వ్యాక్సిన్‌పై సాధారణ సందేహాలు!  | Coronavirus Vaccine Human Common Doubts | Sakshi
Sakshi News home page

వ్యాక్సిన్‌పై సాధారణ సందేహాలు! 

Published Thu, Jan 7 2021 12:31 AM | Last Updated on Thu, Jan 7 2021 3:47 PM

Coronavirus Vaccine Human Common Doubts - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

గత ఏడాదంతా కరోనా బాధపెట్టినా... ఈ ఏడాది తొలిరోజుల్లోనే వ్యాక్సిన్‌ వస్తుందన్న చల్లటి కబురు అందరినీ ఆహ్లాదపరచింది. దీనికి తోడు మనదేశంలోనూ రెండు వ్యాక్సిన్లకు కేంద్రప్రభుత్వం నుంచి అనుమతి దొరికింది. త్వరలోనే పంపిణీ కూడా మొదలుకాబోతోంది.  అయితే ఇప్పుడు సగటు మనిషికి అన్నీ సందేహాలే. వ్యాక్సిన్‌ తీసుకోడానికి పరగడుపున వెళ్లాలా, ఏదైనా తిని వెళ్లవచ్చా? పల్స్‌ పోలియో వ్యాక్సిన్స్‌ ఇచ్చేప్పుడు కొద్దిపాటి జ్వరం ఉన్నా ఇవ్వవచ్చన్నారు. ఇదీ అలాగేనా? జ్వరం ఉంటే మానేయాలా? గతంలో వ్యాక్సిన్స్‌ ఇవ్వగానే ఇవ్వగానే జ్వరాలు వచ్చేవి. దీనికీ అలాగే జ్వరాలు వస్తాయా? వ్యాక్సిన్‌ పరగడుపున తీసుకోవాలా లేదా  తీసుకున్న తర్వాత పథ్యం లాంటివి ఏవైనా ఉంటాయా? ఇక కొంతమంది రోజూ ఆల్కహాల్‌ తీసుకునేవారుంటారు. వ్యాక్సినేషన్‌ తర్వాత వాళ్లు ఎప్పటిలాగే సాయంత్రం ఆల్కహాల్‌ తీసుకోవచ్చా, లేదా?... మామూలు మనుషుల మదిలో మెదిలే ఎన్నో సగటు సందేహాలకు జవాబులివి. 

ఎవరికి ఈ వ్యాక్సిన్‌ ని ఇస్తారు?
ముందుగా సుమారుగా కోటిమంది ఉండే వైద్యసిబ్బందికి, వారి తర్వాత రెండు కోట్ల మంది ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ కి ఈ వ్యాక్సిన్‌ ఇస్తారు. ఆ తర్వాతి వరుసలో 50 ఏళ్ల పైబడిన వారితో పాటు అంతకన్నా తక్కువ వయసులో ఉండి వేరే విధమైన దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి కూడా ఈ వ్యాక్సిన్‌ ఇస్తారు. దేశవాసుల్లో ఇలాంటి వారు సుమారుగా 27 కోట్ల మంది ఉన్నారని అంచనా. మొత్తం 30 కోట్ల మందికి ఈ వ్యాక్సిన్‌ ఇవ్వడానికి తొలివిడత ప్రయత్నం జరుగుతోంది.

పిల్లలకు ఈ వ్యాక్సిన్‌ ఇవ్వొచ్చా?
పిల్లలకు ఈ వ్యాక్సిన్‌ అవసరం చాలా తక్కువ. పిల్లల్లో కరోనా వచ్చిన తర్వాత కూడా ప్రమాదం ఉండే అవకాశం చాలా అరుదు. అందుకే ప్రపంచ దేశాలన్నింటిలో కూడా 18 ఏళ్లు దాటిన వాళ్లకి మాత్రమే కరోనా వ్యాక్సిన్‌ని ఇస్తున్నారు.

కరోనా వ్యాక్సిన్‌కి ఏ విధంగా రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలి?
ఇప్పటికి ఉన్న నిబంధనల ప్రకారం... కరోనా వ్యాక్సిన్‌కి రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలంటే మొదట కోవిన్‌ అనే అప్లికేషన్‌ని డౌన్లోడ్‌ చేసుకోవాలి. ప్రస్తుతం ఈ అప్లికేషన్‌ ఇప్పుడు అందుబాటులో లేదు. ఈ అప్లికేషన్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత అందులో వ్యాక్సిన్‌కి పైన చెప్పిన మేరకు అర్హతలున్నవారు తొలుత నమోదు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్‌ తర్వాత అర్హులైన వారికి ఒక ఎస్‌ఎంఎస్‌ మెసేజ్‌ వస్తుంది. ప్రస్తుతానికి ముందుగా రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న వారికి మాత్రమే వాక్సినేషన్‌ సెంటర్లో వ్యాక్సిన్‌ వేయడం జరుగుతుంది. (వెద్యం, దాని సంబంధిత రంగాల్లో ఉన్న వారు కోవిన్‌ రిజిస్ట్రేషన్‌ చేయించుకోనక్కరలేదు.)

క్యాన్సర్‌ గాని లేక ఇమ్యూనిటీ తక్కువ ఉండే వాళ్లకు ఏ విధమైన వాక్సిన్‌ ఇవ్వచ్చు?
మనకు ఇప్పుడు అందుబాటులో ఉన్న వ్యాక్సిన్‌లలో భారత్‌ బయోటెక్‌ వాక్సిన్‌ పూర్తిగా నిర్వీర్యం చేసిన వైరస్‌ నుంచి తయారైంది. అందువలన ఈ వ్యాక్సిన్‌ ఇమ్యూనిటీ తక్కువ ఉండే వారిలో కూడా సురక్షితమైనది. ఆక్స్ఫర్డ్‌ వ్యాక్సిన్‌ వైరల్‌ వెక్టార్‌ వ్యాక్సిన్‌. ఇందులో విభజన చెందని అడినో వైరస్‌ ఉంటుంది. అయినప్పటికీ ఈ వ్యాక్సిన్‌ కూడా క్యాన్సర్‌ రోగుల్లో ప్రమాదకరమైనది కాదు. కాకపోతే ఇమ్యూనిటీ తక్కువ ఉండే వారిలో యాంటీబాడీస్‌ ఉత్పత్తి కూడా తక్కువగా ఉంటుంది. కాబట్టి వీరిలో ఈ వ్యాక్సిన్ల వలన పూర్తి రక్షణ ఉండకపోవచ్చు. 

ఒకసారి కరోనా వచ్చిన తగ్గిన వారు కూడా వ్యాక్సిన్‌ తీసుకోవలసిన అవసరం ఉంటుందా?
ఒకసారి కరోనా వచ్చి తగ్గిన వారిలో యాంటీబాడీస్‌ వృద్ధి అవకాశం ఉంటుంది. అయితే ఈ యాంటీబాడీస్‌ సరైన మోతాదులో ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు. ఈ యాంటీబాడీస్‌ కరోనా వచ్చి తగ్గిపోయిన తర్వాత అవి ఎన్ని రోజుల పాటు శరీరంలో ఉంటాయి అనే విషయంలో కూడా ఇప్పటికీ స్పష్టత లేదు. అదురుగానే అయినప్పటికీ... ఇప్పటికీ ఒకసారి వచ్చి తగ్గిపోయిన తర్వాత మరొకసారి కరోనా వచ్చిన దాఖలాలున్నాయి. ఈ కారణాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని... కరోనా వచ్చి తగ్గిన తర్వాత కూడా టీకా తీసుకోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. శరీరంలో కరోనా యాంటీబాడీస్‌ ఉన్నవారికి మళ్లీ కరోనా వచ్చే అవకాశం తక్కువే. కానీ అలా అని ప్రజలందరికీ యాంటీబాడీస్‌ పరీక్ష చేసి తరువాత వ్యాక్సిన్‌ ఇవ్వడం సాధ్యం కాదు. కరోనా వ్యాధి వచ్చి తగ్గిన వారిలో వ్యాక్సిన్‌ ఇవ్వడం వల్ల ఎటువంటి దుష్ఫలితాలూ కనపడలేదు కాబట్టి వ్యాధి వచ్చి తగ్గిన తర్వాత కూడా కరోనా వాక్సిన్‌ తీసుకోవడమే మంచిది.

కరోనా వ్యాక్సిన్‌ని తీసుకునే ముందు రోజు లేదా తీసుకున్న రోజు మద్యపానం చేయవచ్చునా?
స్పుత్నిక్‌ వ్యాక్సిన్‌ని తీసుకునే ముందు మద్యపానం చేయరాదని రష్యన్‌ అధికారులు చెప్పడంతో కొంతమేరకు దుమారం చెలరేగింది. వారు అలా చెప్పడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. ఆల్కహాల్‌ తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ కొంత మేరకు తగ్గే అవకాశం ఉంటుంది. ఇమ్యూనిటీ తగ్గినట్లయితే వ్యాక్సిన్‌ ఇచ్చిన తర్వాత యాంటీబాడీస్‌ సరిగ్గా తయారు అవ్వకపోవచ్చు. అందువల్ల వ్యాక్సిన్‌ సరిగ్గా పనిచేయాలంటే వ్యాక్సిన్‌ తీసుకోవడానికి కొన్ని రోజుల ముందు ఆ తర్వాత మళ్లీ  వాక్సిన్‌ తీసుకున్న తర్వాత ఇంకొన్ని రోజులు ఎక్కువ మోతాదులో మద్యపానం తీసుకోకపోవడమే మంచిది. అంటే కొద్దిరోజుల పాటు మద్యానికి దూరంగా ఉండటం వల్లనే ప్రయోజనం ఎక్కువ అన్నమాట. 

ఇంట్లో డయాబెటిస్, హైపర్టెన్షన్‌ ఉన్న పెద్దవాళ్ళకి వ్యాక్సిన్‌ ఇచ్చేటప్పుడు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా?
ఇప్పటికి కేవలం ఇంట్లో పెద్ద వాళ్ళకి మాత్రమే వ్యాక్సిన్‌ ఇచ్చే సదుపాయం ఉంది. వీళ్లలో చాలామంది కి బీపీ షుగర్‌ లు ఉండే అవకాశం ఉంటుంది. అందుకని వాళ్లకే వ్యాక్సిన్‌ అవసరం ఎక్కువ కూడా. అంతేకాదు వాళ్లకే కరోనా వల్ల ముప్పు అవకాశాలూ ఎక్కువ. అందువల్ల వీళ్లను వ్యాక్సినేషన్‌ సెంటర్‌ కి తీసుకువెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలి. వీళ్లు మాస్క్‌ ధరించడమే కాకుండా భౌతిక దూరాన్ని కూడా పాటించాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు బీపీ షుగర్‌ ఉన్న వాళ్ళలో కూడా చాలావరకు సురక్షితమైనవి. అందువల్ల  అనుమానాలు ఏమీ పెట్టుకోకుండా వీళ్లకు వ్యాక్సిన్‌ ఇప్పించవచ్చు. 

వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఏమైనా ఉండే అవకాశం ఉందా?
ఇప్పటికి అందుబాటులో ఉన్న కోవిషీల్డ్, కోవ్యాక్సిన్‌ అనే ఈ రెండు వ్యాక్సిన్లు కూడా చాలావరకు సురక్షితమైనవి. అయితే అన్ని వ్యాక్సిన్లు లాగానే కొంతవరకూ చిన్న చిన్న సైడ్‌ ఎఫెక్ట్స్‌ వీటికి కూడా ఉండవచ్చు. ముఖ్యంగా ఇంజక్షన్‌ తీసుకున్న దగ్గర నొప్పి, కొద్దిగా జ్వరం, తలనొప్పి లేదా వొళ్ళు నొప్పులు వీటివల్ల రావచ్చు. జ్వరం తీవ్రత ఎక్కువగా ఉన్నట్లయితే పారాసిటమాల్‌ తీసుకుంటే సరిపోతుంది. కొంతమందికి కళ్లు  తిరిగే అవకాశం కూడా ఉంటుంది. వ్యాక్సిన్‌ తీసుకున్నవారికి ఏ విధమైన సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉన్నప్పటికీ... వారిని జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండటానికి వీలుగా వారిని వ్యాక్సినేషన్‌ సెంటర్లో ఒక అరగంట సేపు అక్కడే ఉంచేస్తారు. (గుర్తుంచుకోవాల్సిన అంశమేంటంటే... కొన్ని సందర్భాల్లో క్లినికల్‌ ట్రయల్స్‌లో ఎదురుకాని సైడ్‌ ఎఫెక్ట్స్‌ కూడా వాస్తవ వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో కనిపించవచ్చు.)

వ్యాక్సిన్‌ను తీసుకోవడానికి పరగడుపున వెళ్లాలా లేకపోతే ఏమైనా తిని వెళ్ళవచ్చా?
సాధారణంగా వ్యాక్సిన్‌ తీసుకోవడానికి ముందుగా పరగడుపున ఉండాల్సిన అవసరం ఉండదు. కరోనా కి సంబంధించిన వ్యాక్సిన్‌లన్నీ ఇంజక్షన్‌ రూపంలో ఇచ్చేవి కావడంతో ఆహారం విషయంలో ఎక్కువ జాగ్రత్తలు అవసరం లేదు. అయితే కొన్నిసార్లు వాక్సిన్‌ తీసుకున్న తర్వాత వాంతులు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి కొద్దిగా తేలికపాటి ఆహారం మాత్రమే తీసుకుంటే మంచిది.

కొద్దిపాటి జ్వరం ఉన్నప్పటికీ వాక్సిన్‌ ఇవ్వచ్చునా?
సాధారణంగా కొద్దిగా ఒళ్లు వేడిగా ఉన్నప్పటికీ కూడా వ్యాక్సిన్‌ తీసుకోవచ్చు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో జ్వరం ఒకవేళ  కరోనా వల్ల వచ్చినట్లయితే పూర్తిగా తగ్గిన తర్వాత మాత్రమే వ్యాక్సిన్‌ తీసుకోవడం మంచిది. ఎందుకంటే జ్వరం ఉన్నప్పుడు వాక్సినేషన్‌ సెంటర్‌కి వెళ్ళినట్లయితే అక్కడ  ఉన్న మిగతా వాళ్ళకి కూడా వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది.

మనకు అందుబాటులోకి రానున్న వ్యాక్సిన్లు ఎంతవరకు సమర్థంగా పనిచేస్తాయి? 
కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ సుమారుగా 70 శాతం వరకు సమర్థంగా పనిచేయవచ్చు. భారత్‌ బయోటెక్‌ వ్యాక్సిన్‌ సమర్థత ఫేజ్‌ 3 ట్రయల్స్‌లో ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంటుంది. ఫేజ్‌ 1, ఫేజ్‌ 2 ట్రయల్స్‌లో ఈ వ్యాక్సిన్‌ 90 శాతానికి పైగా పనిచేస్తుందని తెలిసింది. ఈ రెండు వ్యాక్సిన్లు కూడా కొత్తగా వస్తున్న బ్రిటిష్‌ వేరియెంట్‌కి సైతం వ్యతిరేకంగా పనిచేస్తాయని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. 

కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత మాస్క్‌ ధరించడం మానేయవచ్చా?
కరోనా వ్యాక్సిన్‌ మొదటి డోసు తీసుకున్న తర్వాత పూర్తి రక్షణ రాకపోవచ్చు. రెండవ డోసు తీసుకున్న పదిహేను రోజుల తర్వాత మాత్రమే పూర్తి రక్షణ లభించే అవకాశం ఉంది. అందువల్ల రెండు డోసులూ పూర్తయిన 15 రోజుల వరకు తప్పనిసరిగా మాస్కు ధరించాలి. భౌతిక దూరాన్ని పాటించాలి. ఆ తర్వాత కూడా మాస్క్‌ ధరించడమే ఉత్తమం. మాస్క్‌ అనేది అనేక రకాల వ్యాధులను రాకుండా చూస్తుందని గుర్తుంచుకోవాలి. కేవలం ఈ పాండమిక్‌ పూర్తిగా తగ్గిపోయిన తర్వాత మాత్రమే మనం ఈ జాగ్రత్తల నుంచి తప్పుకునే అవకాశం ఉంటుంది. 

- డా. ఎంఎస్‌ఎస్‌ ముఖర్జీ, సీనియర్‌ కన్సల్టెంట్‌, కార్డియాలజిస్ట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement