జ్ఞానం కోసం 18 ప్రయత్నాలు | 18 attempts for wisdom | Sakshi
Sakshi News home page

జ్ఞానం కోసం 18 ప్రయత్నాలు

Published Sun, Oct 15 2017 12:26 AM | Last Updated on Thu, Jul 11 2019 5:37 PM

18 attempts for wisdom - Sakshi

వేయేళ్ల కిందట భగవద్‌ రామానుజుని 1017–1137  వైష్ణవోజ్జీవన ప్రయాణం మొదలైంది.అది భక్తి జ్ఞాన మార్గం. అందరిదయిన జ్ఞానం అందరికీ అందించి భక్తిని ప్రేరేపించిభక్తి ద్వారా ముక్తి సాధించవచ్చనే జ్ఞాన యజ్ఞాన్ని కొనసాగింపజేయడమే రామానుజునిజీవిత లక్ష్యం. సహస్రాబ్ది సంవత్సరం సందర్భంగా రామానుజుని వైభవం... రామానుజ మార్గం మీకోసం... ఇది ప్రారంభం!

శ్రీవరదరాజ నిలయమైన కాంచీపురంలో గురువుగారు తిరుకచ్చినంబి (నంబి=ముని) ఆదేశించారు గోష్ఠీపూర్ణుల వద్ద ఉపదేశం పొందాలని. అందుకని శ్రీరంగం నుంచి తిరుగోష్ఠియూర్‌ బయలు దేరాడు రామానుజుడు. మనసు చాలా ఆనందంగా ఉంది. పరమాత్ముడి దరిజేరే అద్భుతమైన మంత్రం ఆచార్యులు గోష్ఠీపూర్ణుల వారు (మరో పేరు తిరుగోష్ఠియూర్‌ నంబి) దగ్గర లభిస్తుంది. త్వరగా చేరుకోవాలి తిరుగోష్టియూర్‌. ఎంత వేగంగా నడిచినా రెండు రోజులైనా పడుతుంది. శ్రీరంగం నుంచి తిరుగోష్ఠియూర్‌ దాదాపు 150 మైళ్ల దూరం. ‘‘ఆచార్యుల వారి దర్శనం లభించాలి. అంత త్వరగా ఆయన అనుగ్రహించరని అంటారు. నన్ను కరుణించేట్టు చూడు రంగనాథా’’ అని రామానుజుడు పదేపదే ప్రార్థిస్తున్నాడు.

‘‘గురువుగారూ నిశ్చింతగా ఉండండి. మీకు గోష్ఠిపూర్ణ ఆచార్యులవారు అద్భుతమైన విజ్ఞానం ఇవ్వబోతున్నారు. మీరూ మీ ద్వారా మేము ఈ భవసాగరాన్ని దాటుకోబోతున్నాం. మీ వంటి దీక్షాదక్షులైన శిష్యుడు ఎవరికి దొరుకుతారు స్వామీ...’’  అన్నాడు దాశరథి. ‘‘అంత మాట అనకు, గురువు దయదలచకపోతే శిష్యుడి గొప్పదనం ఏమిటి చెప్పు? విజ్ఞానం గురూపదేశం కావాలంటే వినయం అవసరం దాశరథీ, అహంకారాన్ని మించిన అడ్డు మరొకటి లేదు. నేను గొప్ప శిష్యుడనుకోవడం అహంకారమే అవుతుంది కదా’’  అని మందలించారు రామానుజుల వారు.  అడవులు గ్రామాలు దాటి నడుస్తూనే ఉన్నారు రామానుజులు వారి ఇద్దరు శిష్యులు–దాశరథి, కురేశుడు. క్రోసులకొద్దీ నడిచినా అడవి గడవడం లేదు. తిరుగోష్ఠియూరు జాడే కనబడడం లేదు. ఒక చోట గ్రామస్తుడొకాయన కనిపించాడు. నాయనా తిరుగోష్ఠియూర్‌ ఇంకెంత దూరం అనడిగాడు. దాదాపు చేరుకున్నారు స్వామీ, ఇంకో క్రోసెడు దూరం అంతే.  ‘‘శ్రీమన్నారాయణ... ఈ అడవి దారి అయిపోతుందన్నమాట. అంతా శ్రీరంగడి లీల. కొంత ఓపిక తెచ్చుకో దాశరథీ మన గమ్యం దగ్గరలోనే ఉంది...’’

అదిగో కనిపిస్తూనే ఉంది తిరుగోష్ఠియూర్‌ కోవెల శిఖరం అంటూ రామానుజుడు నేలమీద పడి ప్రణమిల్లాడు. శిష్యులిద్దరూ అనుకరించారు. కాషాయ వస్త్రాలు అప్పటికే మాసిపోయి ఉన్నాయి. పొద్దున్నే చెరువులో స్నానం చేసి ఉత్తరీయం, పంచె ఉతుక్కోవడం, అనుష్ఠానం, సంధ్యావందనం, ఆరాధన ముగిసేలోగా అవి ఆరిపోవడం, మళ్ళీప్రయాణం. సాష్టాంగ దండప్రణామంతో మళ్లీ బట్టలు మట్టికొట్టుకుపోయాయి. ఈ స్వల్ప విషయాలను రామానుజుడు ఎన్నడూ లెక్క చేయలేదు. గురువిచ్చే బ్రహ్మవిద్య కోసం ఎన్ని కష్టాలయినా పడాల్సిందే... ఎంత శ్రమయినా సహించాల్సిందే.  
ఊళ్లో ప్రవేశించారు. తెలతెల్లవారుతున్నది. ఆచార్యుల వారి తిరుమాళిగ (ఇల్లు) ఎక్కడ ఉందో తెలియదు. ఎవర్నయినా అడగాల్సిందే.  అక్కడే ఆవులు తోలుకుపోతున్న పెద్దమనిషిని అడిగారు శిష్యులు.
‘‘గోష్ఠీఫూర్ణులా...వారెవరు? మాకు తెలియదే... ఏ ఊరన్నారు. తిరుగోష్ఠియూరా, ఊరైతే ఇదే, కాని ఎవరా స్వామి? అని ఆయన చెప్పలేకపోతున్నాడు’’ శిష్యులు ఆశ్చర్యపోయారు. గోష్ఠీపూర్ణుల వంటి మహనీయుడి గురించి ఊళ్లో వాళ్లకే తెలియదా? ఎంత విచిత్రం. దాశరథి మరో ప్రయత్నం చేశాడు.  తిరుగోష్ఠియూర్‌ కోవెలలో అర్చన చేసే పెద్ద పూజారి స్థానాచార్యులు, వారి గురించి అడుగుతున్నాం.. అన్నాడు. అప్పుడు అర్థమైంది. ఓహో ఆ స్వాములోరా... అదిగో ఆ వీధి మలుపులో కొబ్బరి చెట్టు పక్కనే ఉంది అని ఓ పూరిల్లు చూపించాడు. అప్పటికే మరికొందరు గుమిగూడారు. ఎవరో ముగ్గురు స్వాములు తమ ఊరి పెద్ద స్వామిని కలుసుకోవడానికి వచ్చారనే విషయం పాకి పోయింది. మన ఊళ్లో స్వామి కోసం ముగ్గురు స్వాములు శ్రీరంగం నుంచి వచ్చారట అనుకుంటున్నారు.
రామానుజులు పడిపోయారు, దండం సమర్పించడానికి. దండవత్‌ ప్రణామం అంటే కర్ర (దండం) వలె నేలమీద పడిపోయి నమస్కరించడం. ఆ విధంగా నేలదండాలుపెడుతూ ఆ పూరింటివైపు వెళ్తున్న రామానుజులనుచూసి ఊళ్లో వాళ్లు ఆశ్చర్యపోతున్నారు.  మన ఊళ్లో ఉన్న స్వామి ఇంత గొప్పోరా అని. నిజానికి వారికి గోష్ఠీపూర్ణుల గొప్పదనం  చెప్పడం, ఆ మహనీయుడి పట్ల తన భక్తి ప్రపత్తులను చాటడమే రామానుజుల ఉద్దేశ్యం. మీ ఊళ్లో పెద్ద జ్ఞాన నిధి వంటి మహానుభావుడున్నాడని వివరిస్తున్నాడు తన వినమ్ర నమస్కారాల పరంపరతో.

ఎవరో ముగ్గురు వచ్చారని తెలిసి ఆచార్యులు గోష్ఠీపూర్ణుల వారు అనుష్టానం (ప్రాతః సంధ్యావందనం, ఆరాధన) ముగించుకుని బయటకు వచ్చారు. ఎవరు నాయనా అన్నారు. ‘‘రామానుజన్‌ వందురిక్కేన్‌’’ (=నేను రామానుజుడిని వచ్చాను) అన్నారు.  పాదాభివందనం చేసి ప్రవర (తన గోత్రానికి చెందిన రుషుల పేర్లు, తన పేరు చెప్పుకోవడం) అహంభో అభివాదయే (నేను నమస్కరిస్తున్నాను) అంటూ చేతులు కట్టుకుని నిలిచారు. మా ఆచార్యులు కాంచీ పూర్ణుల వారు తమ అనుగ్రహం కోసం వెళ్లమని శాసించారని చెప్పుకున్నారు. ఆయన నిశితంగా పరిశీలించారు ఇతను బ్రహ్మజ్ఞానానికి అర్హుడేనా. తిరుమంత్రోపదేశం స్వీకరించేందుకు యోగ్యత సిద్ధించినట్టేనా... అనే ప్రశ్నలు ఆయన చూపుల్లో ద్యోతకమవుతున్నాయి. రామానుజులు చెప్పిందంతా ఆలకించారు స్వామి.  సౌమ్యనారాయణుని ఆలయంలో ఆరాధన సమయంలో కనిపించమన్నారు. తిరువారాధన (తిరు=శ్రీ  ఆరాధన), శాత్తుమఱై (మంగళాశాసనం) కూడా ముగిసింది. తీర్థం, శఠగోపం స్వీకరించారు. ఆలయమంటపంలో కూర్చున్నారు. రామానుజులు శిష్యులతో సహా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గర్భాలయం నుంచి వచ్చిన ఆచార్యుల వారు కొన్ని ప్రశ్నలు వేసారు. కొంత సేపు సంభాషించారు. రామానుజుడి ఆధ్యాత్మిక ఆలోచనా సరళి తెలుసుకున్నారు. అయినా ఏదో అనుమానం.

‘‘రామానుజా.. ఇప్పుడు కాదు.. మళ్లీరా’’ అన్నారు. అడియేన్‌ (మీ పాదాలే శరణు) అంటూ పాదాభివందనం చేసి, సరే స్వామీ అని సెలవు తీసుకుని బయలుదేరారు మనసు పరిపరి విధాల ప్రశ్నిస్తున్నది, ‘‘నేను అర్హుడినేనా అని అనుమానిస్తున్నారా ఆచార్యుల వారు. గురూపదేశం లభిస్తుందా శ్రీరంగా’’.  ‘‘గురువుగారూ, ఆచార్యుల వారు కాదన లేదు కదా. మళ్లీ రమ్మన్నారు కదా’’ అన్నాడు కురేశుడు. నిజమే. సాపాటు ముగించుకుని ఇద్దరు శిష్యమిత్రులతో కలిసి శ్రీరంగానికి బయలుదేరారు. కొన్నాళ్ల తరువాత మళ్లీ నడిచి వచ్చారు. మళ్లీరా అన్నారు గురువుగారు. ఒక్కసారా రెండుసార్లా... ఆవిధంగా పదిహేడు సార్లు ప్రయాణించారు వారు. ప్రతిసారీ ఇప్పుడు కాదు మళ్లీ రా అనే అంటున్నారు.. ఏమిటిది? రామానుజాచార్య 18 సార్లు తిరుగోష్ఠియూర్‌ కు వెళ్లి నిరాశతో తిరిగి వచ్చినప్పటికీ గోష్ఠీపూర్ణుల వారు ప్రతిసారీ ఆయన్ను ఊరికే పంపలేదని, కొన్ని వైష్ణవ లక్షణాలను మంత్రార్థాన్ని అవగాహన చేసుకోవడానికి కావలసిన అర్హతలను కూడా వివరించారని కొందరు వైష్ణవ పండితులు విశ్లేషించారు. రామానుజులు వచ్చిన ప్రతిసారీ ఒక విషయం చెప్పడం, మిగతాది చెప్పేముందు మళ్లీ రండి చూద్దాం అని పంపేవారు. మొదటిసారి వచ్చినపుడు సంసారానురక్తి అనే బీజాన్ని పూర్తిగా వదిలితేనే తిరుమంత్రోపదేశం పరమార్థాన్ని, చరమశ్లోకంతో తిరుమంత్రానికి ఉన్న అనుబంధాన్ని తెలుసుకుని నిజమైన వైష్ణవుడు కావడానికి వీలుంటుందని చెప్పి తిప్పిపంపారు. ఈ విధంగా 18 సార్లు గోష్ఠీపూర్ణులు రామానుజులకు చెప్పిన నియమాలు పరమపదానికి సోపానాలని సిద్ధాంతీకరించారు.

1. సంసారం పట్ల రక్తి బీజంతో సహా నశించాలి.
2. అహంకారం మమకారం (నేను నాది) పూర్తిగా తొలగిపోవాలి.
3. దేహం మీద ప్రేమ (దేహాభిమానం) పోవాలి.
4. స్వస్వరూపజ్ఞానం పెంపొందించుకోవాలి. అంటే ‘నేను’ అంటే ఏమిటో తెలుసుకునే ఆత్మజ్ఞానం కలగాలి.
5. ఐశ్వర్యం, భోగం నివృత్తి కలగాలి. అంటే సంపదల మీద అభిమానం, ఆశ తొలగిపోవాలి.
6. భగవంతుడిపైన ప్రేమ ఏర్పడాలి.
7. విషయాంతర రుచి కలగాలి, అంటే భౌతిక, ప్రాపంచిక విషయాలను మరచిపోవాలి.
8. పారతంత్య్రం ఏర్పడాలి. అంటే నాదేమీ లేదు. ఏదీ నావల్ల జరగడం లేదు. నేను స్వతంత్రుడను కాను. భగవంతుడే అన్నీ జరిపిస్తున్నాడనే ఆలోచన వచ్చిన వెంటనే రండి.
9. అర్థ కామ రాగాల పట్ల ద్వేషం కలిగిన తరువాత రండి.
10. పూర్తిగా వైష్ణవత్వం పొంది రండి.
11. సాత్విక పరిగ్రహం (శాంతంగా ఉండే లక్షణం) ఏర్పడిన తరువాత రండి.
12. భాగవత పరిగ్రహం (భగవంతుడే ప్రియుడని భావించే వ్యక్తులు ఇష్టపడేట్టు ఉండడం) వచ్చిన తరువాత రండి.
13. భగవత్‌ పరిగ్రహం (భగవంతుడే సర్వం అనే భావం) వచ్చిన తరువాత రండి.
14. అన్యప్రయోజనం (లౌకికప్రయోజనాల కన్న అన్యమైన అలౌకిక ప్రయోజనం) కోరినపుడు రండి.
15. అనన్యార్హ శేష భూతత్వం ఏర్పడాలి= అన్యములు లేవు భగవంతుడే మిగిలిన శరణనే నమ్మకం వచ్చిన తరువాత రండి.
16. నారాయణుడే ఉపాయం, నారాయణుడే ఉపేయం (గమ్యం గమనం రెండూ అతనే) అని నమ్మి రండి.
17. అనన్య శరణం.. అంటే మరొక గతి లేదని వేడుకుంటే రండి.

నిజానికి రామానుజుడు ఒక్కో పరీక్షా ఉత్తీర్ణుడవుతున్నాడు. అంతులేని సహనం, అమేయమైన విశ్వాసం చాటుతున్నాడు. చీకాకు లేదు, కోపం లేదు. విసుగు లేదు. లేశమాత్రమైన అహంకారం ఉన్నా దాన్ని ఆ విధంగా గురువుగారు కడిగేస్తున్నారు. పదిహేడోసారి కూడా గురూపదేశం దొరకలేదన్న బాధతో నిరాశతో మరోసారి శ్రీరంగానికి చేరుకున్నారు. ఈ జన్మకు తనకు అష్ఠాక్షరీ మంత్రార్థం లభిస్తుందా? గురువుగారెందుకు కరుణించడం లేదు? అని పరిపరివిధాల పరితపిస్తున్నారు. శ్రీరంగంలో శ్రీరంగనాథుడు కాంచీపురంలో శ్రీవరదరాజు తమ ప్రధానార్చకుల ద్వారా మాట్లాడతారని వేయేళ్ల కిందటి కథలు చెబుతున్నాయి. తిరుమల శ్రీనివాసుడు కూడా ఆనాటి భక్తులతో మాట్లాడిన సందర్భాలు పురాణాల్లో ఉటంకించారు. ఆ తరువాత కొంత కాలానికి మూల మూర్తులు భక్త అర్చకులతో మాట్లాడడం నిలిచిపోయిందంటారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement