అప్పారావు చిటికెల పందిరి! | Sakshi Editorial On Chandrababu Govt By Vardhelli Murali | Sakshi
Sakshi News home page

అప్పారావు చిటికెల పందిరి!

Published Sun, Jan 19 2025 12:31 AM | Last Updated on Sun, Jan 19 2025 12:31 AM

Sakshi Editorial On Chandrababu Govt By Vardhelli Murali

జనతంత్రం

ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వం ఏడు మాసాలు పూర్తి చేసు కొని ఎనిమిదో నెలలో ప్రవేశించి ఓ వారం గడిచిపోయింది. అష్టమంలోకి బుధుడు ఎంట్రీ ఇచ్చినట్టున్నాడు. గణాంకాలూ, లెక్కలూ వగైరా సబ్జెక్టులు బుధ గ్రహం పోర్టుఫోలియోలని చెబు తారు. అవసరమున్నా లేకపోయినా సరే ఈ మధ్య ముఖ్య మంత్రి సంపద సృష్టి లెక్కలు చెప్పడం మొదలుపెట్టారు. ఇలా ఆర్థిక శాస్త్ర అధ్యాపకుని అవతారం ఎత్తడం వెనుక ఆయన మనో భావాలేమిటో గ్రహించాలి.

కొత్త ప్రభుత్వ పనితీరును మొదటి ఆరు మాసాలపాటు జనం పెద్దగా పట్టించుకోరని మన రాజకీయ నాయకులు అభిప్రాయపడతారు. ఏడో నెల నుంచి మాత్రం నఖశిఖ పర్యంతం పరిశీలిస్తారు. అందుకే కొత్త ప్రభుత్వాలకు తొలి ఆరు నెలలు ‘హనీమూన్‌ పీరియడ్‌’ అనే ముద్దుపేరును తగిలించుకున్నారు. ఆ మురిపాల కాలం కరిగిపోయి ఐదు వారాలైంది. జనం ప్రశ్నించడం మొదలైంది. వీధుల్లోకి రావడం కూడా ప్రారంభమైంది. జనం దృష్టి మళ్లింపు ఎత్తుగడలతో నెట్టుకురావడం ఇక కుదరదు. ఏదో ఒకటి చెప్పాలి. ఇచ్చిన హామీలు ఎప్పటి నుంచి అమలు చేస్తారో చెప్పాలి. ఎందుకు ఇంకా అమలు చేయడం లేదో విడమర్చి వివరించాలి.

ఎన్నికలకు ముందు మూడు పార్టీల కూటమి ఎడాపెడా చేసిన వాగ్దానాల సంగతి తెలిసినదే! వాటిలో ఓ ఆరింటిని అతి ప్రధానాంశాలుగా గుర్తించి ‘సూపర్‌ సిక్స్‌’ పేరుతో తక్షణం అమలు చేస్తామని ఊదరగొట్టిన వైనమూ తెలిసినదే! ‘సూపర్‌ సిక్స్‌’లో భాగంగా యువతకు 20 లక్షల ఉద్యోగాలిస్తామనీ, నిరుద్యోగులకు నెలకు 3 వేల రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామనీ హామీ ఇచ్చారు. 

ఒక ఇంటిలోంచి ఎంతమంది విద్యార్థులు బడికెళ్తే అంతమందికీ ఏటా రూ.15 వేలు ఇచ్చి ఆ తల్లికి వందనం చేస్తామన్నారు. ప్రతి రైతుకూ ఏటా ఇరవై వేల పెట్టుబడి సాయం అందజేస్తామన్నారు. ప్రతి ఇంటికీ ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్‌ సిలిండర్లన్నారు. మహిళలందరికీ ఉచి తంగా బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామన్నారు. రాష్ట్రంలోని మహిళలందరికీ నెలకు 15 వందల రూపాయలిస్తామన్నారు.

ఎనిమిదో నెల వచ్చినా ఇందులో ఒక్కటి కూడా అమలు చేయలేదు. ఆరింటిలో ఆర్థిక భారం పెద్దగా పడని గ్యాస్‌ సిలిండర్ల హామీని తీసుకొని పాక్షికంగా అమలు చేశారు. మూడుకు బదులు ఒకే సిలిండర్‌ను తొలి ఏడాదికి పరిమితం చేశారు.

రెండో సంవత్సరం నుంచైనా మూడు సిలిండర్లిస్తారో ఒక్కదాని తోనే సరిపెడతారో చూడాలి. మేనిఫెస్టోలో చేసిన వాగ్దానాల్లో అతి ప్రధానమైనవిగా ఎంపిక చేసుకున్న ‘సూపర్‌ సిక్స్‌’కే ఈ గతి పడితే మిగిలిన వాటి సంగతేమిటో అర్థం చేసుకోవచ్చు.

ఎకనామిక్స్‌ పాఠాల ప్యాకేజీలో భాగంగా ఎన్నికల హామీలను తాము అమలు చేయబోవడం లేదనే సంగతిని నర్మగర్భంగా చంద్రబాబు చెప్పేశారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ) తొలి అంచనాల పేరుతో మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలకు ఓ క్లాస్‌ తీసుకున్నారు. పవర్‌ పాయింట్‌ ద్వారా ఓ పది పదిహేను గణాంకాల టేబుళ్ళను ప్రదర్శించారు. ఈ సంవ త్సరం జీఎస్‌డీపీ పెరుగుదల రేటు 12.94 శాతంగా ఉండ బోతున్నదని జోస్యం చెప్పారు. ఈ అంచనాకు ఆధారమేమిటో ఆయన చెప్పలేదు.

ఈ జోస్యం ఇంతటితో ఆగలేదు. ఆయన వేసిన చిటికెల పందిరి ఆకాశం దాకా ఎగబాకింది. ఏటా పదిహేను శాతం చొప్పున జీఎస్‌డీపీ పెరుగుతూ పోతే 2047 నాటికి 2.74 ట్రిలియన్‌ డాలర్‌ ఆర్థిక వ్యవస్థగా ఆంధ్రప్రదేశ్‌ అవతరిస్తుందనీ, తలసరి ఆదాయం 58,14,916 రూపాయలకు పెరుగుతుందనీ చెప్పారు. మన ఆర్థిక వ్యవస్థ ఎంత బలంగా ఎదిగినా డాలర్‌ కూడా ఇంకా బలపడుతుందట! అది కూడా ఆయనే చెప్పారు. 

2047 నాటికి డాలర్‌ విలువ 127 రూపాయలుగా ఉండ బోతున్నదట! వచ్చే సంవత్సరం తమ పిల్లల్ని అమెరికా చదువులకు పంపించాలనుకునే వాళ్లు అప్పటికి డాలర్‌ రేటు ఎంతుంటుందోనని కంగారుపడే అవసరం లేదు. చంద్రబాబు సర్కార్‌ను సంప్రదిస్తే తెలిసిపోతుంది. వారికి డాలర్‌ జ్యోతిషం తెలుసు.

ఈవిధంగా ఏటా 15 శాతం చొప్పున జీఎస్‌డీపీ పెరుగుతూ పోతే ఈ ఐదేళ్లలో 4 లక్షల 35 వేల కోట్ల రూపాయల కొత్త అప్పులు చేయవచ్చట! వాటి ఆధారంగా సంక్షేమ పథకాలను అమలు చేయవచ్చనే చావు కబురు చల్లగా చెప్పారు. ‘ఈ సంవ త్సరం మంచి వర్షాలు కురవాలి. 

అతివృష్టి, అకాల వర్షాలు ఉండరాదు. పశు, పక్ష్యాదుల దాడి ఉండకూడదు. పంట తెగుళ్ల బారిన పడకూడదు. మంచి దిగుబడి రావాలి. అద్భుతమైన ధర మార్కెట్‌లో పలకాలి. అప్పుడు తప్పకుండా విందు చేసుకుందాం’ అనే సందేశాన్ని ఆయన సంక్షేమ పథకాల అమలుకు వర్తింపజేశారు.

ఇటువంటి పాలకులను ఉద్దేశించే కావచ్చు – వందేళ్ల క్రితమే సుప్రసిద్ధ ఆర్థికవేత్త జాన్‌ మేనార్డ్‌ కీన్స్‌ చెప్పిన ఒకమాట ప్రసిద్ధ కొటేషన్‌గా మారింది. ‘‘ఇన్‌ ద లాంగ్‌ రన్‌ వి ఆర్‌ ఆల్‌ డెడ్‌’’. సుదూర భవిష్యత్తులో మనమంతా విగత జీవులమే అనే మాటను తక్షణ సమస్యల పరిష్కారం అవసరాన్ని పాలకులకు చెప్పడం కోసం వాడారనే అభిపాయం ఉన్నది. ఇప్పుడు పరి ష్కారం కావలసిన ఆర్థిక సమస్యలను భవిష్యత్‌ మార్కెట్‌ పరిస్థితులు పరిష్కరిస్తాయని నమ్మేవారిపై కీన్స్‌ వేసిన సెటైర్‌గా దాన్ని చెబుతారు. ఇది మన ఏపీ సర్కార్‌కు బాగా నప్పుతుంది.

చంద్రబాబుకు అత్యంత ప్రీతిపాత్రమైన ప్రపంచ బ్యాంకు ఇచ్చే నివేదికలను సైతం ఆయన లెక్కలోకి తీసుకోవడం లేదని పిస్తున్నది. గ్లోబల్‌ ఎకానమీ మీద ఈ జనవరిలోనే ప్రపంచ బ్యాంకు ఒక నివేదికను విడుదల చేసింది. ఈ శతాబ్దపు తొలి క్వార్టర్‌ (2000–2025) ఇచ్చినంత ఉత్తేజం ఆర్థిక రంగానికి రెండో క్వార్టర్‌ (2026–2050) ఇచ్చే అవకాశం లేదని ఈ నివేదిక అభిప్రాయపడింది. 

గ్లోబల్‌ జీడీపీ పెరుగుదల రేటు 2.7 శాతంగానే ఉండబోతున్నట్టు ఇది అంచనా వేసింది. రెండు ఖండాల్లో యుద్ధాలు, పెద్ద దేశాలు అవలంబిస్తున్న రక్షణాత్మక వాణిజ్య విధానాలు కూడా ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్ని చూపెడుతున్నాయి. మిగతా ప్రాంతాలతో పోలిస్తే లాటిన్‌ అమెరికా, పశ్చిమాసియా, దక్షిణాసియా ప్రాంతాల పరిస్థితి కొంచెం మెరుగ్గా ఉండొచ్చనీ, ఆ యా ప్రాంతాల్లోని స్థానిక విని మయ మార్కెట్‌లు బలపడడం అందుకు కారణమనీ ఈ నివేదిక పేర్కొన్నది.

దక్షిణాసియా దేశాల్లో స్థానిక వినిమయ మార్కెట్‌లు బలపడుతుంటే ఆంధ్రప్రదేశ్‌లో ఆ అవకాశం లేకుండా చంద్ర బాబు హరించారు. ఆయన అధికారంలోకి వచ్చిన తొలి ఆరు మాసాల్లో తగ్గిపోయిన జీఎస్టీ వసూళ్లే అందుకు నిదర్శనం. ఏటికేడు పెరుగుతూ వస్తున్న జీఎస్టీ వసూళ్లు చంద్రబాబు తొలి ఆరు నెలల కాలంలో తొలిసారిగా నేల చూపులు చూస్తూ వచ్చాయి. లిక్కర్‌ అమ్మకాల పుణ్యమా అని ఒక్క అక్టోబర్‌ మాసంలోనే కొంత ఎదుగుదల నమోదైంది. 

ఈ జీఎస్టీ లెక్కలు చంద్రబాబు చెబుతున్న ఆకాశ రామన్న లెక్కలు కావు. స్వయానా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే లెక్కలివి. ఒకపక్క ప్రజల కొనుగోలు శక్తి పడిపోతున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌లో సాక్ష్యాధారాలతో కనిపిస్తున్నది. కానీ జీఎస్‌డీపీ పెరుగుదల మాత్రం తారాజువ్వలను తలదన్నేలా ఉంటుందని చంద్రబాబు విడుదల చేసిన ఆకాశ రామన్న లెక్కలు చెబుతున్నాయి. ఇదెలా సాధ్యమవుతుందో చెప్పడం తలపండిన ఆర్థికవేత్తలకు కూడా సాధ్యం కాకపోవచ్చు.

చంద్రబాబు తొలి ఆరు మాసాల కాలంలో రాష్ట్ర ప్రభు త్వానికి తన సొంత ఆదాయ మార్గాల ద్వారా వచ్చే ఆదాయంలో 1.69 శాతం క్షీణత నమోదైంది. అక్టోబర్‌లో లిక్కర్‌ వేలంపాటల ఆదాయం ఆదుకోకపోయి ఉంటే ఈ క్షీణత ఇంకా ఎక్కువే ఉండేది. అంతకుముందు సంవత్సరం (2023) అదే నెలల్లో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయంలో 12.19 శాతం వృద్ధి నమోదైంది. 

రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయాలంటే ఏముంటాయి? జీఎస్టీ, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్స్, సేల్స్‌ ట్యాక్స్‌ (పెట్రోలియం ఉత్పత్తులు ఈ కేటగిరీలో వస్తాయి), మైనింగ్‌ వగైరా పన్నేతర ఆదాయం... ప్రధానంగా ఇవే! ఈ వసూళ్లు క్షీణించడమంటే ప్రజల కొనుగోలు శక్తి పడిపోతున్నట్టు అర్థం. ఈ వసూళ్లలో వృద్ధి కనిపిస్తేనే జీఎస్‌డీపీలో ఎదుగుదల కనిపిస్తుంది.

చంద్రబాబు మొదటి ఐదేళ్ల (2014–19) కాలంలో దేశ జీడీపీలో ఏపీ వాటా 4.45 శాతంగా ఉంటే వైఎస్‌ జగన్‌ హయాంలో (2019–24) 4.82 శాతంగా నమోదైంది. ఈ లెక్కలను చంద్రబాబు ప్రెజెంటేషన్‌లో కూడా దాచిపెట్ట లేకపోయారు. వాస్తవాలు ఇలా ఉంటే జగన్‌ పాలనలో ఆర్థిక విధ్వంసం జరిగిందనే దగుల్బాజీ ప్రచారాన్ని ఇంకా కొనసా గిస్తున్నారు. 

ఒకపక్క పరిపాలనా వైఫల్యం, దివాళా తీస్తున్న ఆర్థిక రంగం, మరోపక్క ఎన్నికల వాగ్దానాలు అమలు చేయకుండా ప్రజలను దారుణంగా వంచించడం... వీటి నుంచి దృష్టి మళ్లించడానికి తప్పుడు ప్రచారాలనూ, హెచ్చుల ‘విజన్‌’లనూ బాబు సర్కార్‌ ఆశ్రయిస్తున్నది.

ఏడు మాసాల్లో 4 లక్షల కోట్ల పెట్టుబడులను రప్పించామని డప్పు వేసుకోవడం ఒక వంచన. 1 లక్షా 85 వేల కోట్ల పెట్టుబడి పెడుతుందని చంద్రబాబు చెబుతున్న ఎన్‌టీపీసీ గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టుకు సంబంధించిన ఒప్పందాలపై జగన్‌ ప్రభుత్వ హయాంలోనే సంతకాలు పూర్తయ్యాయి. నక్కపల్లి బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ కథ కూడా ఇంతే! కానీ చంద్రబాబు సర్కార్‌ మాత్రం ఆ ఘనతను తన ఖాతాలోనే వేసుకొని ప్రచారం చేసుకుంటున్నది. 

తాజాగా విశాఖ ఉక్కు విషయంలోనూ ఇదే తంతు. కేంద్రం చేత 11 వేల కోట్లు విడుదల చేయించి తాము ఘనకార్యం చేశామనీ, ప్రైవేటీకరణ ఆగిపోయిందనీ కూటమి నేతలు ప్రచారం చేసు కుంటున్నారు. కానీ ఈ ప్రకటన చేసిన కేంద్ర మంత్రి కుమార స్వామి చెప్పిన విషయాన్ని మాత్రం యెల్లో మీడియా మరుగున పడేసింది. జగన్‌మోహన్‌రెడ్డి అడ్డుకున్నందు వల్లనే ప్రైవేటీకరణ ఆగిపోయిందని ఆయన మీడియా సమక్షంలోనే కుండబద్దలు కొట్టారు.

కేంద్రం ఆర్థిక సాయాన్నయితే ప్రకటించింది గానీ ప్రైవేటీ కరణను ఆపేస్తామని ఎక్కడా చెప్పలేదు. కార్మిక సంఘాల ఇతర ప్రధాన డిమాండ్లయిన సొంత గనుల కేటాయింపు, ‘సెయిల్‌’లో విలీనంపై ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇవేమీ లేకుండా 26 వేల కోట్ల అప్పులున్న సంస్థకు 11 వేల కోట్లు సాయం చేస్తే అప్పులూ, బకాయిలూ తీర్చి, సామర్థ్యాన్ని పెంచుకొని భారీ ఉత్పత్తులు సాధించి లాభాల బాటలో పయనిస్తుందా? పోలవరం, బనకచర్ల వంటి అంశాల్లోనూ మోసపూరితమైన తప్పుడు ప్రచారాలే! ఇటువంటి నయవంచనను ప్రతిఘటించవలసిన బాధ్యత కేవలం ప్రతిపక్ష రాజకీయ పార్టీలదే కాదు – విద్యాధి కులు, మేధావులు, ప్రజా సంఘాలది కూడా! అప్పుడే మన ప్రజాస్వామ్యం పరిణతి చెందినట్టు! లేకపోతే అప్పుల అప్పా రావులు వేసే చిటికెల పందిళ్లు ఎప్పటికి పూర్తవుతాయోనని కళ్లప్పగించి చూస్తూ ఉండాల్సిందే!


వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement