క్యాన్సర్.. ఈ పేరు వింటేనే అందరూ హడలిపోతారు. ఎందుకంటే ఇదో ప్రాణాంతక వ్యాధి. సరైన సమయంలో ట్రీట్‌మెంట్ తీసుకోకపోతే ప్రాణాలు పోతాయి. ఈమధ్య కాలంలో క్యాన్సర్ కేసులు ఎక్కువగా చూస్తున్నాం. సమస్య వచ్చాక ఏం చేయాలి అని ఆలోచించే కంటే ముందు నుంచే జాగ్రత్తలు పాటిస్తే ఒకటిలో మూడోవంతు క్యాన్సర్‌లను నయం చేయొచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
క్యాన్సర్ నివారణకు మన చేతుల్లో ఉన్నది, మనం చేయగలిగింది, మన జీవన శైలిని ఆరోగ్యంగా మార్చుకోవటం మాత్రమే! క్యాన్సన్ నివారణలో అత్యంత కీలక పాత్ర పోషించే ఐదు అలవాట్లు ఏంటంటే..
1.మొదటిది ఆహార అలవాట్లు, మన ఆహారంలో పండ్లూ, కూరగాయలు భాగం అయ్యేలా సరైన పోషకాలు అందేలా తీసుకోవాలి.
2 ఎక్కువగా ఒత్తిడికి లోనవ్వకూడదు, మానసిక ఒత్తిడి పరోక్షంగా క్యాన్సర్‌కు కారణం అవ్వొచ్చు.
3.రోజూ శారీరక శ్రమ తప్పనిసరి. క్రమం తప్పకుండా కనీసం ముప్పై నిముషాలు వ్యాయామం చేయాలి.
4.అప్రమత్తంగా ఉండి ఏదైనా క్యాన్సర్ సంకేతం కనిపిస్తే క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్స్ చేయించుకోవాలి.
5. ధూమపానం ,మద్యపానం వంటి అలవాట్లకువీలైనంత దూరంగా ఉండాలి.
క్యాన్సర్.. ఎలా గుర్తించాలి?
క్యాన్సర్ శరీరంలో ఏ భాగానికైనా ఏ వయసులోనైనా రావచ్చు . చాలా క్యాన్సర్‌లకు లోతుగా పరీక్షలు జరిపితే గానీ గుర్తించలేము . మన శరీరం గురించి మనకంటే బాగా ఎవరికీ తెలియదు. అందుకే డాక్టర్ దగ్గరకు వెళ్లినప్పుడు ఎలాంటి సంకోచాలు లేకుండా మన ఇబ్బందులను పూర్తిగా చెప్పేయాలి. ఏదైనా సమస్యగా అనిపించినపుడు నిర్లక్ష్యం చేయకూడదు . మన పెద్దలకు , పూర్వీకులకు క్యాన్సర్ ఉన్నట్లైతే మనకు వచ్చే అవకాశం ఎక్కువ. కాబట్టి సంబంధిత వైద్యుల సలహాలను పాటించి కుటుంబంలో అందరు ఎప్పటికప్పుడు అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి.
అంతే త్వరగా కోలుకోవచ్చు..
►క్యాన్సర్ అని పలకడానికి,చెప్పడానికి చాలామంది భయపడతారు, ఇష్టపడరు. క్యాన్సర్ అనగానే ఇక ఆ మనిషి బతకడమే కష్టమన్నట్లు ఆలోచిస్తారు. క్యాన్సర్ వచ్చినవారిని జాలిగా,చులకనగా , అంటరానివారుగా చూడడం , ఏదో పాపం చేయడం వల్లనే వారికి క్యాన్సర్ వచ్చిందని దెప్పిపొడవడం చేయకూడదు .క్యాన్సర్ అని చెప్పడానికి భయపడడం, బాగా దిగులుపడడం , నిరాసక్తంగా నిస్పృహలో ఉంటూ వైద్యులకు సహకరించకపోవడం చేయకూడదు.
► సగానికి పైగా క్యాన్సర్‌లు మామూలు వ్యాధుల్లానే సరైన వైద్యంతో నివారించబడతాయి. ముఖ్యంగా వ్యాధి నిర్థారణ ఎంత త్వరగా జరుగుతుందో అంత త్వరగా కోలుకోవచ్చు.
► వైద్యుల దగ్గర దాపరికం ఉండకూడదు. అలానే అనుమానం కూడా ఉండకూడదు . వారి సలహాల పట్ల నిర్లక్ష్యం ఉండొద్దు.నమ్మకంతో ధైర్యంగా వైద్యం తీసుకోవాలి .
► 6 నెలలకు,సంవత్సరానికి ఒకసారి అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి. ఏదైనా శారీరక ఇబ్బంది, సమస్య వచ్చినపుడు వైద్యులను సంప్రదించడం చాలా ముఖ్యం.
► మనం తీసుకునే ఆహారమే ఆరోగ్యానికి ముఖ్య కారణం. సరైన నిద్ర , ఆహారం , జీవనశైలి , ఆలోచనా విధానం వల్ల సగానికి పైగా వ్యాధులు తగ్గుతాయి.
► ఎంతటి ప్రమాదకర సమస్య అయినా సరైన అవగాహనతో , సానుకూల దృక్పథంతో , ఆరోగ్యకర జీవనశైలితో ప్రయత్నస్తే తప్పకుండా బయటపడగలం.
-నవీన్ నడిమింటి
ప్రముఖ ఆయుర్వేద వైద్యులు
Comments
Please login to add a commentAdd a comment