా వైరస్‌కి సంబంధించిన అత్యంత ప్రధానమైన సమాచారాన్ని మార్చి 16వ తేదీన అందించారు. ‘మేమంతా కరొనాకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలియచేస్తూ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో హెచ్చరిస్తున్నాం. 2003లో విజృభించిన  సార్స్‌ వైరస్‌ సమయంలోనూ, 2009 ఫ్లూ మహమ్మారి వచ్చినప్పుడూ సమాచారాన్ని అందిస్తూ ఏ విధంగా హెచ్చరించామో, ఇప్పుడు కొవిడ్‌ 19 గురించి కూడా అదే విధంగా హెచ్చరిస్తున్నాం. కేసులు పెద్ద సంఖ్యలో నమోదు కావటం ప్రజలను భయాందోళనలకు గురి చేస్తోంది. ఈ వైరస్‌ కారణంగా అంతకంతకు పెరుగుతున్న మరణాల సంఖ్య ప్రభుత్వాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అత్యంత వేగంగా విస్తరిచండం కొవిడ్‌–19కు ఉన్న ప్రత్యేక లక్షణం, అదే సమయంలో అత్యంత ఆందోళనకరం. 50 మందికి పైగా శాస్త్రవేత్తలు కొవిడ్‌ – 19 గురించి శాస్త్రీయ సమాచారం ఇవ్వడానికి పరిశోధన చేస్తున్నారు’ అంటున్నారు ప్రొఫెసర్‌ అజ్రా ఘనీ.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement