దౌల్తాబాద్: కొన్నాళ్ళుగా మతిస్థిమితం లేకుండా ఉంటున్న కొడుకును ఆలనా పాలన చూసుకుంటున్న తల్లి పాలిట తనయుడు కాలయముడయ్యాడు. ఏమైందో ఏమోకాని ఉన్నట్టుండి బుద్ధ్దిమాంద్యుడైన అతనికి ఆవేశం వచ్చింది. దీంతో విచక్షణ మరచి తలుపులకు గడియపెట్టి ఇంట్లో ఉన్న తల్లిదండ్రులను కర్రతో విచక్షణ రహితంగా కొట్టాడు. తమను వదిలి పెట్టాలని తల్లిదండ్రులు కాళ్లు పట్టుకున్నా అతను ఆగలేదు.
దీంతో తల్లి తలపై కర్రతో బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందగా, తండ్రి తీవ్రగాయాలతో బయటపడిన సంఘటన ఆదివారం మండల కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. దౌల్లాబాద్‌కు చెందిన తలారి పెద్దసాయప్ప, గోవిందమ్మలకు ముగ్గురు కుమారులు. వారిలో ఇద్దరు కుమారులు బతుకుదెరువు నిమిత్తం బొంబాయి వెళ్ళి అక్కడే ఉంటున్నారు. పెద్దసాయప్ప, గోవిందమ్మ మతిస్థిమితం లేని రెండవ కుమారుడు వెంకటప్ప ఆలనాపాలనా చూస్తూ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పదేళ్ల క్రితం వరకు బాగానే ఉన్న వెంకటప్ప బొంబాయి వెళ్లి అక్కడే మతిస్థిమితం కోల్పోయాడు.
అప్పట్లో అతనికి వివాహం జరిగినా భార్య ఏడాదికే విడాకులు తీసుకుంది. అప్పటి తల్లి గోవిందమ్మ(55) వెంకటప్ప బాగోగులు చూస్తోంది. ఈ క్రమంలో ఆదివారం ఉదయం గోవిందమ్మ, భర్త పెద్దసాయప్పలు ఇంటి విషయాలు మాట్లాడుకుంటుండగా ఒక్కసారిగా కోపం వచ్చిన వెంకటప్ప పొయ్యిలో ఉన్న కట్టె తీసుకుని తలుపులకు గొళ్ళెం పెట్టి తల్లిదండ్రులపై దాడికి దిగాడు. తల్లి గోవిందమ్మను తలపై బాదడంతో మెదడు చిట్లి అక్కడికక్కడే మృతి చెందింది. తండ్రిపై కూడా దాడికి దిగడంతో తీవ్రగాయాలతో తప్పించుకుని బయటపడ్డాడు.
దీంతో చుట్టు పక్కల వారు వెళ్ళి చూడగా అప్పటికే గోవిందమ్మ మృతి చెంది ఉంది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో కోస్గి ఎస్‌ఐ భాగ్యలక్ష్మిరెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మృతురాలి భర్త పెద్దసాయప్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ శ్యాంసుందర్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొడంగల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
వివేకం లేక.. విచక్షణ కోల్పోయి
Published Mon, Jan 19 2015 4:15 AM | Last Updated on Sun, Sep 2 2018 4:37 PM
Advertisement
Advertisement