దేవరకొండ తిలక్ రాసిన ‘నల్లజర్ల రోడ్డు’ చదవాలి. అందులో దట్టమైన అడవి మధ్యన కారు చెడిపోయి ఆగిపోతే కారు దిగిన నవ యువకుణ్ణి విషసర్పం కాటు వేస్తుంది. అర్ధరాత్రి. ప్రాణాపాయం. సాయం చేసే మనిషి కనిపిస్తే ఆస్తి రాసిమ్మన్నా సరే! కారులోని మనుషులు వెర్రెత్తి చూస్తుండగా ఒక ముసలివాడు తన మనవరాలితో వస్తాడు. గుడిసెలో విరుగుడు మందు లేకపోతే అంత రాత్రీ అడవిలోకి మనవరాలిని పంపి తెప్పిస్తాడు. ప్రాణం నిలబెడతాడు. అతని కోసం ఏమైనా చేస్తాం అంటారు కృతజ్ఞతతో కారులోని మనుషులు. తెల్లవారుతుంది. ఇప్పుడు ముసలివాడిని పాము కాటేస్తుంది. మనవరాలు కారు మనుషులతో తాతను పట్నం తీసుకెళ్ల మంటుంది. కానీ కారు మనుషులకు అర్జెంటు వ్యవహారం మీద వెళ్లాల్సి ఉంటుంది. గత రాత్రి వాళ్లు ఆ ముసలివాడి వల్లే బతికారు. కానీ ఈ ఉదయం ముసలివాణ్ణి వాడి ఖర్మానికి వదిలి బయలు దేరారు. మనిషితనానికి విఘాతం కలిగించే మనుషులు వీరు.
మధురాంతకం మహేంద్ర రాసిన ‘అతడి పేరు మనిషి’ కథ చదవాలి. అందులో కారు చెడి పోయిన వాన సాయంత్రం దానిని డ్రైవ్ చేస్తూ ఒంటరిగా రోడ్డు మీద చిక్కుబడిపోయిన యువతిని ఒక పల్లె యువకుడు ఆదుకుంటాడు. గుడిసెకు తీసుకెళ్లి పొడి బట్టలు ఇస్తాడు. అన్నం పెడతాడు. రాత్రంతా ఆమెకు రక్షణగా ఉండి మరుసటి ఉదయం భద్రంగా పంపిస్తాడు. ఆమె తన లాకెట్‌ను మర్చిపోతే వెతుక్కుంటూ వెళ్లి ఇవ్వబోతే ఆ యువతి ఇంటి మనుషులు థ్యాంక్స్ చెప్పి ‘భోజనం చేసి వెళ్లమని’ బయట వరండాలో సరిగ్గా కుక్క ఎక్కడ తింటుందో అక్కడ పెట్టబోతారు. యువతి దుఃఖంతో వణికిపోతుంది– మనిషితనానికి విఘాతం కలిగించే అలాంటి మనుషులను చూసి!
అల్లం శేషగిరిరావు ‘వఱడు’ కథ భలే పాఠం. దేశానికి కొత్తగా రైల్వే లైన్లు వేస్తున్న రోజులు. అడవిలో క్యాంప్. రిటైర్ అయిన వృద్ధ గుమస్తా ఇంజనీరుగారిని బతిమిలాడి కుటుంబ అవసరాల రీత్యా పని చేస్తూ ఉంటాడు. అతడి కూతురు నిండు గర్భిణి. ఇంకా చాలా ఖర్చులే ఉన్నాయి. ఆ ఒత్తిడిలో ఆ వృద్ధ గుమస్తా ఏదో పని సరిగా చేయకపోతే ఇంజనీరు గారు ఫైలు ముఖాన కొడతారు. అది చూసి జీపు డ్రైవరు చిన్నయ్యకు కోపం వస్తుంది. వయసులో పెద్దవాడైన గుమస్తా మీద చిన్నవాడివైన నువ్వు ఫైలు కొడతావా అని నిరసన వ్యక్తం చేస్తాడు. ఎందుకు చేస్తాడు? వృద్ధ గుమస్తా మర్యాద కాపాడటానికి! కానీ వృద్ధ గుమస్తా ఇంజనీరు గారికి కోపం రాకుండా చూసుకుంటాడు. ‘తల్లి వంటి ఇంజనీరుగారు ఒక దెబ్బ కొట్టడం తప్పా’ అని ఎదురు చిన్నయ్యనే అడుగుతాడు. చిన్నయ్య ఇప్పుడు అపరాధి అవుతాడు. ఇంజనీరు గారి అహానికి ఆ చిన్నయ్య డ్రైవర్ ఉద్యోగం ఊడిపోతుంది. అడవిలో వఱడు (హైనా) నేరుగా తాను వేటాడి బతకదు. పులికి ఎరను చూపి అది తినగా మిగిలిన దాన్ని తింటుంది. వృద్ధ గుమస్తా చేసింది అదే. డ్రైవర్ చిన్నయ్యను ఎరగా వేయడం. మనిషితనానికి విఘాతి ఆ గుమస్తా.
అనాదిగా మనిషి మనిషితనానికి విఘాతం పుట్టిస్తూనే ఉన్నాడు. మనిషిగా ఉండటానికి నిరాకరిస్తూనే ఉన్నాడు. అతడికి ఆధిపత్యం కావాలి. స్వార్థం కావాలి. ‘తనే’ కావాలి. అందుకై ప్రాంతం తనది అంటాడు. కులం తనది అంటాడు. మతం తనది అంటాడు. సరిహద్దు తనది అంటాడు. సరిహద్దుకు అవతల ఉన్నదీ తనదే అంటాడు. అతడు వెన్నుపోటు పొడుస్తాడు. విశ్వాస ఘాతుకం చేస్తాడు. విద్వేషాన్ని ప్రజ్వరిల్లజేస్తాడు. హింసను ప్రేరేపిస్తాడు. ఎదుటివాడి రక్తాన్ని ఆశిస్తాడు. యుద్ధాన్ని ఆజ్ఞాపిస్తాడు. మనిషిగా ఉండటం ఎంతో సులువు అని గ్రహించక అందుకు విరుద్ధమైన అతి కష్టమైన పనులన్నీ చేస్తాడు.
అప్పుడు సందేహం వస్తుంది– మనిషిని నమ్మొచ్చా అని! ఏ మనిషినీ నమ్మకూడదు అని! అల్లాంటి సమయాలలోనే ఎవరో ఒక మనిషి మనిషితనానికి పెద్ద ఉదాహరణగా నిలుస్తాడు. ఓ.హెన్రీ ‘లాస్ట్ లీఫ్’ గుర్తుంది కదా! న్యూమోనియా సోకిన అమ్మాయి తన కిటికీలో నుంచి చూస్తున్న తీగకు ఆకులు రాలుతూ ఉంటే చివరి ఆకు రాలిన రోజు తాను మరణిస్తానని గట్టిగా నమ్ముతుంది. అన్ని ఆకులూ రాలుతాయి. చివరి ఆకు తప్ప. ఆమె బతుకుతుంది. కానీ గోడ మీద రాలని ఆకును చిత్రించిన వృద్ధ చిత్రకారుడు అందుకై రాత్రంతా మంచులో తడిసి అదే న్యూమోనియాతో మరణిస్తాడు. ఆ వృద్ధ చిత్రకారుడు ఎవడో? ఎవడైతే ఏమిటి, మనిషి!
రోజులు అట్టే బాగోలేవు. ఇరుగింటి వారికి పొరుగింటిపై అక్కసు, బంధువులకు బంధువులతో పొసగనితనం, అన్నాచెల్లెళ్ల అక్కాతమ్ముళ్ల మధ్య విఘాతం, ఆఫీసుల్లో సాటి కొలీగ్స్‌పై కక్ష, సమూహాలకు సమూహాలతో వైరం, మతాలకూ మతాలకూ చిచ్చు, దేశాల మధ్య వైరం... ఇంతా చేసి ఇదంతా మనిషి మనిషితనానికి తెస్తున్న విఘాతం. మూడు పూట్లా తిండి, ఒక పూట విసర్జనాన్ని దాటలేకపోయిన మనిషి సాటి మనిషిని బాధించి, సాధించి బావుకునేది ఏమిటి? ఆస్తి, ఎల్లలు పెంచుకోగలడు కానీ కడుపులోని పెద్ద ప్రేవు, చిన్నప్రేవు పరిమాణాన్ని పెంచగలడా?
వేళ్ళు ముదిరి పునాదులకే ప్రమాదం వచ్చినప్పుడు చెట్టును కొట్టేయక తప్పదు. మనిషి తనానికి విఘాతంగా మనిషి మారినప్పుడు ఆ మనిషికి గట్టిగా బుద్ధి చెప్పక తప్పదు. చరిత్ర అంతా ఓడిన చెడ్డ మనుషులు, గెలిచిన మంచి మనుషులే! మనిషిపై మనిషికి నమ్మకం మిగిల్చినవాళ్లే! లేకుంటే ఇంతకాలం మనిషి బతకగలిగేవాడా సాటి మనిషిని తోడు చేసుకోక.
మనిషికి విఘాతం
Published Mon, Feb 28 2022 12:25 AM | Last Updated on Mon, Feb 28 2022 12:26 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment