నారాయణ నారాయణ
నడిసే విజ్ఞాన సర్వస్వం అని ఎవరిని బడితే వారిని ప్రశంసించటం ఆధునిక కాలంలో అలవాటుగా మారింది. కానీ అలాంటి ప్రశంసకు అసలైన హక్కుదారు నారద మహర్షి. ఆయనకు తెలియని విషయం లేదు. లౌకిక విషయాలలో కానీ, ఆధ్యాత్మిక విషయాలలో కానీ ఎంతటి వారికయినా ఏ విషయంలోనైనా ఎలాంటి సందేహాన్నయినా నివృత్తి చేయగల ధీశాలి బ్రహ్మ మానసపుత్రుడైన నారద మహర్షి.
నారదుడు నారాయణ నామం నిరంతరం స్మరిస్తుంటాడు. ‘మహతి’ అనే తన వీణ వాయిస్తూ, నారాయణ దివ్య కీర్తనలను తంత్రీలయ సమన్వితంగా ఆయన ఆలపిస్తాడు. నారదుడు మొదట్లో తన సంగీత జ్ఞానం గురించి చాలా అహంభావంతో ఉండేవాడట. ఒకసారి నారదుడూ, గంధర్వ గాయకుడు తుంబురుడూ, ఇతర గాయకులూ వైకుంఠానికి వెళ్లారట. లక్ష్మీ నారాయణులు ఒక్క తుంబురుడిని మాత్రం తమ సమక్షానికి పిలిపించుకొని ఆయన గానం విని సత్కరించి పంపారట. నారదుడితో సహా ఇతర గాయకులకు లోపలికి వెళ్లేందుకు కూడా అనుమతి లభించలేదట. నారదుడికి అసూయ కలిగింది. కాని సజ్జనుడు కనక, ఆ తుంబురుడి గానంలో విశేష గుణం ఏమిటో తెలుసుకొని వీలైతే ఆయన దగ్గర ఆ విశేషం నేర్చుకొందామని, తుంబురుడి ఇంటికి వెళ్లాడట. తుంబురుడు కనిపించలేదు. ఆయన వీణ కనిపించింది. నారదుడు ఆ వీణను ఒక్కసారి కుతూహలం కొద్దీ మీటాడు. అది వినిపించిన అద్భుతమైన నాదం వినగానే, ఆయన గ్రహించాడట, తుంబురుడు తనకంటే ఎన్నో రెట్లు గొప్ప గాయకుడని! ఇక అసూయ వదిలేసి, తనకూ అటువంటి విద్వత్తునూ ప్రతిభనూ ప్రసాదించమని విష్ణువును గురించి తపస్సు చేశాడట. ఫలితంగా, నారదుడికి కృష్ణావతార సమయంలో జాంబవతీ, రుక్మిణీ, సత్యభామల వద్దా, చివరకు సాక్షాత్తూ శ్రీకృష్ణుడి వద్దా సంగీతం నేర్చుకొనే భాగ్యం కలిగిందని అద్భుత రామాయణంలో కనిపించే కథ.
నారదుడికి అన్ని పక్షాల వారూ కావలసిన వారే. అన్ని పక్షాలకూ ఆయన కావలసినవాడే! అయినా సర్వ స్వతంత్రుడూ. ఆయన పక్షం న్యాయ పక్షం. ఆయన ధ్యేయం లోక క్షేమం.
- ఎం.హనుమంత రావు