![Why Everyone Does Gossiping - Sakshi](/styles/webp/s3/article_images/2020/05/16/Gossiping.jpg.webp?itok=Redkhg5J)
ముందే వచ్చేశాడే.. ఇంట్లో ఏదైనా పని ఉంటే కదా వాడికి..! ఆవిడంతే ఎప్పుడూ ముభావంగా ఉంటుంది.. ఎందుకో చెప్పనా? అదిగో చూడు వాళ్లిద్దరి ఇకఇకలు పకపకలు.. బుద్ధిలేకుండా.. వాళ్లు ఎలాంటివాళ్లంటే! ఇలా ఏ ఇద్దరు మనుషులు కలిసినా మూడో వ్యక్తి గురించి చెవులు కొరుక్కోవడం మానవ సహజ లక్షణం. ప్రతీ మనిషి రోజుకు సగటున దాదాపు 52 నిమిషాలు ఇతరుల జీవితం గురించే మాట్లాడటానికి వెచ్చిస్తాడు. అంతేకాదు తమ మధ్య లేని స్నేహితుడు, బంధువు, శత్రువు ఇలా అందరి గురించి 15 శాతం చెడుగానే మాట్లాడుకుంటారు. సామాజిక జంతువైన మనిషికి ఈ లక్షణం పూర్వీకుల నుంచే సంక్రమించింది. ఆదిమ మానవుల కాలం నాటి నుంచే గాసిప్ రాయుళ్లు వదంతులు ప్రచారం చేసేవాళ్లు. అయితే ఓ వ్యక్తితో పరిచయం, స్నేహం పెంచుకునేందుకు ఎక్కువ మంది చాడీలపై ఆధారపడతారు. ఈ విషయాలన్నీ చెబుతున్నది మేం కాదండోయ్. మనిషి ప్రవర్తన- వ్యవహార శైలిపై పరిశోధనలు చేస్తున్న సామాజిక శాస్త్రవేత్తలు, సైక్రియార్టిస్టులూనూ.
గాసిప్ అంటేనే ఒకరకమైన ప్రతికూల దృక్పథం.
ఈ విషయం గురించి గాలేస్‌బర్గ్ నాక్స్ కాలేజీ సైకాలజీ ప్రొఫెసర్ ఫ్రాంక్ మెక్‌ఆండ్రూ మాట్లాడుతూ.. ‘‘మన పూర్వీకులు గాసిప్ విషయంలో ఎంతో నేర్పరులు. మానవ పరిణామక్రమంలో వారి వారసులమైన మనకు కూడా ఈ గుణం అలవడింది. ఎవరు ఎవరితో పడుకుంటున్నారు? ఎవరి దగ్గర అధికారం ఉంది? ఎవరికి కావాల్సినన్ని వనరులు అందుబాటులో ఉన్నాయి? గుహల్లో నివసించే కాలం నాటి నుంచి ఇవన్నీ ఉన్నాయి. ముఖ్యంగా నిజానిజాలు తెలుసుకోకుండా మూడో వ్యక్తి గురించి వదంతులు ప్రచారం చేయడం, వారి గోప్యతకు భంగం కలిగించడం ఇతరులను గాయపరుస్తుంది.
అయితే రోజూవారీ జీవితంలో ప్రతీ ఒక్కరూ గాసిపింగ్ ద్వారా ఎన్నో మంచి విషయాలు కూడా తెలుసుకునే అవకాశం ఉంది. ఓ వ్యక్తి ఎటువంటి వాడు.. అతడి వల్ల మనకేమైనా హాని కలుగుతుందా? అన్న విషయాలు తెలుసుకుని ముందే జాగ్రత్తపడవచ్చు’’అని చెప్పుకొచ్చారు. ఇక మరో ప్రొఫెసర్ మేఘన్ రాబిన్స్.. ఇతరుల గురించి రహస్యాలు మాట్లాడుకునేప్పుడు ప్రతీ ఒక్కరూ ఉపయోగించే మాట.. ‘‘నిన్ను నమ్మి నీతో ఈ విషయం పంచుకుంటున్నా’’. అయితే ప్రతీ ఒక్కరూ విశ్వాసాన్ని నిలబెట్టుకోలేరు. కొంతమంది మాత్రమే దీనికి కట్టుబడి ఉంటారు. కాబట్టి మూడో వ్యక్తితో మనకు కొంతమేర ప్రమాదం పొంచి ఉంటుంది’’అని హెచ్చరించారు.
ఆడ, మగా తేడా లేదు..
ఆడవాళ్లు, చదువుకోని వాళ్లు ఎక్కువగా గుసగుసలాడుకుంటారనేది ఒక అపోహ మాత్రమే అని పరిశోధకులు కొట్టిపారేశారు. గాసిపింగ్‌కు ఆడా, మగా.. హై క్లాస్, లో క్లాస్ తేడా ఉండదని.. నిరక్షరాస్యులే కాదు ఆఫీసుల్లో పనిచేసే వాళ్లు కూడా ఇందుకు అతీతం కాదని వెల్లడించారు. ఇతరులకు హాని చేయనంత వరకు గాసిపింగ్ అంతచెడ్డ గుణం కాదని... బంధాలు పెంపొందించుకోవడంలో ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా వృద్ధులు తమ ఒంటరితనాన్ని పోగొట్టుకోవడం కోసం రెస్టారెంట్లు, మాల్స్‌కు వెళ్లి కొత్త వారిని పరిచయం చేసుకుంటారని... ఇందుకోసం గాసిపింగ్ ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు.
అందుకే సెలబ్రిటీల గురించి మాట్లాడతాం
చాలా మంది సెలబ్రిటీల జీవనశైలిని అనుకరించేందకు ప్రయత్నిస్తారు. వారి వివరాలు తెలుసుకునేందుకు అమితాసక్తి చూపుతారు. ముఖ్యంగా వారి వ్యక్తిగత జీవితం గురించి ఆరాలు తీస్తారు. ఇలా తెలుసుకున్న విషయాలను పది మందిలో కూర్చున్నపుడు.. పార్టీలో ఉన్నపుడు వాటికి కాస్త మసాలా జోడించి తనదైన స్టైల్లో చెప్పి శ్రోతలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. తమకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం తహతహలాడేవారు ఇలా చేస్తారు. మాట్లాడుతోంది సెలబ్రిటీల గురించి కాబట్టి.. వాళ్లు మనకు తారసపడే అవకాశం లేనందు వల్ల ఇది సేఫ్‌సైడ్ అనుకుంటారు. అంతేకాదు ఇలాంటి వారు.. తన కంటే అన్ని విషయాల్లో కాస్త పైచేయి సాధించిన వారి విషయంలోనూ ఇదే ధోరణి అవలంబిస్తారు. దీని వల్ల పెద్దగా ప్రమాదం ఉండకపోవచ్చు. అదే గాసిప్ తన గురించి వస్తే మాత్రం తట్టుకోలేరు. తనలోని అవలక్షణాలను చెప్పిన వారికి దూరంగా ఉంటారు. ఇందుకోసం ముఖ్యమైన బంధాలను వదులుకోవడానికి కూడా వెనకాడరంటూ ఆండ్రూ తాను పరిశోధనలో తేలిన అంశాల గురించి చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment