మంచి మాట: దిద్దుకోవలసిన తప్పులు Manchimata: We Should Remove Our Mistakes and Errors | Sakshi
Sakshi News home page

మంచి మాట: దిద్దుకోవలసిన తప్పులు

Published Wed, Dec 14 2022 6:30 AM | Last Updated on Wed, Dec 14 2022 7:00 AM

Manchimata: We Should Remove Our Mistakes and Errors - Sakshi

మానవ జీవనాన్ని, మానవ సమాజాన్ని పట్టి పీడిస్తున్న వాటిల్లో ప్రధానమైనవి తప్పులు. ఆచరణల్లోని తప్పులు మాత్రమే కాదు ఆలోచనల్లోని తప్పులు కూడా మానవాళికీ, ప్రపంచానికీ అనాదిగా హానిచేస్తూనే ఉన్నాయి.

ఆత్మావలోకనం చేసుకుంటే మనం చేసిన తప్పులవల్ల మనకు ఎంత హాని జరిగిందో, మన తప్పులవల్ల ఇతరులకు ఎంత హాని జరిగిందో మనకే తెలిసిపోతుంది. చరిత్రను అవలోకిస్తే  దేశాలకూ, ప్రపంచానికీ తప్పులు ఎంత హాని చేశాయో తెలిసిపోతుంది. హిట్లర్‌ తప్పులవల్ల ప్రపంచయుద్ధమే జరిగి తత్ఫలితంగా కలిగిన వినాశనం మనకు తెలిసిందే. పెద్దస్థాయిల్లో జరిగిన తప్పులవల్ల సామాన్య ప్రజలు విలవిలాడిపోయిన కథనాన్ని చరిత్ర మనకు చెబుతూనే ఉంది. కళ, భాష, సాంస్కృతిక రంగాలకూ తప్పులవల్ల హాని జరుగుతూనే ఉంది. కొన్ని దశాబ్దుల క్రితం చోటు చేసుకున్న తప్పులవల్ల తెలుగు సాహిత్యానికే కాదు భాషకు కూడా జరిగిన పెనుహాని ఇవాళ క్షేత్రవాస్తవంగా మనకు తెలుస్తూనే ఉంది. తప్పులవల్ల మనం తప్పులతోనే ప్రయాణం చేస్తున్నాం; తప్పులవైపే ప్రయాణం చేస్తున్నాం; తప్పులతో మనం మమైకమైపోయాం. 

తప్పులకు ప్రతి మనిషీ గురయ్యాడు; బలయ్యాడు. విద్యలోని తప్పులు, వృత్తిలోని తప్పులు, వ్యవహారాల్లోని తప్పులు, ఆచారాల్లోని తప్పులు, మతపరమైన తప్పులు, విశ్వాసాల్లోని తప్పులు, ప్రవర్తనల్లోని తప్పులు వీటివల్ల మనిషి జీవితం తప్పులమయం అయిపోయింది.

ఫలితంగా మనిషి ఒక తప్పుడు జీవి అయిపోయాడు! మనిషి చేస్తున్నట్లుగా, చేస్తున్నంతగా జంతువులు తప్పులు చెయ్యడం లేదు! మనుషులు చేసిన, చేస్తున్న  తప్పులవల్ల మానవప్రపంచానికే కాదు జంతుజాలానికి కూడా హాని జరుగుతోంది. చాల తప్పులు చలామణిలోకి వచ్చేశాయి.

చాపకింద నీరులా తప్పులు మనలోకి రావడం కాదు కొనసాగుతున్న వానలా తప్పులు మనపై పడ్డాయి, పడుతున్నాయి.. అందువల్ల మనం తడిసిపోతూ ఉండడం కాదు, ఆ తప్పులు చప్పుడు చెయ్యని నిప్పులుగా అయిపోవడం వల్ల మనం మనకు తెలియకుండానే వాటికి కాలిపోతూ ఉన్నాం.

చాల కాలంగా తప్పులతో, తప్పులలో, తప్పుల కోసమే బతుకుతున్నామా అన్నట్లుగా మనం బతుకుతున్నాం. దానికి పర్యవసానంగా చాల కాలంగా తప్పులు మనల్ని శిక్షిస్తున్నాయి... బతకుతున్నాం అనడానికి ఋజువుగా నిత్యమూ మనం తప్పులవల్ల శిక్షను అనుభవిస్తూ ఉన్నాం. అయినా మనకు తప్పుల విషయమై ఉండాల్సిన అవగాహన రావడంలేదు. 

చరిత్రలోని తప్పులు, తప్పుల చరిత్ర... వీటి నుంచి మనం పాఠాలు నేర్చుకోలేదు. అందుకే మనల్ని భయాలు, అందోళనలు, ఆపదలు, గందరగోళం చుట్టుముట్టాయి, చుట్టుముడుతున్నాయి. గతంలోని తప్పులతో మనం పోరాడడం లేదు. వర్తమానంలోని తప్పుల గురించి మనం ఆలోచించడంలేదు. భవిష్యత్తులో తప్పులవల్ల జరగనున్న విపత్తుల్ని గ్రహించడం లేదు.

తప్పు జరగడం, తప్పు చెయ్యడం అనేవి మనిషికి సహజమైనవే. కానీ తప్పే జరుగుతూ ఉండడం, తప్పే చేస్తూ ఉండడం సహజం కాకూడదు. మన తప్పుల్ని, మనలోని తప్పుల్ని  తెలుసుకోలేకపోతే మనం నేరస్థులం అవుతాం.తప్పులవల్ల వర్తమాన, భవిష్యత్తుల్లో మనం ముప్పుల పాలు కాకూడదు.

ప్రతి సంవత్సరమూ ధనుర్మాసంలో మన ముందుకు వస్తూ ఉండే తిరుప్‌పావై పాసురాలలో ఒక చోట ఆణ్డాళ్‌  చెప్పింది: ‘దామోదరుణ్ణి నోరారా గానం చేసి, మనసారా ధ్యానిస్తే జరిగిపోయిన తప్పులూ, జరగబోయే తప్పులూ మంటల్లో దూదిపింజలైపోతాయి’. జరిగిన, జరగబోయే తప్పులు కాలి భస్మం అయిపోవాలని 1,200 యేళ్ల క్రితమే ఇలా ఇంత గొప్పగా ఆశంసించడం జరిగింది. మన తప్పులు, మన చుట్టూ ఉన్న తప్పులు కాలిపోకపోతే ఆ తప్పులకు మనం కాలిపోతాం.

సరైన మనస్తత్వంతో, వివేకంతో మనలోని తప్పుల్ని తొలగించుకోవాలి; మనం ఒప్పుల్ని ఒంటబట్టించుకోవాలి; ఆపై మనం క్షేమంగానూ, మేలైనవాళ్లంగానూ బతకాలి.
– రోచిష్మాన్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement