wisdom
-
అజ్ఞాన జ్ఞానం
‘ఆదియందు అక్షరమున్నది’(జాన్ 1:1) అని బైబిల్ వాక్కు. అజ్ఞానం అనాది నుంచి ఉన్నది. సృష్టిలో అజ్ఞానానికి ముందు ఏముందో ఎవరికీ తెలీదు. అజ్ఞానం అమేయమైనది; అజ్ఞానం అప్రమేయమైనది; అజ్ఞానం అనాదినిధనమైనది; అజ్ఞానం అప్రయత్నలబ్ధమైనది; అజ్ఞానం అగాధమైనది; అజ్ఞానం అనంతమైనది; అజ్ఞానం అజరామరమైనది. విచిత్రంగా జ్ఞానాజ్ఞానాల నడుమ ఒక సారూప్యత ఉంది. ఇవి రెండూ అగోచరమైనవే! రెండింటికీ ఒక భేదం కూడా ఉంది. జ్ఞానానికి అవధులు ఉంటాయేమో గాని, అజ్ఞానానికి ఎలాంటి అవధులూ ఉండవు.అజ్ఞానం నుంచి మానవాళికి అప్రయత్నంగా దొరికే ఆస్తి– మూర్ఖత్వం. అజ్ఞానం నుంచి ఉద్భవించడం వల్ల మూర్ఖత్వమూ అనంతమైనదే! ‘అనంతమైనవి రెండే రెండు. ఒకటి: ఈ విశ్వం, రెండు: మనుషుల మూర్ఖత్వం; విశ్వం సంగతి నాకింకా పూర్తిగా తెలీదు’ అన్నాడు ప్రపంచ ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ గ్రహీత అల్బర్ట్ ఐన్స్టీన్. మానవ మూర్ఖత్వానికి గల అనంత తత్త్వం అవగతమయ్యే నాటికి పాపం ఆయన తలపండితుడైపోయాడు. అనంతమైన అజ్ఞాన సాగరాన్ని ఈదులాడి ఒడ్డున పడితే తప్ప జ్ఞానమేమిటో తెలియదు. చాలామందికి అజ్ఞానసాగరంలో ఈదులాడుతూ ఒడ్డునున్న వాళ్ల మీదకు అజ్ఞాన తరంగాలను వెదజల్లుతుంటారు. వాళ్లకదో వేడుక!అజ్ఞానానికి గల అనేక పర్యాయపదాల్లో ‘మాయ’ ఒకటి. ఎవరి అజ్ఞానం వారికి తెలీదు. ఎదుటివారి అజ్ఞానాన్ని గుర్తించడంలో మాత్రం ప్రతి ఒక్కరూ జ్ఞానులే! ప్రవచన ప్రసంగాల్లో అజ్ఞానాన్ని నేరుగా ప్రస్తావిస్తే, శ్రోతల మనోభావాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. అందువల్ల ప్రవచనకర్తలు అజ్ఞానాన్ని ‘మాయ’ అని సున్నితంగా చెబుతుంటారు. ‘తస్మాదజ్ఞాన సంభూతం హృత్స్థం జ్ఞానాసినాత్మన/ ఛిత్వైనం సంశయం యోగమాతిష్ఠోత్తిష్ఠ భారత’– (4:42) అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి బోధించాడు. అంటే, ‘అజ్ఞానం కలిగిన బుద్ధిలో నిలకడగా ఉన్న ఆత్మ గురించిన సందేహాన్ని జ్ఞానమనే ఖడ్గంతో ఖండించి, తత్త్వజ్ఞానానికి సాధనమైన కర్మయోగాన్ని స్వీకరించు’ అని అర్థం. బుద్ధిలో అజ్ఞానం ఉన్నట్లు శ్రీకృష్ణుడు గుర్తించి చెప్పాడు. కాబట్టి ఆయన జ్ఞాని. అజ్ఞానాన్ని ఖండించడానికి జ్ఞానఖడ్గాన్ని ప్రయోగించాలని ఆయన ఉద్బోధించాడు. శ్రీకృష్ణ పరమాత్ముడి గీతబోధ విన్న అర్జునుడు మొదలుకొని ఎందరెందరో జ్ఞానఖడ్గానికి పదునుపెట్టి అజ్ఞానాన్ని ఖండిస్తూనే ఉన్నారు. ఖండఖండాల అజ్ఞానం కొన్ని మెదళ్లలోకి చేరి, అఖండంగా పెరిగిపోతుండటమే విడ్డూరం. బహుశా, ఇదే మాయ కావచ్చు!‘ఇగ్నోరెన్స్ ఈజ్ బ్లిస్’ అని ఇంగ్లిష్ నానుడి. అంటే, అజ్ఞానమే ఆనందమన్నమాట! ఈ నానుడినే కొంత విస్తరిస్తూ, ‘అజ్ఞానమే ఆనందం అంటుంటారు గాని, అజ్ఞానం మన విధికృతం’ అని చెప్పింది అమెరికన్ రచయిత్రి, పాత్రికేయురాలు గేయిల్ లైండ్స్. విధికృతమైన వాటిని ఎవరు మాత్రం తప్పించుకోగలరు? కాబట్టి అజ్ఞానాన్ని కూడా ఎవరూ తప్పించుకోలేరు. అజ్ఞానాన్ని గురించి తెలుసుకోవాలంటే, జ్ఞానులు ఎంతో ప్రయాసతో ప్రయత్నించవలసి ఉంటుంది. అజ్ఞానులకు ఆ బెడద లేదు. తమకు అప్రయత్నలబ్ధమైన అజ్ఞానానందాన్ని నిక్షేపంగా ఆస్వాదిస్తుంటారు. అజ్ఞానాన్ని గురించి అసలు ఎందుకు తెలుసుకోవాలి? అంటే, జ్ఞానాన్ని పెంచుకోవడానికి అని చెబుతారు చాలామంది. పాపం వాళ్లు చాలా అమాయకులు. అసలు సిసలు ముదురు జ్ఞానులు కొందరు ఉన్నారు. వాళ్లు అజ్ఞానాన్ని గురించి నానా రకాల అధ్యయనాల్లో మునిగి తేలుతూ ఉంటారు. జనబాహుళ్యంలో అజ్ఞాన విస్తరణకు పనికొచ్చే పద్ధతులకు రూపకల్పన చేస్తుంటారు. వాటిని జనాల మీద ప్రయోగిస్తుంటారు. ఇదొక ప్రత్యేక శాస్త్రం. ఇంగ్లిష్లో దీనినే ‘ఆగ్నటాలజీ’ అంటారు. అంటే, అజ్ఞానాధ్యయన శాస్త్రం అన్నమాట! మన దేశంలోని విశ్వవిద్యాలయాలు ఈ శాస్త్రం మీద ఇంకా దృష్టి సారించలేదు గాని, అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాల్లోని పలు విశ్వవిద్యాలయాలు ఈ శాస్త్రం మీద అధ్యయనాలు కొనసాగిస్తున్నాయి. ‘ఆగ్నటాలజీ’ అనే అజ్ఞానాధ్యయన శాస్త్రానికి ఆ పేరుతో పిలవడం ఆలస్యంగా మొదలైంది గాని, అజ్ఞానానికి సంబంధి«ంచిన పరిజ్ఞానం అంతకంటే ముందు నుంచే ఆచరణలో ఉంది. స్కాటిష్ సామాజిక చరిత్రకారుడు అయాన్ బోల్ 1992లో తొలిసారిగా ‘ఆగ్నటాలజీ’ అనే మాటను ప్రయోగించాడు. అమెరికన్ సిగరెట్ తయారీ కంపెనీలు 1969లో ఉద్ధృతంగా చేసిన ప్రచారం ఆగ్నటాలజీకి ఉదాహరణగా నిలుస్తుందని శ్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రాబర్ట్ ప్రోక్టర్ తేల్చిచెప్పాడు. కార్పొరేట్ సంస్థల నుంచి రాజకీయ పార్టీల వరకు నానా వర్గాలు ఆగ్నటాలజీ పద్ధతులను ఉపయోగించుకుంటూ, ప్రజల అజ్ఞానానికి జ్ఞాన ఖడ్గాల వల్ల ముప్పు లేకుండా కాపాడుతూ తమ ప్రయోజనాలను నెరవేర్చుకుంటున్నాయి.ఇది హైటెక్కు టమారాల యుగం. జ్ఞానం జనాలకు అందుబాటులో లేని సరుకేమీ కాదు. అందుబాటులో ఉన్నంత మాత్రాన జనాలందరూ జ్ఞానాన్ని పొందినట్లు కాదు. ఈ కృత్రిమ మేధ కాలంలో కూడా రాజకీయ, తాత్త్విక అంశాలకు సంబంధించిన జ్ఞానాన్ని జనాలు విశ్వాసాలు, మతాచారాలు, ప్రచారం ద్వారా మాత్రమే పొందుతున్నారు. ఇది విపరీత అజ్ఞాన శకం. పత్రికలు, ప్రసార సాధనాలు, సామాజిక మాధ్యమాలు ఆగ్నటాలజీ ప్రయోగాలకు సాధనాలుగా మారుతున్నాయి. ప్రజలను మాయలో ముంచెత్తుతున్నాయి. ‘మతములన్నియు మాసిపోవును/ జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును’ అన్న గురజాడ ఆశయం ఎక్కడ? అజ్ఞానంపై శాస్త్ర పరిశోధనలు సాగిస్తున్న నేటి పరిస్థితులెక్కడ? -
సమయోచిత జ్ఞానమే.. వివేచన!
వివేచన అంటే సమయోచిత జ్ఞానం, యుక్తాయుక్త విచక్షణ, లోచూపు, శోధన, దార్శనికత, విశ్లేషణా సామర్థ్యం. ఇతరులకు తోచని, అవగాహనకు రాని సూక్ష్మాంశాలను గ్రహించగల ఓ శక్తి. ఈ వివేచన కొందరిలో మాత్రమే ఉండే ఓ అపురూపమైన శక్తి.అసలు వివేచన ఎలా ఒనగురుతుంది... అని ప్రశ్నించుకుంటే... ప్రధానంగా చదువు వల్ల పొందే జ్ఞాన, పరిజ్ఞానాల వల్ల అని చె΄్పాలి. ఈ భావాన్నే ΄ోతన‘‘జదివిన సదసద్వివేక చతురత గలుగు జదువగ వలయును జనులకు.. ’’అని హిరణ్యకశిపుని చేత పలికిస్తాడు. చదువు వల్ల జ్ఞానంతోపాటు ఔచిత్యాననౌచిత్యాలు, మంచి చెడు విచక్షణలు తెలుస్తాయి. అవి మన పలుకులో, ప్రవర్తనలో, ఆలోచనాసరళిలో అభిలషణీయమైన చక్కని మార్పు తెస్తాయి. ఈ వివేచన మన వైయుక్తిక జీవిత సుఖ సంతోషాలకు, ఆరోగ్యకరమైన సామాజిక వికాసానికి పునాదులు వేస్తుంది.విద్యనభ్యసించటం వలన వివేచన అనే శక్తిని పొందటం జరుగుతుంది. కాని ఇది ఎల్లప్పుడూ నిజం కావలసిన అవసరం లేదని లోకానుభావం, పరిశీలన చెపుతాయి. కొందరు విద్యావంతులలో కనిపించని ఈ వివేచన కొన్ని సందర్భాలలో అక్షర జ్ఞానంలేని వారెందరి లోనో కనిపించటం ఆశ్చర్యం కలిగిస్తుంది. కానీ, ఇది వాస్తవం. వారి సంభాషణల్లో, సమస్యలను పరిష్కరించే వేళల్లో సమయోచిత జ్ఞానాన్ని చూపుతూ, విచక్షణను ప్రదర్శిస్తూ వివేచనాపరులుగా పేరు తెచ్చుకున్న వారున్నారు."పంచతంత్రంలోని పావురాలు – వేటగాడి కథ వివేచనా పార్శ్వమైన ముందుచూపుని సూచిస్తుంది. ఆకాశమార్గం లో పయనించే పావురాలు భూమిపై ఒకచోట చల్లిన నూకలను చూచి, కిందకు దిగి తిందామనుకున్నప్పుడు వారిని వారించిన చిత్రగ్రీవునిలో ఉన్నది ముందుచూపే. అప్రమత్తతే. ఇవి వివేచనలోని కోణాలే . చిత్రగ్రీవుని మాటను పెడచెవిని పెట్టి ్రపాణాల మీదకు తెచ్చుకున్న మిగిలిన పావురాలలో ఉన్నది తొందరపాటుతనం, విచక్షణారాహిత్యం. జ్ఞానాన్ని సందర్భానుసారంగా ఉపయోగించగలగాలని ఈ ఉదంతం మనకు చెపుతుంది. అలాగే మూడు చేపలకథలోని దీర్ఘదర్శి అన్న చేప తన్రపాణాలను కాపాడుకున్నది ఈ ముందుచూపు వల్లే కదూ!"ఇది ఎలా సాధ్యమవుతుంది? జీవనక్రమంలో వచ్చే ఆటు΄ోట్లను తట్టుకుని, నిబ్బరంగా ఉంటూ, మనసును దిటవు చేసుకోవటంవల్ల వారికి ఇది సాధ్యమవుతుంది. అలాగే చేదు అనుభవాలు, జీవితం నేర్పిన పాఠాలు పొందిన ఇంగితజ్ఞానంతో జీవితాన్ని మరింత లోతుగా పరిశీలిస్తూ, విశ్లేషించుకునే వీరికి ఈ వివేచనాశక్తి కరతలామలకమవుతుంది.కౌరవులు పాండవులను పెట్టే ఇబ్బందులను, చేసే దుశ్చర్యలను గమనిస్తూ ఎప్పటికప్పుడు వారిని అప్రమత్తులను చేసి, రక్షించినవాడు శ్రీ కృష్ణుడు. అలా వివేచనకు గొప్ప ఉదాహరణగా నిలిచాడు. వివేచనాశీలి ఎదుటవారి మాటలను, వాటి అంతరార్థాన్ని గ్రహించగలడు. వారి మనసులో మెదిలే ఆలోచనలను పసిగట్టగలరు. వాటిని విశ్లేషించగలరు. ఇవన్నీ వివేచనకున్న కోణాలే.బెర్ట్రాండ్ రసెల్.. జ్ఞానం –వివేకం.. అన్న వ్యాసంలో ఈ రెండిటి మధ్య ఉన్న సూక్ష్మమైన భేదాన్ని ఒక ఉదాహరణతో ఎంతో స్పష్టంగా వివరించాడు. రివాల్వర్ ఎలా ఉపయోగించాలో తెలియటం జ్ఞానం. దాన్ని ఎప్పుడు వాడాలి, అసలు వాడాలా, వద్దా అన్న సందర్భానౌచిత్య నిర్ణయశక్తే వివేచన. మనలో చాలామందికి విషయం పరిజ్ఞానం ఉంటుంది. కాని ఎక్కడ ప్రదర్శించాలో, ఎక్కడ కూడదోనన్న వివేకం ఉండదు. మన ప్రతిభా నైపుణ్యాలను అసందర్భంగా ప్రదర్శించి, అవమానం పొందకూడదు. ఉచితానుచితాలు తెలుసుకుని ప్రవర్తించటం కూడా వివేచనే. సాంకేతికాభివృద్ధి... ముఖ్యంగా అంతర్జాల సాంకేతికత విశ్వాన్ని కుగ్రామం చేసింది. ఆ సాంకేతికతను అంది పుచ్చుకోవాలి. వాటి ఫలితాలు అనుభవించాలి. ఇందంతా జ్ఞానపరమైనది. అభినందనీయం. కాని సక్రమమార్గంలో ఉపయోగించుకోవటంలోనే మన వివేచన ఉంటుంది. – లలితా వాసంతి -
గురు వాక్యస్య... !!!
వాగ్గేయకారులలో గమనించవలసిన ఒక గొప్ప లక్షణం– వారిలోని గురుభక్తిని. అది లేకుండా సనాతన ధర్మంలో ఏ వ్యక్తీ పరిఢవిల్లలేదు. పుస్తకజ్ఞానం ఎంత ఉన్నా గురుముఖతః నేర్చుకున్నదేదో అది మాత్రమే అభ్యున్నతికి కారణమవుతుంది. ‘శ్రద్థ’ అని మనకు ఒక మాట ఉంది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం– అంటారు గీతాచార్యులు. ఆ శ్రద్ధ ఎవరికి ఉన్నదో వారికి మాత్రమే జ్ఞానం కలుగుతుంది–అని. శ్రద్ధ అన్న మాటకు శంకరభగవత్పాదులు వ్యాఖ్యానం చేస్తూ.. ‘‘శాస్త్రస్య గురువాక్యస్య సత్య బుద్ధ్యవధారణమ్’ సాశ్రద్ధా కథితా సద్భిర్యాయా వస్తూపలభ్యతే’’.. అంటారు. శాస్త్రం చెప్పిన విషయం తిరుగులేని సత్యం... అన్న నమ్మకం ఉండాలి. కలడుకలండనెడువాడు కలడోలేడో...’ అన్న అనుమానం దగ్గరే ఉండిపోకుండా ‘భగవంతుడు ఉన్నాడు. శాస్త్రం చెప్పిన విషయం పరమ సత్యం..అని నమ్మాలి. ఆ పైన గురువాక్యస్య.. అంటే గురువుగారి నోటివెంట ఏది వచ్చిందో అది సత్యం. గురువుగారి నోటి వెంట వచ్చినది సత్యమయ్యేట్లు చూడవలసిన కర్తవ్యం భగవంతుడు తీసుకుంటాడు. అందుకే యోగివాక్కు అంటారు. యోగి వాక్కు అంటే – గురువుగారు సత్యం చెప్పారు.. అని కాదు .. గురువుగారు చెప్పినది సత్యం... అని అన్వయం చేసుకోవాలి. అంటే అంత తిరుగులేని విశ్వాసం ఉండాలి. అందుకే గురు విషయంలో స్థాన శుశ్రూష అంటారు. మనం ఉంటున్న ఇంటిని, మనం కొలిచే దేవుడు ఉండే దేవాలయాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో అలా గురువుగారుండే ప్రదేశాన్ని కూడా శిష్యులు శుభ్రం చేస్తూ గురువుగారికి సౌకర్యంగా ఉండేటట్లు చూస్తుంటారు. ఈ కంటితో చూడలేని పరబ్రహ్మం సశరీరంతో... అంటే మనలాగా కాళ్ళూచేతులతో, ఇతరత్రా మనలాగే నడిచివెడితే అదే గురువు. ‘గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్పరబ్రహ్మ తస్మైశ్రీగురువేనమః’–అని. గురువే బ్రహ్మ. గురువు మనలోని జ్ఞానజ్యోతిని వెలిగిస్తాడు. అందుకని సృష్టికర్త. గురుర్విష్ణుః..అంటే శ్రీమహావిష్ణువు స్థితికారుడై ఏ విధంగా ఈ సృష్టినంతటినీ నిలబెడుతున్నాడో అలా జ్ఞానాన్ని, భక్తిని పతనం కాకుండా గురువు కాపాడుతుంటాడు. అందుకని విష్ణువు. గురుర్దేవో మహేశ్వరః.. మహేశ్వరుడు ఎలా లయకారుడో అట్లా అజ్ఞానాన్ని గురువు లయం చేసి జ్ఞానాన్ని ఇచ్చి నిలబెడుతుంటాడు. అందుకే గురువు పరబ్రహ్మము. అటువంటి గురువుకు... తస్మైశ్రీగురవేనమః. ... నమస్కరించుచున్నాను. ఈ లోకంలో గురువుగారికి ప్రత్యుపకారం చేయడం కానీ, గురువుగారిని సత్కరించడం కానీ, గురువుగారికి మనం పదేపదే కృతజ్ఞతలు చెప్పడం కానీ సాధ్యమయ్యే విషయం కాదు. కాబట్టి గురువు విషయంలో కృతజ్ఞత గా చెయ్యగలిగినది ఒక్కటే– రెండు చేతులు కలిపి జోడించి శిరస్సు తాటించి నమస్కరించడం మాత్రమే. అది గురువుపట్ల చెదరిపోని నమ్మకంతో చేయాలి.. అది వాగ్గేయకారులందరూ చేశారు. కాబట్టే మహాత్ములయ్యారు. -
ఉపేక్షిస్తే ఉనికికే ప్రమాదం!
అది మండు వేసవి. అప్పుడే సూర్యోదయం అయింది. లేత కిరణాలు సోకి సాలవృక్షం పచ్చదనాన్ని వెదజల్లుతూ పరవశించిపోతోంది. ఆ అడవిలో తానే ఎత్తైన వృక్షాన్ని అనే గర్వంతో కూడిన ఆనందం అది. అంతలో..ఒక కాకి ఎగిరి వచ్చి ఆ వృక్షం కొమ్మల మధ్య ఉన్న ఖాళీ ప్రదేశంలో వాలింది. దాని ముక్కున పండిన మాలువా పండు ఉంది. ఆ పండును కాలివేళ్ళతో తొక్కి పట్టి, గుజ్జునంతా తినేసింది. ముక్కును అటూ ఇటూ రాచి, వాలుగా చూసి, ‘కా..కా’’ అంటూ ఎగిరి వెళ్ళిపోయింది. అలా కాకి వెళ్ళిపోగానే, తన మీద వదిలి వెళ్ళిన మాలువా విత్తనాన్ని గమనించిన ఆ సాలవృక్షం ఆలోచనలో పడింది. భయం పుట్టి వణికింది. అయినా తనని తాను సమాధాన పరచుకుని శాంతించింది. వేసవి ముగిసింది. మాలువా విత్తనం టెంకె పగిలింది. దానిలోంచి నిగనిగలాడే విత్తనం బయటకొచ్చి పడింది. ఆ విత్తనాన్ని చూడగానే సాలవృక్షానికి వేళ్ళు కుంగినట్లయింది. పెనుగాలికి కూలినట్లు భావించింది. కార్చిచ్చుకి తగలబడి బూడిద అయినట్లు అనిపించింది. నిలువెల్లా వణకసాగింది. మొత్తుకోసాగింది. అప్పుడు ఆ వృక్షం చుట్టూ ఉండే ఇతర వృక్ష మిత్రులంతా ‘‘దుఃఖ కారణం ఏమిటి?’’ అని అడిగారు. ‘‘సాలవక్షం విషయం చెప్పింది. అప్పుడు ‘‘సాలవృక్షమా! చింతించకు. అనవసరంగా భయపడుతున్నావెందుకు? ఆ విత్తనాన్ని నెమలి తినవచ్చు. జింక నమిలి వేయవచ్చు. కార్చిచ్చు కాల్చవచ్చు. ఎవరైనా మనిషి చూసి తీసుకుపోవచ్చు. ఎండకు ఎండిపోవచ్చు. నీడలో నాని కుళ్ళిపోవచ్చు. చెద పురుగులు తినొచ్చు. చీమలు తీసుకుపోవచ్చు. ఇన్ని అవరోధాలు ఉన్నాయి. వీటన్నింటినీ దాటుకుని అది మొలకెత్తలేదు. ఒకవేళ మొలకెత్తినా వెంటనే వానలు ఆగిపోతే, మొలకలోనే మాడిపోవచ్చు. కాబట్టి లేనిపోని భయాన్ని ఊహించుకుని వణికిపోకు’’ అంటూ ధైర్యం చెప్పాయి. తోటి వృక్షాల ఓదార్పుకు ఆ సాలవృక్షం ధైర్యాన్ని తెచ్చుకుంది. కానీ ఆ విత్తనం మొలవడానికి ఏ అవరోధం కలగలేదు. ఆ ఏడాది సకాలంలో వర్షాలు పడడంతో చక్కగా మొలకెత్తింది. వేగంగా పెరిగింది. పెద్ద పెద్ద తమలపాకుల్లా లేత పచ్చని ఆకుల తీగపైకి లేచింది. దాన్ని చూసి సాలవృక్షం లబోదిబోమంది. మరలా వృక్షాలన్నీ– ‘‘నీవు మహావృక్షానివి. అది చిన్న తీవె. అయినా ఆ బుజ్జి కాడ ఎంత ముచ్చటగా, అందంగా ఉందో, అది నీకు మంచి అలంకారంగా ఉంది. ఈ చిన్న తీవె నిన్నేమి చేయగలదు’’ అని మరలా ధైర్యం చెప్పాయి. వాటి మాటలు విని సాలవృక్షం కొంత సాంత్వన పడింది. కానీ.. అతి తక్కువ కాలంలోనే ఆ తీగ బలపడింది. దాని బెరడును చీల్చుకుని వేళ్ళను లోనికి పంపింది. ఆ వృక్ష సారాన్నే పీల్చుకోసాగింది. చివరికి చెట్టంతా కమ్ముకుపోయింది. సారాన్ని కోల్పోయిన సాలవృక్షం ఎండి.. క్రమంగా జీవాన్నీ కోల్పోయింది. ఒకప్పుడు అడవిలో తిరిగే మనుషులు ఏదైనా విషయం గురించి మాట్లాడుకుంటూ ‘‘ఆ పెద్ద సాలవృక్షం దగ్గర ఆ మహా సాలవృక్షం పక్కన..’’ అని ఆనవాళ్ళను చెప్పుకుంటూ ఉండేవారు. కానీ.. ఇప్పుడు.. ఆ మాలువా పొద పక్కన’’ అంటూ చెప్పుకోసాగారు. చెడ్డవారిని చేరదీయడం వల్ల, చెడ్డతనం పట్ల ఉపేక్ష భావంతో ఉండటం వల్ల అది మన ఉనికికే చేటు తెస్తుంది. మనిషి మనసులో చెడు కోరికలు రేగినప్పుడు.. ‘‘ఇది చిన్న కోరికే కదా! ఈ ఒక్కసారికీ ఈ పని చేసి ఇక ఆ తరువాత చేయకుండా ఉంటే మనకు వచ్చే నష్టం లేదు. కలిగే కష్టమూ లేదు’’ అనుకుని ఆ చెడ్డ కర్మలకు పూనుకుంటారు. కానీ, ఆ తర్వాత వాటిని మానడం అటుంచి, మరింత లోతుకు కూరుకుపోతారు. కామ రాగాలన్నీ ఇలానే ప్రవేశించి, పెరిగి పెరిగి మన ఉనికికే ప్రమాదాన్ని తెస్తాయి. వాటిని మనస్సులో పుట్టకుండా చేసుకోవాలి. లేదా పుట్టిన వెంటనే నివారించుకోవాలి. ఆపేక్షతో ఉపేక్ష చూపితే మన ఉనికికే నిక్షిప్తం చేస్తాయి. ఇది కామరాగాల పట్ల ఎంత అప్రమత్తతతో ఉండాలో బుద్ధుడు చెప్పిన కథ ఇది. ఆ రోజుల్లో ‘మోక్షానికి కామం కూడా ఒక మార్గమే’ అని చెప్పే సాధువులు కొందరు ఉండేవారు. వారికి కనువిప్పు కలిగించడం కోసం, బుద్ధుడే ఈ కథ చెప్పాడు. – డా. బొర్రా గోవర్ధన్ (చదవండి: పుట్టిన మూడు రోజులకే మిస్సింగ్..ఇప్పటికీ అంతు తేలని ఓ మిస్టరి గాథ!) -
మంచి మాట: దిద్దుకోవలసిన తప్పులు
మానవ జీవనాన్ని, మానవ సమాజాన్ని పట్టి పీడిస్తున్న వాటిల్లో ప్రధానమైనవి తప్పులు. ఆచరణల్లోని తప్పులు మాత్రమే కాదు ఆలోచనల్లోని తప్పులు కూడా మానవాళికీ, ప్రపంచానికీ అనాదిగా హానిచేస్తూనే ఉన్నాయి. ఆత్మావలోకనం చేసుకుంటే మనం చేసిన తప్పులవల్ల మనకు ఎంత హాని జరిగిందో, మన తప్పులవల్ల ఇతరులకు ఎంత హాని జరిగిందో మనకే తెలిసిపోతుంది. చరిత్రను అవలోకిస్తే దేశాలకూ, ప్రపంచానికీ తప్పులు ఎంత హాని చేశాయో తెలిసిపోతుంది. హిట్లర్ తప్పులవల్ల ప్రపంచయుద్ధమే జరిగి తత్ఫలితంగా కలిగిన వినాశనం మనకు తెలిసిందే. పెద్దస్థాయిల్లో జరిగిన తప్పులవల్ల సామాన్య ప్రజలు విలవిలాడిపోయిన కథనాన్ని చరిత్ర మనకు చెబుతూనే ఉంది. కళ, భాష, సాంస్కృతిక రంగాలకూ తప్పులవల్ల హాని జరుగుతూనే ఉంది. కొన్ని దశాబ్దుల క్రితం చోటు చేసుకున్న తప్పులవల్ల తెలుగు సాహిత్యానికే కాదు భాషకు కూడా జరిగిన పెనుహాని ఇవాళ క్షేత్రవాస్తవంగా మనకు తెలుస్తూనే ఉంది. తప్పులవల్ల మనం తప్పులతోనే ప్రయాణం చేస్తున్నాం; తప్పులవైపే ప్రయాణం చేస్తున్నాం; తప్పులతో మనం మమైకమైపోయాం. తప్పులకు ప్రతి మనిషీ గురయ్యాడు; బలయ్యాడు. విద్యలోని తప్పులు, వృత్తిలోని తప్పులు, వ్యవహారాల్లోని తప్పులు, ఆచారాల్లోని తప్పులు, మతపరమైన తప్పులు, విశ్వాసాల్లోని తప్పులు, ప్రవర్తనల్లోని తప్పులు వీటివల్ల మనిషి జీవితం తప్పులమయం అయిపోయింది. ఫలితంగా మనిషి ఒక తప్పుడు జీవి అయిపోయాడు! మనిషి చేస్తున్నట్లుగా, చేస్తున్నంతగా జంతువులు తప్పులు చెయ్యడం లేదు! మనుషులు చేసిన, చేస్తున్న తప్పులవల్ల మానవప్రపంచానికే కాదు జంతుజాలానికి కూడా హాని జరుగుతోంది. చాల తప్పులు చలామణిలోకి వచ్చేశాయి. చాపకింద నీరులా తప్పులు మనలోకి రావడం కాదు కొనసాగుతున్న వానలా తప్పులు మనపై పడ్డాయి, పడుతున్నాయి.. అందువల్ల మనం తడిసిపోతూ ఉండడం కాదు, ఆ తప్పులు చప్పుడు చెయ్యని నిప్పులుగా అయిపోవడం వల్ల మనం మనకు తెలియకుండానే వాటికి కాలిపోతూ ఉన్నాం. చాల కాలంగా తప్పులతో, తప్పులలో, తప్పుల కోసమే బతుకుతున్నామా అన్నట్లుగా మనం బతుకుతున్నాం. దానికి పర్యవసానంగా చాల కాలంగా తప్పులు మనల్ని శిక్షిస్తున్నాయి... బతకుతున్నాం అనడానికి ఋజువుగా నిత్యమూ మనం తప్పులవల్ల శిక్షను అనుభవిస్తూ ఉన్నాం. అయినా మనకు తప్పుల విషయమై ఉండాల్సిన అవగాహన రావడంలేదు. చరిత్రలోని తప్పులు, తప్పుల చరిత్ర... వీటి నుంచి మనం పాఠాలు నేర్చుకోలేదు. అందుకే మనల్ని భయాలు, అందోళనలు, ఆపదలు, గందరగోళం చుట్టుముట్టాయి, చుట్టుముడుతున్నాయి. గతంలోని తప్పులతో మనం పోరాడడం లేదు. వర్తమానంలోని తప్పుల గురించి మనం ఆలోచించడంలేదు. భవిష్యత్తులో తప్పులవల్ల జరగనున్న విపత్తుల్ని గ్రహించడం లేదు. తప్పు జరగడం, తప్పు చెయ్యడం అనేవి మనిషికి సహజమైనవే. కానీ తప్పే జరుగుతూ ఉండడం, తప్పే చేస్తూ ఉండడం సహజం కాకూడదు. మన తప్పుల్ని, మనలోని తప్పుల్ని తెలుసుకోలేకపోతే మనం నేరస్థులం అవుతాం.తప్పులవల్ల వర్తమాన, భవిష్యత్తుల్లో మనం ముప్పుల పాలు కాకూడదు. ప్రతి సంవత్సరమూ ధనుర్మాసంలో మన ముందుకు వస్తూ ఉండే తిరుప్పావై పాసురాలలో ఒక చోట ఆణ్డాళ్ చెప్పింది: ‘దామోదరుణ్ణి నోరారా గానం చేసి, మనసారా ధ్యానిస్తే జరిగిపోయిన తప్పులూ, జరగబోయే తప్పులూ మంటల్లో దూదిపింజలైపోతాయి’. జరిగిన, జరగబోయే తప్పులు కాలి భస్మం అయిపోవాలని 1,200 యేళ్ల క్రితమే ఇలా ఇంత గొప్పగా ఆశంసించడం జరిగింది. మన తప్పులు, మన చుట్టూ ఉన్న తప్పులు కాలిపోకపోతే ఆ తప్పులకు మనం కాలిపోతాం. సరైన మనస్తత్వంతో, వివేకంతో మనలోని తప్పుల్ని తొలగించుకోవాలి; మనం ఒప్పుల్ని ఒంటబట్టించుకోవాలి; ఆపై మనం క్షేమంగానూ, మేలైనవాళ్లంగానూ బతకాలి. – రోచిష్మాన్ -
ఇంగితమూ జ్ఞానమే!
విద్యాభ్యాసం, విస్తృత పుస్తక పఠనాల వల్ల పొందే జ్ఞానం ఒకటైతే, మనిషిలో ఉండే సహజమైన గ్రహింపు శక్తి, అవగాహన శక్తి వలన వచ్చే జ్ఞానం మరొకటి. దీనికే ఇంగితం లేదా ఇంగితజ్ఞానం అని పేరు. చదువుకున్న వారిలోనే ఇది ఉండనక్కరలేదు. ఇది ప్రతి మనిషిలో ఉండే ఒక అంతర్లీనమైన ఒక జీవలక్షణం. జీవితంలో మనకు కలిగే అనేక అనుభవాలతో ఈ ఇంగితం మరింతగా పదునెక్కుతుంది. అందుకే ఇది ఎంతో విశిష్టమైంది. చదువుతో నిమిత్తంలేకుండా ప్రతి మనిషి జీవనానికి, జీవితానికి అత్యంత ఆవశ్యకమైనది. ఈ ఇంగితం మనలను అప్రమత్తులను చేసి వ్యవహార దక్షతను పొంచి జీవితం సజావుగా సాగేటట్టు చేస్తుంది. విద్యాధికులలో ఉండే జ్ఞానమనే బంగరు పళ్లెరానికి ఇది ఒక గోడ చేర్పు లాంటిది. అనేక శాస్త్రాలను మధించి దాని జ్ఞానామృతాన్ని గ్రోలిన పండితులైనా, తమ జీవితాన్ని నూతన ఆవిష్కరణల కోసమై ధారపోసే శాస్త్రవేత్తలైనా తమ ఇంగితం ఉపయోగించవలసిన అవసరం ఉంటుంది. అలా కానివేళ, వారి జ్ఞానం వారికే కాక మానవాళికే ముప్పు తెస్తుంది. చరిత్ర పుటలు తిరగవేసినా, మన సమకాలీన చరిత్రను పరిశీలించినా ఈ విషయం తేటతెల్లమవుతుంది. ఒక గురువు తనవద్ద శ్రద్ధతో విద్యాభ్యాసాన్ని పూర్తిచేసుకున్న నలుగురు శిష్యులకు చనిపోయిన వారిని బతికించగల అద్భుత శక్తినిచ్చాడు. అయితే, దానిని అత్యవసరమైనప్పుడు మాత్రమే ఉపయోగించ మని హెచ్చరించి పంపాడు. వారిలో ముగ్గురు మార్గమధ్యంలో ఒక పులి కళేబరాన్ని చూసి వారి అద్భుత శక్తిని ప్రయోగించాలని ఉవ్విళ్ళూరటం, నాలుగవవాడు వారి మూర్ఖత్వానికి వగచి, హితవు పలికి భంగపడి వీరికి దూరంగా వెళ్లి తన ప్రాణాలు దక్కించుకున్న కథ మనకు తెలుసు. ప్రాణాలు కోల్పోయిన ఆ నలుగురు జ్ఞానసంపన్నులే. కాని వారిలో కొరవడిన ఇంగితం ప్రాణం నిలబెట్టుకున్న వాడిలో మెండుగా ఉంది. అలాగే పరస్త్రీని తాకకూడదన్న ధర్మాన్ని మనసులో స్థిరరచుకున్న ఒక శిష్యుడు ప్రవాహంలో కొట్టుకుపోతున్న ఒక స్త్రీని రక్షించడానికి ముందుకు రాలేదు. అక్కడ ఆపదలో ఉన్నది ఒక జీవి మాత్రమేనని భావించిన రెండోవాడు ఆమెను కాపాడటానికి కారణం ఇంగితమే. ఇంగితమంటే వివేకమే. ఒకరకమైన యుక్తాయుక్త విచక్షణ. సందర్భోచిత జ్ఞానం. మన చదువుల సారానికి, జీవితానుభవాన్ని విచక్షణాశక్తిని కలిపి చూడగలగటమే ఇంగితం. మన ప్రవర్తనలో, వ్యవహార శైలిలో దానిని చూపగలిగేవారి జీవితం అపార్థాలు, తగాదాలు లేకుండా సాగుతుంది. వందలాది పక్షులకు ఆశ్రయమిచ్చే ఓపెద్ద చెట్టుకింద కూర్చుని ధ్యానముద్రలో ఉన్నాడో పండితుడు. అపుడో పక్షి విడచిన విసర్జనం అతని తల మీద పడింది. విపరీతమైన కోపమొచ్చిన ఆయన దాని వంక తీక్షణంగా చూసాడు. అంతే! ఆ పక్షి కాలి బూడిదై పోయింది. ఆయనకు సంతోషమూ, గర్వమూ కలిగాయి. అన్ని పక్షులున్న చెట్టు కింద కూర్చుంటే ఆ అనుభవం ఎదురవ్వటం నీరు పల్లానికి వెళుతుందన్న నంత సహజం. ఇంత చిన్న విషయం ఆయనకు తట్టకపోవటానికి కారణం తన ఇంగితజ్ఞానాన్ని ఉపయోగించ లేకపోవటమే. ఇక్కడ ఇంగితమంటే వివేకమని అర్థం. చాల సహజమైన ఈ ఇంగితజ్ఞానాన్ని ఉపయోగించకపోతే పండితులు, జ్ఞానసంపన్నులు వారి శాస్త్ర సంబంధమైన జ్ఞానాన్ని, సాధన ద్వారా పొందిన జ్ఞానాన్ని ఎలా మట్టిపాలు చేసుకుంటారో చెపుతుందీ ఉదాహరణ. నిస్సందేహంగా జ్ఞానమే ఆధిక్యమైనది, గొప్పది, విలువైనది. ఈ జ్ఞానాన్ని ప్రదర్శించేటప్పుడు ఒక నియంత్రణాశక్తిగా ఈ ఇంగితం పనిచేయాలి. రివాల్వరు ఉపయోగించగలగటం జ్ఞానం. అయితే, దానిని ఆ సందర్భంలో వాడవలసిన అవసరం ఉందా లేదా అనే సంగతిని మనకు బోధపరచే గొప్ప వజ్జ ఈ ఇంగితం. ఇంగితమంటే తార్కికత, విచక్షణ, భావోద్వేగాలపై ఒక పట్టు. ఇంగితమంటే మన శక్తియుక్తుల్ని అవసరమైన చోట, తప్పనిసరైన క్షణాన మాత్రమే ఉపయోగించేటట్టు మనల్ని సమాయత్తం చేసే ఒక నిబద్ధత, ఒక అదుపు. అలా కానివేళలలో అది పిచుక మీద బ్రహ్మాస్త్రమే అవుతుంది. ఒక పండితుడు గణితంలో అపారమైన జ్ఞానాన్ని సంపాదించాడు. విశేషమైన ప్రజ్ఞతో గణితానికి చెందిన ఏ లెక్కనైనా, సమస్యనైనా పరిష్కరించసాగాడు. తన గ్రామంలోనూ, చుట్టుపక్కల గ్రామాలలోనూ అంతటి మేధావి లేడని ఖ్యాతి పొందాడు. పేరు, డబ్బు వచ్చింది. ప్రజలు, ఇంత గణితశాస్త్ర పండితులు ఆయన ప్రజ్ఞాపాటవాలకు ఆశ్చర్యానుభూతికి లోనై ఆయనకు నీరాజ నాలిచ్చి సత్కారాలు, సన్మానాలు చేసారు. గణితంలో తనకన్నా ప్రజ్ఞావంతుడు లేడనే అహంకారం ప్రవేశించింది అతనిలో. గర్వం తారస్థాయికి చేరుకొని ‘నాతో పోటీపడగలవారెవరైనా ఉన్నారా మీ గ్రామంలో?’ అని సవాలు విసరి, తలపడినవారిని ఓడించి, దూషించి అవమానించసాగాడు. ఒకసారి ఒక సాయంసంధ్య వేళలో ఒక గ్రామంలోకి ప్రవేశిస్తున్న సమయాన ఒక పశువుల కాపరి కలిసాడు. ఆ చదువురానివాడితోనూ తన గొప్పతనాన్ని గురించి అతిగా చెపుతూ వెళుతున్నాడు. ఒకచోట ఆ కాపరి తటాలున కిందకు వంగి ఒక గుప్పెడు ఇసుకను తీసుకుని ‘అయ్యా, కొంచెం ఇదెంతో లెక్కించి చెప్పగలరా?’ అని ఆ గణితశాస్త్ర పండితుణ్ణి అడిగాడు. ఆ ప్రశ్నకాపండితుడి నోటివెంట ఒక క్షణం మాట రాలేదు. ఆలోచన స్తంభించి పోయింది. చివరకు ఆ ఇసుకను లెక్కించలేమన్నాడు. దానికా పశువులు కాపరి ‘సామీ! దీనిని గుప్పెడని కదా అంటారు. ఐదు వేళ్ళు దగ్గరకు చేర్చి తీసుకుంటే చారెడు, రెండు అరచేతులతో తీసుకుంటే దోసెడు, బొటనవేలికి, చూపుడువేలికి మధ్య తీసుకుంటే చిటికెడని కదా అంటారు’ అన్నాడు. అంతే ఆ పండితుడికి తన తప్పు తెలిసింది. మామూలు పద్ధతిలోనే ఆ ఇసుకను లెక్కించే యత్నం చేయటం వల్ల సమాధానం చెప్పలేకపోయానని. సహజసిద్ధమైన ఇంగితజ్ఞానాన్ని తను చూపలేకపోయానని అర్థం చేసుకుని తన అహంకారానికి సిగ్గుపడి అతడికి నమస్కరించి ఇంటిముఖం పట్టాడు. నిజానికి ఆ నిరక్షరాస్యుడు పండితుడికి ఏ విషయంలో పోటీనే కాదు. కాని అతడు పండితుణ్ణి ప్రశ్నించటానికి కారణం అతడి ఇంగితమే. దీనినే మరో కోణం నుండి చూస్తే ఆ పండితుడి గర్వానికి, అనుచిత ప్రవర్తనకు ఆ పశువుల కాపరి ప్రశ్న నిరోధకం. అంతేకాదు. సహజ సిద్ధమైన ఇంగితానికి.. జీవితపరిశీలన, అన్వయం, సందర్భాచిత ఆకళింపు జత కూడితే అది విశేషమైన ప్రజ్ఞ. ఏ పుస్తకాలలో చెప్పని ఏ గురువు నేర్పని విద్య ఇది. ఇంగితమనే పుస్తకంలో జీవితానుభావాలే పుటలు, అధ్యాపకులు. మనలో సహజంగా ఉండే ఏ అద్భుత శక్తి, మన జీవిత మార్గదర్శి. విద్య వల్ల మరింతగా పదునెక్కాలి. అపుడే మరింతగా ప్రకాశిస్తుంది. ఇంగితమంటే లోకజ్ఞానం. ఇది మన నిత్య వ్యవహారాల నిర్వహణలో సహాయపడుతూ ఉంటుంది. అలాగే కొన్ని ముఖ్య సందర్భాలలో కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఈ ఇంగితం మనకు ఎంతో వెన్నుదన్నుగా ఉంటుంది. ఇంగితం మన ‘వివేచనా నేత్రం’ ఇన్ని ఉదాహరణలవల్ల మనం గ్రహించవలసింది ఏమిటి? ఇంగితమంటే ఒకసహజమైన తెలివిడి, లోతైన పరిశీలన, బుద్ధికి, మనస్సుకి గోచరమయ్యే ఒక అద్భుత అవగాహన. చదువుకున్న వారిలో ఉండేవి, ఉండవలసిన లక్షణాలు ఇవే కదూ! శాస్త్రపరమైన జ్ఞానం అక్షరాస్యులదైతే, నిరక్షరాస్యులది పరిశీలనా గతమైనది. ఇంగితం జ్ఞానమే. అది సహజాతమైనది అన్నారు పెద్దలు. –బొడ్డపాటి చంద్రశేఖర్, ఆంగ్లోపన్యాసకులు -
ఆలోచనా లోచనం
ఆలోచన మెదడుకు సంబంధించినది, ప్రేమ హృదయానికి సంబంధించినది. ఆలోచన, ప్రేమ రెండూ మనిషి ప్రగతి కి అత్యంత ఆవశ్యకమైనవి. ఆలోచన (వివేకం) పరిపక్వ స్థితికి చేరితే ప్రేమ ప్రకాశిస్తుందంటారు. అందుకే జ్ఞానోదయమైనవారు – వారు ఏ దేశానికి చెందిన వారైనా, ఏ మతానికి చెందిన వారైనా ప్రేమ మూర్తులై ఉంటారు. వారు మాట్లాడినా, మౌనంగా ఉన్నా, ఏమైనా పని చేసినా, ఏమీ చేయక ఊరకే ఉన్నా వారికి, ఇతరులకూ మంచే జరుగుతుంది. వారు ఏ మత ఆచారాలను పాటిస్తూ ఉండకపోవచ్చు. ఏ మతాన్ని ప్రత్యేకంగా ప్రచారం చేస్తూ ఉండకపోవచ్చు. మతాలకు అతీతంగా ప్రేమ, జ్ఞానాలను వారు ధారాళంగా పంచుతూ ఉంటారు. ఆలోచించగలిగే శక్తి గానీ, ఆలోచించాలన్న తపన గాని లేని మనిషి జీవించి ఉన్నట్టా? అసలు ఆలోచించని మనిషికి, జంతువుకు తేడా ఏమిటి? జంతువులు కూడా వాటికున్న సహజ జ్ఞానాన్ని ఆధారం చేసుకుని కొంత ఆలోచించటాన్ని గమనిస్తాము. మరి మనిషన్నవాడు ఆలోచనా రహితంగా, వివేకహీనుడై జీవిస్తే ఎలా? ప్రపంచంలోని అన్ని మత గ్రంథాల లక్ష్యం మనిషిలో ఆలోచనా శక్తిని రేకెత్తించాలనే. ఎప్పుడైతే ఆలోచనా శక్తి, వివేకం వృద్ధి అవుతాయో మంచి ఏదో, చెడు ఏదో సత్యమేదో, అసత్యమేదో, నిత్యమేదో, అనిత్యమేదో అతడే తెలుసుకోగలడు. సరైన ఎంపిక చేసుకుని చక్కగా జీవించగలడు. ఇతర జీవులను సంతోషంగా జీవింపజేయగలడు. భగవంతుడున్నాడని నమ్మటమో, నమ్మకపోవటమో అంత ముఖ్యం కాదు. పునర్జన్మ ఉందనో, లేదనో భావించటమూ అంత ముఖ్యం కాదు; స్వర్గ నరకాలు ఉన్నాయని విశ్వసించటమో, విశ్వసించకపోవటమో అదీ అంత ముఖ్యం కాదు. మరి ఏది ముఖ్యం? మనిషిగా జన్మించాము కాబట్టి మనుషుల మధ్య జీవించాలి. అది తప్పదు. అయితే ఎలా జీవించాలి? ఎలా జీవిస్తే సుఖంగా, సంతోషంగా మనశ్శాంతితో జీవించగలమో తెలుసుకుని అలా జీవించాలి. అలా జీవించాలంటే వివేకం కావాలి. ఆ వివేకాన్ని కల్గించటమే శాస్త్రాల, మతాల ఉద్దేశం. మన తల్లిదండ్రుల పట్ల, భార్యా పిల్లల పట్ల, బంధుమిత్రుల పట్ల, ఇరుగుపొరుగు వారి పట్ల మనం ఎలా నడుచుకుంటే సుఖంగా, సంతోషంగా, సంతృప్తిగా ఉండగలమో తెలుసుకోవాలంటే వివేకం తప్పక ఉండాల్సిందే. చీకట్లో నడవాలంటే దీపపు కాంతి ఉండాల్సిందే. లేకపోతే ఏదో ఒక గుంటలో పడి చస్తాము. అదేవిధంగా వివేకమనే వెలుగు లేక అంధకారమయమైన (ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియని) జీవితంలో పయనిస్తే కష్టనష్టాలు తప్పవు. పతనం తప్పదు. మనలో వివేక జ్యోతి వెలగాలంటే మనలో ప్రశ్నించే తత్వం వృద్ధి చెందాలి. ఆలోచించే గుణం అధికమవ్వాలి. అంటే గుడ్డిగా విశ్వసించటాన్ని మానుకోవాలి. ఏకాంతంగా ప్రశాంతంగా మౌనంగా కాలాన్ని గడపటాన్ని చేర్చుకోవాలి. అప్పుడే ఆలోచించటానికి అవకాశమేర్పడుతుంది. దేవుడు–దయ్యం, స్వర్గం– నరకం, పుణ్యం, పాపం వీటన్నిటినీ గూర్చి యోచించి, ఆలోచించిన పాశ్చాత్య తత్వవేత్త (ఫ్రెంచ్ ఫిలాసఫర్) వాటి ఉనికిని సందేహించాడు. ఆయన అన్నాడు. ‘...అంటే నేను యోచిస్తున్నాను కాబట్టి నేను ఉన్నాను’ అని అన్నాడు. అంటే యోచన ఆలోచన అన్నది ఒకటుంది నాలో. కాబట్టి నేను కూడా ఉన్నట్టే అని ధ్రువీకరించాడు. దాన్ని బట్టి ఆలోచనా శక్తికున్న ప్రాధాన్యతను మనం ఇట్టే గుర్తించవచ్చు. అందుకే ....‘‘మనిషి ఆలోచనా శక్తి గల ప్రాణి’’ అంటారు. వివేకం, ఆలోచనా శక్తి లేకపోతే మంచి చేయాలనుకున్నా కీడే కలుగుతుంది. ఒరే! కాస్త విశ్రాంతి తీసుకుంటాను. నీవు విసనకర్రతో విసురుతూ నా పక్కన కూర్చో అన్నాడట గురువుగారు. శిష్యుడు విసురుతూ ఉన్నపుడు ఒక ఈగ పదే పదే గురువుగారి తలపై వాలింది. శిష్యునికేమో గురువుగారి పట్ల అమిత భక్తి ఉంది. ఈగపై విపరీతమైన కోపం వచ్చింది. దగ్గరలో ఉన్న రోకలి ని రెండు చేతులతో ఎత్తి పట్టుకుని ఈసారి మా గురువు గారికి నిద్రాభంగం చెయ్, నీ కథ చెబుతా అనుకుంటూ వేచి ఉన్నాడు. ఈగ గురువు గారి గుండుపై కూర్చుంది. శిష్యుడు శక్తి కొద్దీ రోకలితో కొట్టాడు. ఈగ ఎగిరిపోయింది, గురువుగారి గుండు బద్దలైంది. సరైన ఆలోచన లేకపోతే జరిగేది అదే అంటారు స్వామి వివేకానంద. నిజమే. మంచిగా జీవిస్తూ, ఇతరులకు మంచి చేయటమే సర్వమత సారం. కాని మంచి అంటే ఏమిటో తెలియాలిగా? అదీ తెలీకనే కదా మతాలన్నీ మారణ హోమాలు చేసింది, మానవత్వాన్ని మంట కలిపింది. నేను ఆలోచిస్తున్నాను కాబట్టి నేనున్నాను అని రేనే డెక్టార్, అంటే నేను ప్రేమిస్తున్నాను కాబట్టి నేను ఉన్నాను అని ఇంకొక తత్వవేత్త అంటారు. ప్రేమ ఉంది కాబట్టి నేను ఉన్నట్టే అని అంటే ప్రేమకు పెద్ద పీట వేసినట్టే. – రాచమడుగు శ్రీనివాసులు -
ఇష్టపడితే కష్టం ఉండదు..
సుమతీ శతకంలో మకుటంగా ఉంచిన ‘‘సుమతీ! ’’ అంటే... మంచి మనసున్న వాడా! మంచి మేధ కలిగిన వాడా! మంచి మతి కలిగిన వాడా! అని అర్థం. ఒక వ్యక్తికి ఏదయినా ఒకటి తెలియకపోవడం తప్పుకాదు. ఎవ్వరూ సర్వజ్ఞులు కారు. అందరం శంకర భగవత్పాదులం కాదు. పుట్టుకతో అందరికీ అన్ని విషయాలూ తెలియవు. కానీ తెలియనిది తెలుసుకోకపోవడం, తెలుసుకునే ప్రయత్నం చేయకపోవడం మాత్రం తప్పే. నాకు తెలిసినది మాత్రమే నిజం, నాకు తెలుసుకోవలసిన అవసరం లేదనడం ధిక్కారం...అది ముమ్మాటికీ తప్పు. నాకు తెలియదు కాబట్టి నేను తెలుసుకుంటాను–అని ఎవరు వినయంతో చెవిపెట్టి మంచి మాటలు వింటారో వారందరూ సుమతులే. విద్యార్థుల మనసు తెల్లకాగితంలా ఉంటుంది. దాని మీద ఏది రాస్తే దాని ముద్ర పడుతుంది. పిల్లలకు అందవలసిన విషయం అందితే వాళ్ళు జీవితంలో వృద్ధి లోకి వస్తారు. ఉత్తమ పౌరులవుతారు. అటువంటి పిల్లలు కుటుంబంలో ఆధారపడతగిన వ్యక్తులవుతారు. ఆ వీథిలో ఉన్నవారు, ఆ ఊరి వారు, ఆ రాష్ట్రం, ఆ దేశంలో ఉన్న వారు కూడా వారిని చూసి గర్వపడే, సంతోషపడే స్థితిని పొందుతారు. అలా పొందేటట్లు బతకగలిగిన స్థితికి చేరుకోవడానికి సుమతీ శతకం పద్యాలు గొప్ప సోపానాలు. ఇవి పిల్లలను ఉద్దేశించి చెప్పినవే అయినా, వారికే కాక, అందరికీ అన్నికాలాల్లో ఉపయుక్తం అవుతాయి. వాటిలో ఒక పద్యం చూద్దాం... ‘‘ఇమ్ముగ చదువని నోరును/అమ్మాయని పిలిచి అన్నమడుగని నోరున్/తమ్ముల పిలువని నోరును/కుమ్మరి మనుద్రవ్వినట్టి గుంటర సుమతీ!’’ –‘ఇమ్ముగ చదువని నోరును...’ అంటే.. చదివేది ఇష్టంగా చదవాలి.. ఇష్టం అంటే? నీకు ఆకలేసింది. ఉదయం ఫలహారం తిన్నావు.. మధ్యాహ్నం మళ్ళీ ఆకలేస్తుంది.. మరి ఉదయం తిన్నదేమయింది! ఏదీ చూపించమంటే ఇక కనిపించదు. అది రక్తం, మాంసం, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ వంటి సప్త ధాతువుల్లోకి కలిసిపోయింది. అలా కలిసి అది నువ్వయి పోయింది. అంటే నేను తిన్న ఫలహారం నాలో కలిసిపోయింది, నేనుగా మారిపోయింది. మళ్ళీ మధ్యాహ్నం తింటాం. అదీ అంతే. నీళ్ళు తాగుతాం. అదీ అంతే. అలాగే చదివిన చదువు కూడా మనకన్నా వేరుగా ఉండకూడదు. అది కూడా నీలోకి వెళ్ళిపోయి ‘నువ్వు’గా మారిపోవాలి. అంటే నీకు దాని అవసరం ఎప్పుడొస్తే అప్పుడు అది నీకు జ్ఞాపకం రావాలి. అలా జ్ఞాపకం వస్తూ ఉండాలి అంటే మీరు చదివిని దానిని లోపల మననం చేసుకుంటూ ఉండాలి. ఇదంతా జరగాలి అంటే... చదివే చదువు ఇష్టంగా, ప్రీతిగా చదవాలి. ఇష్టంగా స్వీకరించింది ఏదయినా మన ప్రయత్నం లేకుండానే అది మన మనసులో ఎప్పటికీ ఉండిపోతుంది. అవసరమయినప్పుడు అది వెంటనే మనకు గుర్తొస్తుంటుంది. మీకు నాన్నంటే ఇష్టం, అమ్మంటే ఇష్టం. మీరు ఎక్కడున్నా వారిని మనసులో అనుకున్న వెంటనే మీకు వారెలా గుర్తుకొస్తుంటారో, ఇష్టంగా చదివినది కూడా అంతే. ఆవుపాలు పితికేటప్పుడు ఆ పాలధార సన్నగా ఉన్నా నేరుగా పాత్రలోకి చేరేటట్లు ఎలా ఏకాగ్రతతో పితుకుతామో, అలా చదివే విషయాలు, గురువుల ద్వారా వినే విషయాలు కూడా నేరుగా మనసులోకి చేరాలి. అలా జరగాలంటే... చదివే వాటిని కష్టంతోనో, చదవాల్సి వచ్చిందన్న బాధతోనో కాకుండా బాగా ఇష్టపడి చదవాలి. -బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
చదువే మనిషికి నిజమైన సంపద..
‘కళాశాల ప్రాంగణం దాటిన తరవాత మనిషిలో మిగిలిన సారమే అసలైన చదువు’ అన్నాడు ఆల్బర్ట్ ఐన్ స్టీన్. చదువు వల్ల పొందిన జ్ఞానం, విచక్షణ, వివేకం, వినయం, సంస్కారం అన్నీ జీవితంలో కనిపించాలి. చదువు మనిషికి ఆత్మ గౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేదిగా ఉండాలి. తన కాళ్ళ మీద తాను నిలబడటానికి చదువు దోహదం చేయాలి. అర్థవంతంగా జీవించటం నేర్పాలి. అది ఎంత చిన్న చదువైనా, పెద్ద చదువైనా ఆర్థిక భద్రతనిచ్చి, తద్వారా సమాజంలో గౌరవాన్ని ఇస్తుంది. చదువుకు శ్రద్ధ అవసరం. మనిషిని మనీషిగా చేసేది ఈ శ్రద్ధే! చదువు, ప్రశ్నించే తత్వాన్ని, ప్రతీది తెలుసుకోవాలనే జిజ్ఞాసను కలిగించాలి. ప్రశ్న జ్ఞానార్జనకు సంకేతం. మూఢ నమ్మకాలను, అంధవిశ్వాసాలను పోగొట్టి, తార్కిక జ్ఞానాన్ని ఇవ్వాలి. హేతుబద్ధంగా ఆలోచించటం నేర్పాలి. కేవలం పుస్తకాలలోని చదువే చదువు కాదు. నాలుగు గోడల మధ్య తరగతి గదిలో చదివే చదువు వ్యక్తి వికాసానికి సరిపోదు. పూర్వకాలంలో గురుకుల విద్యలో శిష్యులకు అవసరమైన విద్యలు నేర్పించాక, దేశాటనానికి పంపేవారు గురువులు. వివిధ ప్రదేశాలకు వెళ్ళటం, అక్కడి చారిత్రిక విశేషాలను తెలుసుకోవటం చదువులో భాగమే! కొత్త ప్రదేశాలలో కొత్త వారితో పరిచయాలు పెంచుకోవటం, కొత్త భాషలు నేర్వటం కూడా జ్ఞానార్జనే! 19వ శతాబ్ది ప్రారంభంలో సంఘసంస్కర్తలందరూ స్త్రీల సమస్యలకు వారి అజ్ఞానం, అవిద్యే కారణమని భావించారు. స్త్రీ విద్యను ప్రోత్సహించారు. ప్రాథమిక పాఠశాల చదువు, ఇంటి చదువుతోనే ఎంతో జ్ఞానం పొంది, తమ సమస్యలను తామే పరిష్కరించుకున్న పాత్రలను సాహిత్యంలో చూస్తాం. చదువు వ్యక్తిత్వాన్ని వికసింప చేసి, శీలనిర్మాణానికి దోహదం చేయాలి. బుద్ధిని వికసింప జేసి, తమ సమస్యలకు తామే పరిష్కారాన్ని తెలుసుకునే ఆలోచనాశక్తిని పెంచాలి. చదువే మనిషికి నిజమైన సంపద. ఇది ఉపయోగిస్తుంటే తరిగి పోయేది కాదు. ఇచ్చేకొద్ది వృద్ధి పొందే సంపద. విద్యాసంపన్నులు ఎక్కడకు వెళ్లినా గౌరవం పొందుతారు. సమాజంలో ఉపాధ్యాయులకున్న విలువ, గుర్తింపు సాటిలేనిది. చదువు ఇది మంచి... ఇది చెడు– అనే వివేక చతురత నిస్తుంది. చదువుతోనే మనిషి సమాజం లో తానేమిటో నిరూపించుకునే చైతన్యాన్ని పొందాలి. వ్యక్తీకరణ సామర్థ్యాన్నివ్వాలి. మార్కులు, శ్రేణులు చదువుకు కొలబద్దలు కావు. ముఖ్యంగా ఇప్పటి చదువుల్లో వ్యక్తికరణ నైపుణ్యాలకే పెద్దపీట. చదువు నేర్వటంలో ప్రాథమిక, ప్రధాన అంశం వినటం. ఇందులో పట్టు సాధిస్తే, సందేహాలు కలగటం, ప్రశ్నించడం, జ్ఞానాన్వేషణ, జ్ఞానార్జన వంటివి సాధ్యమవుతాయి. బాల్యం నుంచి తల్లితండ్రులు పిల్లలలో ఆరోగ్యకరమైన సొంత ఆలోచనా శక్తిని, వ్యక్తిత్వాన్ని చదువు ద్వారా పెంపొందించాలి. పెద్దయ్యాక, వాళ్ళేం కావాలనుకుంటున్నారో వాళ్లే నిర్ణయించుకోగలిగినంత ఆలోచనా స్థాయి వారికి రావాలి. నచ్చిన చదువు ఏదైనా సరే, వాళ్ళు అందులో ముందుంటారు. ఆ చదువును సార్థకం చేసుకోగలుగుతారు. ప్రతి వ్యక్తిలో అంతర జ్ఞానం దాగి ఉంటుంది. దానిని వెలికి తీయటమే చదువు చేసే పని. చదువు పరమార్థం జ్ఞానం పొందటం. ఉద్యోగం, చదువుకు ఉన్న ఫలితాలలో ఒక అంశం మాత్రమే! చదువంటే ఉద్యోగం కోసమే అనే అభిప్రాయం విద్యార్థులలో ముందు తొలగాలి. చదువు, మానసిక, నైతిక శక్తులను పెంపొందిస్తుందని గుర్తెరగాలి. చదువు జీవితానికి వెలుగు నిస్తుంది. గొప్ప మేధావులను తయారు చేస్తుంది. పూర్వం చదువును మూడవ కన్నుగా భావించారు. దేశంలో జరిగే అన్యాయాలను, ఘోరాలను, దౌర్జన్యాలను విద్యావికాసం ద్వారానే నిరోధించగలం. ఏ దేశ ప్రగతి అయినా ఆ దేశంలో చదువు పై ఆధారపడి ఉంటుంది. అందుకే, దేశం విద్యారంగం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అయితే, ఒక స్థాయి వరకే ఎవరికైనా ఒక పాఠశాల అధ్యాపకుడు ఉంటారు. ఆ నిర్ణీత విద్యాభ్యాస సమయం ముగిసాక, మనిషి విశాల ప్రపంచంలోకి అడుగు పెడతాడు. అప్పటి నుండి విశ్వంలో ప్రతివారి నుండి, ప్రతి అంశం నుండి ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాడు. చదువుకు అంతం ఉండదు. ఉద్యోగం వచ్చేసిందనో, పెళ్లయి పోయిందనో చదువుకు ఫుల్స్టాప్ పెట్టకూడదు. ఎప్పుడూ కొత్త విషయాలను నేర్చుకుంటూనే ఉండాలి. కొత్త పుస్తకాలను చదువుతూనే ఉండాలి. విషయ పరిజ్ఞానాన్ని పెంచుకుంటూనే, మెరుగు పరచుకుంటూనే ఉండాలి. మనిషి నిత్య విద్యార్ధిగా ఉండాలి. చదువు... స్వేచ్ఛ అనే అద్భుతమైన ప్రపంచపు తలుపును తెరిచే తాళం చెవి లాంటిదని మేధావులు చెపుతారు. చదువు బానిసత్వం నుంచి, ఆత్మ న్యూనత నుంచి విముక్తి కలిగిస్తుంది. అందుకే ప్రతి ఒక్కరు చదువుకోవాలి. చదువులో సారాన్ని, విలువలను గ్రహించి, జీవితానికి అన్వయించుకోవాలి. మంచి సమాజ నిర్మాణానికి తాము చదువుకున్న చదువు ద్వారా సహకరించాలి. చదువు అనే బంగారు పళ్లెరం కాంతులీనటానికి జీవితానుభవం అనే గోడ చేర్పులు కావాలి. – డాక్టర్ చెంగల్వ రామలక్ష్మి -
నాగమ్మ పెద్దమ్మ
బతికున్నప్పటి కంటే కొంతమంది చనిపోయాకే ఎక్కువ గుర్తుంటారేమో! అక్షరఙ్ఞానం లేకపోయినా తమ అనుభవాలతో జీవితాన్ని గడిపి ఆ శేషాన్ని ఙ్ఞాపకాలుగా మార్చి పోయినవాళ్లు ఇంకా బాగా గుర్తుంటారు. నాకు ఊహ తెలినసిన దగ్గర్నుంచి ఊరు విడిచిపెట్టే వరకూ నాగమ్మ పెద్దమ్మతో వున్న అనుబంధం కూడా అలాంటిదే. ఒంట్లో ఓపికున్నంత వరకూ కష్టపడాలని, ఇతరుల మీద అత్యవసరమైతే తప్ప ఆధారపడకూడదనే సత్యం నాగమ్మ పెద్దమ్మ నాకు నేర్పింది. సన్నగా, పొడుగ్గా, విశాలమైన నుదురు, నిటారుగా వుండే ముక్కుతో తెల్లగా కళగా వుండేది పెద్దమ్మ. తలంతా తెల్లబడి తలపైన ముగ్గుబుట్ట బోర్లించినట్లుగా వుండేది. నుదురునిండా కనిపించే ముడతలు కోనేటి దగ్గరున్న మెట్లను తలపించేవి. పట్టుకోకలు కట్టుకుని కోకచెంగును బొడ్డులో దోపుకునేది. నుదుటున బొట్టుండేది కాదు.బొట్టు పెడితే మరింత అందంగా కనిపిస్తుంది. ఇంటిముందున్న బూరుగుచెట్టు నుండి గాలికి రాలిపడిన బూరుగుకాయల్ని ముందేసుకుని వాటిలోని దూదిని వేరుచేస్తూ కనిపించేది పెద్దమ్మ. పసిపిల్లని సాకినట్లుగా ఒక్కో బూరుగుకాయనీ పగులకొట్టి అందులోనుంచి తీసిన దూది గాలికి ఎగరకుండా దాన్ని జాగ్రత్తగా చుట్టచుట్టిన దుప్పట్లో దాచిపెట్టేది. ఎప్పుడన్నా ఆడుకుంటూ పెద్దమ్మ ఇంటి వాకిట్లోకి వెళ్తే ‘కూర్చో’మన్నట్లుగా సైగచేసేది. ‘‘ఒక్కదానివే కదా ఇంట్లో వుండేది! కాసేపు పడుకోకుండా నడుము నొప్పెట్టేలా ఈ పనులెందుకు’’ అని అమాయకంగా అడిగేవాడిని. బోసినోటితో చిన్నగా నవ్వి నా బుగ్గలపైన సుతారంగా నొక్కి కణత దగ్గర మొటికలు విరిచి ముద్దు పెట్టుకునేది. తర్వాత లోపలికెళ్లి పండిన అరటిపండు తీసుకొచ్చి తినమని ఇచ్చేది. పెద్దమ్మ భర్త వ్యవసాయం బాగా చేసేవాడు. సొంతభూమి లేకపోయినా కౌలుకు తీసుకుని పసుపు, అరటి పంటలు పండించేవాడు. అరటితోట కాపుకొచ్చినప్పుడు పండడానికి సిద్ధంగా వున్న గెలను తీసుకొచ్చి ఇంటి మధ్యలో వేళ్లాడదీసేవాడు. రోజుకు ఒకటో రెండో పండితే వాటిని తినడమో, పెరుగన్నంలో నంజుకుని తినడమో చేసేవాళ్లు. రెండో మూడో పాడిగేదెలుండేవి. గేదెల్ని పొలానికి తీసుకెళ్లి సాయంత్రం ఇంటికొచ్చాక పాలుతీసి ఇంటింటికీ వెళ్లి ఖాతాల్లెక్కన పాలు పోసి వచ్చేది. పొరపాటున కూడా పాలల్లో నీళ్లు కలిపేది కాదు. ఎవరైనా వేళాకోళానికి ‘అందరూ పాలల్లో నీళ్లు కలిపి దీపం వుండగానే ఇల్లు చక్కదిద్దుకుంటుంటే... నువ్వేమో తీసిన పాలు తీసినట్లే పోస్తున్నావు’’ అని మాట్లాడితే ‘‘పాలూనీళ్లల్లా సంసారం సాగాలిగానీ వ్యాపారం చేయకూడదు..’’ అని సున్నితంగా మందలించేది. పెద్దమ్మకి పిల్లల్లేరు. లోపం ఎవరిదో ఆ భగవంతుడికే తెలియాలి. భార్యాభర్తలిద్దరూ అన్యోన్యంగా పిల్లల్లేరనే దిగులు లేకుండా జీవితం గడిపేవారు. అయినా లోపం లోపమే కాబట్టి తెలిసిన బంధువుల అబ్బాయిని తెచ్చుకుని పెంచు కున్నారు. కడుపున పుట్టకపోయినా వాడిని ఏ పనీ చేయనివ్వకుండా అల్లారుముద్దుగా పెంచుకున్నారు. అడిగిందల్లా లేదన కుండా ఇవ్వడం, అతిగారాబం వల్ల వాడు చదువబ్బక జులాయిగా మారాడు. ఎటూ చదువబ్బడం లేదుకాబట్టి వ్యవసాయం నేర్చుకుంటాడని పొలానికి తీసుకెళ్తే తండ్రి చెప్పేది వినకుండా నిర్లక్ష్యంగా ప్రవర్తించేవాడు. పిల్లలు కళ్లముందు ఎంత అల్లరిచేసినా అది తల్లిదండ్రులకు సంబరంగానే వుంటుంది. ఎప్పుడైనా ఇరుగుపొరుగు వాళ్లు వాడిమీదేమైనా చాడీలు చెప్తే ‘‘అల్లరి చేయకుండానే పెద్దవాళ్లు అయిపోయారా? పసితనం కదా... వాడే తెలుసుకుంటాడులే..’’ అని సర్ది చెప్పి పంపించేది. కాలం కలకాలం ఒకేలా వుండదు. మనిషి లెక్కలు మనిషికుంటే కాలం లెక్కలు కాలానివి. పిల్లలతో ఆడుకుంటూ ఆడుకుంటూ ఊరిచివరి మామిడితోటలో వున్న దిగుడుబావిలో పడి చనిపోయాడు వాడు. పెద్దమ్మ గుండె పగిలిపోయింది. పిల్లాడిని పెంపకానికిచ్చిన తల్లి పెద్దమ్మను తీవ్రంగా తిట్టిపోసింది. ‘గొడ్డుమోతుదానివి, పేగుతెంచుకుని కంటే ఆ బాధ తెలుస్తుంది, పెంపకానికి తెచ్చుకుంటే పిల్లలపైన ప్రేమెలా పుడుతుంది, వాళ్లను కాపాడుకోవాలనే ఙ్ఞానమెలా వస్తుంది...’’ కడుపుమీద కొట్టుకుంటూ పెడబొబ్బలు పెడ్తున్న ఆమెవంక విషాదంగా చూస్తుండిపోయింది పెద్దమ్మ. సొంత తల్లికాకపోయినా అంతకంటే ఎక్కువగానే సాకింది వాడిని. తన పెంపకంలో లోపం లేదు, తన ప్రేమలో లోటులేదు. అయినా అనుకోని విపత్తు జరిగితే లోకం దృష్టిలో ఎన్ని నిందలుపడాల్సి వస్తుందో అనుభవంలోకి వచ్చింది పెద్దమ్మకి. కాలం గాయాలు చేస్తుంది, ఓదార్పునూ ఇస్తుంది. కొన్నాళ్లు వాడి ఙ్ఞాపకాలతోనే భారంగా గడిచిపోయింది జీవితం. వాడి గుర్తులనుండి బయటపడి ఈ లోకంలోకి వస్తున్న పెద్దమ్మకి భర్తమరణం పిడుగులా మారింది. ఒకరోజు ఉదయాన్నే పొలానికి నీళ్ళు పెట్టడానికి వెళ్లిన భర్త పాముకాటుకు గురై చనిపోయాడు. పెద్దమ్మకి పెళ్లైనప్పటి నుండీ వాళ్ళిద్దరూ ఎంత సాన్నిహిత్యంగా వుండేవారో తెలిసిన వాళ్లు ఆమెను ఓదార్చారు గానీ బాధను తీసేయలేకపోయారు. భర్త పోయిన తర్వాత పంటనుండి వచ్చిన డబ్బులతో కొన్ని అప్పులు తీర్చింది. పాలమ్మగా వచ్చిన ఆదాయాన్ని రోజువారీ ఖర్చులకోసం వాడుకునేది. రోజులు గడిచేకొద్దీ ఒంట్లో శక్తి తగ్గిపోవడం, గేదెలకు చాకిరీ ఎక్కువగా చేయాల్సి రావడంతో వాటిని అమ్మేసింది. ఇంటిచుట్టూ మట్టిగోడలు పడగొట్టించి ఇటుకలతో కట్టించింది. అరసెంటు స్థలం చుట్టూ వున్న పిచ్చిమొక్కల్ని తొలగించి కంచె పాతించింది. ఇంటిముందున్న సపోటా చెట్టుకిందో, జామచెట్టుకిందో మంచం వేసుకుని కూర్చునేది. ఇంటిముందునుంచి ఎవరెళ్తున్నా ‘ఎలా వున్నారం’టూ అందర్నీ ఆరాతీసేది. ‘కాసేపు కూర్చుని పోదువు రా’ అంటూ పిల్చేది. ‘‘నీకేమే పెద్దమ్మా... ఒంటరిదానివి. ఒక ముద్దొండుకుని తింటావు, నిద్రొస్తే పడుకుంటావు. నీకులాగా మాకెలా కుదురుతుందీ...’’ అంటూ దీర్ఘం తీసుకుంటూ వెళ్ళే వాళ్లవంక చూస్తూ ‘‘ఒక్కదాన్నే వుండడం ఎంత నరకమో నీకెంత చెప్పినా తెలియదులే...’’ నీళ్లను కళ్లల్లోనే దాచుకుని తనలో తనే గొణుక్కునేది పెద్దమ్మ. పొద్దున్నే లేచి చక్కగా ముఖం కడుక్కుని అద్దం ముందేసుకుని జామచెట్టు కింద కూర్చుని తలదువ్వుకునేది. ఒత్తుగా కొబ్బరినూనె రాసుకుని తలపై వున్న కాసిని వెంట్రుకలనే శుభ్రంగా దువ్వుకుని దానిలో సవరం పెట్టి అల్లుకుని పెద్ద ముడేసుకునేది. అటూఇటూ అద్దాన్ని తిప్పి కాసేపు చూసుకునేది. ‘‘ఇంత వయసొచ్చినా సోకు తగ్గలేదు నీకు... నిండా నాలుగెంట్రుకలు లేవు, పొద్దస్తమానం దువ్వుతూనే వుంటావు...’’ అనేవాళ్లని చూసి ‘‘నాతోపాటు పుట్టినయ్, పోయే దాకైనా జాగ్రత్త చేయాలిగా...’’ అంటూ ముసిముసిగా నవ్వుకునేది. పెద్దమ్మ ఎండుచేపలు అమ్మేది. ప్రతీ ఆదివారం తెల్లవారుజామునే లేచి పెద్ద గోనెసంచి తీసుకుని ఊరికి ఇరవై కిలోమీటర్ల దూరంలో వున్న సంతకి వెళ్లేది. ఎండురొయ్యలు, చీలికచేపలు, రొయ్యపొట్టు, ఉప్పుచేపలు తీసుకుని వెనక్కి వచ్చేది. బస్సుదిగి ఊర్లోకి నడిచివస్తుంటే ఆడోళ్లందరూ పెద్దమ్మ వెనకాలే వచ్చేవాళ్లు ఎండుచేపలకోసం. కనీసం మూట కూడా దించుకోనివ్వకుండా మీదకి ఎగబడేవాళ్లు. వాళ్లందర్నీ తోసి ‘ముసలిముండని... అంతదూరం నుండి ఇంత పెద్ద మూటేసుకుని పడతా లేత్తా ఇంటికొస్తే ఒక్కతన్నా గుక్కెడు మంచినీళ్లిచ్చిందా? చేపలో చేపలో అని నా గోచి లాగుతున్నారు, అవతలికి పొండెహే...’’ అంటూ తిట్టేది. గోనెసంచి ముడివిప్పగానే ఎండుచేపల వాసన గుప్పున వచ్చేది. ఈగల్లాగా అందరూ మూకుమ్మడిగా చేరి ‘నాకివి కావాలి, నాకవి కావాలి’ అంటూ ఎవరిక్కావలసిన చేపలు వాళ్లు పట్టుకెళ్లేవాళ్లు. తక్కెడ సర్ది లోపల దాచిపెట్టేది. గురువారం నుండి శనివారం వరకూ ఎవరికైతే చేపలు అప్పుగా ఇచ్చిందో వాళ్లదగ్గరకెళ్లి డబ్బులు వసూలుచేసేది. ఆ డబ్బులు లెక్కచూసుకుని మళ్లీ ఆదివారం సంతకి సిద్ధమయ్యేది. ఇంటి దగ్గర ఖాళీగా కూర్చునేది కాదు. ఒకవేళ కూర్చున్నా బూరుగుకాయల నుంచి దూది వడుక్కునేది. పొయ్యి వెలిగించుకుని నాలుగుగింజలు ఉడికించుకుని కాల్చిన ఎండుచేప నంజుకుని ఆ పూటకి భోజనం కానిచ్చేది. రెండుముద్దలు కాకులకోసం విసిరేది. ఎక్కడెక్కడి నుండో ఎగిరొచ్చే వాటికి, ఏకాకిగా జీవితం గడుపుతున్న తనకీ పెద్దగా భేదం కనిపించేది కాదు. పిచ్చాపాటిగా ఎవరైనా ఎప్పుడైనా ‘‘ఒక ముద్దొండుకుని తిని ఇంట్లో కూర్చోకుండా ఎందుకే ఎండనపడి అంతదూరం వెళ్లి సుఖంగావున్న ప్రాణాన్ని దుఃఖాన పెట్టుకుంటావు? మధ్యదారిలో ఏమైనా అయితే ఎలా తెలుస్తుంది...’’ అనేవాళ్ళు.దానికి పెద్దమ్మ ‘‘పోయే ప్రాణమే గానీ వచ్చే ప్రాణం కాదుగా... ఎప్పటికైనా పోవలసిందే! ఎంతసేపూ ఇంట్లోనే కూర్చుంటే ఇబ్బందిగా వుంటుంది. సంతకెళ్తే నాలుగు ముఖాలు కనిపిస్తాయి, నలుగురి మాటలు వినిపిస్తాయి. ప్రపంచంలో నా ఒక్కదానికే కష్టాలున్నాయనుకునేదాన్ని. సంతలో ఒక్కొక్కరిదీ ఒక్కోరకం కష్టం. వాళ్లకంటే నేనే నయమనిపిస్తుంటుంది...’’ అని చెప్తూ సొట్టబుగ్గలు ఇంకా గుంటలుపడేలా పెద్దగా నవ్వేది. మళ్ళీ తనే నవ్వుతూ ‘‘ఇదిగో ఇంకో మాట చెప్తా విను... కాలూచెయ్యీ పడిపోయి మంచానపడి అందరిచేతా సేవ చేయించుకుంటూ తిట్టించుకుంటూ పోయేకంటే... ఈ చిలక ఎక్కడో ఒకచోట గుటుక్కున ఎగిరిపోతేనే బాగుంటుంది.... ఏమంటావు?’’ అంటూ నవ్వుకుంటూ లోపలికెళ్తున్న పెద్దమ్మ వంక ఆ ప్రశ్న అడిగిన వాళ్ళు అయోమయంగా చూసేవాళ్ళు. అన్నట్టుగానే పెద్దమ్మ వెళ్లిపోయింది. ఎవరిచేతా మాటపడకుండానే, ఎవరితోనూ చేయించుకోకుండానే పడు కున్నది పడుకున్నట్లే నిద్రలోనే చనిపోయింది. అటువంటి మనిషి మళ్లీ పుట్టదని ఊరంతాఅనుకున్నారు. అటువంటి చావు ఎవరికీ రాదని కూడా అందరూ అనుకున్నారు. - డా. జడ సుబ్బారావు -
తిరుమల చరిత్రపై గొప్ప పరిశోధన
ఇంతవరకు తిరుమల చరిత్రపై వివిధ భాషల్లో వెలువడ్డ పుస్తకాలకు భిన్నంగా పరిపూర్ణంగా చరిత్రను పునాదిగా చేసుకుని రాసిన విశిష్ట గ్రంథమిది. చెట్లనీడలో, చెదల పుట్టల నడుమ కప్పబడి ఉన్న వెంకటేశుని ప్రతిమను తొండమాన్ చక్రవర్తి వెలికి తీయించి పునఃప్రతిష్ట గావించి శిలాస్తంభాలతో మండపరీతి ఆలయాన్ని నిర్మించింది మొదలుకుని ఆళ్వారులు ఎంతో కష్టంతో కొండల నడుమన ఉన్న వేంకటేశుని దర్శించి తాము సేకరించిన వివరాలను పాటగట్టి ఆ భక్తితత్వాన్ని ప్రచారం చేసిన చరిత్రను ఆచార్య దేవిరెడ్డి సుబ్రమణ్యం రెడ్డి ఈ పుస్తకంలో వివరించారు. 2 వేల సంవత్సరాల చరిత్ర క్రమంలో తిరుమల చరిత్రను ఆధార సహితంగా వెలికి తీసి మనముందు ఉంచిన పరిశోధక స్థాయి కలిగిన గ్రంథమిది. ఈ పుస్తకంలో మహిమలు, భక్తి ప్రచారాలు. వేంకటేశ్వరుడి లీలలు కానరావు. అయితేనేం, మనిషి తమకు మంచి చేసినవారిని దేవుళ్లగా, చెడు చేసిన వారిని రాక్షసులుగా భావించి కొందరికి దైవత్వం, కొందరికి దానవత్వం ఎందుకు ఆపాదిస్తూ వచ్చాడో పరిణామ క్రమంలో వివరిస్తూ వచ్చిన ఈ గ్రంథం అందరూ తప్పక పఠించి తీరాల్సినది. గాడ్స్ ఆన్ అర్త్; తిరుమల చరిత్ర పుటలు: 310; వెల రూ. 300; ప్రతులకు: ప్రొ. దేవిరెడ్డి సుబ్రమణ్యం రెడ్డి 303, బి1 బ్లాక్, వరరూప హోమ్స్, శ్రీ సాయి అపార్ట్మెంట్స్, తుమ్మలగుంట, తిరుపతి–517502. ఫోన్: 9849584324 ఈమెయిల్:dsreddy.svu@gmail.com – రాజశేఖర రాజు మానవుడు నిరంతర జిజ్ఞాశువు. అన్నింటినీ తెలుసుకోవాలనుకునే మానవుని తృష్ణకు సంపూర్ణంగా లొంగనిదా ఆత్మ. కారణం, అది అటు విశుద్ధశక్తి రూపంలోనూ, ఇటు దృశ్యమాన ప్రపంచరూపంలోనూ కలగలిసి ఉండటమే. అంతేగాక, విరుద్ధ లక్షణాలు ఆ ఆత్మ సొంతం. ఆత్మ ఎంత సూక్ష్మమో, అంత విస్తృతం. ఎంత తేలికో, అంత భారయుతం. ఎంతటి సరళమో, అంతటి సంక్లిష్టతమం. ఎంతటి నిర్లిప్తమైనదో, అంతటి చైతన్యమైనది. ఎంతటి స్థిరమైనదో, అంతటి పరిణామశీలి. అందుకే, ఉపనిషత్తులు ఆత్మను ‘సవితా’ అని పేర్కొన్నాయి. ఆత్మ సాంద్రత అనంతమవడం వల్ల ఆ ఆత్మలో ఎక్కడైనా భారీ లేక అతి భారీ నక్షత్రాలు, నక్షత్ర సముదాయాలు రూపొందుతున్నాయి. అలాగే, అంతే ప్రాంతంలో సూక్ష్మాతిసూక్ష్మమైన పదార్థాలు కూడా. ఆత్మ పరిణామతత్వం వల్లనే నిర్జీవులకు విఘటనం, జీవులకు మరణం తప్పదు. విఘటనం చెందిన నిర్జీవి ఏ రకంగా నైతే తిరిగి తన రూపాన్ని పొందదో, అలాగే జీవి మరణాంతరం తన రూపాన్ని తిరిగి పొందదు. ఎందుకంటే ఈ ఆత్మకు తిరిగి చూసుకునే అవసరమూ లేదు, అవకాశమూ లేదు. ఆత్మసాంద్రత అనిర్వచనీయమైనందువల్ల, అదే తిరిగి తిరిగి అన్ని రూపాల్లో పుడుతుందని, ఆ ఆత్మే తానని ఆత్మ జ్ఞానం పొందినవాడు గుర్తెరిగి, గతంలో, వర్తమానంలో, భవిష్యత్తులో ఉద్భవించేది తానేనని నిర్ధారించుకుంటాడు. తద్వారా మరణభీతిని జయిస్తాడు. అతన్ని మాత్రమే అరిషడ్వర్గాలు చేరలేవు. ఆత్మజ్ఞాని ఓ విశ్వమానవుడు ఆత్మజ్ఞాని ఓ విశ్వమానవుడు. అతనికి కులం లేదు, మతం లేదు, అసలు భేదమే లేదు. జీవుల్లోనే కాదు, నిర్జీవుల్లో కూడా భేదాన్ని గుర్తించలేడు. అభేదమే మనసుగా మారిపోగా, అదే ఆనందానికి మాతృకగా పరిణమిస్తుంది. మానవ సమాజం కూడా ఈ విషయాన్ని గుర్తిస్తే సమాజంలో భేదాభిప్రాయాలకు తావు ఉండదు. మతవాదం, కుల వాదం, జాతివాదం మొదలైనవే కాకుండా మానవుడే ఒక ఉన్నతజీవి అనే దురభిమానం కూడా పోతుంది. ఈ ప్రకృతిలో తనదొక విశిష్టమైన బాధ్యతాయుత జన్మ అని గుర్తిస్తుంది. ప్రకృతిలో ఇతర జీవాలను తోబుట్టువులుగా చూడడం జరుగుతుంది. ఆధిపత్య ధోరణి పోయి బాధ్యతాయుత జీవన విధానం ప్రారంభమవుతుంది. మానసిక శుభ్రతయే కాక, పరిసరాల పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ మొదలైన ప్రాకృతిక కార్యకలాపాలు మొదలై ఓ చక్కటి సమాజం సాకారమౌతుంది. ప్రతీ గ్రామం ఓ మున్యాశ్రమంగా రూపుదిద్దుకుంటుంది. అయం నిజః పరోవేతి గణనా లఘు చేతసామ్ ఉదార చరితానాంతు వసుధైక కుటుంబకామ్ అన్నట్టుగా వసుధ అంతా ఒకే కుటుంబమై విరాజిల్లుతుంది. – గిరిధర్ రావుల -
మంచే జరిగింది
ఒకసారి పరీక్షిత్తు మహారాజు వేటకు వెళుతూ తాత భీమసేనుడు గతంలో జరాసంధుణ్ణి చంపి తెచ్చిన బంగారు కిరీటాన్ని ధరించాడు. మణులు పొదిగిన ఆ కిరీటం ధరించగానే, ఆయనలో రజోగుణం ప్రవేశించింది. వేటాడి వేటాడి అలిసిపోయిన పరీక్షిత్తు, దాహంతో చుట్టూ చూశాడు. నిశ్చలంగా తపస్సులో లీనమైన శమీక మహర్షి కనిపించాడు. ఎన్నిసార్లు పిలిచినా పలకలేదన్న కోపంతో ఒక చచ్చిన పాముని తెచ్చి, ఆయన మెడలో వేశాడు. శమీక మహర్షి కొడుకు శృంగి, జరిగినదాన్ని తెలుసుకుని, తపస్సు చేసుకుంటున్న తండ్రిని అవమానించాడన్న కోపంతో, ఆనాటికి ఏడవ రోజున తక్షకుడు అనే సర్పం విషంతో రాజు మరణించాలని శపించాడు. పరీక్షిత్తు మహారాజుకు జరిగినదేమీ తెలియదు. రాజమందిరానికి రాగానే కిరీటం తీసి పక్కన పెట్టాడు. అప్పుడు ఆయనలో ఉన్న రజోగుణం తగ్గి, తాను చేసిన పనిని తలచుకొని పశ్చాత్తాపపడ్డాడు అయితే, దురదృష్టవశాత్తూ అప్పటికే జరగవలసిన అనర్థం అంతా జరిగిపోయింది. శమీక మహర్షి శిష్యులు వచ్చి అసలు విషయం తెలియజేశారు. మహారాజు ఉత్తమ సంస్కారం కలవాడు కనుక, తనకు మంచే జరిగిందనుకున్నాడు. మరణం ఎప్పుడు సంభవిస్తుందో ఎవరికీ తెలియదు కనుక, భగవచ్చింతనలో సమయాన్ని సద్వినియోగ పరుచుకోవాలనుకున్నాడు. చివరకు ఒక మహర్షి ద్వారా జ్ఞానం పొంది, వైకుంఠం చేరాడు. పరీక్షిత్తు అసుర గుణాలు కలిగినవారి వస్తువులను వాడటం వల్ల, వివేకాన్ని కోల్పోయాడు. అదే ఆయనకు శాపమైంది. – డి.వి.ఆర్. -
ఆత్మజ్ఞానంతోనే పరిణామ దశ
ఆ అనంతశక్తి కాలాతీతమైనది. కాలం అనేది సూర్యుని వల్ల ఏర్పడే దివారాత్రుల వలన కలిగే ఒక భావన. సూర్యమండలంలోని ఒక్కో గ్రహానికి ఒక్కో కాలం ఉంటుంది. కాలం అనేది జనన మరణాలు కల పదార్థాలకు మాత్రమే ఉంటుంది. జననమరణాలు లేని అనంతశక్తికి ఉండదు. అట్టిదానికి కాలాన్ని ఆపాదించనూలేము. కాలాన్ని చెప్పగలిగే లేదా చూపగలిగే పదార్థం అనంతశక్తి ఆవల పుట్టలేదు. కారణం, ఆ అనంతశక్తి అలాంటి స్థానమే లేకుండా ఆవరించి ఉండడమే. అంతేకాకుండా, పుట్టే పదార్థానికి ఇదే శక్తి కావాలి. కాబట్టి, కాలం అనే భావనకు కారణమైన అన్ని నక్షత్ర, గ్రహాలను కన్నది ఈ అనంతశక్తే కాబట్టి, అది కాలాతీతమైనది. సనాతనమైన ఆత్మ తన ఉనికిని, నూతనత్వాన్ని చాటుకోవడానికి పరిణామాన్ని ఆశ్రయించిందని తెలుసుకున్నాం. అయితే, ఆత్మకు జన్మ అనేదిలేదు. అలాగే, ఈ పరిణామ ప్రక్రియ ప్రారంభమూ చెప్పలేము. అయితే, పరిణామం అనేది అనంతశక్తికి తప్పనిసరైన విధి. గమ్మత్తేమిటంటే, ప్రతి పదార్థరీత్యా ఆ పదార్థమే తొలిసారిగా ఉద్భవించినట్టు తోస్తుంది. ఎందుకంటే, పరిశోధన భూకేంద్రంగా చేసుకుని సాగడమే. అంతటి విచిత్రమైన అనంతశక్తిలో సృష్టిలయలు కలిగి ఉన్న పదార్థాలు అనగా గెలాక్సీలు, నక్షత్రాలు, గ్రహాలు ఎన్నని ఎంచగలం, ఎక్కడని చెప్పగలం? పార్సెక్ లాంటి ఖగోళ కొలతలకు అందని దూరాలలో ఒక పదార్థాన్ని చూసే శక్తి సముపార్జించే లోపల మరో పదార్థం పురుడు పోసుకుంటుంది. ఈ పదార్థమే తర్వాత అనంతశక్తిగా రూపొందుతుంది. ఈ పరిణామం నిరంతర ప్రక్రియ. ప్రస్తుతం మన నివసిస్తున్న భూమండలం, మన సౌరకుటుంబం ఆ అనంతశక్తి లో ఏ భాగమో, ఏ దిశలో ఉందో, ఎంతటి భాగాన్ని ఆక్రమించి ఉందో ఏ విధంగా చెప్పగలం? ఈ విధంగా అనంతశక్తికి వైజ్ఞానికపరంగా చూసినా, ఉపనిషత్తుల పరంగా చూసినా పరిణామం చెందడమే ప్రధాన లక్షణమని అర్థమౌతుంది. ఇదే విషయాన్ని శ్వేతాశ్వతర ఉపనిషత్తు నిర్ధారిస్తోంది. అనంతశక్తిని ‘పరిణామశీల అయిన అంతర్యామి’గా పేర్కొంటూ, పరిణామాన్ని నిత్య లక్షణంగా అలవాటు చేసుకున్న ఆ శక్తి అన్ని ప్రాణులలోను, వాటి అవయవాలలోనూ, నిర్జీవులలోనూ దాగుకొని అందంగా ఉందని పేర్కొంటుంది. ఈ విషయాన్ని తెలుసుకున్న సాధకుడు, ఈ శరీరంలో స్వయంప్రకాశక ఆత్మతత్వం ద్వారా, తనలోనూ, తన చుట్టూతా నిశ్చలమై ఉన్న బ్రహ్మ తత్వాన్ని సాక్షాత్కరించుకున్నప్పుడు మాత్రమే జన్మరాహిత్యాన్ని, శాశ్వతత్వాన్ని అవగాహనలోకి తెచ్చుకుని జాతి, కుల, మత, లింగ, భాష, వయో ఆధారిత సకల బంధాల నుండి విముక్తుడై, మోక్షజీవితాన్ని ఆనందంగా జీవిస్తాడు. జ్ఞానం వలన సాధకుడు విశ్వనరుడై ఉదారజీవితాన్ని గడిపి, మరణభయం లేకుండా, శరీరాన్ని వదిలి మరో పరిణామ దశలోకి ప్రవేశిస్తాడు. – గిరిధర్ రావుల -
సర్వాంతర్యామి ఎక్కడ?
సర్వాంతర్యామి అంటే ఎంతటి వాడు? ఎలా ఉంటాడు? ఎక్కడ ఉంటాడు? ఏ రూపలావణ్యాలను కలిగి ఉంటాడు... వంటి ప్రశ్నలు మదిని తొలిచేస్తుంటాయి. అదేవిధంగా తన రూపానికి కారణం ఏంటి? తన చుట్టూ ఉన్న దృశ్యమాన ప్రపంచం ఎప్పుడు, ఎందుకు, ఎలా ఏర్పడిందనేవి నిరంతరం సమాధానాలు వెతుక్కునే ప్రశ్నలు. మానవుడు తనను తాను ఉత్కృష్ట రూపంగా, తన జన్మ మహోన్నతమైనదిగా ఊహించుకుని భగవంతుడు కూడా అదే విధంగా ఉంటాడనుకుంటాడు. మరింత శక్తిమంతుడు కాబట్టి, అనేక శిరస్సులు, బాహువులతో ఊహించుకుంటాడు. కానీ, ఉపనిషత్తుల్లోని జ్ఞానం మానవునికి ఆ భగవంతుని రూపాన్ని అనంతమైనశక్తిగా, ఇంద్రియాలు గ్రహించలేని సూక్ష్మరూపమైననూ, తాను లేని ప్రాంతంగాని, పదార్థాలు గాని లేనట్టి హేతువుగానూ తేల్చేసాయి. వేలప్రశ్నలకు, సందేహాలకు నిత్య నూతన సమాధానాలు ఉపనిషత్తులలో చూడగలం. ఉపనిషత్తులలో ఆధ్యాత్మికతను వెతికితే ఆధ్యాత్మికత, విజ్ఞానశాస్త్రాన్ని వెతికితే విజ్ఞాన శాస్త్రం, భగవంతుని వెతికితే భగవంతుడు కనిపిస్తాడు. అంటే ఈ మూడింటినీ సమాధానపరిచే అద్భుత జ్ఞానం వాటిల్లో ఉందన్నమాట. ఆత్మనైనా, అనంతశక్తినైనా, భగవంతుడినైనా జ్ఞానాన్ని ఆధారం చేసుకునే తెలుసుకోవాలి. ఆ జ్ఞానం సాహిత్యరూపంలో నిండి ఉంది. అయితే, భగవంతుని అర్థం చేసుకోవడానికి ఇక్కడొక వెంట్రుకవాసి వ్యత్యాసం ఉంటుంది. కేవలజ్ఞానం ద్వారా ఆ అనంతశక్తిని తెలుసుకున్నా అది పూర్తిగా అవగతం కాదు. ఎప్పుడైతే ఆ జ్ఞానాన్ని ఆధారం చేసుకుని, నిరంతర చింతన ద్వారా అటువంటి జ్ఞానాన్ని అనుభవిస్తామో, ఎప్పడైతే అలాంటి జ్ఞానాన్ని మనసులో రమింపజేస్తామో అప్పుడే ఆ పరమాత్మను లేక అనంతశక్తిని లేదా భగవంతుని సందర్శించగలుగుతాము. అప్పుడే ‘అహం బ్రహ్మాస్మి’ స్థితి సాధ్యమవుతుంది. అంటే ఆత్మకు, సాధకునికి మధ్య అభేదం ఏర్పడుతుంది. ఆ సాధకునికి పంచేంద్రియాల ద్వారా ఏ విషయాన్ని గ్రహించినా ఆత్మానందమే కలుగుతుంది. ఎందుకంటే ఈ దృశ్యమాన ప్రపంచం లోపలా, బయటా అంతటా తాను ఆ ఆత్మనే సందర్శించగలుగుతాడు. తనలో కూడా ఆ ఆత్మని అనుభవించగలుగుతాడు. అదే బ్రహ్మానందం. అదే ఆధ్యాత్మిక మకరందం. దానిని మించిన తీపి దొరకదు, దానిని మించిన ఆనందం లభించదు. – రావుల గిరిధర్ -
సాయి సంస్కృత పండితుడా?
ఎవరికైనా కొంత పాండిత్యం పట్టుబడితే చాలు తమ పాండిత్యాన్ని ప్రదర్శించుకోవడం కోసం ఎవర్ని నలుగుర్లోనూ కించపరుద్దామా? అనే దృష్టితో ఎక్కువ మంది కనిపిస్తారు. కొందరైతే అప్పటికప్పుడు అవతలివారి తక్కువదనాన్ని గుర్తించి మనసులో ఒక అంచనాకి వచ్చి మౌనంగా ఉంటారు. ఇక కొందరైతే చాటుగా వేళాకోళం చేస్తూ కనిపిస్తారు. సాయిది మాత్రం మరొకర్ని తక్కువ చేసే లక్షణం కానే కాదు. అవతలి వ్యక్తికి తన స్థాయి స్పష్టంగా తనకే అర్థమయ్యేలా, నొప్పించకుండా అర్థమయ్యేలా చేయడం సాయి ప్రత్యేకత. ఉదాహరణతో గమనిద్దాం! దీని అర్థం ఇదేనా? నానా(నానాసాహెబ్ ఛాందోర్కర్) సాయికి మంచి భక్తుడు. నిరంతరం సాయి సేవలోనే ఉంటూ ఉండేవాడు. ఓ రోజున ఎప్పటిలాగానే సాయి పాదాలని చేతులతో ఒత్తుతూ తనకి బాగా ఇష్టమైన భగవద్గీత శ్లోకాలని లోలోపల కూనిరాగంలాగా తీస్తూ పాడుకోవడం మొదలుపెట్టాడు. జ్ఞానసంన్యాసయోగమని ఓ యోగముంది భగవద్గీతలో. దానిలోని 34వ శ్లోకాన్ని నానా చిన్నగొంతుతో పాడటం మొదలెట్టాడు ఓ పక్క సాయి పాదాలని ఒత్తుతూ. సాయి వెంటనే.. నానా! శ్లోకాన్ని చాలా బాగా పాడుతున్నావు గానీ, లోలోపల గొణుగుతూ చదవడమెందుకు? పైకే పాడు ఆ శ్లోకాన్ని నేనూ వింటాను అన్నాడు. నానాకి మరింత సంతోషమైంది. శ్రావ్యంగానూ కొంత పెద్ద గొంతుతోనూ స్పష్టంగా పాడి విన్పించాడు నానా. ఆ శ్లోకం ఇదే. త ద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా! ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానిన స్తత్వదర్శినః అనేది. అప్పుడు సాయి.. ‘‘నానా! ఈ శ్లోకానికి అర్థాన్ని ‘ప్రతి పదానికీ ఇది అర్థం’ అంటూ నాకు చెప్పవూ?’’ అని అడిగాడు.సాయికి సంస్కృతం రాదనీ, ఆ కారణంగా తానే దానికి అర్థాన్ని సాయి అంతటివానికి చెప్పే అవకాశాన్ని పొందగలిగాననీ నానా ఆనందపడుతూ అర్థాన్ని వివరించసాగాడు.‘ప్రణిపాతేన – సాష్టాంగ ప్రణామం చేతనూ, పరిప్రశ్నేన – ప్రశ్నించడం చేతనూ, సేవయా – సేవించడం చేతనూ, తే – నీకు, తత్త్వ దర్శినః – తత్త్వసాక్షాత్కారాన్ని పొందిన, జ్ఞానినః – జ్ఞానులు, జ్ఞానమ్ – జ్ఞానాన్ని, ఉపదేక్ష్యంతి – ఎంతో శ్రద్ధతో బోధిస్తూ నీకు అర్థమయ్యేలా చేస్తారు. తత్ – ఏ ప్రకారంగా ఆ జ్ఞానం బోధింపబడుతుందో దాన్ని, విద్ధి – శ్రద్ధతో గమనించి తెలుసుకో!ఓ గురువు నుంచి జ్ఞానాన్ని పొందాలంటే అది సాష్టాంగ ప్రణామం ద్వారా, ప్రశ్నించి తెలుసుకోవడం ద్వారా, ఆ గురువుకి సేవని చూస్తూ ఉండటం ద్వారా అది సాధ్యం. ఇంతకీ జ్ఞానాన్ని బోధించగల ఆ తత్త్వాన్ని తెలిసిన గురువు నుంచి పై పద్ధతుల్లో దేని ద్వారా ఆ జ్ఞానం లభిస్తుందో దాన్ని శ్రద్ధతో గమనించి తెలుసుకో! అనేది దానర్థం అని పరమ సంతృప్తిని పడుతూ చెప్పాడు నానా.ఇంతేకాదు. మళ్లీ సాయి ఈ చెప్పిందాన్ని మరోలా చేస్తూ చెప్పకుండానూ, అలాగే తన పాండిత్యపు లోతు సాయికి అర్థమయ్యేలాగానూ, పరమానందపడుతూ ఈ పై వ్యాఖ్యానానికి కొనసాగింపుగా ‘ఆనందగిరివ్యాఖ్యానం శంకరానంద శ్రీధర వ్యాఖ్యానం, శంకర భాష్యం, మధుసూదన వ్యాఖ్యా.. నీలకంఠ వ్యాఖ్యా.... కూడా ఈ విషయాన్నే చెప్పాయి’ అని నానా చెప్పి తన మాటలకి సాయి ప్రతిస్పందన ఏమిటో తెలుసుకునే ఉద్దేశంతో ఓ పక్క ధైర్యం, ఆత్మసంతృప్తితోనూ.. మరో పక్క అదో తీరు భయం, అధైర్యంతోనూ.. సాయి ముఖంలోకే చూస్తూ ఉండిపోయాడు నానా.ఇతర భక్తులంతా నానా సంస్కృత పండితుడైన కారణంగానూ, సాయికి సంస్కృత పాండిత్యమున్నట్లు ఏనాడూ విన్న– కన్నవారు లేని కారణంగానూ, సాయి ఏమంటాడోనని అలా చూస్తూ ఉండిపోయారు అటు నానానీ ఇటు సాయినీ. సాయి ప్రారంభించాడు. నానా! పై శ్లోకంలోని మూడవ పాదాన్ని ఒక్కసారి చూడు. ‘ఉపదేక్ష్యంతి తే జ్ఞానమ్’ అని కదా నువ్వు చదివింది. దానికి అర్థాన్ని వివరించినది కూడాను. సంస్కృత వ్యాకరణం ప్రకారం దీన్ని ‘తే+అజ్ఞానమ్’ అని కూడా విడదీయవచ్చు. (ఏజః పదాం తాదతి అనే సూత్రం ప్రకారం ఇది శాస్త్రం అంగీకరించిన సత్యమే) ఆ పద్ధతిలో మరి జ్ఞానులంతా అజ్ఞానాన్ని ఉపదేశిస్తారని అన్నామనుకో! ‘ఇలా చెప్పడం తప్పు!’ అని ఎలా అనగలవు? నేనేదో నిన్ను తగ్గించడానికో, ఏదో మెలిక పెట్టి అవమానించడానికో నీతో అంటున్న మాట కాదు. ఇలా ఎవరైనా నిన్నడిగితే ఏం సమాధానం చెప్పగలుగుతావు? ఇది మొదటి సందేహం. రెండవది. కృష్ణుడు కదా గీతని ఉపదేశించాడు! ఆయన ఏమంటున్నాడని ఈ శ్లోకం చెప్తోంది? ‘తత్త్వాన్ని దర్శించిన జ్ఞానులు నీకు జ్ఞానం అంటే ఏమిటో ఆ విశేషాలని వివరిస్తారు’ అని కదా! అంటే మరి ఉపదేశిస్తూన్న కృష్ణుడు తత్త్వదర్శి కాడా? జ్ఞాని కాడా? ఆయనే మరి తత్త్వదర్శులయిన జ్ఞానుల దగ్గరికి వెళ్లాలని చెప్తూన్నవాడు అవుతుంటే ఇక ఈయన ఎందుకు గీతని అర్జునునికి బోధించాలి? పైగా ‘అన్నీ తెలిసినవాడ్ని నేనే’ (వేదాహం సమతీతాని..) అని ఆయనకాయనే భగవద్గీతలో చెప్పుకున్నాడు కదా! మరి ఆయనే ఫలానివాళ్లు తత్త్వదర్శులు, జ్ఞానులు అని చెప్పకూడదా?మరోమాట కూడా! ఆయనే భగవద్గీత చేస్తూ (భగవంతుడ్ని, అతని స్వరూపాన్ని గూర్చిన విశేషాలని గానం చేస్తూ) జ్ఞానమంటే ఏమిటో, విజ్ఞానమంటే ఏమిటో, ఏం తెలుసుకుంటే ఇక తెలియవలసిందంటూ ఏదీ ఉండదో.. దాన్ని తెలియజేస్తున్నాను (జ్ఞానం తేహం సవిజ్ఞానమ్.. అవశిష్వతే) అన్నాడో దీన్నంతటినీ ఆలోచిస్తూంటే తికమక అయిపోతోంది.అందరూ నోరెళ్లబెట్టి చూస్తుంటే, నానాకి నోటమాట రాకపోతూంటే సాయి చెప్పుకుపోతున్నాడు.నానా! ఇక చివరి అనుమానాన్ని విను. సాష్టాంగప్రణామం చేస్తే జ్ఞానం ఉపదేశింపబడుతుందా? మామూలు తేలికపదాన్ని వాడకుండా నమస్కారమనే అర్థంలో ‘ప్రణిపాతం’ అనేంత గట్టిపదాన్ని వాడాల్సి వచ్చిందట? అలాగే ప్రశ్నిస్తూ ఉంటే జ్ఞానం ఉపదేశింపబడుతుందా? అయినా ప్రశ్నించడం అనకుండా పరిప్రశ్న చేయడమనేంత గట్టిపదాన్ని ఎందుకు వాడాల్సి వచ్చింది? మరొక్కమాట... సేవ చేస్తే జ్ఞానాన్ని ఉపదేశిస్తారా? ఇదేంమాట? జ్ఞానమనేది అంత తేలికైనదా? అని ప్రశ్నార్థకంగా నానాని చూశాడు సాయి. మల్లయుద్ధంలో చిత్తుచిత్తుగా ఓడిపోయినవానిలా నానా అక్షరం కూడా మాట్లాడలేక, సాయిపాదాలు రెంటినీ గట్టిగా పట్టుకుని ‘సాయిదేవా! నువ్వు అనన్యసామాన్యుడివి. మహా ప్రతిభా సంపన్నుడివి. ఇన్ని మార్లు భగవద్గీతలోని ఈ అధ్యాయాన్ని చదివినా సమాధానాలు ఎలాగూ తెలియనే తెలియవు గానీ, కనీసం ఇలాంటి ప్రశ్నలు ఈ శ్లోకం చదివితే వస్తాయి, వచ్చేందుకు అవకాశముందనే విషయం కూడా తెలియని అజ్ఞానంతో ఉన్నాను. దయచేసి సమాధానాల్ని చెప్పి నాకు జ్ఞానబోధ చేయి తండ్రీ!’ అన్నాడు నానా.సాయి ప్రారంభించాడు. ‘‘ఏం లేదు నానా? ఆందోళన పడకు! జ్ఞానాన్ని సంపాదించాలంటే జ్ఞానపిపాసి అయిన వ్యక్తి సద్గురువుని ఏ తీరుగా ఆశ్రయించాలో చెప్పే శ్లోకం ఇది.ప్రణిపాతమనే మాటకి సాష్టాంగనమస్కారమనేది అర్థమే కావచ్చు గానీ ఒట్టిగా సాష్టాంగ ప్రణామాలవల్ల జ్ఞానం ఉపదేశింపబడదు. ప్రణిపాతమంటే ‘సర్వస్య శరణాగతి’ అని అర్థం. ఏనుగుకాస్తా చెరువులో దిగింది. మొసలి దాని ముందు రెండుపాదాలనీ పట్టింది. మొసలి నీటిలోనికీ, ఏనుగు ఒడ్డువైపుకీ లాగుకుంటూ ఒకర్ని మరొకరు గెలవాలని ప్రయత్నించారు. సాధ్యపడలేదు. అప్పుడు ఏనుగు – నీవే తప్ప ఇత్ః పరం బెరుగ..! ఓ! దైవమా! నన్ను రక్షింప సమర్థుడివి నువ్వే సుమా! అంటూ తన శరీర మనః ప్రాణ బుద్ధులతో శరణుకోరి ప్రార్థించింది. అదుగో అదీ ‘సర్వస్య శరణాగతిః’ అంటే. ద్రౌపది నిండు కౌరవసభలో వస్త్రాపహరణం జరగబోతున్న తరుణంలో సర్వస్యశరణాగతిధర్మంతో కృష్ణుడ్ని ప్రార్థించింది. ఇదే విధంగా సుగ్రీవుడు కూడా వాలితో యుద్ధానికి తలపడి పూర్తిగా ఓడిపోయి రాముణ్ని శరణువేడాడు. ఆ రాముడు వాలిని వధించాడంటే దానికి కారణం సుగ్రీవుని బలాధిక్యం కాదు. సుగ్రీవుడు చేసిన శరణాగతి ధర్మం మాత్రమే. కాబట్టి ప్రణిపాతమంటే.. శరణుకోరుతూ, తనని తాను రక్షించే వ్యక్తికి సమర్పించుకోవడమని అర్థమన్నమాట. ఇక ప్రశ్నించడమనే మాటకి.. ఎదుటివానికి విసుగొచ్చేంత స్థాయిలో ప్రశ్నించడమని అర్థం కాదు. ప్రశ్న అనకుండా ‘పరిప్రశ్న’ అనడమంటే వేదాంతానికి సంబంధించిన ప్రశ్న వేయడమని అర్థమన్నమాట! అంతే కాదు. కొందరు – ఎదుటివానికి ఎంత తెలుసు? అనే దుర్బుద్ధితో, అతనికి తెలిసిన దాన్ని కాదనిపించాలనే వంకర బుద్ధితో, ఏమేమో మోసంతో నిండిన ప్రమాణాలని చూపించి, నిజం కానిదానిని నమ్మింపజేసి, వారితో కూడిన సభలో వాళ్లని బహిరంగంగా ఓడించి, తాము గొప్పవారనిపించుకోవడం.. వంటి ఇలాంటివి సరికాదన్నమాట. శ్రద్ధతో, భక్తితో కేవలం విషయాన్ని తెలుసుకోవాలనే ఆసక్తితో మాత్రమే ప్రశ్నించడం, అందునా లౌకికమైన ధోరణిలో కాకుండా వేదాంతానికి సంబంధించి ప్రశ్నించడమే ‘పరిప్రశ్న’. మూడవ పదం ‘సేవ’ అనే మాటకి అర్థం గురువుగారికి పాదాలొత్తడం, దూరం నుంచి నూతి నీళ్లు తోడి తేవడం, ఇంకా మూఢభక్తితో ఆయనకి ఒళ్లు తోమడం.. వంటివన్నీ జ్ఞానాన్ని పొందే మార్గాలు కానే కావు.9 విధాల భక్తి మార్గాలున్నాయి. స్నేహపూర్వకంగా ఉండే భక్తి సఖ్యభక్తి. దీనికి ఉదాహరణ అర్జునుడు. తన రథానికి సారథిగా ఉంచుకోవడమే కాక భక్తితో స్నేహాన్ని శ్రుతిమించకుండా చేశాడు. పరీక్షిన్మహారాజుకి పాము కాటు శాపం రాగానే శుకమహర్షి దగ్గర అధ్యాత్మ విద్యని నేర్చుకోవడం కోసం మోక్షతత్వాన్ని గురించి విన్నాడు. ఇది శ్రవణభక్తికి ఉదాహరణ. నిస్వార్థంగా దాస్యాన్ని చేసి రామునికి, సీతమ్మ జాడని చెప్పడమే కాక, రాముని మీద ప్రయోగించదలిచి ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని దాచి ఉంచుకుంటే దాన్ని తనమీదే ప్రయోగించేలా చేసుకున్న ఆంజనేయుడు దాస్య భక్తికి ఉదాహరణ. శరీరంలోని పంచజ్ఞానేంద్రియాలతోనూ సంపూర్ణభక్తితో వందనం చేసి తరించిన అక్రూరుడు (భాగవతంలో) వందనభక్తికి ఉదాహరణ. సంవత్సరకాలం పాటు రాజ్యాన్ని విడిచి, భార్యతో కలిసి, ఓ మధువనంలో ఉంటూ రాజసౌఖ్యాలనీ, లాంఛనాలనీ విడిచి కృష్ణుడినే సేవించిన అంబరీషుడు అర్చన భక్తికి ఉదాహరణ. తన హృదయపూర్వకమైన సేవతో ఒక్క తులసిదళానికే తన భర్త కృష్ణుడు తూగిపోయేలా చేసుకుని విజేత్రి(గెలిచినది) అయిన రుక్మిణి సేవాభక్తికి ఉదాహరణ. విదురుడు, భీష్ముడూ మొదలైన పెద్దలు కృష్ణుడ్ని ఏనాడూ వ్యక్తిగా కాక ఎల్లప్పుడూ దైవంగానే ఆరాధిస్తూ తమ అంతఃకరణం నిండుగా దైవంగానే అనుకున్నారు. ఇది ఆత్మలో ఎరుక అంటే ఆత్మనివేదన భక్తికి ఉదాహరణ. నిరంతరం సంకీర్తన చేస్తూ తన భక్తిని చాటుకుని, విజయాన్ని సాధించిన నారదుడు సంకీర్తన భక్తికి ఉదాహరణ. తనకి ప్రాణాపాయం లేనే లేదనే ధైర్యంతో తన తండ్రి చంపదలచి, ప్రయత్నాలు చేస్తున్నా చలించని ప్రహ్లాదుడు చింతనమనే 9 వ భక్తికి ఉదాహరణ. అలా ఈ తీరు ఏదో ఒక భక్తిమార్గంలో సేవిస్తూ ఉండడం సేవ కిందికొస్తుంది తప్ప గురువుకి భౌతికంగా చేసే సేవ.. సేవాభక్తి కిందికి రాదు.సాయి ఇలా చెప్పేస్తూ ఉంటే.. సాయి ఇంతటి లోతు పాండిత్యాన్ని ఎప్పుడు, ఎలా, ఎక్కడ, ఎవరి నుంచి గ్రహించాడు? అనే భావంతో అందరూ నిశ్చేష్టులై వింటూండిపోయారు. కేవలం అది ఆయన చేసిన మంత్రమననశక్తి మాత్రమే అనేది స్పష్టంగా అర్థం కాసాగింది అందరికీ. అప్పుడు సాయి మాట్లాడుతూ.. ఇంకొక్క విషయాన్ని చెప్పి ముగిస్తానంటూ జ్ఞానం గురించి చెప్పాడిలా.ఏ గురువూ ఏ శిష్యునికీ జ్ఞానాన్ని గురించి చెప్పడు. చెప్పలేడు కూడా. పంచదార అనేది తీపిగా ఉంటుందని చెప్తే తెలియదు అలా వినడం ద్వారా. ఏవేవో గ్రంథాల్లో చదివితే అర్థమయ్యే విషయం కాదు. స్వయంగా దాన్ని తిన్నప్పుడే ఆ విషయం ఎవరూ చెప్పనంతగా, చెప్పలేనంతగా అర్థమవుతుంది. దీన్నే ఆది శంకరుల వారు అనుభూతి అన్నారు. ఏది ప్రత్యక్షంగా తెలియదో, గ్రంథాల ద్వారా అనుభవానికి రాదో, రాలేదో, వచ్చే వీలులేనిదో, ప్రత్యక్షం, పరోక్షం అనే రెండింటి ద్వారా కాక స్వయంగా అనుభవంలో మాత్రమే తెలిసేదో అదే అపరోక్ష అనుభూతి అవుతుందన్నమాట.సాయి ఇంతలోతుగా చెప్తుంటే కొందరికి ఈ వేదాంతం కొంతస్థాయిలోనే అర్థమవుతున్నా.. ఓ మహమ్మదీయునికి ఇంతటి వైదిక సంస్కారమా? అనుకున్నారు. పూర్తిగా తెలియకున్నా వినాలనే ఆసక్తి పెరుగుతూ వింటూనే ఉండిపోయారు.సాయి చెప్పసాగాడు. భగవద్గీతలో కృష్ణుడన్నాడు ‘అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః’ అని.అందరికీ ఉండేది అజ్ఞానమే. దాన్ని తొలగిస్తే చాలు జ్ఞానమంటే ఏమిటో తెలుస్తుంది.ఉదాహరణకి సూర్యుడ్ని, చంద్రుడ్ని రాహుకేతుగ్రహాలు గ్రహిస్తాయి. దాన్నే గ్రహణం తొలిగాక పూర్తిగా వారి ప్రకాశం మనకి సొంతమవుతుంది. గురువనే వారెవరు ఉన్నారో ఆయన మనకున్న ఆ అజ్ఞానాన్ని తొలగించడమనే పనిని మాత్రమే చేస్తాడు. అద్దం నిండా దుమ్ము, ధూళి, నూనె మరకలు వంటివి పడితే మనరూపం కన్పించకుండా పోతుంటే, దాన్ని ఎలా శుభ్రపరచాలో అలా శుభ్రం చేసిన రోజున మన రూపం ప్రతిబింబితమవుతుంది. ఆ దుమ్ము, ధూళి, నూనె మరకలు వంటివి అజ్ఞానంతో సమానం. దాన్ని తుడిచి శుభ్రపరిచినవాడు గురువు. అద్దానికున్న ప్రతిబింబించగలిగే గుణం జ్ఞానలక్షణం. ఇలా శుభ్ర పరుచుకోవాలనే విధానాన్ని తెలిపిన గురువు ద్వారా ఈ విషయాన్ని గ్రహించడం అనుభవంలోనికి తెచ్చుకుని, నిత్యం శుభ్రపరుచుకుంటూ ఉండటం ‘జ్ఞానం’. ‘తాడుని చూసి పామేమో అనుకుని భయపడతాం. తాడు గురించిన, పాముని గురించిన జ్ఞానం కలిగిన గురువు మనలో పాముని గురించిన అజ్ఞానపు ఆలోచనని తొలగించి తాడే సుమా! అనే జ్ఞానాన్ని కలిగిస్తే అతను గురువూ – అది జ్ఞానస్వరూపమూనూ. కాబట్టి మట్టిపట్టిన బంగారాన్ని ఎలా నిప్పులో వేసి కాల్చి నిజమైన మేలిమి బంగారపు ముద్దని పైకి తెచ్చి చూపిస్తారో అలా గురువు ఎప్పుడూ తన వద్దకొచ్చిన శిష్యుల అజ్ఞానాన్ని తొలగించి, జ్ఞానదర్శనాన్ని చేయించుతాడే తప్ప తాను కొత్తగా జ్ఞానమంటూ మరి దేన్నో బోధించడు. బోధించలేడు.’‘జ్ఞానమనేది ఎప్పుడూ ఉన్నదే. ఎక్కడా ఉండేదే. దాని మీద ఉన్న – మనకి అర్థం కాకుండా ఉన్న ఆ అడ్డునీ, అవరోధాన్నీ, ముసుగునీ తొలగిస్తే చాలు. జ్ఞానమనేది ఎవరికి వారికే తెలుస్తుంది. అర్థమవుతుంది. అనుభవంలో కన్పిస్తుంది అని ఈ శ్లోకం అర్థం’ అని ముగించాడు సాయి.నానాతో పాటు వింటున్న ఆ భక్తులంతా సాయి పాదాలని కౌగిలించుకున్నట్లుగా ఒకరి వెంట ఒకరు చుట్టేశారు. ఇప్పటివరకూ చూసిన సాయిని మరింత స్పష్టంగా, లోతుగా, అవగాహనతో చూశారు. సాయికున్న అత్యద్భుత యోగశక్తి, తపశ్శక్తి, మంత్రమననశక్తి కారణంగా సంస్కృత పండితుడైన, వ్యాఖ్యాన గ్రంథాలని ఔపోశనపట్టిన వాడైన నానాకి కూడా అర్థం కాలేదని తనకి తానే అంగీకరించేలా వ్యాఖ్యానించాడు సాయి అనుకున్నారు నానాతో సహా.నేడు మనం కూడా గ్రహించుకోవల్సింది ఒక్కటే. సాయికి ఇష్టమైన నైవేద్యాలు, సాయికి ఇష్టమైన ప్రదేశాలు, సాయికి ప్రీతికరమైన ఊదీ(విభూతి)ని ధరించడాలు మాత్రమే చేస్తూ.. సాయికి దగ్గరివాళ్లం అయిపోయామనుకోకూడదు. సాయిని గురించిన ఈ తత్త్వాన్ని తెలిపే చరిత్రలని చదివి, దాన్ని హృదయంలో ఉంచుకోగలగాలి. అప్పుడే సాయి మనకి అర్థమవుతాడు. మనకి అర్థం ఎక్కడైనా కాలేదన్నచోట తానే వచ్చి, మనకి అర్థమయ్యేలా తనని తాను వివరించుకుంటాడు. అందుచేత సాయి చేసిన ప్రతిపనీ, ప్రతిమాటా, ప్రతి సంఘటనా వెనుక ఎంతో అర్థం ఉంటుందన్నమాటే!‘మేకని కోసి చంపాల్సిందే!’ అని సాయి ఓ భక్తునికి ఆజ్ఞాపించాడు ఒకసారి. ఇదేమిటి? జీవహింసని చేయవలసిందని దైవసమానుడైన సాయి ఆజ్ఞాపించాడా? అందునా ఓ బ్రాహ్మణుడ్ని..? ఏమిటి అంతరార్థం? తెలుసుకుందాం అజ్ఞానాన్ని తొలగించుకుని..! – సశేషం -
నీలోకి నీవు తొంగి చూసుకో!
వివేకజ్ఞానం కలిగిన వారెప్పుడూ దీర్ఘకాలిక సుఖానికై ప్రయత్నిస్తారు. భగవంతుడిని నమ్మేవారు వారు ఎప్పుడూ కూడా దీర్ఘకాలిక సుఖాన్ని లెక్కించక స్వర్గలోకం పొందబోయే సుఖం కోసమే ప్రయత్నిస్తారు. పూర్వం మహాభారత యుద్ధ సందర్భంలో అర్జునుడు యుద్ధం పాపానికీ, దుఃఖానికీ కారణమైనని భావించి, ఆయుధాలను పక్కన పడవేసి, నిర్వేదంలో కూరుకుపోయి ఉన్నప్పుడ శ్రీ కృష్ణ పరమాత్మ ధర్మయుద్ధం క్షత్రియులకు పూర్వపుణ్యం వల్లనే దొరుకుతుందని, అది రాబోయే మహాపుణ్యానికి సాధనా మార్గమని, అదే మహాసుఖానికీ, ఆనందానికీ కారణమని తెలిపాడు. ఇక్కడ కృష్ణపరమాత్మ అర్జునుడిని యుద్ధంచేయమని బలవంతం చేయలేదు, కేవలం యుద్ధం ఎందుకు చేయాలో చెప్పాడంతే! దాంతో అర్జునుడికి దుఃఖనివృత్తి జరిగి, యుద్ధం వైపు మనసు మళ్లింది. అంటే దుఃఖాన్ని తొలగించుకోవడం వల్ల ఆనందం కలుగుతుందన్నమాట. లోకంలో ప్రజలు కోరే ధనం, ధాన్యం, ఇల్లు–వాకిలి, విద్య, అధికారం, కీర్తి, మర్యాద, పుణ్యం, బంధువర్గం మొదలైనవన్నీ తమ తమ సుఖానికి లేదా ఆనందాన్ని పొందడం కోసమేనని భావిస్తారు. ఎందుకంటే, ఆనందాన్ని కలిగించేది సుఖం మాత్రమే, సుఖాన్ని చేకూర్చేది ఆనందం మాత్రమే. వేదాలు, ఉపనిషత్తులూ ఏమి చెబుతాయంటే, అవివేకులైన వారు మాత్రమే తాత్కాలిక ఆనందాన్ని, సుఖాన్ని కోరుకుంటారు. వివేకజ్ఞానం కలిగిన వారెప్పుడూ దీర్ఘకాలిక సుఖానికై ప్రయత్నిస్తారు. భగవంతుడిని నమ్మేవారు వారు ఎప్పుడూ కూడా దీర్ఘకాలిక సుఖాన్ని లెక్కించక స్వర్గలోకం పొందబోయే సుఖం కోసమే ప్రయత్నిస్తారు. గట్టిగా ఆలోచించి చూస్తే, సుఖం లేదా ఆనందం అన్నది శరీరంలోనిదే కానీ శరీరానికి అవతల ఉన్నది కాదు. సుఖం మాత్రమే తమకు అనుకూలమైనదని భావించినప్పుడు, దానికి ప్రతికూలమైనవన్నీ దుఃఖాలే అవుతాయి. కాబట్టి దుఃఖ పరిహారాన్నీ, ఈ లోకపు అల్పసుఖాన్నీ, శాశ్వత మోక్షసుఖాన్నీ కోరేవారు, దైవానుగ్రహం కోసం కృషి చేయాలనీ, తద్వారానే జీవుల దుఃఖ నివృత్తి అవుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. మరి భగవంతుణ్ణి నమ్మని వాళ్ల సంగతేమిటనే ప్రశ్న తలెత్తవచ్చు. దానికి యోగశాస్త్ర పితామహుడు పతంజలి ముని ఏమి చెబుతాడంటే... ప్రతిరోజూ రాత్రి పడుకునేముందు ఆ రోజు చేసిన పనులన్నింటినీ నెమరు వేసుకో. ఆ తర్వాత నీలోకి నీవు తొంగి చూసుకో. నువ్వు ఆలోచించిన కొద్దీ నీ ఆలోచనా పరిధి పెరుగుతుంది. దుఃఖ నివృత్తి జరుగుతుంది. ఆనందం కలుగుతుంది. అలా తనలోకి తాను తరచి చూసుకోవడమే ధ్యానం. -
దేవదేవుడయినా గురువుకి శిష్యుడే!
కృష్ణ భగవానుడిది పరిపూర్ణావతారం. ఆయనే జగద్గురువు. కానీ ఈ లోకంలోకి వచ్చిన తరువాత గురువయిన సాందీపని మహర్షికి ఎంత సేవ చేసాడో! ఆ సేవకుమెచ్చి గురువులు కూడా అలాగే అనుగ్రహించేసారు. ఒకరోజు సమిధలు తేవడానికి అరణ్యానికి వెళ్ళారు శ్రీ కృష్ణుడు, కుచేలుడు. కొద్దిసేపటికి మబ్బులు పట్టి హోరున వాన, చీకటి.. అరణ్యంలో దారితప్పి తెల్లవారేసరికి తిరిగొచ్చారు. ఈలోగా వారు రాలేదన్న బెంగతో సాందీపని మహర్షి వాళ్ళ పేర్లుపెట్టి పెద్దగా అరుస్తూ వెతికాడు ఆ రాత్రంతా. వారు ఎదురు పడగానే గట్టిగా కావలించుకుని ‘‘ఓ కృష్ణా! ఓ కుచేలా! ఇకపై మీకు విశేషమైన ఐశ్వర్యం, జ్ఞానంతోపాటూ బంధుమిత్ర బలగాలు అన్నీ విశేషంగా సమకూరుతాయి’’ అని ఆశీర్వదించేసాడు ఆ ఆనందంలో. గురువు ప్రేమైక హృదయుడు. దాచుకోవడం గురువుకి తెలియదు. తాను కష్టపడి నేర్చుకున్నది మొత్తం ఇచ్చేస్తాడు. అంతేకాదు, గురువు వినయ సంపన్నుడు. ఉపనిషత్తులో ఒక కథ ఉంది. సుకేశుడని ఒక మహర్షి. ఆయన దగ్గరకు ఒక రాకుమారుడు వెళ్ళాడు. ‘‘చంద్రకళలు, షోడశకళలు ఏవి? వాటి విశేషం గురించి తెలుసుకోవాలని ఉంది, చెప్పండి’’ అని అడిగాడు. ‘‘అయ్యో నాకు తెలియదే, మరొకర్ని అడగండి’’ అన్నాడు. చెప్పలేక పోయినవాడు సుకేశుడనే గురువయితే, అడిగిన రాకుమారుడు సిగ్గుపడి తలొంచుకుని వెళ్ళిపోయాడు. ఇదేమిటి? అంటే...ఆయన ఎన్నో శాస్త్రాలు చదువుకున్నాడు, కష్టపడి ఎంతో మంది శిష్యులకు చెబుతున్నాడు. ఆయనకి తెలియని ఏదో ఒక చిన్న విషయం ఉంటే నేనది అడిగి ఆ మహానుభావుడినోటితో తెలియదనిపించానే, ఇటువంటి ప్రశ్న అడిగి ఆయన్ని ఇబ్బందిపెట్టానే...అని క్షోభిస్తూ వెళ్ళాడు యోగ్యుడైన ఆ శిష్యుడు. శిష్యుడు గురువుగారి కీర్తిప్రతిష్ఠలు నిలబెట్టడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూంటాడు. పెద్దవాళ్ళయిన తరువాత కుచేలుడు, శ్రీకృష్ణుడు ఒకసారి కలుసుకున్నప్పుడు పాతజ్ఞాపకాలు నెమరువేసుకునే క్రమంలో కృష్ణుడు మొదటగా ప్రస్తావించిన అంశం – ‘‘ఓయ్, కుచేలా! నీకు గుర్తున్నారు కదా మనకు పాఠం చెప్పిన ఆ గురువుగారంటూ... మన సాందీపని గురువుగారు ఎంత గొప్పవాడయ్యా, అజ్ఞానమన్న చీకటికి దీపమయ్యా ఆయన. ఎంత మహానుభావుడో.. అవ్యయమైన బ్రహ్మాన్ని లోపల తాను అనుభవించి ఎప్పుడూ సత్కర్మలు చేస్తూ పండిత శ్రేష్ఠులచేత ప్రశంసలనందుకొన్నవాడయ్యా... అటువంటి గురువు లభించడం.. అక్కడ మనం చదువుకోవడం ఎంత అదృష్టమయ్యా..’’ అంటాడు. రుక్మిణీ కళ్యాణంలో... అగ్నిద్యోతనుడు రుక్మిణికి గురువు, కాబట్టి కృష్ణుడికీ గురువే. ఆయనను రమ్మని పిలుస్తూ ’ఆలస్యం చేస్తావేం..ఆవిడ రాసిన పత్రిక చదివావుగా, లే, లేచిరా, పెళ్ళవుతుందా, అని సందేహిస్తున్నావా. తప్పకుండా అవుతుంది. ఉపాధ్యాయులం, గురువులమయిన మేం ఆశీర్వదిస్తున్నాం. కళ్యాణమస్తు.’’ గురుభక్తి ఎలా ఉండాలో చిన్న పద్యాల్లో పోతన గారు అద్భుతంగా ఆవిష్కరించేసారు. శిష్యుడి ప్రథమ కర్తవ్యం–గురువుగారి గౌరవాన్ని నిలబెట్టడం. గురువు పేరెత్తితే చాలు పరబ్రహ్మం, పరిపూర్ణావతారం కూడా తలవంచేసింది. అంతే. అదీ ఆచార్యదేవోభవ అంటే. - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
భక్తి కన్నా జ్ఞానం మిన్న
ఒకసారి షైతాన్ ఒక సమావేశం ఏర్పాటు చేశాడు. వివిధ కేటగిరీలకు చెందిన అనేకమంది శిష్యులు ఆ సమావేశంలో పాల్గొన్నారు. రోజువారీ కార్యకలాపాలకు సంబంధించిన నివేదికలు శిష్యుల నుండి స్వీకరిస్తున్నాడు. ఒక శిష్యుడు తన కార్యకలాపాలకు సంబంధించిన నివేదికను వినిపిస్తూ,‘తాను ఈరోజు ఒక మనిషితో దొంగతనం చేయించాను.’ అన్నాడు. షైతాన్ మంచిపని చేశావు అని వాణ్ణి ప్రశంసించాడు. మరొకడు,’ తాను ఈ రోజు ఒక వ్యక్తిని ప్రార్థనకు వెళ్ళకుండా ఆపాను.’అన్నాడు. దానికి నాయకుడు’ మంచిపని చేశావు.’ అన్నాడు. మరొకడు లేచి, తానీరోజు ఓ కుటుంబంలో కలతలు సృష్టించాను అని వివరించాడు. దానిక్కూడా షైతాన్ శహభాష్ అని మెచ్చుకున్నాడు. . మరొకడు తన నివేదికను సమర్పిస్తూ, ‘తాను భార్యాభర్తల మధ్య గొడవలు పెట్టాను.’ అన్నాడు.‘భళా మంచిపని చేశావు’అన్నాడు. తాను ఒక మనిషిని చెడువైపునకు ఆకర్షించి అతడితో ఆ చెడుపని చేయించాను’ అన్నాడు మరొకడు. ‘‘నువ్వుకూడా మంచిపనే చేశావు’’ అన్నాడు షైతాన్ .ఈ విధంగా షైతాన్ శిష్యులు తాము చేసిన ఘనకార్యాలను ఒక్కొక్కరు వరుసగా ఏకరువు పెట్టారు. చివరిలో ఒక చిన్న షైతాన్ లేచి, ‘‘నాయకా..! నేను వీళ్ళందరి లాగా పెద్దపెద్ద దుష్కార్యాలు, పాపాలేవీ ఎవరితోనూ చేయించలేకపోయాను. కాని ఒక చిన్న పని మాత్రమే చేయగలిగాను.’’ అన్నాడు కాస్త చిన్నబుచ్చుకుంటూ.. ‘‘ఏమిటీ పెద్దపెద్ద పనులేమీ చెయ్యలేకపోయావా? చిన్నపని మాత్రమే చేశావా? చెప్పు ఆ చేసిన ఘనకార్యమేమిటో?’’ అన్నాడు షైతాన్.‘‘ఒక బాలుడు పాఠశాలకు వెళుతుంటే మాయమాటలు చెప్పి బడికిపోకుండా చేశాను.’’ అన్నాడు‘‘శభాష్ శిష్యా.. శభాష్ .. నువ్వు చేసిన పని చిన్నపని కాదు. అసలు పని చేసిందే నువ్వు. అసలు పని అదే. వీళ్ళందరూ చేసింది ఒకెత్తయితే నువ్వొక్కడివి చేసింది మరోఎత్తు. మనిషిని విద్యకు దూరం చేయడం అన్నిటికన్నా గొప్పపని. మనిషి విద్యావిజ్ఞానాలకు దూరమైతే, మనపని సులువవుతుంది. అంతకన్నా ఏం కావాలి? జ్ఞానానికి దూరమైతే మిగిలేది అజ్ఞానమే. ఇక తనంత తానే మనిషి పాపాల్లో, దుర్మార్గాల్లో కూరుకుపోతాడు. అంతకన్నా మనకు కావలసిందేముంది?’అంటూ షైతాన్ తన శిష్యుణ్ణి గాఢంగా ఆలింగనం చేసుకున్నాడు.నిజానికి, వేయిమంది దైవభక్తుల్ని బురిడీ కొట్టించడం కన్నా ఒక్క ఆలిమ్ను, ఒక్కజ్ఞానిని, పండితుణ్ణి దారితప్పించడం షైతాన్కు కష్టమైన పని. అందుకే షైతాన్ ఒక ధార్మిక విద్యార్థిని దారి తప్పించడానికి తీవ్రంగా శ్రమిస్తాడు. ధ్యానం చేయకుండా, జిక్ర్ చేయకుండా, నమాజులు చేయకుండా, సత్కార్యాలు ఆచరించకుండా, ఎలాంటి మంచిపనులూ చేయకుండా, దుష్కార్యాల్లో, దుర్మార్గాల్లో, పాపాల్లో మానవుడు కూరుకుపోయేలా చెయ్యడానికి షైతాన్ ఎంతగా శ్రమిస్తాడో, అంతకంటే అనేక రెట్లు ఎక్కువగా మనుషుల్ని విద్యా విజ్ఞానాలకు దూరం చెయ్యడానికి అవిశ్రాంతంగా, అలుపెరుగని పోరాటం చేస్తాడు. కుట్రలు, కుతంత్రాలు, మాయోపాయాలు, మోసాలకు పాల్పడతాడు.షైతాన్ మానవరూపంలో వచ్చి కల్లబొల్లి కబుర్లు చెప్పి బురిడీ కొట్టిస్తాడు. అందుకే జిత్తులమారి షైతాన్ మాయల పట్ల అప్రమత్తంగా ఉండాలని ముహమ్మద్ ప్రవక్త(స)హెచ్చరించారు. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
జ్ఞానం అందరికీ సమానమే
ఆచార్య మాడభూషి శ్రీధర్ ఆ కోలాహలం గందరగోళం విన్న గోష్టీపూర్ణుల వారు ఏం జరిగిందని అడిగారు. శిష్యులు జరిగింది వివరించారు. ఆశ్చర్యపోయారాముని. తనకు మాట ఇచ్చిన మరుక్షణంలో భంగం చేయడమా? ఈ వ్యక్తినా నేను శిష్యుడని నమ్మింది? ఈ రామానుజుడి గురించేనా శ్రీరంగనాథ పెరుమాళ్, కాంచీ పూర్ణులు చెప్పింది? నేనే అపరాధం చేశానా? ...ఏం జరిగింది? రంగ రంగా ఎంత పని జరిగింది? రామానుజుడిని పిలిపించమన్నారు. ... తమిళనాడులోని మదురైకి 70 కి.మీదూరంలో ఉన్న సుప్రసిద్ధ ఆలయగ్రామం. హిరణ్యకశిపుడు లోక కంటకుడై అందరినీ బాధిస్తుంటే హిరణ్య కశిపుడు రాలేని చోటేది అని బ్రహ్మ రుద్ర ఇంద్రాది దేవతలు, సప్తరుషులు ఆలోచించారు. అది తిరుగోష్ఠియూర్ అని తెలిసి అక్కడ సమావేశమై రాక్షసుడి అంతానికి మార్గాలను వెదికారు. గోష్ఠి అంటే సమావేశం. దేవతలు సమావేశమైన ఊరు కనుక ఈ గ్రామానికి తిరుకోష్టియూర్ అనే పేరు వచ్చింది. ఇక్కడ సౌమ్య నారాయణుని కోవెల ఉంది. 108 వైష్ణవ దివ్యదేశాలలో ఇది కీలకమైనది. రామానుజులతో ఈ ఊరికి అవినాభావ సంబంధం ఉంది. గోష్ఠీపూర్ణుల వారి తిరుమంత్రోపదేశం కోసం 18 సార్లు శ్రీరంగం నుంచి ఇక్కడికి కాలినడకన వచ్చి భక్తి శ్రద్ధలతో సాధించిన అష్టాక్షరి ‘‘ఓం నమో నారాయణాయ’’ తిరుమంత్రాన్ని గోపురం ఎక్కి అందరికీ చెప్పిన అద్భుత సంఘటన తిరుగోష్ఠియూర్ లో జరిగింది. జగద్గురువు రామానుజుని జీవనంలో అది పతాక సన్నివేశం. కనుక రామానుజ మార్గం దీనితో ప్రారంభమైంది. గాలి వెలుతురు వలె జ్ఞానం కూడా అందరికీ సమానమే రామానుజుని బహిరంగ తిరుమంత్రోపదేశంతో తిరుగోష్ఠియూర్ ఊరు ఊరంతా ఉర్రూతలూగుతున్నది. ఆయనకు ఎంతో కష్టపడితే దొరికిన మంత్రం మనకు ఇంత సులభంగా అందించారు. ఆయన ఎంతటి మహానుభావుడు. గురువుగారు ఏమంటారో ఏమో అని ఆందోళితులవుతున్న జనమూ ఉన్నారు. తనకిచ్చిన మాట తప్పి విచక్షణారహితంగా అందరికీ రహస్యమంత్రోపదేశం చేయడం ఎంత అన్యాయం అంటూ ఆచార్యులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. అర్హులకు, యోగ్యులకు మాత్రమే ఉపదేశించవలసిన మంత్రాన్ని మంత్రార్థాలని విచక్షణారహితంగా అందరికీ గోపురం ఎక్కి చెప్పడమా, తనకిచ్చిన మాట తప్పడమా? ఇంత పరీక్షంచి, మెచ్చి, ఇంతగా నమ్మి దివ్యమంత్రోపదేశం చేసినందుకు ఇదా ఫలితం? అని పరిపరివిధాల ఆలోచిస్తున్నారు. ఆగ్రహోదగ్రులైన గోష్టీపూర్ణుల ముందు అడియేన్ అంటూ పాదాభివందనం చేసి చేతులుకట్టుకుని తలవంచుకుని వినయంగా నిలుచున్నాడు రామానుజుడు. తీవ్రమైన ఆవేశాన్ని అణచుకునే ప్రయత్నం చేస్తూ....‘ఏమిటిది రామానుజా, నాకు మాట ఇచ్చి తప్పుతావా? ఆచార్యుని ఆదేశాన్నే ధిక్కరిస్తావా, ఇదేనా నీ గురుభక్తి, ప్రతిజ్ఞను భంగపరుస్తావా? గురువంటే, అపురూపమైన విద్యంటే అంత నిర్లక్ష్యమా, గురువుకు ఇంత అవమానమా?’ అని గురువు ప్రశ్నించారు.‘మిమ్మల్ని అవమానించే ఉద్దేశం ఏ కోశానా లేదు ఆచార్యా, మీ ద్వారా వ్యక్తమయిన ఈ మహామంత్రం అందరికీ చెందాలని, తద్వారా ఈ మంత్ర ప్రాధాన్యత, ముక్తిసాధనా అందరికీ అర్థమై మీ గౌరవం, గొప్పదనం ప్రపంచ ప్రసిధ్ధం కావాలనే నా లక్ష్యం, ఆ పుణ్యం మీకే చెందాలని నా సంకల్పం, కాని మీ ప్రతిష్ఠకు భంగం వాటిల్లజేయడం కానే కాదు ఆచార్యా’.‘అయితే అవిధేయత సంగతేమిటి. ప్రతిజ్ఞా ఉల్లంఘనకు శిక్ష నీవెరుగవా. ఈ వాగ్దాన భంగానికి నీవు అనుభవించే శిక్ష ఏమిటో మరిచిపోయావా రామానుజా...’‘లేదు. మీ వంటి పవిత్ర మూర్తుల ఆజ్ఞను ధిక్కరించిన నేను నరకానికి పోవడం తథ్యం అని తెలుసు గురువర్యా..’ ‘అయితే తెలిసే ఇంత నేరం చేశావన్నమాట.’ ‘దయచేసి నావినతి నిదానంగా వినండి. నేను అపరాధం చేసిన మాట నిజమే. మాట తప్పిందీ నిజమే. కాని మీ మాట మీద గౌరవం లేక కాదు. నేనింత కష్టపడి మీ దయతో ప్రాప్తమైన దివ్యమంత్రాన్ని, మంత్రార్థాన్ని నా ఒక్కడికోసమే వినియోగిస్తే అంతకన్నా స్వార్థం మరొకటి ఉంటుందా, ఈ మంత్రాన్ని కేవలం నాకే పరిమితం చేసుకుంటే ఆ అపురూపమైన మంత్రానికీ, ఉపదేశం చేసిన మీ ఆచార్యత్వానికే అవమానం అవుతుందనుకున్నాను. దీనులందరినీ కరుణించి మోక్షమార్గానికి వారినందరినీ మళ్లించే ఈ మంత్రాన్ని నా ఒక్కడికే కాకుండా లోకానికే అంకితం చేయాలనే అనుకున్నాను. ఆచార్యవర్యా...నేను చేసిన ఈ వాగ్దాన భంగానికి నరకానికి వెళ్తాను, సరే. నేనొక్కడినే కదా స్వామీ నరకానికి వెళ్లేది..... ఇంతమంది భక్తులు తిరుమంత్రార్థ సాధనంతో ముక్తిమార్గంలో పరమాత్ముడిని చేరగలిగితే, అంతకన్నా కావలసిందేమిటి, నేనొక్కడిని నరకంలో ఉంటే మాత్రం నష్టమేమిటి స్వామీ...పోనీయండి నన్ను నరకానికే పోనీయండి’ అని రామానుజులు దీనంగా వివరించారు. నల్లని మబ్బులు గుమికూడి మెరుపులు పిడుగులు కురుస్తూ, ఆకాశం భయంకరంగా ప్రతిధ్వనిస్తూ ఉంటే భయవిచలితులైన జనం అంతలోనే గాలి వీచి మబ్బులు తొలగిపోయి, సన్ననిజల్లులు కురిపించి ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడితే ఎంత సంతోషించినట్టే, రామానుజుని మృదుమధురమైన సంభాషణం, అందులో çసహృదయ సంభావనం అక్కడ వాతావరణాన్ని సానుకూలంగా మార్చివేసింది. ఆగ్రహం ఆశ్చర్యంగా మారిపోతూ ఉంటే గోష్టీపూర్ణుడు ‘‘ ఇదెంత ఉదాత్త భావన. ఇందాకా పెద్దలెవరికీ తోచనే లేదే. నా మనసులోనూ ఎన్నడూ ఇంతటి సద్భావనే ఉదయించలేదే. తన ముక్తిని సైతం త్యాగం చేసి, నరకం వచ్చినా సరే అనుకుని, అందరి ముక్తికోసం ఆలోచించిన ఈ రామానుజుడెంత ఉత్తముడు, ఎంతటి విశాల హృదయుడు, ఎంత దయామయుడు. కరుణామ యుడైన పరమాత్ముడు మాత్రమే ఇంతటి ప్రేమను కురిపిస్తాడు. వర్షం వలె, సూర్యరశ్మివలె అన్నీ అందరివనీ, భగవంతుడి కరుణ, ఆచార్యాను గ్రహం, భక్తి మార్గం, ముక్తి మార్గం కూడా అందరికీ సమానంగా పంచాలనే ఈ ఆలోచన ఎంత సముచితమయినది... ఇదే కదా సమానత, సమత అంటే... ఈ రామానుజుడి సమతా సంకల్పం, నవీన వైష్ణవ సిద్ధాంతం ఎంత గొప్పది. ఇది సమతా మతం, సమానతా మతం.. సమన్వయతా మతం. సన్మతం, సతతం నిలిచే మతం. కొంతసేపు ఆచార్యుని నోట మాట బయటకు రావడంలేదు. ఆలోచిస్తూ రామానుజుని తిర్ముఖమండలాన్ని(శ్రీ ముఖ మండలం) అలా చూస్తూ ఉండిపోయారు. మనసు కరిగింది. కోపం తరిగిపోయింది. ఆ స్థానంలో నెమ్మదిగా అభిమానం, ఆప్యాయత చోటుచేసుకుంటున్నాయి. ఎంబెరుమానార్ ఆచార్యుని చూపుల్లో కరుగుతున్న ఆయన మనసు గోచరించింది. ఆ కంటితడిలో కొత్త వెలుగు కనిపించింది. గోïష్టీపూర్ణుల కోపం ఆశ్చర్యంగా మారింది, నెమ్మదిగా ఆశీస్సుగా పరిణమించింది. రామానుజుడి అపారమైన కరుణలో ఆయనకు కరుణామయుడైన భగవంతుడి సాక్షాత్కారం లభించింది. ఈ రామానుజుడే భగవంతుడా... నాకూ భగవంతుడా, నా భగవంతుడు రామానుజుడేనా అనుకుంటూ అదే మాట పైకి అన్నారు గోష్టీపూర్ణుల వారు. ఎంబెరుమానార్ (=నాపాలి భగవంతుడా) అని పిలిచారు. రామానుజుడికి అర్థం కాలేదు. అయినా గురువు చేతులుసాచి పిలుస్తుంటే వెళ్లారు, ఆయన ఆలింగనం చేసుకున్నారు. కరుణించారని అర్థమయింది. శిష్యగాత్ర పరిష్వంగ సుఖం అనుభవిస్తున్నారు గురువుగారు. ఆచార్యులు కరుణించినందుకు శిష్యుని కళ్లు ఆనందబాష్పాలు వర్షిస్తున్నాయి. ‘‘నీవన్నదీ నిజమే రామానుజా. ఈ విద్య అందరిదీ, వర్షం వలె, సూర్యరశ్మివలె, చల్లదనం వలె, వెన్నెల వలె, భగవంతుని కరుణ అందరిది, మంత్రం అందరిది, ముక్తి మనందరిదీ, నారాయణుడు దీనజనపరాయణుడు, భక్తజనాధీనుడు, జనార్దనుడు. నీ ఆలోచన సామాన్యమైంది కాదు. నీవే నా భగవంతుడివి, ఎంబెరుమానార్’’. రామానుజుడి నోటి వెంట మాట రావడం లేదు. గురువుపట్ల కృతజ్ఞతాబద్ధుడైనాడు. ధన్యోస్మి అనుకున్నాడు. శిష్య వాత్సల్యం తో గురువుగారు మళ్లీ తన గుడిసెలోకి కొని పోయి, ఇంకా ఎన్నెన్నో నిగూఢమైన అర్థాలు సాదరంగా వివరించారు. నారాయణ స్వరూపాన్ని అష్టాక్షరీ మంత్ర వైభవాన్ని విశదం చేశారు. ‘‘నీ భక్తి మార్గాన్ని ప్రపంచమంతా చాటు. జ్ఞానం కన్నా భక్తి ముఖ్యమైనదనీ, పామరులు కూడా భక్తి తో పరమాత్ముడిని చేరవచ్చుననే నీ మార్గం రామానుజ మార్గమై, రామానుజ మతమై వర్థిల్లుగాక’’ ‘‘రామానుజార్యదివ్యాజ్ఞాం వర్థతా అభివర్థతాం’’ అని ఆశీర్వదించారు. ‘మళ్లీ ఒకసారి రా నాయనా, అప్పుడు నీకు అపురూపమైన ద్వయం మంత్రాన్ని, ఆ మంత్ర విశేషార్థాలను వివరిస్తాను. వెళ్లు నాయనా ఇక నీ వైష్ణవ జైత్రయాత్ర ప్రారంభించు’. అని గురువు ఆదేశించారు. అడియేన్ అంటూ పదేపదే పాదాభివందనం చేసి రామానుజుడు పరమానంద హృదయారవిందుడై శ్రీరంగానికి మళ్లాడు..ఊరు ఊరంతా కొత్తగా లభించిన జగద్గురువును, ఆయన గురువును ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే. తిరుగోష్టియూర్ దాటే దాకా దారిపొడుగునా పాదాభివందనాలే. భక్తి విశ్వాసాలతో పరమాత్ముడి దరిచేరే గొప్ప జ్ఞానాన్ని అందుకోవడానికి 18 యాత్రల పాటు సాగిన దీక్షకు, పట్టుదలకు చరిత్రలో మరెక్కడా లభించని ఉదాహరణ.రామానుజుడి ఉదాహరణతో పోల్చితే గజనీ మహ్మద్ 18 సార్లు భారతదేశంపై దాడిచేసిన సంఘటనను పట్టుదలకు ఉదాహరణగా చెప్పుకోవడం సమంజసం కాదు. ఒక జాతిని ధ్వంసం చేయడానికి కుట్రలు కూహకాలతో సాగిన దాడులెక్కడ, జ్ఞానం కోసం వినయంగా విశ్వాసంతో సాగే కృషి ఎక్కడ? ఇటువంటి గురుశిష్యులు ఎక్కడ మనకు కనిపిస్తారు? అహంకారానికి తావివ్వకుండా, శిష్యుడి ఉదాత్త భావనలను అర్థం చేసుకోవడం, ప్రశంసించడం, చివరకు నీవే నాదైవానివి అనేంత విశాల హృదయుడు ఆచార్యుడు. అర్హతా పరీక్ష అవసరం అంటూనే రామానుజుడి వంటి ఆచార్యుడు జగదాచార్యుడు అవుతాడన్న భవిష్యద్దర్శనం చేసిన గోష్టీపూర్ణులకు సాటి ఎవరు? 18 ప్రయాణాలు విసుగు లేకుండా ప్రతిజ్ఞాభంగానికి భయపడకుండా మోసం చేయకుండా, వినయం కోల్పోకుండా గురువుగారి మన్ననలు పొందిన శిష్యుడు మనకెక్కడ తారసిల్లుతాడు?అందుకే రామానుజుడు సంస్కర్త, జ్ఞానం అందరిదని ప్రకటించి ఊరుకోకుండా అందరికీ తెలియజేయాలని జీవితం అంకితం చేసిన గురువు. జాతిమతకుల భేదాలు లేకుండా అందరికీ ఆలయసమీపంలోని కూటములలో మధ్యాహ్న భోజనం ఇవ్వాలనే ఆలోచనను మొదట అమలుచేసిన వాడు రామానుజుడు. ఇస్లాం మతవాదులైన ముస్లింరాజులు కొల్లగొట్టిన హిందూ దేవతా మూర్తులను తన వాక్చాతుర్యంతో, వాదనా పటిమతో, సంప్రదింపుల నైపుణ్యంతో మర్యాదగా మాట్లాడి వారిని ఒప్పించి వందలాది దేవతా విగ్రహాలను మళ్లీ ఆయా దేవాలయాల్లో ప్రతిష్ఠించిన రామానుజుడు గోష్టీ సమరాంగణ సార్వభౌముడు, అహింసా వాది, సంవాదం ద్వారా సమస్యలు పరిష్కరించుకోవచ్చుననే సూత్రాన్ని ఈ నాడు ప్రపంచం బోధిస్తున్న ప్రత్యామ్నాయ వివాద పరిష్కార విధానానికి తొలి కర్త కర్మ క్రియ రామానుజుడే. గాంధీ అహింసా సిద్ధాంతాన్ని వెయ్యేళ్ల కిందటే ఆచరించి చూపిన మార్గదర్శి. ఊళ్లో చెరువులుండాలని అవి అందరికీ నీరివ్వాలని ఎవ్వరినీ నిరాకరించకూడదని నియమాలు పెట్టిన జగద్గురువు కూడా రామానుజుడే. తొండనూరులో ఆయన తవ్వించిన చెరువు వెయ్యేళ్లనుంచి నీళ్లిస్తూనే ఉన్నది. మేల్కోటే తిరునారాయణ పురం ఆలయంలో ప్రవేశించడానికి మాకెందుకు అర్హత లేదని అక్కడి హరిజన గిరిజనులు అడిగితే అప్పుడే రండి అని ఆలయంలోకి తీసుకువెళ్లిన మహానుభావుడు రామానుజుడు. 108 వైష్ణవ దివ్యదేశాలలో శ్రీరంగం తలమానికమైనది. ఎనిమిది నారాయణ స్వయం వ్యక్త క్షేత్రాలలో ఇది ముఖ్యమైనది. శ్రీ వైష్ణవమతానికి ఇది రాజధాని వంటిది. తిరువరంగ తిరుపతి, పెరియకోయిల్, భూలోక వైకుంఠం, భోగమండపం అని కూడా శ్రీరంగాన్ని పిలుస్తారు. 156 ఎకరాలలో కోటగోడల వంటి ఏడు ప్రాకారాలతో 21 సమున్నత గోపురాలతో సువిశాలమైన ఒక నగరాన్ని తలపించే ఆలయం ఇది. ఒక్కొక్క ప్రాకారంలో జన జీవనం వర్గీకరించబడి ఉంది. ఉభయ కావేరీ నదుల మధ్య ద్వీపంలో 156 ఎకరాలలో విస్తరించిన శ్రీరంగం భూలోక వైకుంఠం. వాల్మీకి రామాయణం, పద్మ మత్స్య పురాణాలలో శ్రీరంగం ప్రస్తావన ఉంది. సభామండపంలో కొలువుదీరినాడు కనుక రంగనాథుడు. 21 గోపురాలు, 9 పుణ్యతీర్థాలు ఉన్నాయి. చంద్ర పుష్కరిణి ఆలయం మధ్యలో ఉంటే 8 పుష్కరిణులు 8 దిక్కులలో ఉన్నాయి. సప్తప్రాకారాలు ఏడు ఊర్థ్వలోకాలకు సంకేతాలు. శ్రీరంగం త్రిచి సమీపంలో ఉంది. త్రిశిరుడి వల్ల తిరుచ్చి త్రిచి అనే పేరు వచ్చింది. -
జ్ఞానం కోసం 18 ప్రయత్నాలు
వేయేళ్ల కిందట భగవద్ రామానుజుని 1017–1137 వైష్ణవోజ్జీవన ప్రయాణం మొదలైంది.అది భక్తి జ్ఞాన మార్గం. అందరిదయిన జ్ఞానం అందరికీ అందించి భక్తిని ప్రేరేపించిభక్తి ద్వారా ముక్తి సాధించవచ్చనే జ్ఞాన యజ్ఞాన్ని కొనసాగింపజేయడమే రామానుజునిజీవిత లక్ష్యం. సహస్రాబ్ది సంవత్సరం సందర్భంగా రామానుజుని వైభవం... రామానుజ మార్గం మీకోసం... ఇది ప్రారంభం! శ్రీవరదరాజ నిలయమైన కాంచీపురంలో గురువుగారు తిరుకచ్చినంబి (నంబి=ముని) ఆదేశించారు గోష్ఠీపూర్ణుల వద్ద ఉపదేశం పొందాలని. అందుకని శ్రీరంగం నుంచి తిరుగోష్ఠియూర్ బయలు దేరాడు రామానుజుడు. మనసు చాలా ఆనందంగా ఉంది. పరమాత్ముడి దరిజేరే అద్భుతమైన మంత్రం ఆచార్యులు గోష్ఠీపూర్ణుల వారు (మరో పేరు తిరుగోష్ఠియూర్ నంబి) దగ్గర లభిస్తుంది. త్వరగా చేరుకోవాలి తిరుగోష్టియూర్. ఎంత వేగంగా నడిచినా రెండు రోజులైనా పడుతుంది. శ్రీరంగం నుంచి తిరుగోష్ఠియూర్ దాదాపు 150 మైళ్ల దూరం. ‘‘ఆచార్యుల వారి దర్శనం లభించాలి. అంత త్వరగా ఆయన అనుగ్రహించరని అంటారు. నన్ను కరుణించేట్టు చూడు రంగనాథా’’ అని రామానుజుడు పదేపదే ప్రార్థిస్తున్నాడు. ‘‘గురువుగారూ నిశ్చింతగా ఉండండి. మీకు గోష్ఠిపూర్ణ ఆచార్యులవారు అద్భుతమైన విజ్ఞానం ఇవ్వబోతున్నారు. మీరూ మీ ద్వారా మేము ఈ భవసాగరాన్ని దాటుకోబోతున్నాం. మీ వంటి దీక్షాదక్షులైన శిష్యుడు ఎవరికి దొరుకుతారు స్వామీ...’’ అన్నాడు దాశరథి. ‘‘అంత మాట అనకు, గురువు దయదలచకపోతే శిష్యుడి గొప్పదనం ఏమిటి చెప్పు? విజ్ఞానం గురూపదేశం కావాలంటే వినయం అవసరం దాశరథీ, అహంకారాన్ని మించిన అడ్డు మరొకటి లేదు. నేను గొప్ప శిష్యుడనుకోవడం అహంకారమే అవుతుంది కదా’’ అని మందలించారు రామానుజుల వారు. అడవులు గ్రామాలు దాటి నడుస్తూనే ఉన్నారు రామానుజులు వారి ఇద్దరు శిష్యులు–దాశరథి, కురేశుడు. క్రోసులకొద్దీ నడిచినా అడవి గడవడం లేదు. తిరుగోష్ఠియూరు జాడే కనబడడం లేదు. ఒక చోట గ్రామస్తుడొకాయన కనిపించాడు. నాయనా తిరుగోష్ఠియూర్ ఇంకెంత దూరం అనడిగాడు. దాదాపు చేరుకున్నారు స్వామీ, ఇంకో క్రోసెడు దూరం అంతే. ‘‘శ్రీమన్నారాయణ... ఈ అడవి దారి అయిపోతుందన్నమాట. అంతా శ్రీరంగడి లీల. కొంత ఓపిక తెచ్చుకో దాశరథీ మన గమ్యం దగ్గరలోనే ఉంది...’’ అదిగో కనిపిస్తూనే ఉంది తిరుగోష్ఠియూర్ కోవెల శిఖరం అంటూ రామానుజుడు నేలమీద పడి ప్రణమిల్లాడు. శిష్యులిద్దరూ అనుకరించారు. కాషాయ వస్త్రాలు అప్పటికే మాసిపోయి ఉన్నాయి. పొద్దున్నే చెరువులో స్నానం చేసి ఉత్తరీయం, పంచె ఉతుక్కోవడం, అనుష్ఠానం, సంధ్యావందనం, ఆరాధన ముగిసేలోగా అవి ఆరిపోవడం, మళ్ళీప్రయాణం. సాష్టాంగ దండప్రణామంతో మళ్లీ బట్టలు మట్టికొట్టుకుపోయాయి. ఈ స్వల్ప విషయాలను రామానుజుడు ఎన్నడూ లెక్క చేయలేదు. గురువిచ్చే బ్రహ్మవిద్య కోసం ఎన్ని కష్టాలయినా పడాల్సిందే... ఎంత శ్రమయినా సహించాల్సిందే. ఊళ్లో ప్రవేశించారు. తెలతెల్లవారుతున్నది. ఆచార్యుల వారి తిరుమాళిగ (ఇల్లు) ఎక్కడ ఉందో తెలియదు. ఎవర్నయినా అడగాల్సిందే. అక్కడే ఆవులు తోలుకుపోతున్న పెద్దమనిషిని అడిగారు శిష్యులు. ‘‘గోష్ఠీఫూర్ణులా...వారెవరు? మాకు తెలియదే... ఏ ఊరన్నారు. తిరుగోష్ఠియూరా, ఊరైతే ఇదే, కాని ఎవరా స్వామి? అని ఆయన చెప్పలేకపోతున్నాడు’’ శిష్యులు ఆశ్చర్యపోయారు. గోష్ఠీపూర్ణుల వంటి మహనీయుడి గురించి ఊళ్లో వాళ్లకే తెలియదా? ఎంత విచిత్రం. దాశరథి మరో ప్రయత్నం చేశాడు. తిరుగోష్ఠియూర్ కోవెలలో అర్చన చేసే పెద్ద పూజారి స్థానాచార్యులు, వారి గురించి అడుగుతున్నాం.. అన్నాడు. అప్పుడు అర్థమైంది. ఓహో ఆ స్వాములోరా... అదిగో ఆ వీధి మలుపులో కొబ్బరి చెట్టు పక్కనే ఉంది అని ఓ పూరిల్లు చూపించాడు. అప్పటికే మరికొందరు గుమిగూడారు. ఎవరో ముగ్గురు స్వాములు తమ ఊరి పెద్ద స్వామిని కలుసుకోవడానికి వచ్చారనే విషయం పాకి పోయింది. మన ఊళ్లో స్వామి కోసం ముగ్గురు స్వాములు శ్రీరంగం నుంచి వచ్చారట అనుకుంటున్నారు. రామానుజులు పడిపోయారు, దండం సమర్పించడానికి. దండవత్ ప్రణామం అంటే కర్ర (దండం) వలె నేలమీద పడిపోయి నమస్కరించడం. ఆ విధంగా నేలదండాలుపెడుతూ ఆ పూరింటివైపు వెళ్తున్న రామానుజులనుచూసి ఊళ్లో వాళ్లు ఆశ్చర్యపోతున్నారు. మన ఊళ్లో ఉన్న స్వామి ఇంత గొప్పోరా అని. నిజానికి వారికి గోష్ఠీపూర్ణుల గొప్పదనం చెప్పడం, ఆ మహనీయుడి పట్ల తన భక్తి ప్రపత్తులను చాటడమే రామానుజుల ఉద్దేశ్యం. మీ ఊళ్లో పెద్ద జ్ఞాన నిధి వంటి మహానుభావుడున్నాడని వివరిస్తున్నాడు తన వినమ్ర నమస్కారాల పరంపరతో. ఎవరో ముగ్గురు వచ్చారని తెలిసి ఆచార్యులు గోష్ఠీపూర్ణుల వారు అనుష్టానం (ప్రాతః సంధ్యావందనం, ఆరాధన) ముగించుకుని బయటకు వచ్చారు. ఎవరు నాయనా అన్నారు. ‘‘రామానుజన్ వందురిక్కేన్’’ (=నేను రామానుజుడిని వచ్చాను) అన్నారు. పాదాభివందనం చేసి ప్రవర (తన గోత్రానికి చెందిన రుషుల పేర్లు, తన పేరు చెప్పుకోవడం) అహంభో అభివాదయే (నేను నమస్కరిస్తున్నాను) అంటూ చేతులు కట్టుకుని నిలిచారు. మా ఆచార్యులు కాంచీ పూర్ణుల వారు తమ అనుగ్రహం కోసం వెళ్లమని శాసించారని చెప్పుకున్నారు. ఆయన నిశితంగా పరిశీలించారు ఇతను బ్రహ్మజ్ఞానానికి అర్హుడేనా. తిరుమంత్రోపదేశం స్వీకరించేందుకు యోగ్యత సిద్ధించినట్టేనా... అనే ప్రశ్నలు ఆయన చూపుల్లో ద్యోతకమవుతున్నాయి. రామానుజులు చెప్పిందంతా ఆలకించారు స్వామి. సౌమ్యనారాయణుని ఆలయంలో ఆరాధన సమయంలో కనిపించమన్నారు. తిరువారాధన (తిరు=శ్రీ ఆరాధన), శాత్తుమఱై (మంగళాశాసనం) కూడా ముగిసింది. తీర్థం, శఠగోపం స్వీకరించారు. ఆలయమంటపంలో కూర్చున్నారు. రామానుజులు శిష్యులతో సహా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గర్భాలయం నుంచి వచ్చిన ఆచార్యుల వారు కొన్ని ప్రశ్నలు వేసారు. కొంత సేపు సంభాషించారు. రామానుజుడి ఆధ్యాత్మిక ఆలోచనా సరళి తెలుసుకున్నారు. అయినా ఏదో అనుమానం. ‘‘రామానుజా.. ఇప్పుడు కాదు.. మళ్లీరా’’ అన్నారు. అడియేన్ (మీ పాదాలే శరణు) అంటూ పాదాభివందనం చేసి, సరే స్వామీ అని సెలవు తీసుకుని బయలుదేరారు మనసు పరిపరి విధాల ప్రశ్నిస్తున్నది, ‘‘నేను అర్హుడినేనా అని అనుమానిస్తున్నారా ఆచార్యుల వారు. గురూపదేశం లభిస్తుందా శ్రీరంగా’’. ‘‘గురువుగారూ, ఆచార్యుల వారు కాదన లేదు కదా. మళ్లీ రమ్మన్నారు కదా’’ అన్నాడు కురేశుడు. నిజమే. సాపాటు ముగించుకుని ఇద్దరు శిష్యమిత్రులతో కలిసి శ్రీరంగానికి బయలుదేరారు. కొన్నాళ్ల తరువాత మళ్లీ నడిచి వచ్చారు. మళ్లీరా అన్నారు గురువుగారు. ఒక్కసారా రెండుసార్లా... ఆవిధంగా పదిహేడు సార్లు ప్రయాణించారు వారు. ప్రతిసారీ ఇప్పుడు కాదు మళ్లీ రా అనే అంటున్నారు.. ఏమిటిది? రామానుజాచార్య 18 సార్లు తిరుగోష్ఠియూర్ కు వెళ్లి నిరాశతో తిరిగి వచ్చినప్పటికీ గోష్ఠీపూర్ణుల వారు ప్రతిసారీ ఆయన్ను ఊరికే పంపలేదని, కొన్ని వైష్ణవ లక్షణాలను మంత్రార్థాన్ని అవగాహన చేసుకోవడానికి కావలసిన అర్హతలను కూడా వివరించారని కొందరు వైష్ణవ పండితులు విశ్లేషించారు. రామానుజులు వచ్చిన ప్రతిసారీ ఒక విషయం చెప్పడం, మిగతాది చెప్పేముందు మళ్లీ రండి చూద్దాం అని పంపేవారు. మొదటిసారి వచ్చినపుడు సంసారానురక్తి అనే బీజాన్ని పూర్తిగా వదిలితేనే తిరుమంత్రోపదేశం పరమార్థాన్ని, చరమశ్లోకంతో తిరుమంత్రానికి ఉన్న అనుబంధాన్ని తెలుసుకుని నిజమైన వైష్ణవుడు కావడానికి వీలుంటుందని చెప్పి తిప్పిపంపారు. ఈ విధంగా 18 సార్లు గోష్ఠీపూర్ణులు రామానుజులకు చెప్పిన నియమాలు పరమపదానికి సోపానాలని సిద్ధాంతీకరించారు. 1. సంసారం పట్ల రక్తి బీజంతో సహా నశించాలి. 2. అహంకారం మమకారం (నేను నాది) పూర్తిగా తొలగిపోవాలి. 3. దేహం మీద ప్రేమ (దేహాభిమానం) పోవాలి. 4. స్వస్వరూపజ్ఞానం పెంపొందించుకోవాలి. అంటే ‘నేను’ అంటే ఏమిటో తెలుసుకునే ఆత్మజ్ఞానం కలగాలి. 5. ఐశ్వర్యం, భోగం నివృత్తి కలగాలి. అంటే సంపదల మీద అభిమానం, ఆశ తొలగిపోవాలి. 6. భగవంతుడిపైన ప్రేమ ఏర్పడాలి. 7. విషయాంతర రుచి కలగాలి, అంటే భౌతిక, ప్రాపంచిక విషయాలను మరచిపోవాలి. 8. పారతంత్య్రం ఏర్పడాలి. అంటే నాదేమీ లేదు. ఏదీ నావల్ల జరగడం లేదు. నేను స్వతంత్రుడను కాను. భగవంతుడే అన్నీ జరిపిస్తున్నాడనే ఆలోచన వచ్చిన వెంటనే రండి. 9. అర్థ కామ రాగాల పట్ల ద్వేషం కలిగిన తరువాత రండి. 10. పూర్తిగా వైష్ణవత్వం పొంది రండి. 11. సాత్విక పరిగ్రహం (శాంతంగా ఉండే లక్షణం) ఏర్పడిన తరువాత రండి. 12. భాగవత పరిగ్రహం (భగవంతుడే ప్రియుడని భావించే వ్యక్తులు ఇష్టపడేట్టు ఉండడం) వచ్చిన తరువాత రండి. 13. భగవత్ పరిగ్రహం (భగవంతుడే సర్వం అనే భావం) వచ్చిన తరువాత రండి. 14. అన్యప్రయోజనం (లౌకికప్రయోజనాల కన్న అన్యమైన అలౌకిక ప్రయోజనం) కోరినపుడు రండి. 15. అనన్యార్హ శేష భూతత్వం ఏర్పడాలి= అన్యములు లేవు భగవంతుడే మిగిలిన శరణనే నమ్మకం వచ్చిన తరువాత రండి. 16. నారాయణుడే ఉపాయం, నారాయణుడే ఉపేయం (గమ్యం గమనం రెండూ అతనే) అని నమ్మి రండి. 17. అనన్య శరణం.. అంటే మరొక గతి లేదని వేడుకుంటే రండి. నిజానికి రామానుజుడు ఒక్కో పరీక్షా ఉత్తీర్ణుడవుతున్నాడు. అంతులేని సహనం, అమేయమైన విశ్వాసం చాటుతున్నాడు. చీకాకు లేదు, కోపం లేదు. విసుగు లేదు. లేశమాత్రమైన అహంకారం ఉన్నా దాన్ని ఆ విధంగా గురువుగారు కడిగేస్తున్నారు. పదిహేడోసారి కూడా గురూపదేశం దొరకలేదన్న బాధతో నిరాశతో మరోసారి శ్రీరంగానికి చేరుకున్నారు. ఈ జన్మకు తనకు అష్ఠాక్షరీ మంత్రార్థం లభిస్తుందా? గురువుగారెందుకు కరుణించడం లేదు? అని పరిపరివిధాల పరితపిస్తున్నారు. శ్రీరంగంలో శ్రీరంగనాథుడు కాంచీపురంలో శ్రీవరదరాజు తమ ప్రధానార్చకుల ద్వారా మాట్లాడతారని వేయేళ్ల కిందటి కథలు చెబుతున్నాయి. తిరుమల శ్రీనివాసుడు కూడా ఆనాటి భక్తులతో మాట్లాడిన సందర్భాలు పురాణాల్లో ఉటంకించారు. ఆ తరువాత కొంత కాలానికి మూల మూర్తులు భక్త అర్చకులతో మాట్లాడడం నిలిచిపోయిందంటారు. -
దేవుని ప్రేమపాత్రులు!
ఆత్మీయం భక్తుల్లో నాలుగు వర్గాల వాళ్లుంటారు. కొందరు ఆర్తితో భగవంతుణ్ని కొలుస్తారు. వాళ్లు ముందు బాగానే బతికినా, కాల కర్మ వైపరీత్యం వల్ల అన్నీ పోగొట్టుకుంటారు. మళ్లీ వెనకటిలాగ జీవితంలో సుఖపడాలని భగవంతుణ్ని ప్రార్థిస్తారు. మరికొందరు తమ ఆత్మస్వరూపాన్ని గురించిన జిజ్ఞాసతో భగవంతుణ్ని సేవిస్తారు. ఇంకా కొందరు, గర్భదరిద్రులుగా ఉండి, ఐశ్వర్యం కోరుకుంటారు. వాళ్లూ భగవంతుణ్నే ఆశ్రయిస్తారు. మరికొందరు భగవంతుని నిష్కామంగా ప్రేమించి సేవిస్తారు. వాళ్లనే ‘జ్ఞానులు’ అంటాడు శ్రీకృష్ణుడు ‘‘ఈ నాలుగు రకాల వాళ్లూ నాకు భక్తులే. కాని అందరికన్నా ఈ చివర చెప్పిన ‘జ్ఞాని’ అంటే నాకు ఎక్కువ మక్కువ. వాడు నాకు ఆత్మ’’ అని తెలియజేశాడు పరమాత్మ. అంటే నిష్కామంగా భగవంతుని సేవించడమే జ్ఞానం. అటువంటి వారినే భగవంతుడు ప్రేమిస్తాడు. -
తండ్రి దక్షిణామూర్తి
జ్ఞానదాతా మహేశ్వరః – మనకు జ్ఞానాన్ని ఇచ్చేవాడు పరమశివుడు. జ్ఞానమంటే – లౌకికమైన విషయాలైనా కావచ్చు, లౌకిక విద్యలైనా కావచ్చు లేదా లౌకిక విద్య వలన ఒక పరమ సత్యాన్నిదృష్టిలోకి తెచ్చుకునే ప్రజ్ఞ అయినా కావచ్చు లేదా అసలు ఏది తెలుసుకోవాలో అది తెలుసుకుని, ఆ కారణం చేత పుట్టవలసిన అవసరాన్ని పోగొట్టుకోవడమైనా కావచ్చు. ఏదైనా ఇవ్వగలిగినవాడు పరమశివుడే. అందుకే ఆయన నటరాజస్వామిగా ఢమరుకాన్ని మోగిస్తాడు. అందులోంచి 14 మాహేశ్వర సూక్తాలొచ్చాయి. ఆ శబ్దంలోంచి సమస్త వాఙ్మయం వచ్చింది. ఆయనే సమస్త కళలకు ఆధారం. అందుకే ఇప్పటికీ శ్రీశైలక్షేత్రం లోపలికి వెడుతుంటే పక్కనే వీణవాయిస్తూ కనబడతాడు. శారదాదేవి ఎలా వీణ పట్టుకుంటుందో దక్షిణామూర్తి కూడా అలా వీణ పట్టుకుని ఉంటాడు. సమస్త విద్యలకు అధిదేవత పరమశివుడు. అందుకే శివుడు తెలుపు, శారదకూడా తెలుపు. ఇద్దరూ జ్ఞాన ప్రదాతలే. అటువంటి పరమశివుడు, ఇంత జ్ఞానం ఇవ్వగలిగినవాడు, ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరంలేని రీతిలో ఆత్మ అనుభవంలోకి వచ్చేటట్లు చేయగలిగినవాడు తండ్రి రూపంలో ఇక్కడ తిరుగుతుంటాడు. అందుకే తండ్రి కలిగిన పెన్నిధానమేల? అన్నారు. లోకంలో సహజంగా తనంత తానుగా గురువు ఎవరంటే తండ్రే. ఎందుచేత అంటే... ఉపదేశం ఎవరు చేస్తారో ఆయన గురువవుతాడు. దీక్ష ఇచ్చేవాడు తండ్రి. యజ్ఞోపవీతాన్ని ధరించే అధికారం ఉన్నవారికి గాయత్రీ మహామంత్రాన్ని ఉపదేశించి జ్ఞానాన్ని పొందేటట్లుగా అనుగ్రహించగలిగినవాడు తండ్రి. మంత్రదీక్షను ఇచ్చిన వాడు కనుక గురుస్థానంలో నిలబడతాడు. ఉపనయనం అంటే ఉప అంటే సమీపం, నయనము అంటే చేర్చుట. గురువు దగ్గరికి చేర్చి ఉపనయన ప్రక్రియ ద్వారా విద్యాభ్యాసానికి అర్హతను కలిగించాడు కాబట్టి తండ్రి గురువయ్యాడు. తండ్రి ఒకవేళ గాయత్రీ మహామంత్రం ఇవ్వకపోతే అక్షరాభ్యాసం చేస్తాడు. అక్షరాభ్యాసం చేయించి పిల్లవాడిని తొడమీద కూర్చోబెట్టుకుని ‘ఓం నమః శివాయః సిద్ధం నమః’అని రాయిస్తాడు. అలా రాయించాడు కాబట్టి తండ్రి గురువు. ఈ గురు స్థానానికి తండ్రి సమర్థతతో సంబంధం ఉండదు. కారణం– ధర్మం అన్నమాట ఎవడు ఆశ్రయిస్తున్నాడో(ఇక్కడ కుమారుడు) వాడివైపునుంచి ఉంటుంది తప్ప అవతలివాడు (తండ్రి) ఎటువంటివాడన్న దానినిబట్టి ఉండదు. ఉదాహరణకు మా నాన్నగారికి నాకంటే మా తమ్ముడంటేనే ఎక్కువ ఇష్టం, ఎప్పుడూ వాడినే పొగుడుతూ, నేనెంత ధర్మమార్గంలో ఉన్నా నన్నే నిందిస్తున్నారనుకోండి. అటువంటప్పుడు మా నాన్నగారిపట్ల నేనెందుకు గౌరవం ప్రదర్శించాలన్న ప్రశ్న వస్తే.....?? అసలు ఆ ఆలోచనే తప్పు. ధర్మం నీవైపు నుంచే చూడాలి కాబట్టి నీ వైపునుంచి దోషం లేకుండా నీవు గౌరవించాలి. తండ్రి ప్రవర్తనను పరిశీలించి తీర్పు చెప్పే అధికారం కొడుకుగా నీకులేదు. తండ్రి ప్రవర్తనను ఎంచడం నీకు ధర్మం కాదు. తండ్రి ఎటువంటివాడయినా సేవించడం ఒక్కటే నీ ధర్మం. తండ్రి తాగుబోతయితే కుటుంబం ఎంత క్లేశపడుతుందో తెలిసి ఆ పరిస్థితి నీకు రాకుండా చేయడానికి నీ తండ్రిని తాగుబోతును చేశాడేమో ఈశ్వరుడు? ‘నా తండ్రి పనికిమాలిన వాడు’ అన్నమాట నీ నోటివెంట ఎన్నటికీ రాకూడదు. తండ్రి తప్పును ఎత్తిచూపే అధికారం కొడుకుగా నీకు లేదు. తండ్రి వందనీయుడు. అంతే. ఇది అతిక్రమిస్తే నీది దోషభూయిష్టమయిన జీవితం అవుతుంది. పరబ్రహ్మను తిరస్కరించిన వాడివవుతావు. -
ప్రతి ఇంటా పూలు వికసించాలి... ప్రతి పంటా చేతికి అందాలి...
కొత్త సంవత్సర ప్రార్థన నవ్వుతూ ఉండాలి. సంతోషంగా ఉండాలి. ఇంటి యజమాని మిఠాయిలతో ఇంటికి చేరుతుండాలి. గృహిణి సంతృప్తిగా ఇంటిని చక్కదిద్దుతుండాలి. పిల్లలు బెరుకు లేకుండా బడికి వెళుతుండాలి. గురువులు జ్ఞానంతో విద్యను బోధిస్తూ ఉండాలి. వికాసం నలువైపులా సాగుతుండాలి. వృద్ధి పది దిశలా విస్తరిస్తుండాలి. కొత్త సంవత్సరం పాత భయాలన్నింటినీ వదలగొట్టాలి. కొత్త సంవత్సరం పాత సందేహాలన్నీ తరిమి కొట్టాలి. కొత్త సంవత్సరం పాత తప్పులన్నింటినీ మరుగున పడేయాలి. కొత్త సంవత్సరం పాత దీనాలాపనల్ని చీపురుతో చిమ్మి కాలబిలంలో పారేయాలి. వచ్చే కాలమంతా సంతోషం నిండి ఉండాలి. శుభం పలుకుతుండాలి. సుఖం వెల్లువెత్తాలి. శాంతి ప్రసరింప చేయాలి. ఏ దేశం మరో దేశం కన్నా ఎక్కువ కాని తక్కువ కాని కాకుండా ఉండాలి. ఏ జాతి మరో జాతి కన్నా ఎక్కువ కాని తక్కువ కాని అవకుండా నిలవాలి. ఏ సరిహద్దు మరో సరిహద్దు రక్తంతో తడవకుండా సామరస్యంతో స్థిరపడాలి. ఏ ద్వేషం ఏ కంచెను దాటకుండా విఫలమవుతూ ఉండాలి. అపకారం తలపెట్టబోతే మేలు జరిగిపోవాలి. కసి స్నేహంగా పగ నెయ్యంగా ప్రతీకారం అనుబంధంగా రూపాంతరం చెందిపోతూ ఉండాలి. ఆకాశం ఆకాశంలానే ఉండాలి. కాలుష్యం కొత్త చిగురుటాకుల నిశ్వాసతో అంతరించి పోవాలి. నదీజలాలు కావలసిన వారికి కావలసినంత దప్పిక తీర్చాలి. సముద్రాలు మానవుడి ఆశకు తల ఒంచకుండా పౌరుషంగా తమ జీవరాశిని కాపాడుకోవాలి. పర్వతాలు మంచు టోపీలతో పలకరించాలి. లోయలు కొండధారలతో తడుస్తూ ఉండాలి. తోటలు పిందెలు కాయలతో ఒంగిన కొమ్మలతో అనునిత్యం నిండు గర్భిణుల్లా భారంగా ఉండాలి. పంటలు చీడపీడల పాడు లేకుండా పచ్చగా ఎదగాలి. రైతు నాగలి పట్టుకుని నవ్వగలగాలి. రోడ్లు భద్రంగా ఉండాలి. వాహనాలు ఏ ప్రమాదమూ లేకుండా గమ్యాన్ని చేరుకోగలగాలి. కొత్త మార్గాలు ఏర్పడాలి. కొత్త దారులు తెరుచుకోవాలి. ప్రతి మార్గం సామాన్యుడి అందుబాటులో ఉండాలి. ఆడపిల్ల పడ్డ ప్రతి గర్భం అపురూపం కావాలి. భూమిన పడ్డ ప్రతి బిడ్డా సురక్షితంగా ఉండాలి. నవ్వే ప్రతి బాలిక కబంధ కపట కాముక దృష్టి నుంచి తప్పించుకోవాలి. యువతీ యువకుల భుజాలను ఈ దేశం నమ్మగలగాలి. పైలా పచ్చీసులో కూడా ఒక బాధ్యత నర్మగర్భంగా లోపల కదలాడాలి. లక్ష్యం హెచ్చరిస్తూ ఉండాలి. గమ్యం వైపు అడుగు పడుతూ ఉండాలి. ప్రేమలు సఫలం కావాలి. పెళ్లిళ్లు విఫలత్వాన్ని తప్పించుకోవాలి. చెదిరిన అనుబంధాలు తిరిగి చేతులు చేతులు కలపాలి. మనిషికి మనిషే తోడు అని నమ్మగలగాలి. ప్రతి మనిషిలో మంచిని వెతకగలగాలి. సాటి మనిషికి గౌరవం ఇవ్వాలి. ధర్మం ఆధిపత్యం కొరకు కాకుండా కేవలం దారిదీపంగా మాత్రమే ఉండగలగాలి. మతం మంచిని మాత్రమే పంచాలి. మతం మరో మతాన్ని ఆలింగనం చేసుకునే సహనంతో వ్యవహరించాలి. పరమాత్ముని ఏకత్వం గోచరం కావాలి. తుపాకీ కరిగిపోవాలి. మందుగుండు తడిసిపోవాలి. హింసను అసహ్యించుకోవాలి. ఉన్మాదం కూకటివేళ్లతో పెకలించుకుపోవాలి. ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టే పెద్దలు జబ్బున పడాలి. పథకాలు రచించేవారందరూ అనుభవించాలి. కుట్రలు కుతంత్రాలు మానవ హననానికి కారణమయ్యే ప్రతి కార్పణ్యాలు మహా పతనం కావాలి. పూర్తిగా విఫలం కావాలి. నిజాయితీ నిండిన దళాలు కావాలి. రక్షణకు నిలిచిన ప్రతి దళ సభ్యుడు విచక్షణను పాటించాలి. సైనికుడు నవ్వుతూ సెలవు పై ఇంటికి రాగలగాలి. శవపేటికల కార్ఖానాలు మూతపడాలి. ప్రతి వాకిలి కళకళలాడాలి. ప్రతి లోగిలి ముచ్చటగొలపాలి. ప్రతి కుండీ పూవులు పూయాలి. ప్రతి గుడీ గంటలు మోగాలి. ప్రతి అజాన్ చెవికి సోకాలి. ప్రతి చర్చ్ ప్రార్థనతో పులకించి తరించాలి. 2017 సకల శుభాలు తేవాలి.ప్రతి మస్తిష్కానికి స్థిమితత్వం ఇవ్వాలి.సామాజిక దొంతరల మధ్య సమన్వయం సిద్ధించాలి.ఒకరి కోసం అందరూ అందరి కోసం ఒక్కరుగా ఒక లిప్త అయినా బతకగలగాలి. ఆమీన్. ఆమెన్. తథాస్తు. – ఖదీర్ -
నారాయణ నారాయణ
నడిసే విజ్ఞాన సర్వస్వం అని ఎవరిని బడితే వారిని ప్రశంసించటం ఆధునిక కాలంలో అలవాటుగా మారింది. కానీ అలాంటి ప్రశంసకు అసలైన హక్కుదారు నారద మహర్షి. ఆయనకు తెలియని విషయం లేదు. లౌకిక విషయాలలో కానీ, ఆధ్యాత్మిక విషయాలలో కానీ ఎంతటి వారికయినా ఏ విషయంలోనైనా ఎలాంటి సందేహాన్నయినా నివృత్తి చేయగల ధీశాలి బ్రహ్మ మానసపుత్రుడైన నారద మహర్షి. నారదుడు నారాయణ నామం నిరంతరం స్మరిస్తుంటాడు. ‘మహతి’ అనే తన వీణ వాయిస్తూ, నారాయణ దివ్య కీర్తనలను తంత్రీలయ సమన్వితంగా ఆయన ఆలపిస్తాడు. నారదుడు మొదట్లో తన సంగీత జ్ఞానం గురించి చాలా అహంభావంతో ఉండేవాడట. ఒకసారి నారదుడూ, గంధర్వ గాయకుడు తుంబురుడూ, ఇతర గాయకులూ వైకుంఠానికి వెళ్లారట. లక్ష్మీ నారాయణులు ఒక్క తుంబురుడిని మాత్రం తమ సమక్షానికి పిలిపించుకొని ఆయన గానం విని సత్కరించి పంపారట. నారదుడితో సహా ఇతర గాయకులకు లోపలికి వెళ్లేందుకు కూడా అనుమతి లభించలేదట. నారదుడికి అసూయ కలిగింది. కాని సజ్జనుడు కనక, ఆ తుంబురుడి గానంలో విశేష గుణం ఏమిటో తెలుసుకొని వీలైతే ఆయన దగ్గర ఆ విశేషం నేర్చుకొందామని, తుంబురుడి ఇంటికి వెళ్లాడట. తుంబురుడు కనిపించలేదు. ఆయన వీణ కనిపించింది. నారదుడు ఆ వీణను ఒక్కసారి కుతూహలం కొద్దీ మీటాడు. అది వినిపించిన అద్భుతమైన నాదం వినగానే, ఆయన గ్రహించాడట, తుంబురుడు తనకంటే ఎన్నో రెట్లు గొప్ప గాయకుడని! ఇక అసూయ వదిలేసి, తనకూ అటువంటి విద్వత్తునూ ప్రతిభనూ ప్రసాదించమని విష్ణువును గురించి తపస్సు చేశాడట. ఫలితంగా, నారదుడికి కృష్ణావతార సమయంలో జాంబవతీ, రుక్మిణీ, సత్యభామల వద్దా, చివరకు సాక్షాత్తూ శ్రీకృష్ణుడి వద్దా సంగీతం నేర్చుకొనే భాగ్యం కలిగిందని అద్భుత రామాయణంలో కనిపించే కథ. నారదుడికి అన్ని పక్షాల వారూ కావలసిన వారే. అన్ని పక్షాలకూ ఆయన కావలసినవాడే! అయినా సర్వ స్వతంత్రుడూ. ఆయన పక్షం న్యాయ పక్షం. ఆయన ధ్యేయం లోక క్షేమం. - ఎం.హనుమంత రావు -
వివేకం లేక.. విచక్షణ కోల్పోయి
దౌల్తాబాద్: కొన్నాళ్ళుగా మతిస్థిమితం లేకుండా ఉంటున్న కొడుకును ఆలనా పాలన చూసుకుంటున్న తల్లి పాలిట తనయుడు కాలయముడయ్యాడు. ఏమైందో ఏమోకాని ఉన్నట్టుండి బుద్ధ్దిమాంద్యుడైన అతనికి ఆవేశం వచ్చింది. దీంతో విచక్షణ మరచి తలుపులకు గడియపెట్టి ఇంట్లో ఉన్న తల్లిదండ్రులను కర్రతో విచక్షణ రహితంగా కొట్టాడు. తమను వదిలి పెట్టాలని తల్లిదండ్రులు కాళ్లు పట్టుకున్నా అతను ఆగలేదు. దీంతో తల్లి తలపై కర్రతో బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందగా, తండ్రి తీవ్రగాయాలతో బయటపడిన సంఘటన ఆదివారం మండల కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. దౌల్లాబాద్కు చెందిన తలారి పెద్దసాయప్ప, గోవిందమ్మలకు ముగ్గురు కుమారులు. వారిలో ఇద్దరు కుమారులు బతుకుదెరువు నిమిత్తం బొంబాయి వెళ్ళి అక్కడే ఉంటున్నారు. పెద్దసాయప్ప, గోవిందమ్మ మతిస్థిమితం లేని రెండవ కుమారుడు వెంకటప్ప ఆలనాపాలనా చూస్తూ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పదేళ్ల క్రితం వరకు బాగానే ఉన్న వెంకటప్ప బొంబాయి వెళ్లి అక్కడే మతిస్థిమితం కోల్పోయాడు. అప్పట్లో అతనికి వివాహం జరిగినా భార్య ఏడాదికే విడాకులు తీసుకుంది. అప్పటి తల్లి గోవిందమ్మ(55) వెంకటప్ప బాగోగులు చూస్తోంది. ఈ క్రమంలో ఆదివారం ఉదయం గోవిందమ్మ, భర్త పెద్దసాయప్పలు ఇంటి విషయాలు మాట్లాడుకుంటుండగా ఒక్కసారిగా కోపం వచ్చిన వెంకటప్ప పొయ్యిలో ఉన్న కట్టె తీసుకుని తలుపులకు గొళ్ళెం పెట్టి తల్లిదండ్రులపై దాడికి దిగాడు. తల్లి గోవిందమ్మను తలపై బాదడంతో మెదడు చిట్లి అక్కడికక్కడే మృతి చెందింది. తండ్రిపై కూడా దాడికి దిగడంతో తీవ్రగాయాలతో తప్పించుకుని బయటపడ్డాడు. దీంతో చుట్టు పక్కల వారు వెళ్ళి చూడగా అప్పటికే గోవిందమ్మ మృతి చెంది ఉంది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో కోస్గి ఎస్ఐ భాగ్యలక్ష్మిరెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మృతురాలి భర్త పెద్దసాయప్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ శ్యాంసుందర్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొడంగల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.