Coronavirus: క్యాన్సర్‌ రోగులూ తీసుకోవల్సిన జాగ్రత్తలు.. | Coronavirus: Doctor Nagendra Parvataneni Says Cancer Patients Caring Tips | Sakshi
Sakshi News home page

Coronavirus: క్యాన్సర్‌ రోగులూ తీసుకోవల్సిన జాగ్రత్తలు..

Published Sun, Jun 6 2021 10:55 AM | Last Updated on Sun, Jun 6 2021 10:55 AM

Coronavirus: Doctor Nagendra Parvataneni Says Cancer Patients Caring Tips - Sakshi

సాధారణ ప్రజలే ఎన్నో వెతలు అనుభవిస్తున్న ప్రస్తుత కరోనా మహమ్మారి సంక్షోభ సమయంలో... క్యాన్సర్‌ రోగులు, వాళ్ల కుటుంబాల బాధలు  చెప్పనలవి కాదు. క్యాన్సర్‌ రోగులంటేనే వాళ్లలో వ్యాధి నిరోధక శక్తి ఒకింత తక్కువగా ఉంటుంది. దాంతో కరోనా బారిన పడే ముప్పు (రిస్క్‌) మరింత ఎక్కువ. అదే జరిగితే అసలే ఇమ్యూనిటీ తక్కువ కాబట్టి వాళ్లల్లో కరోనా దుష్ప్రభావాలూ ఎక్కువే. ఈ నేపథ్యంలో క్యాన్సర్‌ రోగులపై దాని ప్రభావం ఎలా ఉంటుంది,  వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వారి వ్యాక్సినేషన్‌  వంటి అనేక అంశాలపై అవగాహన కోసమే ఈ కథనం.

కరోనా వైరస్‌ ముప్పు క్యాన్సర్‌ రోగులందరిలో ఒకేలా ఉండకపోవచ్చు. రోగి తాలుకు వ్యాధి చరిత్ర, అతడు బాధపడే క్యాన్సర్‌ రకం, వారు తీసుకునే చికిత్స (అంటే సర్జరీ చేయించుకున్నారా, రేడియేషన్‌ తీసుకుంటున్నారా లేక కీమో తీసుకుంటున్నారా అనే అంశాల) ఆధారంగా ఈ ముప్పు ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉండే అవకాశముంది. చికిత్స అంతా ముగించుకున్న క్యాన్సర్‌ పేషెంట్లను మనం ‘కోలుకున్నవారు’ (సర్వైవర్స్‌) అని పిలుస్తాం. క్యాన్సర్‌ నుంచి కోలుకున్నప్పటికీ చాలామందిలో ఇది మళ్లీ వచ్చే అవకాశమున్నందున వాళ్లు తరచూ హాస్పిటల్స్‌కు ఫాలో–అప్‌ కోసం వెళ్లి వస్తుండాలి. ముందే వ్యాధి నిరోధక శక్తి తక్కువ... అందునా మళ్లీ మాటిమాటికీ హాస్పిటల్స్‌కు వెళ్లాల్సిన పరిస్థితి కారణంగా ప్రస్తుతం ఉన్న సంక్షోభ సమయంలో వారి పరిస్థితి మరింత దుర్భరంగా ఉండే అవకాశం ఉంది. 

క్యాన్సర్‌ రోగులందరికీ ఒకే సమాధానం వర్తించదు... ఎందుకంటే? 
ఈ రోజుల్లో కరోనాతో బాధపడే రోగులు తప్ప... మిగతావారంతా కరోనా తాలూకు వైరల్‌ ఇన్ఫెక్షన్‌కు భయపడి హాస్పిటల్స్‌ వైపు వెళ్లడమే మానేశారు. వీళ్లలో క్యాన్సర్‌ రోగులూ ఉన్నారు. క్యాన్సర్‌ చికిత్స అనేది కొంతకాలం మానేసి... ఆ తర్వాత మళ్లీ కుదిరినప్పుడు తీసుకోవాల్సిన చికిత్స కాదు. అందునా ఇది నెలల తరబడి... కొన్ని సందర్భాల్లో ఏళ్ల తరబడి కూడా సాగాల్సిన చికిత్స. ఆపకూడని చికిత్స. ఎందుకంటే చాలా సందర్భాల్లో కాలం గడుస్తున్న కొద్దీ రోగిలో వ్యాధి ముదరడం, క్యాన్సర్‌ గడ్డ మరింత గా పెరగడం వంటి అనర్థాలు సంభవించవచ్చు. ఇలా చికిత్స వాయిదా వేసినప్పుడు వ్యాధి మరింత ముదిరి ఉన్న స్టేజ్‌ దాటి మరో ప్రమాదకరమైన లేదా చికిత్సకు లొంగని స్టేజ్‌కు చేరవచ్చు.

అలాంటప్పుడు కాలాన్ని వృథా చేస్తే... ముందు తేలిగ్గా చికిత్సకు లొంగిపోయే వ్యాధి, ఆ తర్వాత అంత తేలిగ్గా లొంగని విధంగా మారేందుకు అవకాశం ఉంది. దాంతో చిన్న చికిత్సతో తగ్గేది కాస్తా... చాలా పెద్ద చికిత్స వరకూ వెళ్లేందుకు అవకాశం ఉంది. ఇలా చికిత్స అందించకుండా ఆపేసినప్పుడు కొన్ని రకాల క్యాన్సర్లు... ఉదాహరణ కు... కొన్ని బ్రెయిన్‌ ట్యూమర్లు, తల–మెడకు సంబంధించిన క్యాన్సర్లు, ఈసోఫేగల్, హెపాటో–బిలియరీ–ప్యాంక్రియాటిక్‌ క్యాన్సర్లు, హెమటో–లింఫాయిడ్‌ మ్యాలిగ్నెన్సీ వంటి క్యాన్సర్లు ప్రమాదకరమైన పరిస్థితికి వెళ్లవచ్చు. 

ఈ నేపథ్యంలో క్యాన్సర్‌ రోగులందరికీ నిర్దిష్టంగా ఒకే సలహా ఇవ్వడం అనేది కుదరని పని. కాబట్టి ఇలాంటి ప్రశ్నకు... వాళ్ల వ్యక్తిగతమైన కేసు ఆధారంగా... వారికి చికిత్స అందిస్తున్న ఆంకాలజిస్ట్‌ మాత్రమే జవాబివ్వగలరు. కొన్ని ప్రమాదకరం కాని కేసుల్లో మాత్రం కేవలం ఒకటి లేదా రెండు నెలల పాటు వ్యవధి ఇవ్వగలిగినప్పటికీ దాదాపుగా హైరిస్క్‌ కేసుల్లో అంటే... ఛాతీ ప్రాంతంలోని క్యాన్సర్లు, ఎముక మూలుగకు సంబంధించిన లుకేమియా, లింఫోమా, మైలోమా వంటి క్యాన్సర్లలో కొంత రిస్క్‌ తీసుకుని పీపీఈ కిట్స్‌ వంటి వాటి సహాయంతో రోగికి అవసరమైన కీమోథెరపీ, రేడియేషన్‌ థెరపీ వంటి చికిత్సలు అందించడమే రోగికి ప్రయోజనకారిగా ఉండవచ్చు. 

క్యాన్సర్‌ రోగులకు కరోనాతో ముప్పు ఎందుకు ఎక్కువ? 
క్యాన్సర్‌ చికిత్స తీసుకుంటున్న సమయంలో పేషెంట్లలో తెల్లరక్తకణాల సంఖ్య తగ్గడమో, వాటి చురుకుదనం మందగించడమో జరుగుతుంది. మన దేహంలో ఈ తెల్లరక్తకణాలే ఇన్ఫెక్షన్లలో పోరాడే శక్తి కలిగి ఉంటాయి. అలాగే చికిత్స పూర్తయి, కోలుకున్న రోగుల్లో సైతం తమ రోగనిరోధక శక్తి ఇంకా పూర్తిగా నార్మల్‌కి అంత త్వరగా రాదు. కీమోథెరపీ వంటి చికిత్స ప్రక్రియ పూర్తయ్యాక కూడా దాదాపు రెండు నెలల తర్వాతే రోగనిరోధక వ్యవస్థ ఒక మోస్తరు నార్మల్‌ స్థాయికి చేరుకుంటంది. ఈ కారణాలతో మన దేహానికి ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తి బలహీనంగా ఉండటం వల్ల కరోనా ప్రభావమూ, ముప్పూ పెరిగే అవకాశాలెక్కువ. 

ఇక క్యాన్సర్‌ రోగుల్లోనూ క్యాన్సర్‌ గడ్డలతో (ట్యూమర్‌ తరహా క్యాన్సర్లతో) బాధపడేవారితో పోలిస్తే... రక్తానికి సంబంధించిన క్యాన్సర్లు (ల్యుకేమియా / బ్లడ్‌ క్యాన్సర్స్‌) లేదా లింఫోమా వంటి వాటితో బాధపడేవారిలో కరోనా ముప్పు చాలా ఎక్కువ. ఎందుకంటే క్యాన్సర్‌ గడ్డలు వంటివి అయినవారితో పోలిస్తే... ల్యుకేమియా, లింఫోమా పేషెంట్లలో ఇమ్యూనిటీని ఇచ్చే యాంటీబాడీల పుట్టుక చాలా మందకొడిగా ఉంటుంది. అందువల్ల వీళ్లలో ముప్పు పొంచి ఉంటుంది. కీమోథెరపీ తీసుకుంటున్న రోగికి అది ముగిసిన ఒక వారం తర్వాత కూడా రోగ నిరోధక శక్తి చాలా చాలా తక్కువగా ఉంటుంది. అది ఒక మోస్తరు సాధారణ స్థితికి రావడానికి చికిత్స ముగిశాక కనీసం మూడు వారాల వ్యవధి అవసరమవుతుంది.

క్యాన్సర్‌ రోగులు పాటించాల్సిన  జాగ్రత్తలు ఏమిటి? 
క్యాన్సర్‌ రోగులు ఈ కరోనా కాలంలో ఎట్టిపరిస్థితుల్లోనూ తమ చికిత్సను నిర్లక్ష్యం చేయకూడదు. తాము వాడుతున్న మందులను ఏమాత్రం ఆపకుండా కొనసాగించాల్సి ఉంటుంది. ఒకవేళ ఏదైనా కారణాలతో తాత్కాలికంగా ఆపాల్సి వచ్చినా... అది తప్పనిసరిగా వారి క్యాన్సర్‌ నిపుణుల సలహా మేరకు మాత్రమే జరగాలి. క్యాన్సర్‌ చికిత్స కొంత సుదీర్ఘకాలం కొనసాగే ప్రక్రియ. పైగా ఈ సమయంలో రోగి హాస్పిటల్‌కూ, డయాగ్నస్టిక్‌ సెంటర్లకూ, ఎమర్జెన్సీ రూమ్స్‌కీ, రేడియేషన్‌ గదులకూ, ఒక్కోసారి కరోనా హాట్‌స్పాట్స్‌ అంటూ పేర్కొనే ప్రదేశాలకు వెళ్లాల్సి వస్తుంటుంది. నగరాల్లో ఉండే రోగుల కంటే పల్లెల నుంచీ, దూర దూర ప్రదేశాల నుంచి పట్టణాలూ, నగరాల్లో ఉండే పెద్ద సెంటర్లకు వచ్చే రోగులకు ముప్పు మరింత ఎక్కువ. అందుకే క్యాన్సర్‌ రోగులు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. 

క్యాన్సర్‌ చికిత్స (ప్రత్యేకించి కీమో, రేడియేషన్‌) తీసుకుంటున్న రోగులూ , మరీ ముఖ్యంగా బ్లడ్‌ క్యాన్సర్‌ రోగుల్లో బోన్‌ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చికిత్స పూర్తయి ఇంకా ఏడాది కూడా నిండకపోతే... అలాంటి రోగులు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటివారు రోగగ్రస్తమైన వారి దగ్గరికీ (సిక్‌ కాంటాక్ట్స్‌) వెళ్లకుండా భౌతిక దూరాలను  జాగ్రత్తగా పాటించాలి. క్యాన్సర్‌తో బాధపడుతూ అప్పటికే కరోనా వైరస్‌ బారిన పడితే... క్యాన్సర్‌ రోగులు తమ మామూలు మందులు వాడుతూనే... తమలోని రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు ‘‘ఇమ్యూన్‌ బూస్టర్‌ షాట్స్‌’’ వంటి రోగనిరోధక శక్తిని పెంచే మందులను తమ క్యాన్సర్‌ నిపుణుల సలహా మేరకు తీసుకోవాల్సి ఉంటుంది.

క్యాన్సర్‌ రోగికి కరోనా సోకితే... 
ఒకవేళ అప్పటికే క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగికి కరోనా ఇన్ఫెక్షన్‌ సోకితే వారికి రెండు చికిత్సలు అందించాల్సిన పరిస్థితి రావచ్చు. మొదటిది ఎప్పటిలా క్యాన్సర్‌ది కాగా... రెండోది కరోనా చికిత్స. కొందరిలో మాత్రం క్యాన్సర్‌ చికిత్స తాత్కాలికంగా ఆపి, మొదట కరోనా వైరల్‌ ఇన్ఫెక్షన్‌ తగ్గేవరకు... లక్షణాలకు (సింప్టమాటిక్‌) చికిత్స అందించాల్సి ఉంటుంది. అంటే... హైఫీవర్, దగ్గు వంటివి తగ్గేవరకు చికిత్స అందించాలి. ఎలాంటి చికిత్స అన్నది లక్షణాల తీవ్రత మీద ఆధారపడి ఉంటుంది.

వాళ్లలో లక్షణాలన్నీ తగ్గేవరకు లేదా ఈ రోగుల్లోనూ కరోనా నెగెటివ్‌ వచ్చేవరకు వారు కూడా అందరిలాగే రెండు (అరుదుగా మూడు) వారాల పాటు క్వారంటైన్‌లో ఉంటూ చికిత్స తీసుకోవాలి. నెగెటివ్‌ వచ్చిన ఒకే రిపోర్టు ఆధారంగా కాకుండా కనీసం 24 గంటల వ్యవధి ఇస్తూ రెండు పరీక్ష ల్లో నెగెటివ్‌ రిపోర్టు వచ్చాకే మళ్లీ క్యాన్సర్‌ చికిత్సలైన కీమో, రేడియేషన్‌ థెరపీ వంటివి  మొదలు పెట్టడం మంచిది. మిగతావాళ్లతో పోలిస్తే క్యాన్సర్‌ రోగులు వ్యాధి నిరోధక విషయంలో మరింత సున్నితంగా ఉంటారు కాబట్టి వారు ఇతర ఇన్ఫెక్షన్లు సోకకుండా మరింత అప్రమత్తంగా ఉండాలి. 

క్యాన్సర్‌ రోగులకు టీకాలు (వ్యాక్సినేషన్‌) ఇవ్వవచ్చా? 
క్యాన్సర్‌ రోగులకు టీకాలు ఇవ్వవచ్చా అనే సందేహం రావడం మామూలే. టీకా విషయంలో అనుసరించాల్సిన సూచనలివి... 

  • మిగతా అందరిలాగే రోగికి ఇతర మందుల పట్ల ఎలాంటి అలర్జిక్‌ (అనాఫిలెక్టిక్‌) రియాక్షన్‌ లేకుండా ఉన్నట్లయితే వారు కూడా అందరిలాగే టీకా తీసుకోవడమే మంచిది. 
  • ఇటీవలే రోగి తన క్యాన్సర్‌ చికిత్సలో భాగంగా కీమోథెరపీ లేదా ఇమ్యూనోథెరపీ లేదా రేడియేషన్‌ చికిత్స, స్టెమ్‌సెల్‌ థెరపీ లేదా బోన్‌ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌ (ఎముక మూలుగ మార్పిడి) చికిత్సలు తీసుకుని ఉంటే... వాళ్ల ఇమ్యూన్‌ సిస్టమ్‌ మామూలు దశకు వచ్చేవరకు కొంతకాలం పాటు ఆగితే మంచిది. 
  • ఇక గతంలో చికిత్స పొంది... ప్రస్తుతం క్యాన్సర్‌ తగ్గిన వారు (క్యాన్సర్‌ సర్వైవర్స్‌) తప్పనిసరిగా టీకా తీసుకోవాల్సిందే. 
  • ఏది ఎలా ఉన్నప్పటికీ క్యాన్సర్‌ రోగులు సైతం నిర్ణీత కాలంలో వారి రెండు డోసుల టీకాలూ తీసుకోవాల్సిందే అంటూ నిపుణులంతా సూచిస్తున్నారు. కాకపోతే వ్యక్తిగతంగా ఒకసారి తమకు చికిత్స అందించే డాక్టర్‌ను సంప్రదించాక టీకా తీసుకోవడం మేలు. 

-డాక్టర్‌
నాగేంద్ర పర్వతనేని
సీనియర్‌ కన్సల్టెంట్‌ అండ్‌ హెడ్‌ ఆఫ్‌ ద డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సర్జికల్‌ ఆంకాలజీ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement